Skip to main content

డిజిటల్ యుగం@ డేటా సైంటిస్ట్...

సైంటిస్టు.. అనగానే గుర్తొచ్చేవి.. పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు! ఇంజనీరింగ్, టెక్నాలజీ, మెడిసిన్, సైన్స్ రంగాల్లో శాస్త్రవేత్తల అలుపెరుగని కృషి.. మానవ జాతి చరిత్రను మలుపుతిప్పే వారి ఆవిష్కరణల గురించి మనకు తెలిసిందే! నేటి డిజిటల్ యుగంలో మరో నయా సైంటిస్టు సేవలు కీలకంగా మారుతున్నాయి.. అతనే డేటా సైంటిస్ట్!! ప్రస్తుత ఈ-కామర్స్ ప్రపంచంలో రోజూ పుట్టుకొస్తున్న జెటా బైట్ల (విస్తృతమైన) డేటాను అమూల్యమైనదిగా మార్చగలిగే నిపుణులే డేటాసైంటిస్ట్‌లు. గత కొన్నేళ్లుగా సాఫ్ట్‌వేర్ రంగంలో హాట్ కేరీర్‌గా మారిన ‘డేటాసైంటిస్ట్’.. గురించి తెలుసుకుందాం...
ఎవరీ డేటా సైంటిస్ట్?
  • ప్రస్తుత కంప్యూటర్ యుగంలో అన్ని రంగాల్లో విస్తృతంగా ఉత్పత్తి అవుతున్న డేటాను విశ్లేషించి.. దాన్నుంచి విలువైన సమాచారాన్ని రాబట్టి వ్యాపార వృద్ధికి దోహదపడే నిపుణులను డేటాసైంటిస్ట్‌లని అంటున్నారు. ఈ-కామర్స్ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలు తదితరాల్లో ‘జెటా బైట్ల’ కొద్దీ డేటా ఉత్పత్తి అవుతోంది. ఈ డేటా ఇప్పుడు కంపెనీల వ్యాపార వ్యూహాలకు ఆయుధంగా మారుతోంది. విశ్లేషణ ద్వారా డేటాలో దాగున్న విలువైన సమాచారాన్ని గుర్తించి.. సంగ్రహించగలిగిన వారే... డేటా సైంటిస్ట్‌లు. అలా సంగ్రహించిన విలువైన సమాచారంతో వినియోగదారుల అవసరాలు గుర్తించి.. అందుకు తగ్గ ఉత్తమమైన వస్తు, సేవల రూపకల్పనకు డేటా సైంటిస్ట్‌లు దోహదపడతారు. తద్వారా వ్యాపారాల వృద్ధికి బాటలు వేస్తారు.
  • డేటాను విశ్లేషించి అత్యున్నత నిర్ణయాలు తీసుకోవడం వల్ల బిజినెస్ వృద్ధి చెంది లాభాలు పెరుగుతాయి.

అర్హతలు..
డేటాసైన్స్‌లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు మ్యాథ్స్/స్టాటిస్టిక్స్/కంప్యూటర్స్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ తప్పనిసరి. పైస్థాయి హోదాల కోసం ఆయా సబ్జెక్టుల్లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఇప్పటికే ఐటీలో పనిచేసిన అనుభవం ఉంటే అవకాశాలు మరింత మెరుగవుతాయి. డేటా మైనింగ్, డేటా స్ట్రక్చర్స్, డేటా మేనేజ్‌మెంట్, విజువలైజేషన్స్, అల్గారిథమ్స్‌పై పట్టుతో పాటు బిజినెస్ డొమైన్లకు సంబంధించి పరిజ్ఞానం కూడా ఉండాలి.

అవసరమైన నైపుణ్యాలు..
  • గణితంపై ఆసక్తి, డేటా పట్ల ఇష్టం, సమస్యలకు శాస్త్రీయ పద్ధతిలో పరిషార్కాలు గుర్తించే నేర్పు ఉంటే డేటా సైంటిస్ట్‌గా రాణించవచ్చు. కంప్యూటర్ సైన్స్ (లాంగ్వేజెస్, డేటాబేసెస్), స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ (లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ), విజువలైజేషన్ అంశాలపై సంపూర్ణ అవగాహన ఉండాలి. ప్రధానంగా ప్రతి అంశాన్ని తార్కికంగా విశ్లేషించి చూడగలిగే నైపుణ్యం ఉండాలి. కోడింగ్ స్కిల్స్ ఉండడం మేలు చేస్తుంది.
  • డేటాసైంటిస్ట్‌గా విధులు నిర్వర్తించే క్రమంలో వారికి కొన్ని టూల్స్ అవసరం ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి.. ఆర్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇప్పటికే ప్రోగ్రామింగ్ వచ్చిన వారు పైథాన్ ఎంచుకోవాలని, ప్రోగ్రామింగ్‌పై అవగాహన లేకుంటే ‘ఆర్’ లాంగ్వేజ్ వైపు మొగ్గు చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు ఇతర లాంగ్వేజ్‌లు, ఎస్‌ఏఎస్, హైవ్, మట్‌ల్యాబ్, ఎస్‌క్యూఎల్, స్పార్క్, హడూప్ తదితర టూల్స్‌పైనా అవగాహన అవసరం.

కెరీర్ స్కోప్..
  • డేటా సైంటిస్ట్ కెరీర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో రారాజుగా మారింది. డేటా సైంటిస్ట్ జాబ్ ఇప్పుడు ఎంతోమంది ఐటీ రంగ ఔత్సాహికులు, ఉద్యోగులను ఊరిస్తోంది. సగటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కంటే రెట్టింపు వేతనం, టాప్ మేనేజ్‌మెంట్‌తో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుండటంతో ‘డేటా సైంటిస్ట్’ ఆకర్షణీయ కెరీర్‌గా మారింది. ఉద్యోగ కల్పనలో రాబోయే కాలంలో ఎక్కువ డిమాండ్ ఉండబోయే టెక్నాలజీ కెరీర్.. డేటా సైంటిస్ట్ అని నిపుణులు పేర్కొంటున్నారు.
  • డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, బిగ్ డేటా ఆర్కిటెక్ట్, సీనియర్ అనలిస్ట్, బిగ్ డేటా డెవలపర్, బిగ్ డేటా అనలిటిక్స్ బిజినెస్ కన్సల్టెంట్, బిగ్ డేటా ఇంజనీర్ తదితర హోదాల్లో అవకాశాలు లభిస్తున్నాయి.
  • డేటా సైంటిస్ట్‌లకు టాప్ కంపెనీల్లో అవకాశాలు లభిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు డేటా సైంటిస్ట్ నియామకాలు చేపడుతున్నాయి. స్టార్టప్‌లు కూడా డేటా సైంటిస్టులకు ఎర్రతివాచీ పరుస్తున్నాయి.
  • ప్రస్తుతం డేటా సైంటిస్ట్‌ల కొరత ఎక్కువగా ఉంది. దాంతో నైపుణ్యాలున్న వారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. వచ్చే అయిదేళ్లలో అవకాశాలు మరింత విస్తృతమవుతాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్తులో డేటా సైంటిస్టులకు ఉద్యోగాల సంఖ్య బాగా పెరగడంతోపాటు స్థిరమైన కెరీర్ లభిస్తుందనేది జాబ్ మార్కెట్ వర్గాల అంచనా. డైటా సైంటిస్ట్‌గా స్థిరపడా లంటే ఎప్పటికప్పుడు నైపుణ్యాలను సానపెట్టు కోవాల్సి ఉంటుంది.

అన్ని రంగాల్లోనూ..
  • సమాచారాన్ని ఉపయోగించే ప్రతి రంగంలోనూ డేటా సైంటిస్టుల అవసరం ఉంటోంది. ప్రభుత్వ రంగ సంస్థలు, ఫైనాన్స్, ఐటీ సర్వీసెస్, ఎడ్యుకేషన్, ప్రొడక్షన్, మాన్యుఫాక్చరింగ్, మార్కెటింగ్, హెచ్‌ఆర్, ట్రావెల్ అండ్ టూరిజం, మీడియా, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఈ-కామర్స్ తదితర రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
  • రోజువారీ జీవితంలోనూ డేటాసైన్స్ పాత్ర ఎంతో! విమానాల రాకపోకల షెడ్యూళ్ల రూపకల్పన, క్రైమ్ డిటెక్షన్, ఇమేజ్ ఐడెంటిఫికేషన్, నీటి పరిరక్షణ, ఫ్రాడ్ డిటెక్షన్, సెక్యురిటీ సంబంధిత విభాగాల్లో డేటా సైన్స్ అనువర్తనాలు ఉపయోగపడుతున్నాయి. మానవ వనరుల విభాగంలో వనరుల పంపకాల్లోనూ డేటా సైన్స్‌ను ఉపయోగిస్తున్నారు.

ఆకర్షణీయ వేతనాలు :
  • ఐటీ రంగంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు మొదట్లో ఏడాదికి రూ.3 లక్షల వరకు వేతనం లభిస్తోంది. దీనికి రెట్టింపు వేతనాలు నైపుణ్యాలున్న డేటా సైంటిస్టులకు లభిస్తున్నాయి. ఫ్రెషర్స్‌కు కనీస ప్రారంభ వేతనం రూ.7 లక్షల నుంచి మొదల వుతోంది. నాలుగైదేళ్ల అనుభవమున్న నిపుణు లకు రూ.12 లక్షల వరకు వార్షిక ప్యాకేజీలు లభిస్తున్నాయి.
  • ప్రముఖ విద్యా సంస్థ నుంచి పట్టభద్రుడై, ఉన్నత నైపుణ్యాలు ఉంటే ఆకర్షణీయ వేతన ప్యాకేజీలతో ఆఫర్లు అందుకోవచ్చు. అర్హతలు, నైపుణ్యాలు, అనుభవం ఆధారంగా మెరుగైన వేతనాలు, ఉజ్వల కేరీర్‌ను సొంతం చేసుకోవచ్చు.

కోర్సులు :
మార్కెట్‌లో డేటా సైంటిస్టులకు డిమాండ్ ఉండడంతో ఆ కోర్సును ఆఫర్ చేసే విద్యాసంస్థలు, శిక్షణ సంస్థలు చాలా వెలిశాయి. షార్ట్‌టర్మ్ కోర్సుల నుంచి రెండేళ్ల కోర్సుల వరకు.. అమీర్‌పేట (హైదరాబాద్) నుంచి ఐఐఎంల వరకు పలు విద్యాసంస్థలు ఈ కోర్సులను అందిస్తున్నాయి.

సెల్ఫ్ లెర్నింగ్ :
డేటా సైంటిస్టులుగా ఎదగడానికి చాలా స్కిల్స్ అవసరం. నైపుణ్యాలు పెంపొందించుకోవడం అనేది నిరంతరం జరగాలి. పలు ఇన్‌స్టిట్యూట్స్ డేటాసైన్స్ పేరుతో కోర్సులు అందిస్తున్నాయి. వీటికంటే ఆన్‌లైన్ విధానంలో మూక్స్ ద్వారా లేదా సొంతంగా నేర్చుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో నేర్చుకోవడానికి ఎన్నో బ్లాగులు, ఎంతో విలువైన కంటెంట్ ఉచితంగా లభిస్తోంది. వీటిని ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు.

కొన్ని వెబ్‌సైట్లు
  1. Kaggle
  2. అనలిటిక్స్ విద్య
  3. కోర్సెరా ఎడెక్స్ ఉడాసిటీ
  4. డేటాసైన్స్ సెంట్రల్
తార్కిక ఆలోచన ఉంటే..
ప్రస్తుతం వ్యాపార నిర్వహణ మొత్తం ఆన్‌లైన్‌లోకి మారిపో తోంది. మరోవైపు డేటా భారీగా ఉత్పత్తి అవుతోంది. ఈ డేటా వ్యాపార విస్తరణకు కీలకంగా మారుతుండటంతో సంబంధిత మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మున్ముందు కూడా డేటా సైంటిస్టు కెరీర్ ఆశాజనకంగా ఉండే అవకాశముంది. బ్యాంకింగ్ రంగం నుంచి చిల్లర వర్తక వ్యాపారం వరకు.. డేటాసైన్స్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. తార్కిక ఆలోచనా సామర్థ్యం ఉన్నవారు డేటా సైంటిస్ట్ కెరీర్‌ను ఎంపికచేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్‌ల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు డేటా సైంటిస్టులుగా రాణించొచ్చు. ఐటీ రంగంలో అనుభవం ఉన్నవారు డేటాసైన్స్ టెక్నాలజీలను సులువుగా నేర్చుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు. ప్రముఖ తయారీ రంగ కంపెనీలు, కన్సల్టింగ్ సంస్థలు వంటివన్నీ డేటా సైంటిస్టులు, డేటా ఇంజనీర్లను నియమిం చుకుంటున్నాయి.
- అంకిత్ రాటీ, డేటా సైన్స్ ఆర్కిటెక్ట్, Sita aero.
Published date : 02 Oct 2018 06:12PM

Photo Stories