Skip to main content

డేటా సైంటిస్ట్‌లకు విస్తృత అవకాశాలు

నేషనల్ అసోషియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్), క్రిసిల్ గ్లోబల్ రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ సర్వీసెస్ ‘బిగ్ డేటా-ది నెక్స్ట్‌బిగ్ థింగ్’ నివేదిక ప్రకారం- 2018 నాటికి ఒక్క అమెరికాలోనే 1,90,000 డేటా సైంటిస్ట్‌ల కొరత ఏర్పడనుంది. భారత్‌లో కూడా వచ్చే మూడేళ్లలో దాదాపు రెండు లక్షల మంది డేటా సైంటిస్ట్‌ల కొరత ఉంటుందని అంచనా. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) అంచనాల ప్రకారం- బిగ్‌డేటా టెక్నాలజీ, సర్వీసుల మార్కెట్ 26.4 శాతం వార్షిక వృద్ధితో 2018 నాటికి 41.5 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఇంతలా వార్తల్లో ఉన్న డేటా సైంటిస్ట్‌లు ఏం చేస్తారు? డేటా సైంటిస్ట్‌లకు ఎందుకంత డిమాండ్? డేటాసైంటిస్ట్ కోసం చేయాల్సిన కోర్సులు ఏమిటి? తదితరాలపై ఫోకస్...
ఎందుకంత క్రేజ్?
ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ), ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, టెలికం.. ఇలా ఏ రంగానికి చెందిన కంపెనీలైనా ప్రధానంగా వినియోగదారులను ఆకర్షించడం, ఆదాయాలను పెంచుకోవడంపైనే దృష్టిసారిస్తాయి. ఈ క్రమంలో కంపెనీల ఎదుగుదలలో కీలకంగా వ్యహరించే నిపుణులే డేటా సైంటిస్ట్‌లు. వీరు సాంఖ్యక (స్టాటిస్టికల్), పరిమాణాత్మక (క్వాంటిటేటివ్), సాంకేతిక (టెక్నికల్) పద్ధతులను ఉపయోగించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తారు. తద్వారా కంపెనీ అభివృద్ధికి అవసరమైన వ్యాపార నమూనాలు, అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించడంలో కీలకంగా వ్యవహరిస్తారు. డేటా సైంటిస్ట్‌లకు ప్రధానంగా మ్యాథమెటిక్స్, స్టాటిస్టికల్ సబ్జెక్టు, డేటాబేస్/ డేటా వేర్‌హౌస్ ఇంజనీరింగ్, డేటా వేర్‌హౌస్ వంటి నైపుణ్యాలు ఉంటాయి.


ఫుల్ డిమాండ్
పోటీని తట్టుకుని నిలబడే క్రమంలో కంపెనీలన్నీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ విభాగాలను విస్తరిస్తున్నాయి. దీంతో డేటా సైంటిస్ట్‌లకు విస్తృతావకాశాలు లభిస్తున్నాయి. కానీ, డిమాండ్‌కు తగ్గట్లు డేటా సైంటిస్ట్‌లు అందుబాటులో లేరు. ఒక్క భారత్‌లోనే వచ్చే మూడేళ్లలో దాదాపు రెండు లక్షల మంది డేటా సైంటిస్ట్‌లు అవసరమని అంచనా. ఇదే సమయంలో అమెరికాలో ప్రతి 100 డేటా సైంటిస్ట్‌ల ఖాళీలకు.. అందుబాటులో ఉన్న అర్హులైన అభ్యర్థులు కేవలం 40 మంది మాత్రమే! ప్రముఖ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ సంస్థ గిూ తన ఆదాయంలో 13 శాతాన్ని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ద్వారానే ఆర్జిస్తోంది. ఇదే తరహాలో ఇతర బీపీఎం కంపెనీలన్నీ డేటా విశ్లేణ, ఆల్గారిథమ్స్, కంప్యూటర్స్ ఉపయోగించి కొత్త కొత్త బిజినెస్ నమూనాలను రూపొందించి, ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్నాయి.

వేతనాలు
అమెరికాలో డేటా సైంటిస్ట్‌లు ఏడాదికి రెండు లక్షల డాలర్ల వరకు సంపాదిస్తున్నారు. ఇదే సమయంలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న డేటా సైంటిస్ట్‌ల వార్షిక సంపాదన సీఏ, ఇంజనీరింగ్ రంగంలోని వారి కంటే అధికమని ప్రముఖ హ్యూమన్ రిసోర్స్ సర్వీస్ సంస్థ... టీమ్‌లీజ్ పేర్కొంది.

విశ్వవిద్యాలయాలతో కొలాబరేషన్లు
డేటాసైంటిస్ట్‌ల కొరతను అధిగమించే క్రమంలో కంపెనీలు విశ్వవిద్యాలయాలతో కలిసి సంయుక్తంగా బిజినెస్ డేటా అనలిటిక్స్ కోర్సులను అందిస్తున్నాయి. బీపీఎం కంపెనీ గిూ ఈ దిశగా ఇతర కంపెనీల కంటే ముందుంది. ఇది రాజస్థాన్‌లోని ఎన్‌ఐఐటీ విశ్వవిద్యాలయంతో కలిసి బిజినెస్ అనలిటిక్స్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ కోర్సును అందిస్తోంది. డేటా సైంటిస్ట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కొన్ని సంస్థలు ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్, సైన్స్, కామర్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ తదితర అంశాల్లో బ్యాచిలర్ డిగ్రీని అర్హతలుగా పేర్కొంటుండగా, మరికొన్ని మాస్టర్స్ డిగ్రీని అర్హతగా నిర్దేశిస్తున్నాయి.

డేటా సైంటిస్ట్ కోర్సులు
ఐఐఎం కలకత్తా, ఐఐటీ ఖరగ్‌పూర్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ)-కోల్‌కతాలు సంయుక్తంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్ (పీజీడీబీఏ) కోర్సును అందిస్తున్నాయి.
కోర్సు వ్యవధి: రెండేళ్లు
అర్హత: (10+2+4)/ (10+2+5)/ (10+2+3+2) విధానంలో 60 శాతం మార్కులతో డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 55 శాతం.
ఎంపిక: రిటెన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
మేనేజ్‌మెంట్ అనలిటిక్స్, అప్లికేషన్ ఆఫ్ అనలిటిక్స్‌పై ఐఐఎం క లకత్తా, అనలిటిక్స్-స్టాటిస్టికల్, మెషీన్ లె ర్నింగ్ థియరీపై ఐఎస్‌ఐ కోల్‌కతా, అనలిటిక్స్‌కు సంబంధించిన టెక్నాలజీపై ఐఐటీ ఖరగ్‌పూర్‌లు అవగాహన కలిగిస్తాయి.
వెబ్‌సైట్: www.iimcal.ac.in

ఐఐఎం- బెంగళూరు
డిజిటల్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ అనలిటిక్స్, బిగ్ డేటా అండ్ అప్లయిడ్ మార్కెటింగ్ అనలిటిక్స్, హెల్త్ కేర్ అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్- ది సైన్స్ ఆఫ్ డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.iimb.ernet.in

ఐఐఎం-లక్నో
కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియానా యూనివర్సిటీ (యూఎస్‌ఏ), ఐఐఎం లక్నోలు సంయుక్తంగా ఏడాది వ్యవధి గల సర్టిఫికెట్ పోగ్రాం ఇన్ బిజినెస్ అనలిటిక్స్ (సీపీబీఏఈ)ను ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.iiml.ac.in

ఐఎస్‌బీ
హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్..సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ బిజినెస్ అనలిటిక్స్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
కోర్సు వ్యవధి: ఏడాది
వెబ్‌సైట్: www.isb.edu

జాబ్ ప్రొఫైల్స్
డేటా అనలిటిక్స్ కోర్సులు పూర్తిచేసిన వారికి వివిధ హోదాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. అవి.. డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, బిగ్ డేటా ఆర్కిటెక్ట్, సీనియర్ అనలిస్ట్, బిగ్ డేటా డెవలపర్, బిగ్ డేటా అనలిటిక్స్ బిజినెస్ కన్సల్టెంట్, బిగ్ డేటా ఇంజనీర్..

టాప్ రిక్రూటర్స్
మైక్రోసాఫ్ట్, గూగుల్, జెన్‌ప్యాక్ట్, టీసీఎస్, ఐబీఎం, విప్రో, డెల్, కాగ్నిజెంట్

ప్రస్తుతం మార్కెట్ పరిణామాల నేపథ్యంలో డేటా సైంటిస్ట్ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉజ్వల కెరీర్ ఖాయం. డేటా సైంటిస్ట్‌లు ప్రధానంగా కంపెనీల వద్ద పెద్ద మొత్తంలో ఉండే డేటాను విశ్లేషిస్తుంటారు. దాదాపు ఎంఎన్‌సీ కంపెనీలన్నీ డేటా అనాలసిస్ కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకున్నాయి. డేటాసైంటిస్ట్, అనలిటిక్స్ నిపుణులకు ఆయా విభాగాల్లో ఆకర్షణీయ ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఐఐటీ హెచ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ద్వారా ఇండస్ట్రియల్ ప్రొఫెషనల్స్ కోసం డేటాసైన్స్‌లో ఎగ్జిక్యూటివ్ ఎంటెక్ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నాం. ఈ కోర్సుకు సంబంధించి ఆన్‌లైన్ ద్వారా తరగతులను నిర్వహిస్తున్నాం. శని, ఆదివారాల్లో ఆఫ్‌లైన్ తరగతులుంటాయి.
- సి.కృష్ణమోహన్, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐఐటీ హైదరాబాద్.
Published date : 01 Jul 2016 05:05PM

Photo Stories