Skip to main content

ఉందిలే మంచికాలం..!ముందు ముందు ముందునా..!!

దేశంలో ఉద్యోగ మార్కెట్ ముఖ చిత్రం మారబోతోంది.కంపెనీలు వ్యాపార విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వడం.. విదేశాల్లో కార్యకలాపాలను ప్రారంభించడానికి ఉత్సాహం చూపిస్తుండటం.. ప్రస్తుతం ఉన్న రంగాలతోపాటు నూతన రంగాల్లోకి ప్రవేశించడానికి ప్రణాళికలు రచిస్తుండడం.. వెరసి నిరుద్యోగులకు వరంగా మారనుంది. ఆర్థిక వ్యవస్థలో ఆశాజనక పరిస్థితుల కారణంగా కంపెనీలు తాజా గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంతోపాటు అనుభవం కలిగిన ఉద్యోగులను మిడిల్ మేనేజ్‌మెంట్ స్థాయిలో రిక్రూట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు వివిధ సర్వేలు అంచనా వేస్తున్నాయి. వివిధ రంగాల కంపెనీలకు నెలవైన మన హైదరాబాద్‌లోనూ యువతకు అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.ఈ నేపథ్యంలో.. ఉద్యోగాలకు వేదికగా నిలిచే రంగాలు..ఆయా రంగాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవడానికి మార్గాలపై ప్రత్యేక కథనం..

ఫైనాన్స్/అకౌంటింగ్
చిన్నాపెద్ద ప్రతి కంపెనీకి ఫైనాన్‌‌స/అకౌంటింగ్ విభాగం అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. ఫైనాన్స్/అకౌంటింగ్ రంగంలో నియామక ప్రక్రియ గతేడాది మాదిరిగానే స్థిరంగా ఊర్ధ్వ దిశగా కొనసాగుతోంది. అంతేకాకుండా వేతనాల్లో 18-20 శాతం వృద్ధి చోటుచేసుకునే అవకాశముంది. ముఖ్యంగా బహుళ జాతి సంస్థలు స్థానిక మార్కెట్లోకి ప్రవేశించాలని వ్యూహాలు రచిస్తుండటం, స్వదేశీ కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించడానికి ప్రాధాన్యత ఇస్తుండటంతో వచ్చే 12 నెలల కాలంలో ఈ రంగంలో అవకాశాలు గణనీయంగా పెరగనున్నట్లు నిపుణులు అంచనావేస్తున్నారు. ఇందులో స్థిరపడాలంటే ఎంబీఏ (ఫైనాన్స్) లేదా ఫైనాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఈ రంగంలో రాణించేందుకు సంబంధిత అర్హతలతోపాటు కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. ఫైనాన్షియల్ స్కిల్స్ ఉండి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలున్న మానవ వనరులకు డిమాండ్ అధికంగా ఉంది. మారుతున్న అవసరాలను బట్టి సంస్థను సమర్థంగా నడిపించగలిగే నాయకత్వ లక్షణాలతోపాటు వ్యాపార విస్తరణకు దోహదపడే యువత కు ఈ రంగం స్వాగతం పలుకుతోంది.

సేల్స్ అండ్ మార్కెటింగ్
ఏటా స్థిరంగా వృద్ధిని నమోదు చేసుకుంటున్న రంగం.. సేల్స్ అండ్ మార్కెటింగ్. ఈ విభాగంలోని రిటైల్, హెల్త్‌కేర్, లైఫ్ సెన్సైస్ రంగాలు 12 శాతం వృద్ధిని సాధించాయి. దీంతో ఈ రంగానికి సంబంధించిన కార్యకలాపాలను మెట్రోసిటీల నుంచి చిన్న పట్టణాలకు సైతం విస్తరించడానికి సదరు సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. దాని ఫలితమే మనకు కనిపిస్తున్న సూపర్ మార్కెట్ చైన్లు, బ్రాండెడ్ ఫార్మసీ అవుట్‌లెట్లు. వీటికి వినియోగదారుల నుంచి నుంచి పెద్దఎత్తున ఆదరణ లభిస్తోంది. దాంతో విస్తరణకు మార్గం చూపే ఏ చిన్న అవకాశాన్నీ ఈ సంస్థలు వదులుకోవడం లేదు. ఫలితంగా వాటిని నిర్వహించే మేనేజర్/ఫ్లోర్ మేనేజర్ నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్ వరకు ఎన్నో అవకాశాలను యువత అందిపుచ్చుకోవచ్చు. ఈ రంగంలో స్థిరపడాలంటే.. డిగ్రీ, లేదా మార్కెటింగ్‌లో ఎంబీఏ చేసి ఉండాలి. వినియోగదారులతో నేరుగా సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది కాబట్టి సృజనాత్మక ఆలోచనలు, కమ్యూనికేషన్ స్కిల్స్, సందర్భానుసారంగా నిర్ణయం తీసుకునే చాతుర్యం, మార్కెటింగ్ వ్యూహాలను పసిగట్టే నేర్పు ఉన్న నిపుణులకు డిమాండ్ అధికంగా ఉంటోంది. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) రంగంలో లెక్కకు మించిన అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి.

హ్యూమన్ రీసోర్సెస్
ప్రతి కంపెనీకి హ్యూమన్ రీసోర్సెస్ విభాగం తప్పనిసరి. ఎందుకంటే.. నియామకాలు, శిక్షణ, పేరోల్స్ తయారీ వంటి వ్యవహారాలను పక్కాగా నిర్వహించాల్సింది ఈ విభాగమే! కాబట్టి హ్యూమన్ రీసోర్సెస్ రంగంలో మానవ వనరుల అవసరం ఎప్పుడూ అధికంగానే ఉంటోంది. ఈ రంగంలో నియామకాలు గతేడాది కాలంగా ఆశాజనకంగా ఉన్నాయని, హైరింగ్ మరింత ఊపందుకునే పరిస్థితి కనిపిస్తోందని రిక్రూట్‌మెంట్ కన్సల్టెన్సీలు పేర్కొంటున్నాయి. పని చేస్తున్న ప్రదేశం, త దితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఉద్యోగుల వేతనాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హ్యూమన్ రిసోర్సెస్ రంగంలో స్థిరపడాలంటే.. సంబంధిత విభాగంలో ఎంబీఏ/ఎంఏ/ఎంఎస్సీ/పీజీడీఎం వంటి కోర్సులు చేసి ఉండాలి. అంతేకాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ ఆపరేటింగ్, వివిధ వ్యవహారాలను మార్కెట్లోకి కొత్తగా వస్తున్న సాఫ్ట్‌వేర్ల సహాయంతో నిర్వహించే నేర్పు ఉండాలి. ఎక్కువ వేతనం పొందాలంటే మాత్రం కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి.

బ్యాంకింగ్
కొంతకాలంగా నియామకాల విషయంలో అన్ని రంగాల కంటే ముందంజలో నిలుస్తోంది.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం. ముఖ్యంగా నూతనంగా బ్యాంకుల ఏర్పాటు కోసం లెసైన్స్‌లను మంజూరు చేయడం, విదేశీ పెట్టుబడిదారులు స్థానిక మార్కెట్‌పై దృష్టిసారించడం వంటివి ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఈ క్రమంలో చాలా కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. దాంతోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, పలు ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్‌‌స కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా రిక్రూట్‌మెంట్లకు తె రదీస్తున్నాయి. స్థానిక బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడులు పెరగడం కూడా హైరింగ్ ప్రక్రియ జోరుగా మారడానికి ఒక కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. 25 నుంచి 33 శాతం అధిక పే ప్యాకేజ్‌లతో కొత్తగా సిబ్బందిని నియమించుకోవడానికి సంబంధిత సంస్థలు ఉత్సాహం చూపిస్తున్నాయి. కాబట్టి హైరింగ్‌కు సంబంధించి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగం రోజురోజుకూ ఆశాజనకంగా మారుతోంద ని చెప్పొచ్చు. ఈ రంగంలో స్థిరపడాలంటే బ్యాంకింగ్/ ఫైనాన్షియల్ సబ్జెక్ట్‌లు ప్రధానంగా ఎంబీఏ/ఎంకామ్/ ఎంఏ/ఎంఎస్సీ/ పీజీడీఎం/డిప్లొమా వంటి కోర్సులను పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు మార్కెట్లను విశ్లేషించడం, తదనుగుణంగా వ్యూహాలను రూపొందించడం, తార్కిక వివేచన వంటి నైపుణ్యాలు ఉంటే కెరీర్‌లో త్వరగా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు.

నైపుణ్యాలపై ప్రధాన దృష్టి:
కే వలం ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడానికే పరిమితం కాకుండా.. వారిని మరింత సమర్థులుగా, నాయకులుగా తీర్చిదిద్దడానికి వీలుగా శిక్షణ కార్యక్రమాలను చేపట్టడానికి కంపెనీలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికేతర (నాన్ ఫైనాన్షియల్) రంగంలో ఈ విషయానికి పెద్దపీట వేస్తున్నారు. తద్వారా ఉద్యోగి ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు దీర్ఘకాలంపాటు సేవలు అందించే అవకాశం ఉంటుందని కూడా కంపెనీలు భావిస్తున్నాయి. అంతేకాకుండా వ్యాపారాన్ని విస్తరించినప్పుడు కొత్తవారి రిక్రూట్‌మెంట్ కంటే సొంత ఉద్యోగులను మిడిల్ మేనేజ్‌మెంట్ నిపుణులుగా తీర్చిదిద్దడమే మేలని కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి.

వయా సోషల్ మీడియా:
జాబ్ మార్కెట్‌లో అవకాశాలను అందుకోవాలంటే.. మారుతున్న టెక్నాలజీని తెలివిగా ఉయోగించుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే బహుళ జాతి కంపెనీలు సంప్రదాయ విధానాల కంటే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌ను హైరింగ్ కోసం విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. స్వల్ప సమయంలో తక్కువ ఖర్చుతో ప్రతిభావంతులను ఆకర్షించే, గుర్తించే సులువైన మాధ్యమం సోషల్ మీడియా అని భావిస్తున్నాయి. దాంతో అన్ని రంగాలకు చెందిన కంపెనీల హెచ్‌ఆర్ విభాగంలో ‘సోషల్ రిక్రూట్‌మెంట్’ కొత్తగా చోటు సంపాదించుకుంది. కంపెనీలో ప్రస్తుత ఖాళీల వివరాలను తెలియజేస్తూ.. అర్హతలు, కావల్సిన నైపుణ్యాలు, తదితర వివరాలను పోస్ట్ చేస్తున్నాయి. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌పై యువత వెచ్చిస్తున్న సమయం కూడా కంపెనీలు ఈ మాధ్యమం ద్వారా నియామకాలు చేపట్టడానికి కారణమవుతోంది. కాబట్టి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో ప్రొఫైల్స్‌ను జాగ్రత్తగా నిర్వహించాలి. ఫేస్‌బుక్, లింకిడ్‌ఇన్, గూగుల్‌ప్లస్, మైస్పేస్, స్కిల్‌పేజెస్ వంటి సైట్లు ఈ విషయంలో ముందుంటున్నాయి.
Published date : 06 Oct 2014 06:45PM

Photo Stories