Skip to main content

ఉజ్వల కెరీర్‌కు...సీఎంఏ కోర్సు

చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ)ను పూర్తిచేయడం కష్టమని భావించే వారికి కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ) కోర్సు వరమని చెప్పొచ్చు. సాధారణంగా సీఏ కోర్సు క్లిష్టమైనదిగా భావించేవారు బీకామ్ లేదా ఎంబీఏ చేస్తారు. అయితే అలాంటి వారు సీఎంఏ కోర్సును పూర్తిచేయడం ద్వారా మంచి వేతనాలతో సుస్థిర కెరీర్‌ను కైవసం చేసుకోవచ్చు. దీనిపై విద్యార్థుల్లో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది.
సీఎంఏ కోర్సును కామర్స్ కోర్సు అని చెప్పడం కంటే మేనేజ్‌మెంట్ కోర్సు అని చెప్పడం బాగుంటుంది. ఎంబీఏ పూర్తిచేసిన వారికి వివిధ సంస్థల్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయో.. అంతకంటే మంచి అవకాశాలు సీఎంఏ పూర్తిచేసిన వారికి ఉంటాయని చెప్పొచ్చు. దేశంలో సీఎంఏ కోర్సుకు సంబంధించిన కార్యకలాపాలను ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా’ పర్యవేక్షిస్తోంది. పదో తరగతి తర్వాత అయితే నాలుగేళ్లలో, ఇంటర్ ఎంఈసీతో పాటు సీఎంఏ చదివిన విద్యార్థులు ఇంటర్ తర్వాత రెండేళ్లలో, ఇంటర్ తర్వాత సీఎంఏ చదవడం ప్రారంభించిన విద్యార్థులు రెండున్నరేళ్లలో కోర్సు పూర్తిచేయొచ్చు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు కూడా సీఎంఏ కోర్సు చేయొచ్చు. మొత్తం కోర్సును పూర్తిచేసేందుకు డిగ్రీ/ఇంజనీరింగ్ తర్వాత రెండేళ్లు పడుతుంది.

ఇంజనీరింగ్‌కు సమాంతరంగా..
ఇంజనీరింగ్‌కు సమాంతరంగా సీఎంఏ కోర్సును పూర్తిచేసేలా కోర్సుకు రూపకల్పన చేయబోతున్నారు. దీంతో సీఎంఏ కోర్సు కూడా ఇంజనీరింగ్ విద్యార్థులకు కల్పతరువుగా మారనుంది. ఇతరులతో పోల్చితే ఇంజనీరింగ్ చదివిన/చదువుతున్న వారికి సీఎంఏ కోర్సు అత్యంత ఉపయోగకరంగా మారనుంది. ముఖ్యంగా తయారీ రంగంలో అందుబాటులోకి రానున్న అవకాశాలను పరిగణనలోకి తీసుకొని, కొత్త విధానాన్ని ఈ-లెర్నింగ్ ద్వారా అమలు చేయాలని సీఎంఏ సంస్థ భావిస్తోంది.
సాధారణంగా డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు మంచి ఉద్యోగ అవకాశాల కోసం ఎంబీఏ కోర్సు చేస్తుంటారు. ఇలాంటి వారు సీఎంఏ కోర్సు చేయడం ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

రిజిస్ట్రేషన్ :
సీఎంఏ చేయాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఔత్సాహికులు ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. సీఎంఏ ఫౌండేషన్ చదవాలంటే తొలుత రూ.4 వేల డీడీని కోల్‌కతాలో చెల్లేవిధంగా తీయాలి. ఆ డీడీ, దరఖాస్తు (సీఎంఏ చాప్టర్లు/సమాచార కేంద్రాల్లో లభిస్తాయి)ను సీఎంఏ ఇన్‌స్టిట్యూట్-కోల్‌కతాకు పంపొచ్చు. లేదా సీఎంఏ అనుబంధ సంస్థలోనైనా ఇవ్వొచ్చు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులకు సీఎంఏ సంస్థ గుర్తింపు కార్డులు పంపుతుంది. ఇవి ఉన్నవారిని మాత్రమే పరీక్షలకు అనుమతిస్తారు.

సీఎంఏ కోర్సు దశలు...
సీఎంఏ కోర్సులో ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్ అనే మూడు దశలు ఉంటాయి. కోర్సులోని తొలిదశ ఫౌండేషన్. ఇంటర్‌లో ఏ గ్రూపు చదివిన వారైనా సీఎంఏ ఫౌండేషన్‌కు నమోదు చేయించుకోవచ్చు. ఇంటర్ ఎంఈసీ విద్యార్థులు మాత్రం ఇంటర్‌కు సమాంతరంగా సీఎంఏ కోర్సును పూర్తిచేయొచ్చు. ఫౌండేషన్ కోర్సులో 8 సబ్జెక్టులను 4 పేపర్లుగా విభజించారు. ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్, అకౌంటింగ్, లాస్, ఎథిక్స్, బిజినెస్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలు సిలబస్‌లో ఉంటాయి. రోజుకో పేపర్‌కు పరీక్ష జరుగుతుంది. ప్రతి పేపర్‌ను 100 మార్కులకు ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌గా నిర్వహిస్తారు. ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే మొత్తంమీద కనీసం 50 శాతం మార్కులు; ప్రతి పేపర్‌లో కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ఫౌండేషన్ పరీక్ష ఏటా జూన్, డిసెంబర్‌లో ఉంటుంది.

సీఎంఏ-ఎగ్జిక్యూటివ్ కోర్సు :
ఫౌండేషన్ కోర్సులో ఉత్తీర్ణులైన వారు సీఎంఏ ఇంటర్ (ఎగ్జిక్యూటివ్) కోర్సు చదవడానికి అర్హత సాధిస్తారు. సీఎంఏ ఫౌండేషన్‌ను పూర్తిచేసిన వారు ఇంటర్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఏడాది తర్వాత పరీక్ష రాసేందుకు అర్హులు. ఏ గ్రూప్‌లోనైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారు, ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు ఫౌండేషన్ రాయకుండానే నేరుగా ఇంటర్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఏటా జూన్, డిసెంబర్‌లో సీఎంఏ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్మీడియెట్ కోర్సు రెండు గ్రూప్‌లుగా ఉంటుంది. గ్రూప్-1లో ఫైనాన్షియల్ అకౌంటింగ్, లాస్ అండ్ ఎథిక్స్, డెరైక్ట్ ట్యాక్సేషన్, కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కో సబ్జెక్టుకు 100 మార్కులు కేటాయించారు. గ్రూప్-2లో ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్; కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్; ఇన్‌డెరైక్ట్ ట్యాక్సేషన్; కంపెనీ అకౌంట్స్ అండ్ ఆడిట్ సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కో దానికి 100 మార్కులు. విద్యార్థి వీలునుబట్టి రెండు గ్రూప్‌లు ఒకేసారి లేదంటే విడివిడిగా ఆర్నెల్ల వ్యత్యాసంతో రాయొచ్చు.

ప్రాక్టికల్ శిక్షణ :
సీఎంఏ ఫైనల్ పరీక్షలు రాయాలంటే ఆర్నెల్ల ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి. సీఎంఏ ఇంటర్ పూర్తిచేసిన వారు ప్రాక్టికల్ శిక్షణకు గుర్తింపు పొందిన సంస్థ లేదా ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ వద్ద శిక్షణ తీసుకోవాలి. ఈ సమయంలో శిక్షణ ప్రాంతాన్ని బట్టి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు స్టైపెండ్ ఉంటుంది.

సీఎంఏ ఫైనల్ :
ఆర్నెల్ల ప్రాక్టికల్ శిక్షణ పూర్తిచేసిన వారు ఫైనల్ పరీక్ష రాసేందుకు అర్హులు. ఫైనల్లో రెండు గ్రూప్‌లు (గ్రూప్-3, 4) ఉంటాయి. ఏటా జూన్, డిసెంబర్‌లో ఫైనల్ పరీక్షలు జరుగుతాయి. గ్రూప్-3లో కార్పొరేట్ లాస్ అండ్ కాంప్లియెన్స్; స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్; స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్‌మెంట్-డెసిషన్ మేకింగ్; డెరైక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కోదానికి 100 మార్కులుంటాయి. గ్రూప్-4లో కార్పొరేట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్; ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ప్రాక్టీస్; కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ ఆడిట్; స్ట్రాటజిక్ పెర్‌ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ బిజినెస్ వాల్యుయేషన్ సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కో దానికి 100 మార్కులు.

సీఎంఏ ఫైనల్ పూర్తిచేసిన వారికి ఇన్‌స్టిట్యూట్ ఇచ్చే కంప్యూటర్ శిక్షణ పూర్తయితే క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్‌గా అర్హత సాధిస్తారు. ఫైనల్ పూర్తిచేసిన వారు ఉద్యోగం చేయాలనుకుంటే నేరుగా ఉద్యోగంలో చేరొచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేయాలనుకుంటే మరో రెండున్నరేళ్ల ప్రాక్టికల్ శిక్షణ తీసుకోవాలి. ఈ శిక్షణ పూర్తిచేసిన వారికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా.. ‘సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్’ అందజేస్తుంది.

కెరీర్...
  • ఉత్పత్తి రంగం, సేవారంగం, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, సాఫ్ట్‌వేర్.. ఇలా ప్రతి రంగానికి సంబంధించిన సంస్థల్లో సీఎంఏలకు ఉపాధి అవకాశాలుంటాయి. కంపెనీ అమ్మకాలు, కొనుగోళ్లు, లాభనష్టాలు, మానవ వనరులకు చెల్లించే వేతనాలు.. ఇలా ప్రతి అంశం, దశలో సీఎంఏల అవసరం ఉంటుంది. ప్రస్తుతం డిమాండ్‌కు తగిన సీఎంఏలు అందుబాటులో లేరు.
  • సీఎంఏ పూర్తిచేసిన వారికి సీఎంఏ సంస్థ స్వయంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తోంది. ఇటీవల నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో హెచ్‌సీఎల్, ఐసీఐసీఐ, ఐడీబీఐ, జెన్‌ప్యాక్ట్ తదితర సంస్థల్లో అత్యంత ఆకర్షణీయ వేతనాలతో అభ్యర్థులు ఉద్యోగాలు పొందారు.
  • మేనేజ్‌మెంట్, ప్రొఫెషనల్ విద్యా సంస్థల్లో సీఎంఏలకు లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌గా ఉద్యోగాలు లభిస్తున్నాయి. పలు సంస్థల్లో సీఎంఏలకు చీఫ్ ఇంటర్నల్ ఆడిటర్, కాస్ట్ కంట్రోలర్, చీఫ్ అకౌంటెంట్, ఫైనాన్షియల్ కంట్రోలర్ తదితర ఉద్యోగాలు లభిస్తాయి.
Published date : 04 Nov 2017 04:30PM

Photo Stories