Skip to main content

ఉజ్వల కెరీర్‌కు సరైన సోపానం.. సీఏ

  • 2013లో ఐసీఏఐ నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో కొత్తగా సీఏ కోర్సు పూర్తిచేసిన 902 మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొందారు.
  • ప్రాంగణ నియామకాల్లో 58 కంపెనీలు పాల్గొన్నాయి.
  • విదేశాల్లో ఉద్యోగం పొందిన అభ్యర్థుల అత్యధిక వేతనం ఏడాదికి రూ.21 లక్షలు.
  • దేశీయంగా ఉద్యోగం లభించిన అభ్యర్థుల గరిష్ట వేతనం రూ.16.55 లక్షలు.
చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ)లో ఉత్తీర్ణత అంత తేలిక కాకపోవచ్చు.. ఓ పట్టాన కొరుకుడుపడని సబ్జెక్టులూ ఉండొచ్చు.. అయితే ఇష్టపడి ఆపై కష్టపడితే సీఏలో అత్యుత్తమ స్కోర్‌తో ఉజ్వల కెరీర్ కూడాసొంతమవుతుంది. మంచి హోదా, ఆకర్షణీయ ఆదాయాన్ని అందించే సీఏలో తొలిదశ సీపీటీ పరీక్షకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో స్పెషల్ ఫోకస్..

ప్రస్తుతం దేశంలో అన్ని రకాల పరిశ్రమలు చార్టర్డ్ అకౌంటెంట్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత పరిశ్రమల అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే కనీసం ఐదు లక్షల మంది చార్టర్డ్ అకౌంటెంట్లు అవసరమవుతారు. సాఫ్ట్‌వేర్, ఫార్మా, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ తదితర రంగాలు సీఏలకు మంచి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. సీఏలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సు ప్రవేశ అర్హతలు, ఇతర అంశాల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) చాలా మార్పులు చేసింది.

21 ఏళ్లు నిండేసరికి పూర్తిచేయొచ్చు:
సీఏ అనగానే కొరుకుడుపడని కోర్సు అనే అభిప్రాయముం ది. కానీ, ఇష్టపడి చదివితే సీఏ పూర్తి చేయడం పెద్ద కష్టం కాదు. పట్టుదలతో ప్రణాళిక ప్రకారం కృషిచేస్తే 21 ఏళ్లు నిండేసరికి కోర్సు పూర్తిచేసి సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ప్రొఫెషనల్ కోర్సులతో పోలిస్తే సీఏ కోర్సు భిన్నమైంది. ఆయా రంగాల్లో అభ్యర్థులు ఎక్కువగా, ఉద్యోగాలు తక్కువగా ఉంటాయి. సీఏలో మాత్రం అభ్యర్థులు తక్కువగా ఉంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డిమాండ్ అధికంగా ఉన్న సీఏ కోర్సును పదో తరగతి దశ నుంచే లక్ష్యంగా పెట్టుకోవాలి.

మూడు దశలు:
సీఏ కోర్సును ఐసీఏఐ నిర్వహిస్తుంది. ఇందులో కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(సీపీటీ),ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్‌‌స కోర్సు (ఐపీసీసీ), ఫైనల్ దశలుంటాయి.

సీపీటీ:
పదో తరగతి పూర్తిచేసిన వారు సీపీటీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సీపీటీ పరీక్ష ఏటా జూన్, డిసెంబర్‌లో జరుగుతుంది. ఈ పరీక్ష రాయడానికి సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసి ఉన్నవారు లేదా ఇంటర్, డిగ్రీ.. ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు. సీపీటీకి హాజరుకావాలంటే దరఖాస్తు చేసుకునే సమయానికి, సీపీటీకి మధ్య రెండు నెలల వ్యవధి తప్పనిసరి. అంటే జూన్‌లో సీపీటీకి హాజరవ్వాలంటే ఏప్రిల్ ఒకటో తేదీలోపు; డిసెంబర్‌లో సీపీటీకి హాజరవ్వాలంటే అక్టోబర్ ఒకటి లోపు దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష విధానం: సీపీటీ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. దీనికి 200 మార్కులు కేటాయించారు. పరీక్ష రెండు సెషన్లలో ఉంటుంది. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్‌కు 60 మార్కులు, మర్కంటైల్ లాకు 40 మార్కులు, జనరల్ ఎకనామిక్స్‌కు 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు 50 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి విభాగంలో 30 శాతం మార్కులు, అన్ని విభాగాల్లో కలిపి 100 మార్కులు సాధించాలి.

ఐపీసీసీ:
సీపీటీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. ఐపీసీసీ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ కోర్సు రెండు గ్రూపులుగా ఉంటుంది. అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఏదైనా ఒక గ్రూప్ లేదా ఒకేసారి రెండు గ్రూప్‌లకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకున్న తర్వాత తొమ్మిది నెలల స్టడీ కోర్సును పూర్తిచేయాలి. దీంతోపాటు ఓరియెంటేషన్ కోర్సు, 100 గంటలపాటు సాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సును పూర్తి చేయాలి. ఏటా మే, నవంబర్‌లో ఐపీసీసీ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేందుకు ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం, గ్రూప్ మొత్తంమీద 50 శాతం మార్కులు రావాలి.

గ్రూప్-1: పేపర్-1: అకౌంటింగ్; పేపర్-2: బిజినెస్ లా, ఎథిక్స్, కమ్యూనికేషన్; పేపర్-3: కాస్ట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్; పేపర్-4: టాక్సేషన్.

గ్రూప్-2: పేపర్-5: అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్; పేపర్-6: ఆడిటింగ్ అష్యూరెన్స్; పేపర్-7: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్.
ప్రతి పేపర్‌కు గరిష్ట మార్కులు 100.

డిగ్రీతో నేరుగా:
గతంలో సీఏలో చేరాలంటే.. ప్రతి ఒక్కరూ సీపీటీ తప్పనిసరిగా రాయాల్సిందే. ఇది పూర్తయితేనే రెండో దశ ఐపీసీసీలో ప్రవేశించడానికి వీలయ్యేది. కానీ, ఇటీవల సడలించిన నిబంధనల ప్రకారం 55 శాతం మార్కులతో కామర్‌‌స గ్రాడ్యుయేట్స్/ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పూర్తిచేసిన వారు, 60 శాతం మార్కులతో ఏదైనా ఇతర గ్రాడ్యుయేషన్/ పీజీ పూర్తిచేసిన వారు, ఐసీడబ్ల్యూఏఐ లేదా సీఎస్‌లో ఇంటర్ పూర్తిచేసిన అభ్యర్థులు సీపీటీకు హాజరు కావల్సిన అవసరం లేదు. వీరు నేరుగా రెండో దశ ఐపీసీసీలో చేరొచ్చు.

ఆర్టికల్స్:
ఐపీసీసీ కోర్సులోని గ్రూప్-1 గాని లేదా రెండు గ్రూప్స్ పూర్తిచేసిన వారు మూడు సంవత్సరాల ఆర్టికల్స్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఐసీఏఐ గుర్తింపు ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైఫండ్ కూడా సంపాదించుకోవచ్చు.

ఫైనల్:
ఐపీసీసీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఫైనల్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రెండున్నరేళ్ల ఆర్టికల్స్ పూర్తిచేసిన తర్వాత ఫైనల్ పరీక్షకు అర్హత లభిస్తుంది. ఫైనల్ పరీక్షలు ఏటా మే, నవంబర్‌లో జరుగుతాయి. పూర్తిస్థాయి చార్టర్డ్ అకౌంటెంట్‌గా తీర్చిదిద్దే ఫైనల్ కోర్సు కూడా రెండు గ్రూపులుగా ఉంటుంది. ప్రతి గ్రూపులో నాలుగు పేపర్లు ఉంటాయి. అవి..

గ్రూప్-1: పేపర్-1: ఫైనాన్షియల్ రిపోర్టింగ్; పేపర్-2: స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్; పేపర్-3: అడ్వాన్స్‌డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్; పేపర్-4: కార్పొరేట్ అండ్ అలైడ్ లాస్.

గ్రూప్-2: పేపర్-5: అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్; పేపర్-6: ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కంట్రోల్ అండ్ ఆడిట్; పేపర్-7: డెరైక్ట్ టాక్స్ లాస్; పేపర్-8: ఇన్‌డెరైక్ట్ టాక్స్ లాస్.

ఐపీసీసీ మాదిరిగానే ఫైనల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం, గ్రూప్ మొత్తం మీద 50 శాతం మార్కులు సాధించాలి. ఫైనల్‌తో పాటు జనరల్ మేనేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సు కూడా చేయాలి.

ఉన్నత విద్య:
కేవలం ఇంటర్ అర్హతతో పూర్తి చేయగలిగే సీఏ కోర్సుకి.. ప్రభుత్వం ఇతర బ్యాచిలర్ డిగ్రీలతో సమానంగా గుర్తింపు ఇచ్చింది. ఈ క్రమంలో సీఏ ఫైనల్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఎంకాం, ఎంబీఏ వంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో నిర్వహించే సివిల్ సర్వీసెస్, గ్రూప్-1, గ్రూప్-2 మొదలైన అన్ని ఉద్యోగ పరీక్షలకు హాజరుకావచ్చు.

కావల్సిన నైపుణ్యాలు:
సీఏ కోర్సులో చేరేవారికి కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఎంతో అవసరం. వాటిలో ముఖ్యమైనది సహనం. విస్తృతంగా ఉండే సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించి ఆకళింపు చేసుకోవాలంటే సహనం ఎంతో అవసరం. అదేవిధంగా పుస్తకాల ద్వారా నేర్చుకున్న పరిజ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా అన్వయించే సామర్థ్యం, తార్కిక ఆలోచన నైపుణ్యం కూడా కీలకమే. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ నెట్‌వర్కింగ్ స్కిల్స్ అవసరం కూడా ఎంతో ఉంటుంది.

కెరీర్ ఆప్షన్స్:
సీఏ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులను నియమించుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోతున్న వేళ సీఏ కోర్సు పూర్తిచేసినవారికి అవకాశాలు అపరిమితమవుతున్నాయి.

అవకాశాలకు ఆకాశమే హద్దు:
సీఏ కోర్సు పూర్తిచేసిన వారికి వివిధ సంస్థలు అద్భుత అవకాశాలు కల్పిస్తున్నాయి. అవి: సేవా రంగం, టెలికం, బ్యాంకింగ్, బీమా, సాఫ్ట్‌వేర్, మైనింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు, ఆడిటింగ్ ఫర్మ్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, ఇన్వెస్ట్‌మెంట్ హౌసెస్, పేటెంట్ ఫర్మ్స్, లీగల్ హౌసెస్.

సంప్రదాయ, ఆధునిక విభాగాలు:
సీఏ కోర్సు పూర్తిచేసిన వారికి స్టాట్యుటరీ అండ్ ఇంటర్నల్ ఆడిటింగ్, అకౌంటింగ్, డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ టాక్స్; టాక్స్ ప్లానింగ్ తదితర సంప్రదాయ విభాగాలతో పాటు టెక్నికల్ అనాలసిస్, రిస్క్ అసెసర్స్, సర్వేయర్స్, మర్చంట్ బ్యాంకర్స్, మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, కన్సల్టెన్సీ సర్వీసెస్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ వంటి ఆధునిక విభాగాల్లోనూ అద్భుత అవకాశాలు లభిస్తున్నాయి.

టైర్-3 పట్టణాల్లోని రిటైల్ షాపులు, జ్యువెలరీ, వస్త్ర, తదితర వాణిజ్య, వ్యాపార సంస్థల ఆదాయవ్యయాలు, ఉత్పత్తి ఖర్చులు, స్టేషనరీ, మానవ వనరులకు చెల్లించే వేతనాలు, ఇతర వ్యయాలు, అమ్మకాలు, కొనుగోళ్లు, కంపెనీ లాభనష్టాలు.. ఇలా ప్రతి దశలోనూ సీఏలతో సంస్థాగత ఆడిటింగ్ నిర్వహించడం అనివార్యం. ఈ నేపథ్యంలో నిపుణులైన సీఏల అవసరం భారీ స్థాయిలో ఉంటోంది. స్వయం ఉపాధి కోరుకునే వారు సొంతంగా ఆడిటర్‌గా కూడా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు.

వేతనాలు:
సీఏ ఉత్తీర్ణులకు ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో ఫ్రెషర్‌కు నెలకు కనీసం రూ. 35,000 వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవం ఆధారంగా దాదాపు రూ. 10 లక్షల వరకు వార్షిక వేతనం అందుకోవచ్చు.

విధులు:
ఏ సంస్థలోనైనా ప్రధాన విభాగాలు అకౌంటింగ్, ఆడిటింగ్, టాక్సేషన్. వాటి గురించి వివరించేదే చార్టర్డ్ అకౌంటెన్సీ. కంపెనీలు, వ్యక్తుల టాక్స్ ప్లానింగ్ విషయుంలో సీఏ అవసరం తప్పనిసరి. అంతేకాకుండా పెట్టుబడులు, వాటి ప్లానింగ్, సంస్థాగత అభివృద్ధి, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన, నిర్వహణలో సాధ్యాసాధ్యాలు, ఆర్థిక వనరుల సమీకరణ, జారుుంట్ వెంచర్స్, విదేశీ భాగస్వావ్యూలు, విస్తరణ, విలీనాల్లోనూ, ఉత్పత్తుల ధరలు, బీపీఓ మొదలైన వాటిలో సీఏలు కీలక పోషిస్తారు.

కెరీర్ గ్రాఫ్:
కెరీర్ ప్రారంభంలో అకౌంట్స్ లేదా ఫైనాన్స్ ఆఫీసర్‌గా అడుగుపెట్టిన వారు అనుభవం, నైపుణ్యం ఆధారంగా ఫైనాన్స్ డెరైక్టర్, సీఈఓ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) స్థాయికి చేరుకోవచ్చు.

అకౌంటింగ్ టెక్నీషియన్ కోర్సు:
సీఏ గట్టెక్కలేని వారి కోసం ఐసీఏఐ ప్రవేశపెట్టిన కోర్సు అకౌంటింగ్ టెక్నీషియన్. సీపీటీ పాసైన విద్యార్థి సీఏ పూర్తి చేయలేను అని భావిస్తే ఐపీసీసీలోని గ్రూప్-1 పూర్తిచేసి, ఏడాదిపాటు సీఏ దగ్గర ఆర్టికల్ షిప్ చేస్తే అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికెట్ లభిస్తుంది. పరిశ్రమలో దీనికి ప్రత్యేకమైన గుర్తింపు, డిమాండ్ ఉంది. ఈ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ/ప్రభుత్వేతర సంస్థల్లో చేరి కనీసం రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకు వేతనం పొందొచ్చు. ఉద్యోగం చేస్తూనే ఐపీసీసీ రెండో గ్రూప్‌లో కూడా ఉత్తీర్ణత సాధించి తర్వాత ఫైనల్‌ను పూర్తిచేసి పూర్తిస్థాయి సీఏ హోదాను పొందొచ్చు.

సీపీటీ పరీక్షకు ముఖ్య తేదీలు:

దరఖాస్తుల లభ్యత:

అక్టోబర్ 7 నుంచి 28, 2013 (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్).

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:
అక్టోబర్ 28, 2013 (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్).

రాత పరీక్ష తేదీ:
సీపీటీ పరీక్షను డిసెంబర్ 15న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్‌లుగా నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: www.icai.org
Bavitha 






ప్రణాళిక ప్రకారం చదివితే ఉత్తమ స్కోర్

కెరీర్‌కు సంబంధించి స్పష్టమైన అవగాహనతో, లక్ష్యంతో సీఏ కోర్సులోకి అడుగుపెట్టాలి. సబ్జెక్టులు ఎంత కష్టంగా ఉన్నాసరే సరైన ప్రణాళికతో చదివితే మంచి స్కోరింగ్ సాధ్యమన్న ఆత్మవిశ్వాసం ఉండాలి. ఏదీ కష్టపడకుండా రాదన్న వాస్తవాన్ని గుర్తించి, ముందడుగు వేయాలి. టైం మేనేజ్‌మెంట్ పాటిస్తూ ఒత్తిడికి గురవకుండా ప్రిపరేషన్ కొనసాగిస్తే ఎక్కువ స్కోర్ సాధించడం కష్టమేమీ కాదు. శిక్షణ తరగతుల్లో ఏ రోజు చెప్పింది ఆ రోజే చదవడం, సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలి. లేకుంటే సబ్జెక్టులపై అనాసక్తత ఏర్పడే ఆస్కారం ఉంటుంది. నేను ఇంటర్ ఎంపీసీ పూర్తిచేశాను. తర్వాత సీఏలోకి అడుగుపెట్టాను. అకౌంట్స్, ట్యాక్సేషన్, ఆడిటింగ్ తదితర అంశాలు పూర్తిగా కొత్తవి కావడం వల్ల నేర్చుకోవాలన్న ఉత్సుకత పెరిగింది. ఈ ఉత్సాహం చివరి వరకు ఉండటం వల్ల మెరుగైన స్కోర్ సాధించగలిగాను. సీఏ ఫైనల్లో భాగంగా ఉన్న ఆర్టికల్‌షిప్ చాలా ముఖ్యమైంది. అప్పటివరకు వివిధ అంశాలకు సంబంధించి పుస్తకాల్లో నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా అప్లై చేయడానికి ఆర్టికల్‌షిప్ వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం చార్టర్డ్ అకౌంటెంట్లకు అవకాశాలు బాగున్నాయి. ఐటీ, ఫార్మా, ఆతిథ్యం, ఇన్‌ఫ్రా రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సీఏ పూర్తిచేసిన వారికి డిమాండ్ బాగా పెరుగుతోంది.
Bavitha
Published date : 26 Sep 2013 03:21PM

Photo Stories