Skip to main content

షేర్ల వ్యాపారానికి స్టాక్ బ్రోకర్!

స్టాక్ ఎక్స్ఛేంజ్, బులియన్ మార్కెట్, షేర్లు, సెన్సెక్స్, నిఫ్టీ.. ఇవి మనం తరచుగా వినే పదాలు. సంప్రదాయ పొదుపు పథకాల కంటే షేర్లలో పెట్టుబడులతో అధిక రాబడి ఉంటుందని ఆర్థిక నిపుణులు సలహాలు ఇస్తుంటారు. అయితే, షేర్లు, అందులో పెట్టుబడులపై చాలామందికి ఏమాత్రం అవగాహన ఉండదు. షేర్ల ఫలాలు పొందాలనుకునే క్లయింట్ల తరఫున ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి స్టాక్ బ్రోకర్లు ఉంటారు. ప్రపంచంలో ధనం చెలామణిలో ఉన్నంతకాలం స్టాక్ బ్రోకర్లకు చేతినిండా పని, మంచి ఆదాయం లభిస్తాయని నిపుణులు అంటున్నారు.

పేరు ప్రఖ్యాతలు, ఆదాయం, అవకాశాలు: స్టాక్ బ్రోకర్లు తమ క్లయింట్లకు సురక్షితమైన పెట్టుబడి పథకాలను సూచించాల్సి ఉంటుంది. వారి తరఫున షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పథకాల్లో పెట్టుబడులు పెట్టాలి. షేర్ల కొనుగోలు, అమ్మకం వంటి కార్యకలాపాలు స్వయంగా చేపట్టాలి. ఈ వ్యవహారాలను నిర్వహించినందుకు క్లయింట్ల నుంచి ఆకర్షణీయమైన కమీషన్ పొందొచ్చు. స్టాక్ బ్రోకర్లు తమ పనితీరుతో క్లయింట్లకు లాభాలను ఆర్జించి పెడితే పేరుప్రఖ్యాతలు వస్తాయి. అవకాశాలు, ఆదాయం పెరుగుతాయి. తాజా గ్రాడ్యుయేట్లు/పోస్టు గ్రాడ్యుయేట్లకు స్టాక్ బ్రోకరేజీ సంస్థల్లో అసిస్టెంట్ రిలేషన్‌షిప్ మేనేజర్/రిలేషన్‌షిప్ మేనేజర్‌గా కొలువులు అందుబాటులో ఉన్నాయి. బ్రోకరేజీ కంపెనీలో సబ్-బ్రోకర్, ఫ్రాంచైజీగా కూడా చేరొచ్చు.

కావాల్సిన నైపుణ్యాలు: స్టాక్ బ్రోకర్‌కు మార్కెట్ పల్స్‌ను సరిగ్గా గుర్తించే నేర్పు ఉండాలి. ఆర్థిక లావాదేవీల్లో నమ్మకం ప్రధానం. క్లయింట్ల మనోభావాలు దెబ్బతినకుండా, మార్కెట్‌లో కంపెనీ స్థానం దిగ జారకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. స్టాక్ బ్రోకర్ పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే క్లయింట్ల జీవితాలు తారుమారవుతాయి. కాబట్టి విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా సదా అప్రమత్తంగా ఉండాలి. ఈ వృత్తిలో ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి.

అర్హతలు: మన దేశంలో బ్రోకరేజీ సంస్థలు ఎంబీఏ (ఫైనాన్స్) కోర్సు చదివినవారిని అసిస్టెంట్ రిలేషన్‌షిప్ మేనేజర్, రిలేషన్‌షిప్ మేనేజర్‌గా నియమించుకుంటున్నాయి. కాబట్టి ఈ కోర్సు పూర్తిచేస్తే స్టాక్ బ్రోకర్‌గా స్థిరపడొచ్చు. దీంతోపాటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ చేస్తున్న ఫైనాన్షియల్ మార్కెట్స్ సర్టిఫికేషన్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ చేస్తున్న డెరివేటివ్ ఎక్స్ఛేంజ్ సర్టిఫికేషన్ కూడా పూర్తిచేస్తే అర్హతలను పెంచుకొని, మంచి అవకాశాలను అందుకోవచ్చు.

వేతనాలు: స్టాక్ బ్రోకర్లకు పనితీరును బట్టి ఆదాయం చేతికందుతుంది. ఎంబీఏ(ఫైనాన్స్) కోర్సు చేసిన రిలేషన్‌షిప్ మేనేజర్ సంవత్సరానికి రూ.2.4 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. నాన్-ఫైనాన్స్ రిలేషన్‌షిప్ మేనేజర్‌కు ఇంతకంటే కొంత తక్కువ ఆదాయం లభిస్తుంది. సంస్థ పరిధిని బట్టి ఇందులో మార్పులుంటాయి. రిలేషన్‌షిప్ మేనేజర్‌గా కెరీర్‌ను ప్రారంభించినవారు మెరుగైన పనితీరుతో టీమ్ లీడర్, జోనల్ మేనేజర్‌గా పదోన్నతులు పొందొచ్చు.

కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
  • బీఎస్‌ఈ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్-ముంబై.
    వెబ్‌సైట్:
    www.bseindia.com
  • నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్-ముంబై.
    వెబ్‌సైట్:
    www.nseindia.com
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా-న్యూఢిల్లీ
    వెబ్‌సైట్:
    www.icsi.edu
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా-న్యూఢిల్లీ
    వెబ్‌సైట్:
    www.icai.org
  • ఎన్‌సీఎఫ్‌ఎం అకాడమీ-హైదరాబాద్.
    వెబ్‌సైట్:
    www.ascncfmacademy.com
ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగొచ్చు
‘‘భారతీయ స్టాక్ మార్కెట్ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. స్టాక్ బ్రోకర్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఫైనాన్స్, మార్కెట్లపై ఆసక్తి ఉన్న ఇంటర్మీడియెట్, డిగ్రీ అభ్యర్థులు ఈ కోర్సులను అభ్యసించొచ్చు. షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్ల అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియలో స్టాక్ బ్రోకర్‌దే ప్రధాన పాత్ర. వ్యక్తులు లేదా సంస్థలకు సంబంధించిన ఈ క్రయవిక్రయాల విషయంలో స్టాక్‌బ్రోకర్... డీలర్‌గా, అడ్వైజర్‌గా, అనలిస్ట్‌గా పనిచేస్తాడు. ఈ కెరీర్‌లో ప్రవేశించిన వారు ఉద్యోగాలకే పరిమితమవ్వాల్సిన అవసరం లేదు. మార్కెట్ స్థితిగతులపై పూర్తి అవగాహన ఏర్పడితే ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగడానికి మంచి అవకాశం ఉంటుంది’’
ఎ.ఎస్.చక్రవర్తి, ఎన్‌సీఎఫ్‌ఎం అకాడమీ, హైదరాబాద్
Published date : 17 Sep 2014 05:40PM

Photo Stories