Skip to main content

పెట్టుబడులకు.. ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్

జీవితానికి భరోసా, భవిష్యత్తుపై ధీమా కల్పించేవి.. పొదుపు, మదుపు. సంపాదించిన ప్రతి పైసాను జాగ్రత్తగా వాడుకొని, రేపటి అవసరాల కోసం అందులో కొంత మిగుల్చుకోవాలనే ఆరాటం అందరిలో ఉంటుంది. మిగిల్చిన సొమ్మును ఎక్కడ, ఎలా పొదుపు చేసుకోవాలో చాలామందికి అవగాహన ఉండదు. ఒక రూపాయితో మరో రూపాయిని సంపాదించడం ఎలాగో తెలియదు. బీమా పాలసీ తీసుకోవాలంటే .. మార్కెట్‌లో లెక్కలేనన్ని పథకాలు. వాటిలో తమ అవసరాలకు సరిపోయే పథకంపై పరిజ్ఞానం శూన్యం. ఇలాంటి కీలకమైన ఆర్థిక అంశాలపై జనానికి అవగాహన కల్పించి, పొదుపు మదుపుల విషయంలో మార్గదర్శిగా వ్యవహరించే నిపుణులే.. ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్. నేటి సామాజిక అవసరాల రీత్యా వీరికి డిమాండ్ పెరుగుతోంది. ఆదాయాలు వృద్ధి చెందుతుండడంతో ఆర్థిక సలహాదారులను సంప్రదించేవారి సంఖ్య నానాటికీ అధికమవుతోంది. అంకెలు, గణాంకాలు, వడ్డీ లెక్కలపై ఆసక్తి ఉన్నవారు ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌గా కెరీర్‌లో సులభంగా రాణించొచ్చు. సలహాదారులకు ప్రస్తుతం పుష్కలమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి.

బ్యాంక్‌లు, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ సంస్థల్లో..
అర్హులైన ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ కార్పొరేట్ సంస్థల, క్లయింట్ల ఆర్థికపరమైన సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీ షేర్లు, డిబెంచర్లు, బీమా పాలసీలు, కమోడిటీలు, స్థిరాస్తి.. ఇలా వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి సలహాలు ఇవ్వాలి. క్లయింట్ల తరఫున వారి డబ్బును పెట్టుబడి పథకాల్లో పొదుపు, మదుపు చేయాలి. లాభాలను వారికి అందిస్తూ ఆకర్షణీయమైన కమీషన్ పొందొచ్చు. ప్రతి పెట్టుబడిలో లాభనష్టాలను వివరించాలి. ఆయా రంగాల్లో భవిష్యత్తు పరిణామాలను ఊహించగలిగే నేర్పు ఉండాలి. క్లయింట్ల సొమ్ముకు భద్రత కల్పించే పథకాలను సూచించాలి. భారీ స్థాయిలో వ్యాపారలావాదేవీలను నిర్వహించే కార్పొరేట్ సంస్థలు ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లను నియమించుకుంటున్నాయి. బ్యాంకుల్లో, రియల్ ఎస్టేట్ సంస్థల్లో, స్టాక్‌మార్కెట్లలోనూ ఉద్యోగాలు దక్కుతున్నాయి. వృత్తి నైపుణ్యాలను పెంచుకొని సొంతంగా ఇన్వెస్ట్‌మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవచ్చు.

కావాల్సిన నైపుణ్యాలు:
ఆర్థిక సలహాదారులకు విశ్లేషణాత్మక దృక్పథం, తార్కిక ఆలోచనా విధానం ఉండాలి. కమ్యూనికేషన్, మార్కెటింగ్, రిలేషన్‌షిప్ బిల్డింగ్ స్కిల్స్ అవసరం. ఆర్థిక వ్యవహారాలు, సంబంధిత చట్టాలు, నియమ నిబంధనలపై ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకోవాలి. వృత్తిపరమైన నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవాలి.

అర్హతలు: పర్సనల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌గా వృత్తిలోకి ప్రవేశించాలంటే.. ‘అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా సర్టిఫికేషన్ టెస్ట్’లో అర్హత సాధించాలి. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సర్టిఫికేషన్‌తో అర్హతలను, నైపుణ్యాలను పెంచుకోవచ్చు. కార్పొరేట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌గా మారాలంటే.. ఫైనాన్స్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్‌గా గ్రాడ్యుయేషన్/పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలి. ప్రారంభంలో సీనియర్ అడ్వైజర్ వద్ద పనిచేసి, వృత్తిలో మెళకువలను తెలుసుకొని అనుభవం సంపాదించిన తర్వాత సలహాదారుగా సొంతంగా పనిచేసుకోవచ్చు.

వేతనాలు: పొదుపు, మదుపు సలహాదారులు తమ నైపుణ్యాలు, మార్కెట్ స్థితిగతులను బట్టి ఆదాయం ఆర్జించుకోవచ్చు. కార్పొరేట్ సంస్థల సలహాదారులకు స్థిరమైన వేతనం అందుతుంది. ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు పొందొచ్చు. సొంతంగా ఏజెన్సీని ఏర్పాటు చేసుకుంటే ఇంకా అధికంగా సంపాదించుకోవచ్చు. ఖాతాదారుల సంఖ్య, వారి పెట్టుబడుల ఆధారంగా ఆదాయం లభిస్తుంది.

కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - కోల్‌కతా
    వెబ్‌సైట్:
    www.iimcal.ac.in/
  • ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఢిల్లీ యూనివర్సిటీ
    వెబ్‌సైట్:
    www.fms.edu/
  • నార్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్-ముంబై
    వెబ్‌సైట్:
    www.nmims.edu/
  • ఇంటర్నేషనల్ కాలేజీ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్
    వెబ్‌సైట్:
    www.icofp.org/
  • జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్
    వెబ్‌సైట్:
    www.xlri.ac.in/
Published date : 12 Sep 2014 11:50AM

Photo Stories