Skip to main content

కెరీర్ గైడెన్స్.. స్టాక్ బ్రోకర్

ఆర్థ్ధిక సరళీకరణ నేపథ్యంలో అనేక కొత్త రంగాలు ఊపందకున్నాయి. ఉద్యోగావకాశాలు వెల్లువెత్తాయి. వీటిలో స్టాక్ మార్కెట్ కూడా ఒకటి. సెక్యూరిటీల (షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు,బాండ్లు) అమ్మకాలు, కొనుగోళ్లు జరిపే మార్కెట్ ప్రదేశాన్నే స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. ఈ ప్రక్రియలో స్టాక్ బ్రోక ర్ ప్రధాన పాత్ర వహిస్తాడు. వ్యక్తులు లేదా సంస్థల సెక్యూరిటీల క్రయవిక్రయాల విషయంలో స్టాక్ బ్రోకర్ డీలర్‌గా, అడ్వైజర్‌గా, అనలిస్ట్‌గా వ్యవహరిస్తాడు.

స్టాక్ బ్రోకర్ కావడం ఎలా?
ఈ రంగంలో ఆసక్తిగల వారు ముందుగా సంబంధిత స్టాక్ ఎక్స్ఛేంజిలో తమ పేరును నమోదు చేసుకోవాలి. దీనికోసం రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తర్వాత ట్రెనింగ్ ఉంటుంది. రాత పరీక్షలో అకౌంటెన్సీ, క్యాపిటల్ మార్కెట్స్, సెక్యూరిటీస్- పోర్ట్‌ఫోలియో అనాలిసిస్ వంటి సబ్జెక్టుల్లో అభ్యర్ధి పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత కొంత నగదును స్టాక్ ఎక్స్ఛేంజిలో పూచీకత్తుగా ఉంచాలి. ఇది కాక పెద్ద స్టాక్ బ్రోకింగ్ సంస్థల్లో ఉద్యోగాలు లభించే అవకాశం కూడా ఉంది. వీటిలో డీలర్లు లేదా ఏజెంట్లగా చేరి అనుభవాన్ని సంపాదించవచ్చు. స్టాక్ బ్రోకింగ్ సంస్థలు ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్ చేసిన ఎంబీఏ ఉత్తీర్ణులు, చార్టెర్డ్ అకౌంటెంట్స్, చార్టెర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అంతేకాక ఈ రంగానికి చెందిన నిపుణులైన ఆర్ధిక వేత్తలు, అకౌంటెంట్లు, ఫైనాన్స్ మేనేజర్లు, ఫైనాన్షియల్ అనలిస్టులు, క్యాపిటల్ మార్కెట్ స్పెషలిస్టులు, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పైనాన్షియల్ ప్లానర్స్ సేవలను కూడా ఈ సంస్థలు వినియోగించుకుంటాయి.

పని విధానం:
స్టాక్ బ్రోకర్ సొంతగా తన కార్యకలాపాలు సాగించవచ్చు లేదా ఒక సంస్థ తరఫున పని చేయవచ్చు. ప్రధానంగా స్టాక్ బ్రోకర్ వ్యక్తుల లేదా సంస్థల తరపున సెక్యూరిటీలను కొని లేదా అమ్మి కమిషన్ రూపంలో కొంత సొమ్మును పొందుతాడు. సంస్థాగత పెట్టుబడిదార్ల తరఫున పనిచేసే వారిని సెక్యూరిటీస్ ట్రేడర్స్ అంటారు. క్లయింట్లకు ఆర్ధిక పరమైన సలహాలను అందించడం, పోర్ట్‌ఫోలియోలను నిర్వహించడం ద్వారా వారికి ఆర్థ్ధిక లబ్ది చేకూరేవిధంగా స్టాక్ బ్రోకర్ వ్యవహరించాలి. ఇది పూర్తిగా డబ్బుతో కూడిన వ్యవహారం కాబట్టి స్టాక్ బ్రోకర్ చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. డబ్బు పట్ల అత్యాశ, తొందరపాటు లేకుండా విచక్షణ, విశ్లేషణలతో ఆచి తూచి అడుగు వేయగల లక్షణాలను సంతరించుకున్నవారే సక్సెస్‌ఫుల్ స్టాక్ బ్రోకర్ కాగలరు. అయితే ఇటీవల పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో వ్యక్తులే తమ సెక్యూరిటీల అమ్మకం, కొనుగోళ్లను ఇంటివద్ద నుంచే ఇంటర్నెట్ ద్వారా నిర్వహించుకోగలుగుతున్నారు. వివిధ బ్యాంకుల్లో డీమ్యాట్ అకౌంట్లను ప్రారంభించడం ద్వారా తమ వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నారు.ఇక్కడ బ్యాంకులే సెక్యూరిటీల ట్రేడర్లుగా వ్యవహరించి కొంత కమిషన్‌ను పొందడం ద్వారా ఈ సదుపాయాన్ని ఇన్వెస్టర్లకు అందిస్తున్నాయి.

కావాల్సిన స్కిల్స్
కంపెనీలు, ఉత్పత్తులు, వాటి పెట్టుబడుల తీరుతెన్నులు, పనితీరు, వద్ధి రేటు, కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలలు తదితర ఆర్థిక, వ్యాపారపరమైన అంశాలను సునిశితంగా పరిశీలించి విశ్లేషించే సామర్థ్యం ఉండాలి.

జీతం ఎంత?
సాధారణంగా ఎంబీఏలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లు కలిగిన పోస్ట్‌గ్రాడ్యుయేట్లకు ప్రారంభ వేతనం నెలకు కనీసం రూ.12,000 నుంచి 15,000 వరకు ఉంటోంది. చాలా స్టాక్ బ్రోకింగ్ సంస్థలు వేతనంతో పాటు పనితీరుతో ముడిపడిన కమిషన్లుకూడా అందిస్తున్నాయి. ఈ వృత్తిలో సంపాదనకు ఎంతైనా అవకాశం ఉంది. మంచి వృత్తి నైపుణ్యం కలిగినబ్రోకర్లు కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నమాట వాస్తవం.

కోర్సును ఆఫర్ చేస్తోన్న సంస్థలు:
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియూ, న్యూఢిల్లీ: పోస్ట్ గ్రాడ్యుయేట్ మెంబర్‌షిప్ కోర్స్ ఇన్ క్యాపిటల్ మార్కెట్ అండ్ ఫైనాన్షియుల్ సర్వీసెస్
వెబ్ సైట్ : www.icsi.edu

ఇండియున్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ డెవలప్‌మెంట్ (న్యూఢిల్లీ): పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ ఫండమెంటల్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ డెవలప్‌మెంట్
వెబ్ సైట్ : www.utiicm.com

ఆల్ ఇండియా సెంటర్ ఫర్ క్యాపిటల్ మార్కెట్ స్టడీస్, జెడీసీ బైట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ అండ్ రీసెర్చ్, (నాసిక్): ఈ సంస్థ ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ ట్రెనింగ్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ క్యాపిటల్ మార్కెట్ స్టడీస్‌లో ఏడాది డిప్లొమా కోర్సును బోధిస్తోంది. పూణె యూనివర్సిటీ ఈ డిప్లొమా అందజేస్తుంది.

ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రెనింగ్ ఇన్‌స్టిట్యూట్, ముంబై: సర్టిఫికెట్ కోర్స్ ఇన్ స్టాక్ బ్రోకింగ్ (ఈ కోర్సు బ్యాచ్ తర్వాత బ్యాచ్‌గా ఏడాది పొడవునా కొనసాగుతూనే ఉంటుంది.)
వెబ్ సైట్: www.bseindia.com

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పైనాన్షియుల్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ (ముంబై): ఫైనాన్షియుల్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ కోర్స్ (కరస్పాండెన్స్ కమ్ లెక్చర్ విధానంలో) వ్యవధి: ఏడాది
వెబ్ సైట్: www.bseindia.com
Published date : 17 Dec 2012 04:18PM

Photo Stories