Skip to main content

అవకాశాల కామధేనువు ... కామర్స్

కామర్స్ (వాణిజ్య శాస్త్రం).. వస్తువులు, సేవల అమ్మకాలు, కొనుగోళ్లతో కూడిన ఆర్థిక కార్యకలాపాలను వివరించే శాస్త్రం..
ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణలో పెరుగుదల, దేశంలోకి బహుళజాతి కంపెనీలు అడుగుపెడుతుండటం, సేవా రంగం శరవేగంగా విస్తరిస్తుండటం వంటి వాటివల్ల సుశిక్షితులైన కామర్స్ నిపుణులకు డిమాండ్ ఏర్పడుతోంది. దీంతో కెరీర్ పరంగా కొత్త అవకాశాలను వెతుక్కుంటూ నేటి యువత కామర్స్, సంబంధిత ప్రొఫెషనల్ కోర్సుల వైపు అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలో కామర్స్ కోర్సులపై స్పెషల్ ఫోకస్...

తొలి అడుగు
కామర్స్‌లో పదిలమైన కెరీర్‌ను లక్ష్యంగా ఎంపిక చేసుకున్న వారు వేయాల్సిన తొలి అడుగు.. ఇంటర్మీడియెట్‌లో కామర్స్ ఒక సబ్జెక్టుగా ఉన్న గ్రూప్‌లో చేరడం. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు 10+2 స్థాయిలో కామర్స్‌ను ఎంపిక చేసుకునేందుకు రెండు గ్రూప్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి.. సీఈసీ (సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్); ఎంఈసీ (మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్).

కరిక్యులం: రెండేళ్ల వ్యవధి గల ఇంటర్‌లో కామర్స్ సబ్జెక్టుకు సంబంధించి పాఠ్యప్రణాళిక రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం(వాణిజ్య శాస్త్రం)లో వ్యాపారం, భావనలు; వ్యాపార సంస్థల స్వరూప, స్వభావాలు; వ్యాపార విత్తం-మూలాధారాలు; ప్రభుత్వ, ప్రైవేటు బహుళ జాతీయ సంస్థలు; అంతర్జాతీయ వర్తకం; మార్కెటింగ్ వ్యవస్థలు, వ్యాపార ప్రకటనలు, వినియోగదారిత్వం; వ్యాపార సేవలు; స్టాక్ ఎక్స్చేంజ్‌లు తదితర అంశాలుంటాయి.
రెండో భాగం (అకౌంటింగ్)లో సహాయక పుస్తకాలు; బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ; అంకణా తప్పుల సవరణ; ముగింపు లెక్కలు; వర్తకం బిల్లులు, తరుగుదల; కన్‌సైన్‌మెంట్ ఖాతాలు; వ్యాపారేతర సంస్థల ఖాతాలు; ఒంటిపద్దు విధానం; భాగస్వామ్య వ్యాపార ఖాతాలు వంటి అంశాలుంటాయి.

గ్రాడ్యుయేషన్ స్థాయిలో
కామర్స్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ స్థాయిలో బీకామ్ జనరల్, బీకామ్ ఆనర్స్, బీకామ్ కంప్యూటర్స్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా కొన్ని కళాశాలలు మార్కెటింగ్, ఫారెన్ ట్రేడ్, ట్యాక్సెస్ వంటి స్పెషలైజేషన్లతో బీకామ్ కోర్సులను అందిస్తున్నాయి. బీకామ్ జనరల్‌తో పోల్చితే ఇతర కోర్సుల్లో సిలబస్ పరిధి కాస్తా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం బీకామ్ ఆనర్స్, బీకామ్ కంప్యూటర్స్ కోర్సులకు డిమాండ్ బాగుంది. ఇంటర్మీడియెట్-నాన్ కామర్స్ విద్యార్థులు కూడా బీకామ్ కోర్సులో చేరొచ్చు. వీరికి ప్రవేశాల్లో 20 శాతం రిజర్వేషన్ ఉంటుంది.

కరిక్యులం: బీకాంలో ఫైనాన్షియల్ అకౌంటింగ్, కార్పొరేట్ అకౌంటింగ్, డెరైక్ట్ అండ్ ఇన్‌డెరైక్ట్ ట్యాక్సేషన్, కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ లా వంటి అంశాలను బోధిస్తారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని మిళితం చేసి బీకామ్ కంప్యూటర్స్ కోర్సును ఆఫర్ చేస్తున్నారు. దీని కరిక్యులంలో ఫైనాన్షియల్ అకౌంటింగ్, బిజినెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ సీ లాంగ్వేజ్, అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్, బిజినెస్ స్టాటిస్టిక్స్, ఈ-కామర్స్, బిజినెస్ లా వంటి అంశాలుంటాయి. బీకామ్ ఫారెన్ ట్రేడ్ గ్రూప్.. విదేశీ వాణిజ్యం సంబంధిత అంశాల కేంద్రీకృతంగా ఉంటుంది. దీని కరిక్యులంలో ఫైనాన్షియల్ అకౌంటింగ్, అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్ వంటి రెగ్యులర్ అంశాలతోపాటు ఇండియాస్ ఫారెన్ ట్రేడ్, ఫారెన్ ట్రేడ్ ఫైనాన్సింగ్ అండ్ ప్రొసీజర్స్, ఎక్స్‌పోర్ట్ డాక్యుమెంటేషన్ అండ్ ప్రొసీజర్స్ తదితర అంశాలు ఉంటాయి.

పోస్టు గ్రాడ్యుయేషన్
బీకామ్ తర్వాత పీజీ స్థాయిలో పలు స్పెషలైజేషన్స్‌తో ఎంకామ్ పూర్తి చేయవచ్చు. అవి.. ఫైనాన్స్, అకౌంటింగ్, టాక్సేషన్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఇన్సూరెన్స్, మార్కెటింగ్, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (హెచ్‌ఆర్‌ఎం). వీటిల్లో ప్రస్తుతం ఫైనాన్స్, అకౌంటింగ్ స్పెషలైజేషన్స్‌కు మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా జాబ్ మార్కెట్ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొన్ని యూనివర్సిటీలు ఎంకామ్‌లో ఫైనాన్స్ అండ్ కంట్రోల్, కార్పొరేట్ సెక్రటరీషిప్, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ వంటి వినూత్న స్పెషలైజేషన్స్‌ను అందిస్తున్నాయి. పీజీ తర్వాత ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ కూడా చేయవచ్చు. నెట్‌లో అర్హత సాధిస్తే అకడమిక్ రంగంలో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

మేనేజ్‌మెంట్ కోర్సులు
మేనేజ్‌మెంట్‌వైపు ఆసక్తి ఉంటే ఇంటర్మీడియెట్ సీఈసీ/ఎంఈసీ తర్వాత విద్యార్థులు బ్యాచిలర్ స్థాయిలో బీబీఏ (బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్), బీబీఎం (బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్) కోర్సులను ఎంచుకోవచ్చు. మన రాష్ట్రంలోని కొన్ని కాలేజీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. మేనేజ్‌మెంట్ విద్యకు సంబంధించి వీటిని ప్రాథమిక కోర్సులుగా పేర్కొనవచ్చు. ఈ రంగంలో ఉన్నత స్థానాల్లో స్థిర పడాలంటే పీజీ స్థాయిలో ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సులు ఉన్నాయి. వీటిలో చేరడానికి రాష్ట్ర స్థాయిలో ఐసెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్), జాతీయ స్థాయిలో క్యాట్, మ్యాట్, సీమ్యాట్, ఎక్స్‌ఏటీ వంటి ప్రవేశ పరీక్షలు రాయాలి.

‘లా’ అండగా ఉంటే
కామర్స్ గ్రాడ్యుయేట్లకు న్యాయశాస్త్రంలోనూ పట్టా ఉంటే ఎన్నో అవకాశాలు సొంతమవుతాయి. న్యాయ శాస్త్రంలో బోధించే ఇంటర్నేషనల్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, కార్పొరేట్ అకౌంటెన్సీ, టాక్స్ లా తదితరాలన్నీ వాణిజ్య రంగంలోని లోటుపాట్లను సులువుగా తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి కామర్స్‌కు తోడు ‘లా’ ఉండటం కెరీర్ పరంగా లాభించే అంశం. ఈ క్రమంలో ‘లా’ కోర్సులో ప్రవేశానికి రాష్ట్ర స్థాయిలో లాసెట్ (లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్), జాతీయ స్థాయిలో కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్), ఏఐఎల్‌ఈటీ (ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్), లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఇండియా (ఎల్‌శాట్) తదితర ప్రవేశ పరీక్షలకు హాజరు కావచ్చు.

స్వీయ ఉపాధి
సొంతంగా వ్యాపార సంస్థను ప్రారంభించవచ్చు. స్టాక్ బ్రోకర్‌గా, ట్రేడ్ కన్సల్టెంట్‌గా, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా, ఫైనాన్షియల్ అనలిస్టుగా, ట్యాక్స్ కన్సల్టెంట్‌గా ఫ్రీలాన్స్ సేవలను అందించొచ్చు. వివిధ రంగాల సంస్థలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాల నమోదు ప్రక్రియను అకౌంటింగ్ అంటారు. అకౌంటింగ్‌లో ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ విభాగాలుంటాయి.
ఇంటర్మీడియెట్‌లో చదివిన గ్రూప్‌తో సంబంధం లేకుండా అకౌంటింగ్ కోర్సుల్లో చేరే వీలున్నప్పటికీ, కామర్స్ సబ్జెక్టుతో ఇంటర్ పూర్తిచేసిన వారికి ఇవి సౌలభ్యంగా ఉంటాయి. ఎందుకంటే.. కామర్స్‌లో చదివిన సబ్జెక్టులే వీటిలో అధిక శాతం వరకు ఉంటాయి. కాబట్టి వీటిని అధ్యయనం చేయడం తేలికవుతుంది. ప్రస్తుతం అకౌంటింగ్ సంబంధిత ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేసిన వారు అందుకునే నేర్పు, ఓర్పు ఉండాలేగానీ కళ్లు చెదిరే వేతనాలతో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

జాబ్ ప్రొఫైల్స్
కోర్సులు పూర్తిచేసిన వారికి అకౌంటెంట్, బిజినెస్ అనలిస్ట్, ట్యాక్స్ అకౌంటెంట్, ట్యాక్స్ అనలిస్ట్, ట్యాక్స్ అడ్వైజర్, ట్యాక్స్ ఎగ్జామినర్స్, ఫండ్ మేనేజర్, ఫైనాన్షియల్ అనలి్‌స్ట్, ఫైనాన్స్ మేనేజర్, ఇంటర్నెట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వంటి అవకాశాలుంటాయి. ప్రారంభంలో నెలకు రూ.15,000-20,000 వరకు వేతనం లభిస్తుంది.

ఇతర ప్రధాన కోర్సులు:
చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ)
ఏ సంస్థలోనైనా ప్రధాన విభాగాలు అకౌంటింగ్, ఆడిటింగ్, టాక్సేషన్. వాటి గురించి వివరించేదే చార్టర్డ్ అకౌంటెన్సీ. కంపెనీలు, వ్యక్తుల ట్యాక్స్ ప్లానింగ్ విషయుంలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) అవసరం తప్పనిసరి. అంతేకాకుండా పెట్టుబడులు, వాటి ప్లానింగ్, సంస్థాగత అభివృద్ధి, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన, నిర్వహణలో సాధ్యాసాధ్యాలు, ఆర్థిక వనరుల సమీకరణ, జారుుంట్ వెంచర్స్, విదేశీ భాగస్వావ్యూలు, విస్తరణ, విలీనాల్లోనూ, ఉత్పత్తుల ధరలు మొదలైన వాటిలో సీఏలు కీలక పాత్ర పోషిస్తారు.

మూడు దశలు
సీఏ కోర్సును ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) నిర్వహిస్తోంది. ఇందులో కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(సీపీటీ), ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్‌‌స కోర్సు (ఐపీసీసీ), ఫైనల్ దశలుంటాయి. పదో తరగతి పూర్తిచేసిన వారు సీపీటీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సీపీటీ ఏటా జూన్, డిసెంబర్‌లలో జరుగుతుంది. ఈ పరీక్ష రాయడానికి ఇంటర్, డిగ్రీ.. ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు. సీపీటీ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. దీనికి 200 మార్కులు కేటాయించారు. పరీక్ష రెండు సెషన్లలో ఉంటుంది. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, మర్కంటైల్ లా, జనరల్ ఎకనామిక్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లపై ప్రశ్నలుంటాయి. ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి విభాగంలో 30 శాతం మార్కులు, అన్ని విభాగాల్లో కలిపి 100 మార్కులు సాధించాలి.

ఐపీసీసీ
సీపీటీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. ఐపీసీసీ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ కోర్సు రెండు గ్రూపులుగా ఉంటుంది. అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఏదైనా ఒక గ్రూప్ లేదా ఒకేసారి రెండు గ్రూప్‌లకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకున్న తర్వాత తొమ్మిది నెలల స్టడీ కోర్సును పూర్తిచేయాలి. దీంతోపాటు ఓరియెంటేషన్ కోర్సు, 100 గంటలపాటు సాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సును పూర్తి చేయాలి. ఏటా మే, నవంబర్‌లో ఐపీసీసీ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేందుకు ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం, గ్రూప్ మొత్తంమీద 50 శాతం మార్కులు రావాలి.

డిగ్రీతో నేరుగా
55 శాతం మార్కులతో కామర్‌‌స గ్రాడ్యుయేట్స్/ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పూర్తిచేసిన వారు, 60 శాతం మార్కులతో ఏదైనా ఇతర గ్రాడ్యుయేషన్/ పీజీ పూర్తిచేసిన వారు, ఐసీడబ్ల్యూఏఐ లేదా సీఎస్‌లో ఇంటర్ పూర్తిచేసిన అభ్యర్థులు సీపీటీకి హాజరు కావల్సిన అవసరం లేదు. వీరు నేరుగా రెండో దశ ఐపీసీసీలో చేరొచ్చు.

ఆర్టికల్స్
ఐపీసీసీ కోర్సులోని గ్రూప్-1 గాని లేదా రెండు గ్రూప్స్ పూర్తిచేసిన వారు మూడు సంవత్సరాల ఆర్టికల్స్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఐసీఏఐ గుర్తింపు ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైపెండ్ కూడా సంపాదించుకోవచ్చు.

ఫైనల్
ఐపీసీసీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఫైనల్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రెండున్నరేళ్ల ఆర్టికల్స్ పూర్తిచేసిన తర్వాత ఫైనల్ పరీక్షకు అర్హత లభిస్తుంది. ఇందులోని ప్రతి గ్రూపులో నాలుగు పేపర్లు ఉంటాయి. ఫైనల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం, గ్రూప్ మొత్తం మీద 50 శాతం మార్కు లు సాధించాలి. ఫైనల్‌తో పాటు జనరల్ మేనేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సు కూడా చేయాలి.

కెరీర్
సీఏ కోర్సు పూర్తిచేసిన వారికి సేవా రంగం, టెలికం, బ్యాంకింగ్, బీమా, సాఫ్ట్‌వేర్, మైనింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు, ఆడిటింగ్ ఫర్మ్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, ఇన్వెస్ట్‌మెంట్ హౌసెస్, పేటెంట్ ఫర్మ్స్, లీగల్ హౌసెస్ వంటివి ఉన్నత అవకాశాలు కల్పిస్తున్నాయి. స్టాట్యుటరీ అండ్ ఇంటర్నల్ ఆడిటింగ్, అకౌంటింగ్, డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్; ట్యాక్స్ ప్లానింగ్, టెక్నికల్ అనాలసిస్, రిస్క్ అసెసర్స్, సర్వేయర్స్, మర్చంట్ బ్యాంకర్స్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, కన్సల్టెన్సీ సర్వీసెస్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ వంటి ఆధునిక విభాగాల్లోనూ అవకాశాలు లభిస్తున్నాయి. స్వయం ఉపాధి కోరుకునే వారు సొంతంగా ఆడిటర్‌గా కూడా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు. సీఏ ఉత్తీర్ణులకు ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో ఫ్రెషర్‌కు నెలకు కనీసం రూ.35,000 వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవం ఆధారంగా దాదాపు అధిక వేతనాలు అందుకోవచ్చు.

అకౌంటింగ్ టెక్నీషియన్ కోర్సు
సీపీటీ పాసైన విద్యార్థి సీఏ పూర్తి చేయలేను అని భావిస్తే ఐపీసీసీలోని గ్రూప్-1 పూర్తిచేసి, ఏడాదిపాటు సీఏ దగ్గర ఆర్టికల్ షిప్ చేస్తే అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ/ప్రభుత్వేతర సంస్థల్లో చేరి కనీసం రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకు వేతనం పొందొచ్చు.

సీఎంఏ
అకౌంటింగ్ రంగాల్లో సమున్నత భవిష్యత్తును కోరుకునే విద్యార్థులకు మరో చక్కటి అవకాశం కల్పిస్తున్న కోర్సు కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ). ఈ కోర్సును ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. సీఎంఏ కోర్సు మూడు దశలుగా ఉంటుంది. అవి.. ఫౌండేషన్ కోర్సు, ఇంటర్మీడియెట్ కోర్సు, ఫైనల్ కోర్సు.

ఫౌండేషన్ కోర్సు
ఈ కోర్సులో పేరు నమోదు చేసుకోవడానికి కనీస అర్హత ఇంటర్మీడియెట్/10+2/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూసే వారు కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ ఫౌండేషన్ కోర్సు పరీక్షలు ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో జరుగుతాయి.

ఇంటర్మీడియెట్ కోర్సు
సీఎంఏ ఫౌండేషన్ కోర్సు ఉత్తీర్ణులు లేదా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సుకు తమ పేరు నమోదు చేసుకోవచ్చు. ఇంటర్మీడియెట్ కోర్సు రెండు స్టేజ్‌లుగా ఉంటుంది. ప్రతి దశలో మూడు పేపర్లుంటాయి. ఏటా జూన్, డిసెంబర్‌లలో నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే క్రమంలో నిర్ణీత తేదీల్లోపు సంబంధిత దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

ఫైనల్ కోర్సు
ఇంటర్మీడియెట్ కోర్సు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో కాస్ట్ అండ్ వర్‌‌క అకౌంటెన్సీ ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దే క్రమంలో చివరి దశ ఫైనల్ కోర్సు. ఇది రెండు దశలలో ఉంటుంది. సీఎంఏ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు తమ ఆసక్తికి అనుగుణంగా మొదట ఫైనల్ కోర్సులోని రెండు దశలలో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలను జూన్, డిసెంబర్‌లలో నిర్వహిస్తారు.

ఉపాధి అవకాశాలు
సీఎంఏ పూర్తి చేసిన విద్యార్థులకు ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, వస్తూత్పత్తి సంస్థలు, ఇన్సూరెన్స్ సంస్థలు, మైనింగ్ సంస్థలు, డెవలప్‌మెంట్ ఏజెన్సీలు, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెక్టార్, ఇతర పారిశ్రామిక సంస్థల్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, కాస్ట్ ఆడిటర్ వంటి హోదాలో ప్రవేశించొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ మాదిరిగానే ఇండియన్ కాస్ట్ అకౌంట్స్ సర్వీస్ అనే కేంద్ర సర్వీస్‌ను కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి ఐసీఎంఏఐలో ఫైనల్ పూర్తి చేసిన వారికి కేంద్ర సర్వీసులో అడుగుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. సొంతంగా కూడా కాస్ట్ అకౌంటెంట్‌గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.

కంపెనీ సెక్రటరీషిప్ (సీఎస్)
కంపెనీ సెక్రటరీషిప్(సీఎస్)ను ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) నిర్వహిస్తోంది. ఒక కంపెనీలోని బోర్డ్ మీటింగ్‌ల నిర్వహణ, ఎజెండా, మినిట్స్ రూపకల్పన, వాటి ఆచరణపై పర్యవేక్షణ వంటి ఎన్నో ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వర్తించేది కంపెనీ సెక్రటరీలే. అయితే ఆ స్థాయికి చేరుకోవాలంటే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో మెంబర్‌షిప్ సొంతం చేసుకోవాలి. ఈ కోర్సు మొత్తం మూడు దశలుగా ఉంటుంది. అవి.. ఫౌండేషన్ ప్రోగ్రాం; ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం; ప్రొఫెషనల్ ప్రోగ్రాం.

ఇంటర్‌తోనే ‘ఫౌండేషన్’:
ఐసీఎస్‌ఐ.. సీఎస్ కోర్సులోని తొలిదశ ఫౌండేషన్ ప్రోగ్రాం. దీనికి అర్హత ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో పేరు నమోదు చేసుకోవాలి.. ఈ ప్రోగ్రాం కోసం పరీక్ష ప్రతి ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్‌లలో జరుగుతుంది. ఏడాది మొత్తం పేరు నమోదు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. పేరు నమోదు చేసుకున్న తేదీకి, తొలిసారి పరీక్షకు హాజరయ్యే తేదీకి మధ్య కనీసం 8 నెలల వ్యవధి తప్పనిసరి.

రెండో దశ.. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం
ఫౌండేషన్ ప్రోగ్రాంలోని ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కంపెనీ సెక్రటరీషిప్ ప్రోగ్రాంలోని రెండో దశ ‘ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం’కు నమోదు చేసుకోవాలి. బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులు ఫౌండేషన్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా నేరుగా ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంకు పేరు నమోదు చేసుకోవచ్చు.

ప్రోఫెషనల్ ప్రోగ్రాం టు సెటిల్ ఇన్ ప్రొఫెషన్
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. చివరి దశ ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో పేరు నమోదు చేసుకోవాలి. ప్రొఫెషనల్ ప్రోగ్రాంను మొత్తం నాలుగు మాడ్యూల్స్‌గా విభజించారు. ఒక్కో మాడ్యూల్‌లో రెండు పేపర్లు ఉంటాయి.

15 నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించి ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో పేరు నమోదు చేసుకున్న అభ్యర్థులు ఫ్రొఫెషనల్ ప్రోగ్రాం పరీక్ష రాసేసమయానికి తప్పనిసరిగా 15 నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేసుకోవాలి.

అవకాశాలు
1956 కంపెనీల చట్టం ప్రకారం రూ.5 కోట్ల అధీకృత మూలధనం ఉన్న ప్రతి సంస్థ ఒక పూర్తి స్థాయి కంపెనీ సెక్రటరీని నియమించుకోవాలి. కార్పొరేట్ గవర్నెస్ అండ్ సెక్రటరీయల్ సర్వీసెస్, కార్పొరేట్ లాస్ అడ్వైజరీ అండ్ రిప్రజెంటేషన్ సర్వీసెస్, ఫైనాన్షియల్ మార్కెట్ సర్వీసెస్, మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సంబంధిత కంపెనీల్లో అవకాశాలు విస్తృతం. స్వయం ఉపాధి దిశగా ఆలోచించే వారు సొంతంగా ప్రాక్టీస్ కూడా చేయవచ్చు.
Published date : 09 Jun 2015 02:08PM

Photo Stories