Skip to main content

సీఏలో సరికొత్త నైపుణ్యాలకు ‘ఫౌండేషన్’!

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సీఏ ఔత్సాహికుల్లో నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంతో 2017, జూలై 1 నుంచి చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సుకు కొత్త సిలబస్, విధానం అమల్లోకి వచ్చింది. ఇవిమార్కెట్ అవసరాలకు అనుగుణంగా అభ్యర్థుల్లో నైపుణ్యాలు పెంపొందించే విధంగానే ఉన్నాయంటున్నాయి పారిశ్రామిక వర్గాలు. కొత్త విధానంలో తొలి పరీక్ష 2018 మేలో జరగనుంది. ఈ నేపథ్యంలో సీఏ సీపీటీ స్థానంలో ప్రవేశపెట్టిన సీఏ ఫౌండేషన్ పరీక్ష విధానం, సిలబస్, అనుకూల అంశాలు తదితరాలపై ఫోకస్...
సీఏ కోర్సుకు.. సీఏ ఫౌండేషన్ అనేది ప్రవేశ పరీక్ష అని చెప్పొచ్చు. ఈ ఫౌండేషన్‌ను పూర్తిచేసిన వారు మాత్రమే సీఏ కోర్సును చదవడానికి అర్హులు. ఇప్పటి ఫౌండేషన్ స్థానంలో గతంలో సీపీటీ ఉండేది. సీపీటీలో ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ రూపంలోనే ఉండేవి. అయితే ప్రస్తుత ఫౌండేషన్‌లో 50 శాతం మార్కులను మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు, 50 శాతం మార్కులను డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు కేటాయించారు. ఈ కొత్త విధానం వల్ల అభ్యర్థుల్లో విశ్లేషణాత్మక సామర్థ్యంతోపాటు భావవ్యక్తీకరణ నైపుణ్యాలు కూడా పెరుగుతాయి.

కొత్త విధానం ప్రకారం- సీఏ కోర్సులోని దశలు..
  1. సీఏ ఫౌండేషన్
  2. సీఏ ఇంటర్మీడియెట్ (ఫౌండేషన్ పాసైన 8 నెలలకు)
  3. ప్రాక్టికల్ ట్రైనింగ్ (మూడేళ్లు)
  4. సీఏ ఫైనల్

సిలబస్
ప్రిన్సిపుల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటింగ్:
అకౌంటింగ్ ఫండమెంటల్స్, అకౌంటింగ్ ప్రాసెస్, స్పెషల్ ట్రాన్సాక్షన్స్, పార్టనర్‌షిప్ అకౌంట్స్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, కంపెనీ అకౌంట్స్ తదితర అంశాలు.
బిజినెస్ లాస్: కాంట్రాక్ట్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, పార్‌‌టనర్‌షిప్ యాక్ట్, కంపెనీస్ యాక్ట్ మొదలైనవి.
బిజినెస్ కరస్పాండెన్స్ అండ్ రిపోర్టింగ్: కమ్యూనికేషన్, వర్డ్ పవర్, వొకాబ్యులరీ, కాంప్రెహెన్షన్ ప్యాసేజీలు, నోట్ మేకింగ్, డెవలపింగ్ రైటింగ్ స్కిల్స్..
బిజినెస్ మ్యాథమెటిక్స్: రేషియోస్, ఈక్వేషన్స్, మ్యాట్రిసెస్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, సీక్వెన్సెస్, సిరీస్, సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్, క్యాలిక్యులస్..
లాజికల్ రీజనింగ్: నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్ టెస్ట్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, బ్లడ్ రిలేషన్స్..
స్టాటిస్టిక్స్: డిస్క్రిప్షన్ ఆఫ్ డేటా, ప్రాబబిలిటీ, థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్, ఇండెక్స్ నంబర్స్, టైమ్ సిరీస్..
బిజినెస్ ఎకనామిక్స్: ఇంట్రడక్షన్, డిమాండ్ అండ్ సప్లయ్, థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్, బిజినెస్ సైకిల్స్..
బిజినెస్ అండ్ కమర్షియల్ నాలెడ్జ్: బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, బిజినెస్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ పాలసీలు..

అనుకూలతలు
సీపీటీ కేవలం ఆబ్జెక్టివ్ విధానం కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా చాలామంది ఉత్తీర్ణత సాధించేవారు. వీరు తర్వాతి దశల్లో ఇబ్బందిపడేవారు. ఇప్పుడు ఫౌండేషన్ విధానంలో మొదటి నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌కు పెద్దపీట వేశారు. ప్రస్తుతం సీఏ ఇంటర్, ఫైనల్‌లో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు సీఏ ఫౌండేషన్ ద్వారా సమకూరుతాయి.

ఫౌండేషన్ పేపర్-2 సిలబస్‌లో ఇంగ్లిష్ గ్రామర్, రైటింగ్ స్కిల్స్, నోట్ మేకింగ్ తదితర అంశాలు ఉండటం వల్ల కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి. డ్రాఫ్టింగ్ స్కిల్స్ కూడా అలవడతాయి.

సీపీటీలో నెగెటివ్ మార్కుల విధానం ఉండేది. ఫౌండేషన్‌లో దాన్ని తొలగించారు. సీపీటీలో నాలుగు సబ్జెక్టులకు ఒకేరోజు పరీక్ష రాయాల్సి వచ్చేది. ఫౌండేషన్‌లో నాలుగు సబ్జెక్టులను నాలుగు రోజుల పాటు రాసుకోవచ్చు.

గతంలో మార్చిలో ఇంటర్ పరీక్షలు ముగిసిన వెంటనే జూన్‌లో సీపీటీ రాయాల్సి వచ్చేది. దీనివల్ల విద్యార్థులు ఇబ్బందిపడేవారు. ప్రస్తుతం మారిన విధానంలో ఇంటర్ పరీక్షలకు, సీఏ ఫౌండేషన్‌కు మధ్య ఆర్నెల్లు సమయం ఉంది కాబట్టి బాగా సన్నద్ధమవొచ్చు.

సీఏ ఫౌండేషన్‌లో రీజనింగ్ సబ్జెక్టును పొందుపరచడం వల్ల విద్యార్థికి విజ్ఞానంతో పాటు ఆలోచనా నైపుణ్యాలు(ఆప్టిట్యూడ్ స్కిల్స్) పెరిగే అవకాశముంది.

అకౌంట్స్ సబ్జెక్టును పూర్తిగా డిస్క్రిప్టివ్‌గా మార్చారు. దీనివల్ల విద్యార్థులకు సీఏ ఇంటర్, ఫైనల్ దశల్లో ఎదురయ్యే డిస్క్రిప్టివ్ సమస్యలకు ముందుగానే శిక్షణ లభించినట్లయింది.

బిజినెస్ మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్, స్టాటిస్టిక్స్ అంశాల వల్ల విద్యార్థుల్లో పరిశీలనా శక్తి పెరుగుతుంది. ప్రతి అంశాన్నీ లోతుగా విశ్లేషించి, అర్థం చేసుకునే నైపుణ్యాలు అలవడతాయి.

బిజినెస్ ఎకనామిక్స్, బిజినెస్ అండ్ కమర్షియల్ నాలెడ్జ్ అంశాల వల్ల రకరకాల వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలపై విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుంది. వ్యాపార ప్రారంభ, నిర్వహణలపై పట్టు చిక్కుతుంది.

సీఏ కోర్సులో ఉత్తీర్ణత శాతం కేవలం 2-3 శాతం ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. ఇది అపోహ మాత్రమే. ఉదాహరణకు 2017 జనవరి సీపీటీ ఫలితాల్లో 46.44 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సీఏ ఫైనల్లో 7000 మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

సీఏ అనగానే కేవలం కామర్స్ విద్యార్థులు మాత్రమే రాణించగలరనే అభిప్రాయం ఉంది. ఇది వాస్తవం కాదు. గత ఐదారేళ్ల గణాంకాలను పరిశీలిస్తే భారీ సంఖ్యలో ఎంపీసీ/బైపీసీ విద్యార్థులు సీఏలో రాణిస్తున్నట్లు అర్థమవుతోంది.

Career Guidance

~ ఇంటర్మీడియెట్ లేదా 10+2 లేదా తత్సమాన అర్హతతో ఎవరైనా సీఏ ఫౌండేషన్‌కు నమోదు చేసుకోవచ్చు.
~ సీఏ ఫౌండేషన్ పరీక్షలు ఏటా మే, నవంబర్‌లో జరుగుతాయి.
~ జూన్ 30 లోగా సీఏ ఫౌండేషన్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు అదే సంవత్సరం నవంబర్‌లో సీఏ ఫౌండేషన్ రాసేందుకు అర్హత లభిస్తుంది. జూన్ 30 తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు తర్వాతి సంవత్సరం మేలో ఫౌండేషన్ రాయొచ్చు.
~ సీఏ ఫౌండేషన్‌లోని పేపర్-1, పేపర్-2 పరీక్షలు డిస్క్రిప్టివ్ పద్ధతిలో; పేపర్-3, పేపర్-4 పరీక్షలు ఆబ్జెక్టివ్ పద్దతిలో జరుగుతాయి.
~ సీఏ ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్‌లో కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. అదే విధంగా మొత్తం నాలుగు పేపర్లకు కలిపి 50 శాతం మార్కులు సాధించాలి.
ఎం.ఎస్.ఎస్. ప్రకాశ్, డెరైక్టర్, మాస్టర్‌మైండ్స్
Published date : 20 Jan 2018 12:42PM

Photo Stories