Skip to main content

సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదాతో ప్రయోజనాలెన్నో!

చార్టర్డ్‌ అకౌంటెన్సీ(సీఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్‌), కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ(సీఎంఏ)..ఈ మూడు కోర్సులకు.. కామర్స్‌ ప్రొఫెషనల్‌ కోర్సులుగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది! కెరీర్‌ పరంగా.. ఎంబీఏకు దీటుగా ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు! ఇప్పుడు ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి.. మరో ప్రధానమైన గుర్తింపు లభించింది! అదే.. సీఏ, సీఎస్, సీఎంఏలను.. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ తత్సమాన కోర్సులుగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ప్రకటించింది! అంటే.. ఇకపై ఈ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు.. నేరుగా పీజీ అర్హతతో లభించే ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ స్థాయి హోదాతో విద్యార్థులకు కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం...
వాస్తవానికి సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సులకు పీజీ హోదా కల్పించాలని.. ఆయా కోర్సుల నిర్వాహక సంస్థలు ఐసీఏఐ, ఐసీఎస్‌ఐ, ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా.. కొన్ని నెలల క్రితమే యూజీసీకి విజ్ఞప్తి చేశాయి. దాంతో యూజీసీ ఈ కోర్సులకు పీజీ హోదా కల్పించే విషయంపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ ఈ కోర్సుల స్వరూపాన్ని,శిక్షణను క్షుణ్నంగా పరిశీలించింది. వీటికి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ హోదా కల్పిం చొచ్చని యూజీసీకి సిఫార్సు చేసింది. ఆ సిఫార్సుకు అనుగుణంగా ఇటీవల యూజీసీ అధికారిక ప్రకటన విడు దల చేసింది. ఈ కోర్సులను పీజీ కోర్సులకు తత్సమాన కోర్సులుగా భావించాలని దేశ వ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లకు లేఖ రాసింది.

పరిశోధనలకు ఊతం..
యూజీసీ నిర్ణయంతో సీఏ, సీఎస్, సీఎంఏ ఉత్తీర్ణులకు ఉన్నత విద్య,పరిశోధనల దిశగా అడుగులు వేసేందుకు అవకాశం లభిస్తుంది. ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు యూజీసీ–నెట్‌లో అర్హత సాధించి.. తమకు ఆసక్తి ఉన్న విభాగాల్లో పరిశోధనలు చేసే అవకాశం దక్కుతుంది. అంతేకాకుండా వీరు కామర్స్, మేనేజ్‌మెంట్, అకౌంటింగ్, ఫైనాన్స్‌ తదితర విభాగాల్లో ఎంఫిల్, పీహెచ్‌డీల్లో చేరొచ్చు. పీజీ అర్హతగా ప్రవేశాలు కల్పించే ఇతర కోర్సుల్లోనూ అవకాశం లభించనుంది.

అంతర్జాతీయంగా అవకాశాలు..
సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో.. వీటి ఉత్తీర్ణులకు అంతర్జాతీయంగానూ కెరీర్, ఉన్నత విద్య పరంగా అవకాశాలు విస్తృతం కాను న్నాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవడానికి తాజా నిర్ణయం దోహదపడుతుంది. యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో పీజీ ఫైనాన్స్‌ స్పెషలైజేషన్‌ అర్హతగా ఉద్యోగాలు కల్పించే సంస్థల్లో వీరు అడుగు పెట్టేందుకు అవకాశం లభించనుంది.

ఇంకా చ‌ద‌వండి: part 2: ఈ కోర్సులు చేసిన వారికి ఉద్యోగాలు కల్పించేలా.. 80 దేశాలతో ఈ సంస్థల ఒప్పందాలు..
Published date : 29 Mar 2021 02:41PM

Photo Stories