Skip to main content

ఐబీపీఎస్-2019 షెడ్యూల్

ఐబీపీఎస్.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో(ఆర్‌ఆర్‌బీలు).. క్లర్కు, ప్రొబేషనరీ ఆఫీసర్, ఆఫీసర్ స్కేల్1, ఆఫీస్ అసిస్టెంట్, ఇతర స్పెషలిస్టు ఉద్యోగాల భర్తీని ఐబీపీఎస్ చేపడుతుంది. ఏటా ఆయా ఉద్యోగాల భర్తీకి ప్రత్యేకంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. ఐబీపీఎస్ తాజాగా 2019 సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. పరీక్ష తేదీలు ముందుగానే తెలియడం వల్ల అభ్యర్థులు ప్రణాళికబద్ధంగా ప్రిపరేషన్ సాగించేందుకు వీలవుతుంది. తద్వారా బ్యాంక్ ఉద్యోగ సాధనలో విజయం సాధించడం సులువు అవుతుంది. తాజాగా ఐబీపీఎస్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో.. ఆయా ఉద్యోగాల నియామక విధానం.. పరీక్షల తీరుతెన్నులు.. ప్రిపరేషన్ గెడైన్స్..
ఏఏ ఉద్యోగాలు :
  • ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ- రీజనల్ రూరల్ బ్యాంక్స్)ల్లో ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీస్ అసిస్టెంట్స్, ఆఫీసర్స్ స్కేల్ 2, 3 ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ పరీక్షలు నిర్వహించనుంది.
  • ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ-పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్)ల్లో... ప్రొబేషనరీ ఆఫీసర్లు, క్లర్క్‌లు, స్పెషలిస్టు ఆఫీసర్లు ఉద్యోగాల భర్తీని ఐబీపీఎస్ చేపడుతుంది.

ఆర్‌ఆర్‌బీస్.. 2019 షెడ్యూల్ :
ఆఫీస్ అసిస్టెంట్స్, ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 3, 4, 11, 17, 18, 25 తేదీల్లో జరగనుంది. ఆఫీసర్ స్కేల్1 పోస్టులకు మెయిన్ పరీక్ష సెప్టెంబర్ 22న; అసిస్టెంట్ ఉద్యోగాలకు మెయిన్ పరీక్ష సెప్టెంబర్ 29న ఉంటుంది. స్కేల్ 2, 3 పోస్టులకు సింగిల్ ఎగ్జామ్ సెప్టెంబర్ 22న జరుగుతుంది.

పోటీ ఎక్కువ :
రీజినల్ రూరల్ బ్యాంకుల్లో(ఆర్‌ఆర్‌బీస్) పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ ప్రకటనలు ఇస్తుంది. చక్కటి వేతనాలు, గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించే అవకాశం, సొంత రాష్ర్టంలోనే సేవలందించే వీలుండటంతో ఆర్‌ఆర్‌బీ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉంటుంది. ప్రైవేటు బ్యాంకుల్లో పని చేస్తున్న అభ్యర్థులు సైతం ఆర్‌ఆర్‌బీ ఉద్యోగాలకు పోటీపడుతుంటారు. ఏపీ, తెలంగాణల్లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకులు ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ ద్వారా నియామకాలు జరుపుతుంటాయి. ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌లో భాగంగా ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్), ఆఫీసర్ స్కేల్-1(అసిస్టెంట్ మేనేజర్), ఆఫీసర్ స్కేల్-2(జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లు), ఆఫీసర్ స్కేల్-2(అగ్రికల్చర్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, ట్రెజరీ మేనేజర్, లా ఆఫీసర్, సీఏ, ఐటీ ఆఫీసర్) మొదలైన పోస్టుల భర్తీ చేపట్టే అవకాశముంది.

అర్హతలు :
  • మల్టీపర్పస్, స్కేల్ 1(అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే రాష్ట్ర స్థానిక భాష పరిజ్ఞానంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 2(జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లు), సీనియర్ మేనేజర్ పోస్టులకు పని అనుభవం తప్పనిసరి.
  • స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు పోస్టును అనుసరించి ఆయా విభాగాల్లో డిగ్రీ/పీజీ విద్యార్హతతోపాటు సంబంధిత రంగంలో ఏడాది/రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: ఆయా పోస్టులను బట్టి నోటిఫికేషన్ నాటికి 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పని అనుభవంతో సంబంధం లేని మల్టీపర్పస్ పోస్టులకు 18-28 ఏళ్లు; అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 30 ఏళ్లు గరిష్ట వయోపరిమితిగా ఉంటుంది.

ఎంపిక ఇలా..
ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-1 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ విధానంలో ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. అసిస్టెంట్స్ పోస్టులను మెయిన్స్‌లో సాధించే స్కోర్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఆఫీసర్ స్కేల్-1 పోస్టులకు మెయిన్స్‌తోపాటు, కామన్ ఇంటర్వ్యూల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఇతర స్కేల్-2, 3 ఆఫీసర్ పోస్టులను సింగిల్ ఆన్‌లైన్ పరీక్ష, కామన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం :
  • ఆన్‌లైన్ పరీక్ష విధానంలో ప్రిలిమినరీ పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. మల్టీపర్పస్ పోస్టులకు రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ విభాగాల నుంచి 40 చొప్పున ప్రశ్నలు ఉంటాయి.
  • ఆఫీసర్ స్కేల్-1 పోస్టులకు రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి 40 చొప్పున ప్రశ్నలు అడుగుతారు.
  • సెక్షన్ కటాఫ్, రుణాత్మక మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తేనే మెయిన్ రాసేందుకు అవకాశం లభిస్తుంది.

మెయిన్ పరీక్ష విధానం :

సబ్జెక్టు

ప్రశ్నలు

మార్కులు

రీజనింగ్

40

50

న్యూమరికల్ ఎబిలిటీ/ క్వాంటిటేటివ్ ఎబిలిటీ

40

50

జనరల్ అవేర్‌నెస్

40

40

ఇంగ్లిష్ లాంగ్వేజ్/

 

 

హిందీ లాంగ్వేజ్

40

40

కంప్యూటర్ లాంగ్వేజ్

40

20

మొత్తం

200

200

  • ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్),ఆఫీసర్ స్కేల్-1 పోస్టులకు మెయిన్ పరీక్ష దాదాపు ఒకే తీరులో ఉంటుంది. అయితే అసిస్టెంట్ (మల్టీపర్పస్)కు న్యూమరికల్ ఎబిలిటీ ఉండగా.. ఆఫీసర్ స్కేల్-1కు దాని స్థానంలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం ఉంటుంది. కానీ, ప్రశ్నల క్లిష్టత స్థాయి మాత్రం రెండు పరీక్షలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అభ్యర్థులు ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఏదైనా ఒక సబ్జెక్ట్‌ను ఎంచుకోవచ్చు.
  • ఆఫీసర్ స్కేల్-2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, స్పెషలిస్టు కేడర్), ఆఫీసర్ స్కేల్-3 పోస్టులకు సింగిల్ ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షల్లో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇంగ్లిష్‌తోపాటు ప్రొఫెషనల్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ వంటి విభాగాలపై ప్రశ్నలు అడుగుతారు.

పీఎస్‌బీల్లో పీవో, క్లర్క్స్ పీఎస్‌బీలకు 2019 షెడ్యూల్ :
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీవో) నియామకాలకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష: 2019 అక్టోబర్ 12, 13, 19, 20 తేదీల్లో... మెయిన్ పరీక్ష 2019, నవంబర్ 30 తేదీన జరుగుతుంది. అదేవిధంగా క్లర్క్స్‌కు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష 2019, డిసెంబర్ 7, 8, 14, 15 తేదీల్లో... మెయిన్ పరీక్ష 2020, జనవరి 19న ఉంటుంది. అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష 2019, డిసెంబర్ 28, 29 తేదీల్లో.. మెయిన్ పరీక్ష 2020, జనవరి 25న నిర్వహిస్తారు.

తగ్గుతున్న ఖాళీలు :
ఐబీపీఎస్ నుంచే వెలువడే నోటిఫికేషన్లల్లో ముఖ్యమైనవి.. పీఎస్‌యూ పోస్టులు. క్లర్క్, పీవో, ఎస్‌వో ఉద్యోగాలకు ఐబీపీఎస్ వేర్వేరుగా ప్రకటనలు జారీ చేస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు భర్తీ చేయనున్న ఖాళీలను నోటిఫికేషన్‌లోనే ప్రకటిస్తాయి. గత కొన్ని నోటిఫికేషన్లు గమనిస్తే ఖాళీల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి పోస్టులు తక్కువ, పోటీ ఎక్కువని భావించి అభ్యర్థులు గట్టి ప్రిపరేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

భాగస్వామ్య బ్యాంకులు :
అలహాబాద్ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరాబ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంకు, దేనా బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్,పంజాబ్ నేషనల్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంకు.

అర్హతలు :
  • క్లర్కు, పీవో ఉద్యోగాలకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • ఎస్‌వో ఉద్యోగాల్లో.. ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్యభాష అధికారి, లా ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ మొదలైన ఉద్యోగాలు ఉంటాయి. వీటికి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉంటేనే అర్హులు.
  • ఆయా పోస్టులను బట్టి 20-28/30 ఏళ్ల మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక.. ఇలా
  • క్లర్క్ పోస్టులకు రెండంచెల్లో... పీవో, ఎస్‌వో పోస్టులకు మూడంచెల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష(ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష), కామన్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
  • క్లర్కు, పీవోలకు మొదట ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(100 మార్కులు) జరుగుతుంది. ఇందులో ఇంగ్లిష్ (30), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (35), రీజనింగ్(35) విభాగాలు ఉంటాయి. ఈ పరీక్షలో సెక్షనల్ కటాఫ్‌తోపాటు నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులను మెయిన్ పరీక్షకు అనుమతిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి నాలుగో వంతు మార్కులు కోత విధిస్తారు.
  • క్లర్కు పోస్టులకు ఇంటర్వ్యూ ఉండదు. పీవో, ఎస్‌వో పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుంది.
  • ఎస్‌వో నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఆయా పోస్టులను బట్టి పరీక్ష విధానంలో మార్పులు ఉంటాయి.

ప్రిపరేషన్ అవ్వండిలా..
  • ఐబీపీఎస్ క్లర్క్, పీవో పరీక్షల స్వరూపం కాస్త అటుఇటూగా ఒకే విధంగా ఉంటుంది. రెండు పరీక్షలకు అభ్యర్థులు ఉమ్మడిగా సన్నద్ధం కావచ్చు. ఆర్‌ఆర్‌బీ అసిస్టెంట్, స్కేల్ 1 ఆఫీసర్ ఉద్యోగాల పరీక్షల్లోనూ సిలబస్ దాదాపు ఒకే రీతిగా కనిపిస్తుంది.
  • బ్యాంకు పరీక్షల్లో విజయానికి వేగం, కచ్చితత్వం అత్యవసరం. పోటీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా వేగంగా, కచ్చితత్వంతో సమాధానాలు రాబడితే ఉద్యోగం వరిస్తుంది. కొత్తగా సన్నద్ధమవ్వాలనుకున్న అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం. ఉన్న సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మొదటి ప్రయత్నంలోనే బ్యాంకు ఉద్యోగం దక్కించుకునే అవకాశం ఉంది.
  • ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఒకే సిలబస్ ఉంటుంది కాబట్టి వేర్వేరుగా సన్నద్ధమయ్యే బదులు ఒకే వ్యూహంతో ముందుకు సాగాలి. క్లరికల్ పరీక్ష ప్రిలిమ్స్‌లో ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. మెయిన్‌లో రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్‌ల నుంచి 190 ప్రశ్నలు 200 మార్కులకు ఉండే అవకాశముంది. ప్రతి సెక్షన్‌కు వేర్వేరుగా సమయం ఉంటుంది.
  • సిలబస్ పరంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్; రీజనింగ్; క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్/న్యూమరికల్ ఎబిలిటీ.. ప్రిలిమ్స్, మెయిన్‌లో ఉమ్మడిగా ఉంటున్నాయి. ఈ విభాగాల్లో పట్టు పొందితే ఉద్యోగం సాధించడం తేలిక అవుతుంది. అయితే పరీక్షను బట్టి ప్రశ్నల క్లిష్టతలో మార్పు కనిపిస్తుంది.

న్యూమరికల్ ఎబిలిటీ/క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్/డీఏ :
బ్యాంకు పరీక్షలకు ఉన్న పోటీ దృష్ట్యా ప్రశ్నల కాఠిన్యత పెరిగింది. న్యూమరికల్ ఎబిలిటీలో... అర్థమెటిక్ అంశాలైన పర్సంటేజెస్, యావరేజేస్, రేషియో - ప్రపోర్షన్, సింపుల్-కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్-వర్క్, టైమ్-డిస్టెన్స్, పర్ముటేషన్స్-కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, మిక్షర్ అండ్ అలిగేషన్స్ అంశాలు కీలకం. ఈ చాప్టర్ల నుంచి ప్రశ్నలు తప్పనిసరిగా కనిపిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు ముందుగా బేసిక్స్‌ను క్షుణ్నంగా తెలుసుకోవాలి. ప్రాథమిక గణాంకాలను త్వరగా చేసే విధంగా సన్నద్ధమవ్వాలి. బోడ్‌మస్ క్రమంలో.. క్యాలికులేషన్స్ చేయడం, వర్గాలు, ఘనాలు, వర్గమూలాలు గుర్తించుకోవాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లు అంశాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. మెయిన్‌లో డేటా విశ్లేషణ నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి.

ప్రధానంగా దృష్టిసారించాల్సిన టాపిక్స్: సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్షిమేషన్స్, బేసిక్ ఆల్జీబ్రా (క్వాడ్రటిక్ ఈక్వేషన్స్), డేటా ఇంటర్‌ప్రిటేషన్, మిస్సింగ్ నంబర్స్(రాంగ్ నంబర్ సిరీస్). గత మెయిన్ పరీక్షలో అప్రాక్షిమేషన్స్, నంబర్ సిరీస్, డీఐ, క్వాడ్రటిక్ ఈక్వేషన్స్, అర్థమెటిక్ అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. న్యూమరికల్ విభాగంలో స్కోరుకు ప్రాక్టీస్ మంచి సాధనం.

ఇంగ్లిష్ :
తెలుగు విద్యార్థులు ఇంగ్లిష్‌లో స్కోరింగ్ చేయడంలో వెనకబడుతున్నారు. కాస్త దృష్టిసారిస్తే ఎక్కువ మార్కులు పొందడానికి వీలున్న సబ్జెక్ట్ ఇదని నిపుణులు సూచిస్తారు. మొదట బేసిక్ రూల్స్ తెలుసుకోవాలి. బేసిక్ గ్రామర్ అంశాలైన పార్‌‌ట్స ఆఫ్ స్పీచ్, యాక్టివ్-ప్యాసివ్ వాయిస్, డెరైక్ట్, ఇన్‌డెరైక్ట్ స్పీచ్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ తదితర అంశాలను ప్రాక్టీస్ చేయాలి. రీడింగ్ కాంప్రెహెన్షన్, పారాజంబుల్స్, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, స్పాటింగ్ ఎర్రర్స్ సెక్షన్లను ఎక్కువగా సాధన చేయాలి. ఇంగ్లిష్ గ్రామర్, వొకాబ్యులరీపై పట్టు సాధించడానికి ఇంగ్లిష్ దినపత్రికలు, ప్రామాణిక పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి. నిత్యం ఆంగ్ల పేపర్ చదివే వారికి గ్రామర్, వొకాబ్యులరీపై పట్టు వస్తుంది. ఇంగ్లిష్ విభాగానికి సంబంధించి మెయిన్ పరీక్షలో డిస్క్రిప్టివ్ పేపర్ కూడా కొన్ని పరీక్షల్లో కనిపిస్తుంది. కాబట్టి రైటింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. అంటే ఏకకాలంలో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ అప్రోచ్ ఉండాలి.

రీజనింగ్ :
  • బ్యాంకు పరీక్షల్లో ఫలితాన్ని నిర్ణయించే మరో సెక్షన్ ఇది. ఈ విభాగంలో విజయానికి ఏకైక మార్గం ప్రాక్టీస్. వీలైనన్ని మాక్‌టెస్టులు రాయడం ద్వారా విజయావకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. సందేహమున్న ప్రతి టాపిక్‌ను నివృత్తి చేసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా అనలిటికల్ ఎబిలిటీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  • బ్యాంకు పరీక్షల్లో రాణించాలంటే హైలెవల్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ బాగా సాధన చేయాలి. రీజనింగ్‌కు సంబంధించి అరేంజ్‌మెంట్స్, స్టేట్‌మెంట్-కన్‌క్లూజన్, కాజ్ అండ్ ఎఫెక్ట్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్‌‌స, సిరీస్, ఆల్ఫాబెట్ టెస్ట్ తదితర అంశాలపై అధ్యయనం తప్పనిసరి. మొదట బేసిక్ కాన్సెప్టులపై పట్టు సాధించేందుకు కృషిచేయాలి. తర్వాత హైలెవల్ ప్రశ్నలను, గణాంకాలు ఎక్కువగా ఉండే వాటిని ప్రాక్టీస్ చేయాలి.

ముఖ్యమైన అంశాలు: సీటింగ్ అరెంజ్‌మెంట్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సిలాయిజమ్స్, ఇన్‌ఈక్వాలిటీస్, పజిల్స్, డేటా సఫిషియెన్సీ, డెరైక్షన్స్ అండ్ డిస్టెన్స్, ఇన్‌పుట్ - ఔట్‌పుట్, అనలిటికల్ రీజనింగ్.

జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ :
ఇంగ్లిష్‌కు ప్రిపరేషన్ కోసం చదివే దినపత్రికలతోనే జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్‌కు సన్నద్ధత లభిస్తుంది. వీటికి సొంతంగా నోట్స్ సిద్ధం చేసుకోవాలి. జనరల్ అవేర్‌నెస్ విభాగంలో.. బ్యాంకింగ్ రంగం పరిణామాలు, విధానాలపై దృష్టిపెట్టాలి. బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, బ్యాంకుల విధులు, కొత్త విధానాలు, రిజర్వ్‌బ్యాంక్ వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. బ్యాంకింగ్ అవేర్‌నెస్, ప్రభుత్వ విధానాలు, కరెంట్ అఫైర్స్, బేసిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, స్టాండర్డ్ జీకే, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ విభాగాలకు వెయిటేజీ ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్‌కు సంబంధించి ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీబోర్డ్ షార్ట్‌కట్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంబంధిత అంశాల గురించి తెలుసుకోవాలి!!
Published date : 15 Feb 2019 05:15PM

Photo Stories