Skip to main content

4,252 పీవో కొలువులు...సన్నద్ధమవ్వండిలా

సుస్థిర కెరీర్, ఆక్షరణీయమైన వేతనాలతో బ్యాంకు పీవో(ప్రొబేషనరీ ఆఫీసర్) పోస్టు.. బ్యాంకింగ్ కెరీర్ కోరుకునే యువతకు అత్యంత క్రేజీ కొలువు. ఉజ్వల భవితకు మార్గం వేసే బ్యాంక్ పీవో పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీనిద్వారా దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో మొత్తం 4,252 పీవో పోస్టులు భర్తీ చేయనుంది. 30ఏళ్ల లోపు వయసుతోపాటుఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు ఐబీపీఎస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐబీపీఎస్ పీవో నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ప్రిపరేషన్ గెడైన్స్ గురించి తెలుసుకుందాం...
ఐబీపీఎస్.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్.. ఎస్‌బీఐ మినహా ముఖ్యమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వివిధ పోస్టుల భర్తీకి క్రమం తప్పకుండా ప్రకటనలు ఇస్తుంది. తాజాగా పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పీవో/మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ‘ఐబీపీఎస్ పీవో-8’కు నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హతలు..
  • భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయానికి డిగ్రీ ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో మార్కుల వివరాలను తెలపాల్సి ఉంటుంది.
  • వయసు.. 2018 ఆగస్టు 1వ తేదీ నాటికి 20- 30ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
భాగస్వామ్య బ్యాంకులు :
  • ఐబీపీఎస్ పరీక్ష ఆధారంగా పీవో పోస్టులను భర్తీ చేస్తున్న బ్యాంకులు.. అలహాబాద్ బ్యాంకు (784), ఆంధ్రా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా (965), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు (1200), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంకు (84), దేనా బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు (150), సిండికేట్ బ్యాంకు, యూకో బ్యాంకు (550), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (519), యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంకు.
  • ఈసారి నోటిఫికేషన్‌లో 7 బ్యాంకులు మాత్రమే ఖాళీలు ప్రకటించాయి.
ఎంపిక ప్రక్రియ :
  1. ఐబీపీఎస్ బ్యాంక్ పీవో పోస్టులకు ఎంపిక ప్రక్రియ మూడంచెల్లో జరుగుతుంది.
  2. మొదట ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(100 మార్కులు) ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్(30మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (35మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ(35 మార్కులు) విభాగాలు ఉంటాయి. ప్రతి సెక్షన్‌కు 20 నిమిషాల చొప్పున పరీక్షకు మొత్తం గంట సమయం కేటాయిస్తారు. సరైన సమాధానానికి ఒక మార్కు ఉంటుంది. ప్రతీ తప్పు సమాధా నానికి నాలుగోవంతు మార్కులు కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సెక్షనల్ కటాఫ్‌తోపాటు నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన వారిని మాత్రమే మెయిన్ పరీక్షకు అనుమతిస్తారు.
  3. మెయిన్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 200 మార్కులకు ఉంటుంది. ఇందులోనూ సెక్షనల్‌గా ప్రత్యేక సమయం ఇస్తారు. మెయిన్‌లోనూ నెగిటివ్ మార్కింగ్ విధానం ఉండటం వల్ల ప్రతీ తప్పు సమాధానానికి నాలుగో వంతు మార్కుల కోత పడుతుంది. మెయిన్‌లోనే కంప్యూటర్ ఆధారిత డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇంగ్లిష్ 25 మార్కులకు 30 నిమిషాల వ్యవధిలో జరుగుతుంది.
  4. మెయిన్‌లో ప్రతిభ ఆధారంగా ఇంటర్వ్యూకు పిలుస్తారు. మెయిన్‌లోనూ సెక్షనల్ కటాఫ్ మార్కులు సాధించాల్సి ఉంటుంది.
  5. తుది ఎంపికలో.. మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూలో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. వీటికి వరుసగా 80:20 నిష్పత్తిలో వెయిటేజీ ఉంటుంది. మొత్తంగా వచ్చిన మార్కులను 100కు కుదించి మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఇంటర్వ్యూలోనూ విడిగా కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి.
  6. ప్రిలిమినరీ పరీక్ష లో కనీస అర్హత మార్కులు రావాలని పేర్కొన్నప్పటికీ.. వాటిని తుది జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోరు.
మెయిన్ పరీక్ష స్వరూపం (టేబుల్)...

సబ్జెక్ట్

ప్రశ్నలసంఖ్య

మార్కులు

సమయం

రీజనింగ్, కంపూటర్ ఆప్టిట్యూడ్ 45 60 60 ని॥
జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ 40 40 35 ని॥
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 35 40 40 ని॥
డేటాఅనాలసిస్, ఇంటర్‌ప్రిటేషన్ 35 60 45 ని॥
మొత్తం 155 200 3 గంటలు
ఇంగ్లిష్ లాంగ్వేజ్ (లెటర్ రైటింగ్, ఎస్సే) 2 25 30 ని॥

సన్నద్ధత... సమగ్రంగా!
ఐబీపీఎస్ పీవో పరీక్షలో.. ప్రిలిమ్స్, మెయిన్.. రెండు దశల్లోనూ ఆన్‌లైన్ విధానంలో పరీక్ష జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్... పేర్లు వేరైనా దాదాపు ఒకే రకమైన సిలబస్ ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే... బేసిక్ మ్యాథ్స్, డేటా అనాలసిస్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, రీజనింగ్, ఇంగ్లిష్.. రెండూ దశల్లోనూ కనిపిస్తాయి.

ప్రశ్నలు క్లిషంగానే ...
ఐబీపీఎస్ పీవోలో ప్రశ్నల సరళి క్లిష్టంగా ఉంటుంది. బేసిక్స్‌తో నెట్టుకురావడం కష్టమే. క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా అనాలసిస్, రీజనింగ్ విభాగాలకు వేగం ఎంతో అవసరం. అందుబాటులో ఉన్న సమయంలో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే.. చాలా ప్రాక్టీస్ అవసరం. ప్రిలిమ్స్, మెయిన్‌లో ప్రశ్నల కాఠిన్యత అధికంగా ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్‌కు ఎక్కువ సమయం తీసుకునేలా ప్రశ్నలడుగుతారు.

ఇంగ్లిష్... ప్రత్యేక దృష్టితో !
ప్రతి దశలోనూ ఎంతో ప్రాధాన్యత ఉన్న సబ్జెక్ట్.. ఇంగ్లిష్. ప్రిలిమ్స్‌లో 30 ప్రశ్నలు 30 మార్కులకు; మెయిన్‌లో 35 ప్రశ్నలు 40 మార్కులకు ఉంటాయి. ఇంగ్లిష్‌లో మన విద్యార్థులు ఆశించిన స్థాయిలో మార్కులు పొందడంలో విఫలమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అందుకు బేసిక్ గ్రామర్ రూల్‌్లపై అవగాహన పెంచుకోకపోవడమే కారణమంటున్నారు. కాబట్టి అభ్యర్థులకు ఇంగ్లిష్ నైపుణ్యం ఎంతో అవసరం. అభ్యర్థులు ఇంగ్లిష్‌ను ప్రత్యేక దృష్టితో చదవాలి.
  • బేసిక్ గ్రామర్ అంశాలైన పార్‌‌ట్స ఆఫ్ స్పీచ్, యాక్టివ్-ప్యాసివ్ వాయిస్, డెరైక్ట్, ఇన్‌డెరైక్ట్ స్పీచ్, ప్రిపోజిషన్‌‌స, ఆర్టికల్స్ తదితర అంశాలను ప్రాక్టీస్ చేయాలి.
  • రీడింగ్ కాంప్రెహెన్షన్, జంబుల్డ్ సెంటెన్సెస్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, క్లోజ్ ప్యాసేజెస్, ఎర్రర్స్ ఇన్ యూసేజ్, సెంటెన్‌‌స కరెక్షన్, వొకాబ్యులరీ తదితర అంశాలపై పట్టు సాధించాలి.
  • ఇంగ్లిష్ విభాగానికి సంబంధించి మెయిన్ పరీక్షలో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంది. కాబట్టి రైటింగ్ స్కిల్స్ కూడా పెంచుకోవాలి. అంటే.. ఏకకాలంలో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ అప్రోచ్ ఉండాలి. అందుకోసం ఇంగ్లిష్ దినపత్రికలతోపాటు ప్రామాణిక పుస్తకాలను చదవాలి.
క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్... డేటా అనాలసిస్ :
  • ప్రిలిమ్స్‌లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 ప్రశ్నలు-35 మార్కులకు ఉంటుంది. ఈ సెక్షన్‌లో మంచి స్కోర్ కోసం అర్థమెటిక్‌కు సంబంధించి పర్సంటేజ్‌స్, యావరేజేస్, రేషియో-ప్రపోర్షన్, ప్రాఫిట్-లాస్, సింపుల్-కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్-వర్క్, టైమ్ -డిస్టెన్‌‌స, పర్ముటేషన్‌‌స-కాంబినేషన్‌‌స, ప్రాబబిలిటీ, మిక్షర్ అండ్ అలిగేషన్స్, పార్టనర్‌షిప్ విభాగాల నుంచి ప్రశ్నలు తప్పనిసరిగా అడుగుతారు. ప్రశ్నల క్లిష్టత స్థాయి ఎక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనీసం సగం ప్రశ్నలకు కచ్చితంగా సమాధానాలు గుర్తించినా మంచి మార్కులు పొందొచ్చు. ఇక ప్రాథమిక అంశాల కోసం సింప్లిఫికేషన్స్, బోడ్‌మస్ రూల్స్‌కు సంబంధించి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. వర్గాలు, ఘనాలు గుర్తించుకోవాలి.
  • మెయిన్ పరీక్షలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న విభాగం.. డేటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్. కేవలం 35 ప్రశ్నలకే 60 మార్కులు కేటాయించడంతో ఒక్కో ప్రశ్నకు 1.7 మార్కులు ఇచ్చినట్లయింది. ఈ సెక్షన్‌కు 45 నిమిషాల సమయం అందుబాటులో ఉంది. ఈ విభాగంలో స్కోరింగ్‌కు ఎక్కువగా అవకాశముంది. ప్రశ్నల క్లిష్టత మాత్రం క్యాట్‌కు తగ్గకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టేబుల్స్, డయాగ్రమ్స్, నంబర్ డేటా, లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్ తదితర గ్రాఫ్ ఆధారిత డేటాలలోని సమాధానాన్ని క్రోడీకరించేలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఈ విభాగంలో ఎక్కువ స్కోరు చేయడానికి ప్రాథమిక అర్థమెటిక్ అంశాలపై మంచి పట్టు ఉండాలి. డేటాఅనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ విభాగంలో అడిగే ప్రశ్నలు అర్థమెటిక్ కాన్సెప్టుల మేళవింపుగా ఉంటాయి. ఇందుకోసం పర్సంటేజెస్, యావరేజెస్, రేషియో ప్రపోర్షన్ చాప్టర్లపై పట్టు సాధించాకే.. డేటాఅనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి.
రీజనింగ్ :
  1. ప్రిలిమ్స్‌లో రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులకు ఉంటుంది. మెయిన్‌లో రీజనింగ్‌తోపాటు కంప్యూటర్ అప్టిట్యూడ్‌ను ఒకే విభాగం కింద పేర్కొని.. 45 ప్రశ్నలకు 60 మార్కులు కేటాయించారు. గంట సమయం ఇస్తున్నారు. కాఠిన్యత ఎక్కువగానే ఉండే అవకాశముంది.
  2. రీజనింగ్‌కు సంబంధించి అరేంజ్‌మెంట్స్, స్టేట్‌మెంట్-కన్‌క్లూజన్, కాజ్ అండ్ ఎఫెక్ట్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్‌‌స, ర్యాంకింగ్‌‌స, సిరీస్, ఆల్ఫాబెట్ టెస్ట్ తదితర అంశాలపై అధ్యయనం తప్పనిసరి. దీంతోపాటు రీజనింగ్‌లో హైలెవల్ పజిల్స్, సీటింగ్‌అరెంజ్‌మెంట్, స్టేట్‌మెంట్స్-ఆర్గ్యుమెంట్స్, స్టేట్‌మెంట్స్-కోర్స్ ఆఫ్ యాక్షన్, సిలాయిజమ్స్, ఇన్‌ఈక్వాలిటీస్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  3. మొదట బేసిక్ కాన్సెప్టులపై పట్టు సాధించేందుకు కృషి చేయాలి. తర్వాత గత ప్రశ్నలను, గణాంకాలు ఎక్కువగా ఉండే వాటిని ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్ ప్రశ్నలను బాగా సాధన చేయాలి. అనలిటికల్, లాజికల్ స్కిల్స్ పెంచుకునేందుకు ప్రయత్నించాలి.
  4. కంప్యూటర్ విభాగం నుంచి బేసిక్స్‌తోపాటు సాంకేతిక విజ్ఞానాన్ని పరీక్షించేలా డేటాబేసెస్, నెట్‌వర్క్స్, సెక్యూరిటీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్ వంటి వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి. ఎంఎస్ ఆఫీస్, ఆపరేటింగ్ సిస్టమ్స్/సాఫ్ట్‌వేర్ బేసిక్స్, ఇంటర్నెట్, వైరస్/మాల్‌వేర్లు తదితర అంశాలకు సంబంధించిన బేసిక్స్‌ను నేర్చుకోవాలి. షార్ట్‌కట్ కమాండ్‌‌సను తెలుసుకోవాలి.
జనరల్ అవేర్‌నెస్:
  • జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నేస్‌ఉండే ఈ సెక్షన్ మెయిన్ పరీక్షలో మాత్రమే ఉంటుంది. ఈ విభాగంలో 40 ప్రశ్నలు-40 మార్కులకు ఉంటాయి. మొత్తం 35 నిమిషాల సమయం కేటాయించారు. ఎక్కువ మార్కులు సొంతం చేసుకునేందుకు వీలు కల్పించే విభాగమిది.
  • ఎకానమీ పదజాలం, నిర్వచనాలు చదవాలి. వీటితోపాటు అంతర్జాతీయంగా, జాతీయంగా జరిగిన వర్తమాన వ్యవహారాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశముంది. ముఖ్యంగా దేశీయంగా చోటు చేసుకున్న ఆర్థిక అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఎస్‌ఎల్‌ఆర్, సీఆర్‌ఆర్ గురించి తెలుసుకోవాలి.
  • బ్యాంకింగ్ సేవలు, ఆర్‌బీఐ, విధులు, గవర్నర్, డిప్యూటీ గవర్నర్లు, ద్రవ్యోల్బణం-గణించే విధానాలు, ద్రవ్య విధానం, బ్యాంకుల జాతీయ కరణం, పేమెంట్ బ్యాంకులు, ఎన్‌పీఏలు, ఇండియన్ టాక్సేషన్ సిస్టమ్ మొదలైన వాటి గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి.
కెరీర్ ఇలా..
  • ఐబీపీఎస్ పరీక్ష ద్వారా పీవోగా ఎంపికైన వారికి మొదట రెండేళ్లపాటు శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో కన్ఫర్మేషన్ ఇచ్చాక.. కన్‌ఫర్మ్‌డ్ అసిస్టెంట్ మేనేజర్ హోదా లభిస్తుంది. పనితీరు ఆధారంగా బ్రాంచీ మేనేజర్ హోదా, ఇతర ఉన్నత స్థానాలు పొందొచ్చు. ఐబీపీఎస్ పీవోలు విదేశాల్లోనూ ఉద్యోగావకాశాలు అందిపు చ్చుకునే వీలుంది.
ప్రిపరేషన్ టిప్స్..
  • అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్‌కు వేర్వేరుగా కాకుండా ఏకకాలంలో సన్నద్ధమవ్వాలి. పరీక్షలకు చాలా తక్కువ సమయం అందుబాటులో ఉంది. ప్రతిరోజు ప్రిపరేషన్‌కు సమయం కేటాయించాలి. కొత్తగా సన్నద్ధమవుతున్న వారు కూడా ఆత్మవిశ్వాసంతో హార్డ్‌వర్క్ చేస్తే విజయం వరిస్తుంది.
  • బ్యాంక్ పరీక్షల్లో విజయానికి కచ్చితత్వం, వేగం చాలా ముఖ్యం. ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించకున్నా... ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. సాధ్యమైనన్ని ప్రశ్నలు కచ్చితంగా అటెంప్ట్ చేసినా సరిపోతుంది.
  • డేటాఅనాలసిస్, ఇంటర్‌ప్రిటేషన్ విభాగంలో డేటాను క్రోడీకరించే సమయంలో స్పష్టత ఉండాలి.
  • రీజనింగ్ విషయంలోనూ కఠిన ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. ముందుగా సులువైన వాటిని గుర్తించి.. వాటికి పరిష్కారం కనుగొనాలి.
  • జనరల్ అవేర్‌నెస్‌లో గెస్సింగ్ చేయకపోవడమే ఉత్తమం.
  • కంప్యూటర్ టైపింగ్ అలవాటు చేసుకుంటే మెయిన్‌లో ఇంగ్లిష్ ఎస్సే, లెటర్ రైటింగ్‌కు ఉపయోగపడుతుంది.

వేగం, కచ్చితత్వంతోనే విజయం...

బ్యాంకు పోస్టులకు విపరీతమైన పోటీ ఉంది. ప్రాక్టీస్ చేసే వారికే విజయవకాశాలు ఎక్కువ. ప్రిలిమ్స్,మెయిన్స్.. పరీక్షలు వేరైనా ప్రశ్నల స్వరూపం ఒకటే. ప్రిలిమ్స్ దాటడం చాలా ముఖ్యం. మ్యాథ్స్‌లో డేటా అనాలసిస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు క్లిషంగా అడుగుతారు. రీజనింగ్ కూడా అంతే. ఏ ఒక్క సెక్షన్‌నూ, టాపిక్‌ను వదలకుండా సన్నద్ధ మవ్వాలి. ఈ రెండూ విభాగాల్లో స్కోరు సాధించేందుకు ప్రాక్టీస్ ఒక్కటే మార్గం.
- రాజశేఖర్,అర్థమెటిక్ ఫ్యాకల్టీ, ఐరైజ్ అకాడమీ.

ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 4, 2018
ప్రిలిమినరీ పరీక్ష (ఆన్‌లైన్): 2018 అక్టోబర్ 13, 14, 20, 21,
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: 2018 అక్టోబర్/ నవంబర్
మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2018 నవంబర్
మెయిన్ పరీక్ష(ఆన్‌లైన్): 2018 నవంబర్ 18
మెయిన్ పరీక్ష ఫలితాలు: 2018 డిసెంబర్
ఇంటర్వ్యూ కాల్‌లెటర్ డౌన్‌లోడ్: 2019 జనవరి
ఇంటర్వ్యూ: 2019 జనవరి/ఫిబ్రవరి
ప్రొవిజినల్ అలాట్‌మెంట్: 2019 ఏప్రిల్
పూర్తి వివరాలకు : https://www.ibps.in/wp-content/uploads/CWE_PO_MPS_VIII.pdf
Published date : 16 Aug 2018 05:01PM

Photo Stories