Skip to main content

కెరీర్ గైడెన్స్.. ఎయిర్ హోస్టెస్

శరవేగంగా, వృద్ధి బాటలో పయనిస్తున్న ఏవియేషన్ రంగం ఉద్యోగావకాశాల కల్పనలోనూ ముందుంటోంది. ఓ వైపు పెరుగుతున్న ప్రయాణికులు.. అంతే సంఖ్యలో అధికమవుతున్న విమానాల సంఖ్య నేపథ్యంలో పైలట్ మొదలు.. టికెట్ కౌంటర్ స్టాఫ్ వరకు లక్షల మంది మావన వనరుల అవసరం ఏర్పడనుంది. అలాంటి మానవ వనరుల్లో కీలక విభాగం.. ఎయిర్ హోస్టెస్. ఐదంకెల వేతనంతో కెరీర్ ప్రారంభించే అవకాశం ఉన్న ఎయిర్ హోస్టెస్.. కెరీర్‌పై ఫోకస్..

ఆకట్టుకునే రూపం.. ఎదుటి వారిని ఒప్పించే నేర్పు ఉంటే ఆకాశానికెగిసే అవకాశం కల్పించే ఉద్యోగమే ఎయిర్ హోస్టెస్. ప్రయాణ సమయంలో ప్రయాణికుల అవసరాలు కనుక్కోవడం, వారికి చక్కటి ఆతిథ్యం ఇవ్వడం, తద్వారా సంబంధిత ఎయిర్‌లైన్ సంస్థకు పేరు తేవడం.. వంటి హాస్పిటాలిటీ కార్యకలాపాలు ప్రధానంగా ఎయిర్ హోస్టెస్ విధి నిర్వహణలో ముఖ్యాంశాలు.

ప్రవేశం ఎలా?
ఎయిర్ హోస్టెస్‌కు సంబంధించి ప్రొఫెషనల్ శిక్షణ తీసుకోవడం ద్వారా..ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. శిక్షణ తీసుకునే సమయంలో క్రమంలో కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. అవి..

కేవలం అవివాహిత మహిళలు మాత్రమే అర్హులు
ఎడ్యుకేషన్:
ఇంటర్మీడియెట్/10+2/తత్సమానం
హిందీ, ఇంగ్లిష్ ధారళంగా మాట్లాడాలి

వయసు: 19 నుంచి 24/25 ఏళ్లు.

ఎత్తు: కనీసం 154.5 నుంచి 157.5 సెం.మీ.
ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
చక్కటి కంటి చూపు ఉండాలి.

స్కిల్స్ కీలకం:
ఎయిర్ హోస్టెస్‌గా స్థిరపడాలనుకునే మహిళలకు కావల్సిన ప్రత్యేక నైపుణ్యాలంటే.. సహనం, సమయస్ఫూర్తి. సాధారణంగా ఈ రెండిటినీ శిక్షణ సమయంలోనే పొందే విధంగా ఇన్‌స్టిట్యూట్‌లు తర్ఫీదునిస్తాయి. దీంతోపాటు మాతృభాష, ఇంగ్లిష్‌తోపాటు కనీసం మరో విదేశీ భాషపై పట్టు సాధిస్తే మరింత మెరుగైన అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా ఎయిర్‌హోస్టెస్‌గా స్థిరపడాలనుకుంటే నిర్దేశిత శారీరక ప్రమాణాలు పాటించాల్సిందే. వీటిని నిరంతరం పాటించే విధంగా అనునిత్యం జాగ్రత్తలు వహించాలి. లేదంటే ఎయిర్ హోస్టెస్‌గా విమానాల్లో తిరిగే బాధ్యతల నుంచి గ్రౌండ్ క్రూ విభాగానికి బదిలీ కావల్సి వస్తుంది.

అవకాశాలు:
గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లలో ఎయిర్ హోస్టెస్ ట్రెనింగ్ పొందిన అభ్యర్థులకు ఎయిర్‌లైన్ సంస్థలు రెడ్ కార్పెట్ వెల్‌కం చెబుతాయంటే సందేహం లేదు. ప్రస్తుత అంచనాల ప్రకారం వచ్చే దశాబ్ద కాలంలో మన దేశంలో విమానాల సంఖ్య విపరీతంగా పెరగనుంది. ఈ నేపథ్యంలో దానికి తగినట్లుగా ఎయిర్ హోస్టెస్‌ల అవసరం ఏర్పడుతుంది. ఇప్పటికే ఆయా ఇన్‌స్టిట్యూట్‌లతో పలు ఎయిర్‌లైన్ సంస్థలు ఒప్పందాలు చేసుకుని శిక్షణ పూర్తి చేసుకున్న ఎయిర్ హోస్టెస్‌లను వెనువెంటనే ఉద్యోగాల్లో నియమించుకుంటున్నాయి. ఏదైనా విదేశీ భాషలో ప్రావీణ్యం ఉన్నా వారికి రిక్రూట్‌మెంట్ సమయంలో ప్రాధాన్యం లభిస్తుంది.

కెరీర్ గ్రోత్:
మిగిలిన కెరీర్‌ల మాదిరిగానే ఈ రంగంలో కూడా కెరీర్ పరంగా ఎదిగేందుకు అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో ఎయిర్ హోస్టెస్.. సీనియర్ ఎయిర్ హోస్టెస్, సీనియర్ ఫ్లెట్ అటెండెంట్, హెడ్ అటెండెంట్‌గా వంటి హోదాలను అందుకోవచ్చు. ప్రతిభ ఆధారంగా సంబంధిత రంగంలోని వేరే విభాగాల్లో కూడా వీరిని సేవలను వినియోగించుకుంటారు.

టాప్ రిక్రూటర్స్:
  1. జెట్ ఎయిర్‌వేస్
  2. స్పెస్‌జెట్
  3. ఇండిగో ఎయిర్ లైన్స్
  4. ఇండియన్ ఎయిర్‌లైన్స్
వేతనాలు:
పే-ప్యాకేజ్‌లు ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే వేతనాలు మాత్రం పని చేస్తున్న ఎయిర్‌లైన్ సంస్థలను బట్టి ఉంటాయి. విదేశీ ఎయిర్‌లైన్స్‌లో ప్రారంభంలోనే నెలకు కనీసం రూ. 50 వేలకు తగ్గకుండా జీతం పొందొచ్చు. స్వదేశీ (డొమెస్టిక్) ఎయిర్‌లైన్స్‌లో నెలకు కనీసం రూ. 25 వేల నుంచి రూ. 40 వేల మధ్య వేతనం అందుకోవచ్చు. సీనియర్ హోదాలో విదేశీ ఎయిర్‌లైన్స్‌లో నెలకు రూ. 3 లక్షల వరకు వేతనం లభిస్తుంది. అదే స్వదేశీ ఎయిర్‌లైన్స్‌లో అయితే రూ. 50 వేల నుంచి 75 వేల మధ్య ఉంటుంది.

కోర్సులు:
ఎయిర్ హోస్టెస్ శిక్షణకు సంబంధించి పలు షార్ట్‌టర్మ్, లాంగ్ టర్మ్, డిప్లొమా కోర్సులు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల శిక్షణలో భాగంగా ప్రధానంగా హాస్పిటాలిటీపై తర్ఫీదునిస్తారు. ఈ కోర్సుల్లో చేరడానికి ప్రెవేటు రంగంలోనే ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. వీటిల్లో స్క్రీనింగ్ టెస్ట్, రిటెన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ దశల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఎయిర్ హోస్టెస్ శిక్షణ ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు..

ఎయిర్ హోస్టెస్ అకాడెమీ-న్యూఢిల్లీ
కోర్సు:
ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ డిప్లొమా
వ్యవధి: ఏడాది
వెబ్‌సైట్: www.airhostessacademy.com

ఫ్రాంక్‌ఫిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్‌హోస్టెస్ ట్రెనింగ్-ముంబై, హైదరాబాద్.
కోర్సు:
డిప్లొమా ఇన్ ఏవియేషన్, హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్
వ్యవధి: ఏడాది
వెబ్‌సైట్: www.frankfinn.com

ఆపెటెక్ ఏవియేషన్ హాస్పిటాలిటీ అకాడెమీ-హైదరాబాద్
వెబ్‌సైట్:
www.aptechaviationacademy.com

ఆల్‌ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్
కోర్సు:
క్యాబిన్ క్రూ ట్రెనింగ్
వ్యవధి: ఆరు నెలలు
వెబ్‌సైట్: www.aiiaindia.in

ఏసియా-పసిఫిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-అహ్మదాబాద్
కోర్సు:
ఎయిర్ హోస్టెస్ / ఫ్లయిట్ స్టివార్డ్ ట్రెనింగ్
వ్యవధి: ఏడాది
వెబ్‌సైట్: www.apimindia.net

ఫ్లయింగ్ క్యాట్స్-చెన్నై
కోర్సు:
డిప్లొమా ఇన్ ఎయిర్ హోస్టెస్ అండ్ గ్రౌండ్ హ్యాండ్లింగ్
వ్యవధి: ఏడాది
వెబ్‌సైట్: www.flyingcats.com

అధికమే.. అయినా:
ఎయిర్ హోస్టెస్ ట్రెనింగ్ కోర్సు ఫీజు కొంత అధికంగానే ఉంటుంది. అయితే ఆ మేరకు ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఉద్యోగంలో చేరిన తర్వాత నుంచి ఆ రుణం తిరిగి చెల్లించే విధంగా సహకరిస్తున్నాయి.

ఉన్నత విద్య:
ఆయా ప్రెవేటు ఇన్‌స్టిట్యూట్‌లు ఇంటర్మీడియెట్ అర్హతగా అందిస్తున్న ఎయిర్ హోస్టెస్ ట్రెనింగ్ పొందిన అభ్యర్థులు ఆ తర్వాత తమ అకడెమిక్ అర్హతలు పెంచుకోవడానికి ఎన్నో అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఐఏటీఏ సర్టిఫికేషన్లు పొందడానికి వీలవుతుంది. అదేవిధంగా కేబిన్ క్రూ గా పేర్కొనే ఎయిర్ హోస్టెస్ బాధ్యతల నుంచి గ్రౌండ్ క్రూ విభాగానికి బదిలీ కావాలనుకునే అభ్యర్థులకు హాస్పిటాలిటీ, గ్రౌండ్ హ్యాండ్లింగ్ విభాగాల్లో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
Published date : 15 Apr 2013 01:55PM

Photo Stories