Skip to main content

మాట్లాడడం నేర్పించే.. స్పీచ్ థెరపిస్ట్

మనిషికి ప్రకృతి ప్రసాదించిన విలువైన వరం.. మాట. మాట్లాడడం ద్వారా మన భావాలను ఇతరులకు తెలియజేయొచ్చు. నేటి ఆధునిక సమాజంలో మాట శక్తివంతమైన సాధనంగా మారింది. తమ బుజ్జాయికి వయసు పెరుగుతున్నా మాటలు రాకపోతే తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. కొందరు ఎంత వయసొచ్చినా మాట్లాడలేరు. ఇంకొందరికి మాటలు వస్తాయిగానీ, అర్థమయ్యేలా స్పష్టంగా మాట్లాడలేరు. నోరు తిరగకపోవడం, నత్తి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అందరిలాగేవీరి నోటినుంచి మాటలు రప్పించే నిపుణులే.. స్పీచ్ థెరపిస్ట్‌లు. ప్రస్తుతం డిమాండ్ పెరుగుతున్న కెరీర్.. స్పీచ్ థెరపీ.

స్వయం ఉపాధి అవకాశాలు
స్పీచ్ థెరపీ కోర్సులను పూర్తిచేసినవారికి ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. స్పెషల్ స్కూల్స్, ఓల్డేజ్ హోమ్‌లు, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్లలో కొలువులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉంటే స్వయంగా స్పీచ్ థెరపీ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. నగరాలతోపాటు పట్టణాల్లోనూ ఈ సెంటర్లకు ఆదరణ లభిస్తోంది. స్పీచ్ థెరపీలో తగిన అనుభవం ఉంటే అధిక ఆదాయం ఆర్జించడానికి ఆస్కారం ఉంది.

లక్షణాలు: స్పీచ్ థెరపిస్ట్‌లు అన్ని వయసుల రోగులకు ట్రీట్‌మెంట్, కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రంగంలో పేరు తెచ్చుకోవాలంటే శాస్త్రీయ దృక్పథం, ప్రభావవంతమైన ఇంటర్ పర్సనల్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇది సేవా రంగం కాబట్టి రోగులతో వ్యవహరించేందుకు ఓర్పు, సహనం అవసరం.

అర్హతలు: మనదేశంలో హియరింగ్ అండ్ స్పీచ్ థెరపీ, లాంగ్వేజ్ పాథాలజీపై వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌ను పూర్తిచేసిన తర్వాత వీటిలో చేరొచ్చు.

వేతనాలు: స్పీచ్ థెరపిస్ట్ ప్రారంభంలో నెలకు రూ.20 వేల వేతనం అందుకోవచ్చు. తర్వాత అనుభవం, పనితీరును బట్టి వేతనంలో పెరుగుదల ఉంటుంది. ఈ రంగంలో ప్రొఫెషనల్స్‌కు నెలకు రూ.లక్షకుపైగానే అందుతుంది.

స్పీచ్ థెరపీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
  • ఉస్మానియా యూనివర్సిటీ
    వెబ్‌సైట్:
    www.osmania.ac.in
  • ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్
    వెబ్‌సైట్:
    www.aiishmysore.in/en/index.html
  • ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్
    వెబ్‌సైట్:
    www.aiims.edu
దేశవిదేశాల్లో అవకాశాలు
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సేవ చేయాలని, వైవిధ్యమైన కెరీర్‌ను ఎంపికచేసుకోవాలని భావించేవారికి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులన్నీ ప్రత్యేకమే. స్పీచ్, ఆడియాలజీలో గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్, డిప్లొమా చేసేందుకు వీలుంది. ఆడియాలజిస్టు, స్పీచ్ పాథాలజిస్టులకు దేశవిదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. కొందరికి పుట్టుకతో మాటలు రాకపోతే స్పీచ్, ఆడియో థెరపీ ద్వారా సరిచేయవచ్చు. భావాల్ని వ్యక్తీకరించేందుకు వారిని సమాయత్తం చేయడమే ముఖ్యోద్దేశం. ఉద్యోగ విషయానికొస్తే ప్లేస్‌మెంట్స్ గ్యారంటీ. ఉన్నత చదువులతో కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరొచ్చు.
-డాక్టర్ పి.హనుమంతరావు, చైర్మన్,
స్వీకార్-ఉపకార్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సెన్సైస్
Published date : 20 Aug 2014 12:35PM

Photo Stories