Skip to main content

కెరీర్‌గా... తెలుగు భాషా, సాహిత్యాలు

ప్రపంచీకరణ ప్రభావం, ఆంగ్ల భాషా వ్యామోహంతో తెలుగు భాషా, సాహిత్యాలను కెరీర్‌గా ఎంచుకొని అధ్యయనం చేసేవారి సంఖ్య బాగా తగ్గింది. ఒకప్పుడు రాష్ర్టంలో వందల సంఖ్యలో ఉన్న ఓరియంటల్ కళాశాలలు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం జిల్లాకు కేవలం ఒకటి లేదా రెండు మాత్రమే ఉన్నాయి. ఇది వరకు డిగ్రీ కళాశాలల్లో బీ.ఏ. స్పెషల్ తెలుగు పాఠ్యాంశంగా చదివే విద్యార్థుల సంఖ్య వేలల్లో ఉండేది. ప్రస్తుతం స్పెషల్ తెలుగు పాఠ్యాంశంగా ఉన్న కళాశాలలు, దానిని చదివే విద్యార్థుల సంఖ్య వందల్లో ఉందంటే ఆశ్చర్య పోనక్కర్లేదు. చరిత్ర, రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం వంటి సబ్జెక్టులు చదివే వారితో పోలిస్తే, డిగ్రీ/పీజీ స్థాయిలో తెలుగు చదివిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ తరుణంలో తెలుగు భాషా సాహిత్యాలు కెరీర్‌గా ఎంచుకుంటే ఉండే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వివిధ పోటీ పరీక్షల్లో తెలుగు ప్రాధాన్యంపై ప్రత్యేక ఫోకస్...

ఉత్తమోత్తమ ఉపాధ్యాయ వృత్తి మొదలు అత్యుత్తమ సివిల్ సర్వీసెస్ వరకు ఎన్నో అవకాశాలున్నాయి. ఆకాశమే హద్దుగా ఉన్న పాత్రికేయ వృత్తి, ఛానళ్లు, న్యూ మీడియా, ఆకాశవాణి వంటి వాటిలో న్యూస్ రీడర్లు, ప్రూఫ్ రీడర్‌లుగా ఉద్యోగాలున్నాయి. చట్ట సభలు, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు ముద్రణాలయాల్లో అనువాదకులు, కంపోజర్లు, ఫ్రూఫ్‌ రీడర్లుగా పలు అవకాశాలున్నాయి. డిగ్రీ/పీజీలో తెలుగు చదివిన విద్యార్థులు అదనంగా బీఎడ్, డీటీపీ, కంప్యూటర్, పీజీడీసీఏ వంటి వాటిల్లో శిక్షణ పొంది నైపుణ్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి.

ఉత్తమమైన ఉపాధ్యాయవృత్తి
ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకూ ఇతర సబ్జెక్టులతో పోలిస్తే తెలుగు అధ్యాపకుల కొరత ఎక్కువగా ఉంది. డిగ్రీతో పాటు బీఎడ్ లేదా తెలుగు పండిట్స్ ట్రైనింగ్(టీపీటీ) ఉత్తీర్ణులైన అభ్యర్థులు తెలుగు స్కూల్ అసిస్టెంట్, గ్రేడ్ - 2 తెలుగు పండిట్ ఉద్యోగాలకు అర్హులు. వీరు టెట్ పేపర్ - 2లో ఉత్తీర్ణత సాధిస్తేనే డీఎస్సీ రాయగలరు. టెట్ పేపర్ 1(ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు), 2 (స్కూల్ అసిస్టెంట్స్) లలో 150 మార్కుల్లో తెలుగు భాషా సాహిత్యాంశాలు 30 మార్కులకు ఉంటాయి. డీఎస్సీ రాయాలనుకునే ఎవరైనా టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు తెలుగులో ఎక్కువ మార్కులు తెచ్చుకొనే అవకాశం ఉంటుంది. ఆ మార్కులు డీఎస్సీలో విజయం సాధించేందుకు ఉపకరిస్తాయి. ఏదో రెండు అధ్యాయాలు మినహాయిస్తే డీఎస్సీలో ఉండే తెలుగు గ్రేడ్ - 2 పండిట్స్, స్కూల్ అసిస్టెంట్స్ ఉద్యోగాల్లో సిలబస్ దాదాపు సమానంగా ఉంటుంది. కంటెంట్‌లో 44 మార్కులకు 88 ప్రశ్నలుంటాయి. మెథడాలజీలో 16 మార్కులకు 32 ప్రశ్నలుంటాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటాయి. అభ్యర్థులు శ్రద్ధగా సాధన చేస్తే ఉపాధ్యాయ వృత్తి సొంతం చేసుకోవచ్చు.

వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ర్ట ప్రభుత్వం నిర్వహించే రాజీవ్ విద్యామిషన్‌కు సంబంధించిన మోడల్ స్కూల్స్‌లో టీజీటీ, పీజీటీ ఉద్యోగాలకు కూడా టెట్ ఉత్తీర్ణత అవసరం. ఈ పరీక్షల్లో సిలబస్ డీఎస్సీ కంటే కొంత భిన్నంగా ఉంటుంది. వీటిల్లో విషయ ప్రాధాన్యం ఉన్న 160 ప్రశ్నలు 80 మార్కులకు ఉంటాయి. బోధనా పద్ధతుల ప్రమేయం లేదు. టీజీటీ ఉద్యోగానికి డిగ్రీ, బీఎడ్ కనీసార్హత. ఇది స్కూల్ అసిస్టెంట్‌తో సమానం. పీజీటీకి పీజీ, బీఎడ్ అర్హత. ఇది జూనియర్ లెక్చరర్‌తో సమానం.

డిగ్రీ జూనియర్ లెక్చరర్స్ గా..
డిగ్రీ, జూనీయర్ కళాశాలల లెక్చరర్స్ పరీక్ష సిలబస్ దాదాపు సమానంగా ఉంటుంది. డిగ్రీ లెక్చరర్స్ ఉద్యోగార్థులు 55 శాతం మార్కులతో ఎం.ఎ. తెలుగుతో పాటు స్లెట్, నెట్‌వంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి. జూనీయర్ లెక్చరర్స్ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఎం.ఎ. తెలుగు ఉత్తీర్ణులైతే సరిపోతుంది. ఈ పరీక్షలో పేపర్ 1, 2లో తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించిన 150 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున రెండు పేపర్లు 300 మార్కులకుంటాయి. వీటిలో 135 ప్రశ్నలు తెలుగుభాష, సాహిత్యం, వ్యాకరణం, విమర్శ వంటి వాటిపై ఉంటాయి. 15 ప్రశ్నలు సంస్కృత ప్రాథమిక వ్యాకరణాంశాలు, హితోపదేశం, కాళిదాసు గ్రంథాలకు సంబంధించి ఉంటాయి. అభ్యర్థులు పీజీ స్థాయిలో భాష, సాహిత్యం, విమర్శ, వ్యాకరణాంశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తే డిగ్రీ, జూనియర్ లెక్చరర్స్ గా విజేతలు కావచ్చు.

విశ్వవిద్యాలయ స్థాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలనుకునే వారు కనీసం 55 శాతం మార్కులతోఎం.ఎ. తెలుగుతో పాటు స్లెట్, సెట్‌, పరిశోధనకు సంబంధించిన పీహెచ్‌డీ కలిగి ఉంటే ప్రాధాన్యం. ఈ ఉద్యోగానికి రాతపరీక్ష ప్రమేయం లేదు. కేవలం ఇంటర్వ్యూ ఉంటుంది.

ఆకాశమే హద్దుగా ఉన్న పాత్రికేయ వృత్తి
శరవేగంగా విస్తరించి కీలక పాత్ర పోషిస్తున్న మీడియాలో ప్రస్తుతం వందల సంఖ్యలో పత్రికలు, ఛానళ్లు, వెబ్‌సైటులున్నాయి. తెలుగు భాషా సాహిత్యాంశాలతో పట్టభద్రులైన వారికి జర్నలిజంలో అభిరుచి, తెలుగులో రాయగలిగే నెపుణ్యముంటే పాత్రికేయులుగా రాణించొచ్చు. నిరంతర కృషి చేస్తే సంపాదకుడి స్థాయి వరకూ పదోన్నతలు పొందవచ్చు.

ఆకాశవాణి, దూరదర్శన్, రకరకాల ఎలక్రానిక్ మీడియా ఛానళ్లు, వెబ్‌సైట్‌లలో న్యూస్ రైటర్స్, న్యూస్ రీడర్‌‌స, కంటెంట్ రైటర్స్ గా చేరవచ్చు. తెలుగు భాషా సాహిత్య నైపుణ్యాలకు సమాంతరంగా హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యంతో అనువాద నైపుణ్యం పెంపొందించుకుంటే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ కార్యాలయాల్లో అనువాదకులుగా మంచి ఉద్యోగాలు లభిస్తాయి. కొన్ని విశ్వవిద్యాలయాల్లోఅందించే పీజీ డిప్లోమా ఇన్ ట్రాన్‌‌సలేషన్ కోర్సు చేసినవారికి ప్రాధాన్యముంటుంది. తెలుగు భాషా నైపుణ్యంతోపాటు డీటీపీ, పీజీ డిప్లోమా ఇన్ కంప్యూటర్స్ అప్లికేషన్‌‌స వంటి కోర్సులు చేస్తే ప్రభుత్వ, ప్రైవేట్ ముద్రణాలయాల్లో కంపోజర్, ఫ్రూఫ్ రీడర్లుగా స్థిరపడొచ్చు.

సివిల్ సర్వీసెస్ - తెలుగు భాషా సాహిత్యాలు
యూపీఎస్సీ సివిల్స్‌లో ఆప్షనల్ సబ్జెక్టుగా, ఇతర జాతీయ, అంతర్జాతీయ భాషలతో పాటు తెలుగు భాషా సాహిత్యాలు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించింది. ఆప్షనల్ సబ్జెక్టులో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపరుకు 250 మార్కులుంటాయి. డిగ్రీ, పీజీ స్థాయిలో తెలుగు చదివిన వారు ప్రత్యేక శిక్షణతో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ప్రస్తుతం ఎక్కువమంది ఇంజనీరింగ్ పట్టభద్రులు తెలుగు ఆప్షనల్స్‌గా ఎంపిక చేసుకొని విజేతలవుతున్నారు.

ఇతర పోటీ పరీక్షల్లో తెలుగు ప్రాధాన్యం
విద్యార్థులు స్పెషల్ తెలుగు చదువకున్నా, ఇంటర్మీడియట్, డిగ్రీస్థాయిలో జనరల్ తెలుగు శ్రద్ధగా చదివితే డైట్‌సెట్ (డీఎడ్ ప్రవేశ పరీక్ష)లో రాణించవచ్చు. ఈ పరీక్షలో పదో తరగతి పాఠ్య ప్రణాళిక ఆధారంగా తెలుగు భాష, సాహిత్యాంశాల నుంచి 20 మార్కులుంటాయి.

డీఎడ్ అర్హతతో ఉపాధ్యాయుల అర్హత పరీక్ష టెట్ రాయవచ్చు. పేపర్ 1లో తెలుగు భాషా సాహిత్యాంశాలు 30 మార్కులకు ఉంటాయి. (24 మార్కుల కంటెంట్, 6 మార్కుల బోధనా పద్దతులు). టెట్‌లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు తెలుగు ప్రావీణ్యం ఉపయోగపడుతుంది. టెట్‌లో రాణిస్తే డీఎస్సీ సులువవుతుంది.

వీటితో పాటు ఎస్‌ఐ ఆఫ్ పోలీస్ పరీక్షలో వంద మార్కులకు ప్రత్యేక తెలుగు పేపరు ఉంటుంది. అందులో లేఖా రచన, పేరాగ్రాఫ్ రైటింగ్, కాంప్రహెన్షన్ రైటింగ్, వ్యాసరచన, నివేదిక రచన వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షలో సాహిత్య, వ్యాకరణాంశాల ప్రమేయం ఉండదు. ఇందులో అర్హతా మార్కులు సాధించాలంటే తెలుగు భాషలో ప్రావీణ్యం అవసరం. ఈ పేపర్‌లో అర్హత సాధిస్తేనే మిగతా పేపర్లు మూల్యాంకనం చేస్తారు.

వీఆర్‌వో/వీఏవో, పోలీస్ కానిస్టేబుల్ వంటి పరీక్షల్లో తెలుగు భాషపై ప్రశ్నలుంటాయి. తెలుగు భాషలో నైపుణ్యం ఉంటే సులువుగా విజేతలు కావచ్చు. తెలుగు భాషా సాహిత్యాల్లో పట్టభద్రులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాలకు ఎంపిక కాకున్నా, కార్పొరేట్ పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులకు మంచి అవకాశాలున్నాయి. వీటితో పాటు రచనపై ఆసక్తి ఉన్నవారు సృజనాత్మకతతో సాహిత ్యంలో రాణించవచ్చు. పుస్తక రచయితలు, సినిమా కథలు, మాటల రచయితలు.. ఇలా తెలుగు భాషను అభ్యసించిన వారికి పుష్కలమైన అవకాశాలున్నాయి.

- పి.వి. సుబ్బారావు
Published date : 05 Oct 2013 06:15PM

Photo Stories