Skip to main content

ఫార్మసీ

బాగా వృద్ధి చెందుతోన్న రంగాల్లో ఫార్మసీ ఒకటి. మందులకు ఏటా పెరుగుతోన్న డిమాండ్ దృష్ట్యా ఫార్మసీ పరిశ్రమ విస్తరిస్తోంది. నూతన పరిశ్రమల ఏర్పాటు, బల్క్‌డ్రగ్ ప్రొడక్షన్, డ్రగ్ డెవలప్‌మెంట్, ఫార్ములేషన్‌లో... ఆసియాలోనే భారత దేశం ముందుంది. ఫార్మసీలో డి.ఫార్మసీ, ఫార్మ్.డి, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులతో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఫార్మసీలో వివిధ కోర్సుల వివరాలు చూద్దాం...

డిప్లొమా ఇన్ ఫార్మసీ(డి.ఫార్మసీ): ఇది రెండేళ్ల కోర్సు. కోర్సులో చేరడానికి అర్హత ఇంటర్మీడియెట్(ఎంపీసీ/బైపీసీ). రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో దాదాపు 62 ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్ మార్కులతో ప్రవేశం లభిస్తుంది.

బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ(బి.ఫార్మసీ): ఇది నాలుగేళ్ల కోర్సు. ఈ కోర్సులో చేరడానికి అర్హత: ఇంటర్మీడియెట్(ఎంపీసీ/బైపీసీ) లేదా డి.ఫార్మసీ. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని దాదాపు 290 ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సును అందిస్తున్నాయి. వీటిల్లో సుమారు 25వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా.. 50 శాతం సీట్లను ఎంపీసీ అభ్యర్థులతో, 50 శాతం సీట్లను బైపీసీ అభ్యర్థులతో భర్తీ చేస్తారు.

డాక్టర్ ఆఫ్ ఫార్మసీ(ఫార్మ్.డి): ఫార్మసీలో మెరుగైన విద్యకోసం.. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. ప్రవేశపెట్టిన వినూత్న కోర్సే.. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ(ఫార్మ్.డి). ఈ కోర్సులో ప్రవేశానికి అర్హత.. ఇంటర్మీడియెట్(ఎంపీసీ/ బైపీసీ). కోర్సు వ్యవధి ఆరేళ్లు. రాష్ట్రంలో దాదాపు 23 కళాశాలలు ఫార్మ్.డి. కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో 690 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.

బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ( బీఫార్మ్) విద్యార్థులకు కూడా ఫార్మ్.డి. కోర్సు చేసుకోవచ్చు. దీనికోసం పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పీజీఈసెట్) రాయాలి. వీళ్లకు ఈ కోర్సు వ్యవధి మూడేళ్లు. ఈ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 70 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

మాస్టర్ ఆఫ్ ఫార్మసీ(ఎంఫార్మసీ): బీఫార్మసీ తర్వాత ఉన్నత విద్య చదవడానికి అవకాశం కల్పిస్తున్న కోర్సు ఎంఫార్మసీ. ఈ కోర్సులో భిన్న స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు కాల వ్యవధి రెండేళ్లు. రాష్ట్రంలో దాదాపు 100 కాలేజీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో దాదాపు 4 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంఫార్మసీ కోర్సులో పీజీఈసెట్ లేదా గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్) స్కోర్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

పీహెచ్‌డీ: బిట్స్, నైపర్, మణిపాల్ యూనివర్సిటీలు ఫార్మసీలో వివిధ స్పెషలైజేషన్లతో పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వివరాలకు ఆయా వర్సిటీల వెబ్‌సైట్లు చూడొచ్చు.

అవకాశాలు: ఫార్మసీ అభ్యర్థులు సొంతంగా ఫార్మసీలను స్థాపించుకొని స్వయం ఉపాధి పొందొచ్చు. డీఫార్మసీ/బీఫార్మసీ అభ్యర్థులకు.. ఔషధ తయారీ సంస్థల్లో ప్రారంభస్థాయిలో అనలిస్ట్, క్వాలిటీ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్.. మధ్యస్థాయిలో అసిస్టెంట్ మేనేజర్, సూపర్‌వైజర్ స్థాయి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఫార్మసీ రంగానికి సంబంధించి ఎంత ఉన్నత విద్యను అభ్యసిస్తే... అంత ఉన్నతస్థాయికి ఎదగొచ్చు. ఎంఫార్మసీ/పీహెచ్‌డీ... వంటి కోర్సులను చేయడం ద్వారా ఉన్నత ఉద్యోగాలు, పరిశోధనల్లో పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది. బోధన రంగంలోనూ లెక్చరర్లు, ప్రొఫెసర్లుగా స్థిరపడొచ్చు. ప్రభుత్వ రంగంలో.. డిప్లొమా అభ్యర్థులను ఫార్మాసిస్ట్‌లుగా నియామించుకుంటారు. బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ అభ్యర్థులు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు అర్హులు. విదేశాల్లోనూ ఫార్మసీ అభ్యర్థులకు చక్కని అవకాశాలు ఉన్నాయి. ఫార్మసిస్ట్‌గా ప్రాక్టీస్ చేయాంటే మాత్రం అక్కడి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. హాస్పిటల్ డిస్పెన్సరీల్లో ఫార్మ్.డి అభ్యర్థులను నియమించాలనే నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ కోర్సుతోపాటు క్లినికల్ రీసెర్చ్‌లో ‘సాస్’, ఇతర సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటే ఎన్నో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఆసుపత్రుల్లోనే కాకుండా.. క్లినికల్ రీసెర్చ్ సంస్థలు, డ్రగ్ డెవలప్‌మెంట్, క్లినికల్ ట్రయల్స్, క్లినికల్ ఫార్మసీ విభాగాల్లోనూ వీరికి అవకాశాలుంటాయి. అంతేకాకుండా అమెరికాలో ఫార్మసీ ఉద్యోగాలకు అవసరమైన ‘నార్త్ అమెరికన్ ఫార్మసిస్ట్ లెసైన్సర్ ఎగ్జామినేషన్ (నాప్‌లెక్స్)కు హాజరయ్యే అర్హత ఈ కోర్సుతో లభిస్తుంది.

ఫార్మ పీజీ కోర్సులకు జీప్యాట్: గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్).. దేశ వ్యాప్తంగా వివిధ ఇన్‌స్టిట్యూట్‌లు/యూనివర్సిటీలు ఆఫర్ చేసే మాస్టర్ ఆఫ్ ఫార్మసీ(ఎం.ఫార్మసీ) కోర్సుల్లో ప్రవేశించడానికి వీలు కల్పించే పరీక్ష. ఇందులో మంచి ర్యాంక్ సాధించడం ద్వారా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్), సెంట్రల్ యూనివర్సిటీలు మొదలు.. దేశంలో వందల సంఖ్యలో ఉన్న సంప్రదాయ యూనివర్సిటీల్లో ప్రవేశం లభిస్తుంది.

ఫార్మసీలో మేనేజ్‌మెంట్ కోర్సులు:

ఔషధాలను మార్కెట్‌లో విక్రయించడానికి సరైన వ్యాపార మెలకువలు పాటించడం అనివార్యమైంది. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పలు విద్యాసంస్థలు ఫార్మసీ రంగంలో మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సు చేయడం ద్వారా ఫార్మాస్యుటికల్, కెమికల్, బయోటెక్నాలజీ సంస్థలు, పరిశోధన, విద్యాసంస్థల్లో మేనేజిరియల్ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పంజాబ్-ఎంబీఏ(ఫార్మా) కోర్సు అందిస్తోంది. బీఫార్మసీ పూర్తి చేసిన వారు అర్హులు.
వెబ్‌సైట్: www.niper.nic.in

నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్: ముంబై- ఎంబీఏ(ఫార్మాస్యుటికల్ మేనేజ్‌మెంట్) కోర్సును అందిస్తోంది. బి. ఫార్మసీ పూర్తిచేసినవాళ్లు అర్హులు.
వెబ్‌సైట్: www.nmims.edu

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ మార్కెటింగ్, లక్నో - పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఫార్మా మార్కెటింగ్) సెల్ఫ్ స్టడీ పద్ధతిలో అందిస్తోంది. ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చే సిన వారు అర్హులు.
వెబ్‌సైట్: www.iipmindia.com

జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌లు:
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్):
పిలాని(రాజస్థాన్), హైదరాబాద్ క్యాంపస్‌లు: బీఫార్మసీ(ఆనర్స్), ఎంఫార్మసీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
వెబ్‌సైట్: www.bitsadmission.com

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్):
దీనికి దేశం వ్యాప్తంగా పలు చోట్ల(మెహాలీ, హైదరాబాద్, కోల్‌కతా, గుహవాటి, అహ్మదాబాద్, రాయ్‌బరేలీ, హాజీపూర్) క్యాంపస్‌లు ఉన్నాయి. ఇవి ఫార్మసీలో ఎంఎస్(ఫార్మా) కోర్సులు అందిస్తున్నాయి. నైపర్- కామన్ ఎంట్రన్స్ టెస్ట్/జీప్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది.
వెబ్‌సైట్: www.niper.ac.in

మణిపాల్ యూనివర్సిటీ:
మణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సెన్సైస్ బీఫార్మసీ, డి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఫార్మ్-డి కోర్సులను ఆఫర్ చేస్తుంది.
వెబ్‌సైట్: www.manipal.edu

జేఎస్‌ఎస్ ఫార్మసీ కాలేజ్-ఊటీ: ఈ ఇన్‌స్టిట్యూట్ బీఫార్మసీ, డి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఫార్మ్-డి కోర్సులను ఆఫర్ చేస్తుంది.
వెబ్‌సైట్: www.jsscpooty.org

బెనారస్ హిందూ యూనివర్సిటీ:
ఈ సంస్థ బి. ఫార్మసీ, ఎం.ఫార్మసీ, కోర్సులను ఆఫర్ చేస్తుంది.
వెబ్‌సైట్: www.itbhu.ac.in

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -మెస్రా (రాంచీ):
ఈ ఇన్‌స్టిట్యూట్ బి. ఫార్మసీ, ఎం. ఫార్మసీ, ఎంఎస్-ఫార్మసీ కోర్సులను ఆఫర్ చేస్తుంది.
వెబ్‌సైట్: www.bitmesra.ac.in
Published date : 25 Jun 2012 03:51PM

Photo Stories