Skip to main content

పైలట్

ఎక్కువ మంది యువతకు కలగా మిగిలే కోర్సు పైలట్. కోర్సు పూర్తిచేయడానికి పాతిక లక్షలు ఖర్చవ్వడమే దీనికి కారణం. కానీ పైసా ఖర్చులేని పైలట్ కోర్సు, ఉద్యోగానికి డిఫెన్స్‌లో దారులెన్నో ఉన్నాయి. పైలట్ కోర్సు, అర్హతలు, సంస్థలు, కెరీర్‌పై స్పెషల్ ఫోకస్...

పైసా ఖర్చులేని పైలట్ కోర్సు, ఉద్యోగానికి మార్గాలివీ...
ఐదు మార్గాల్లో ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్ కావొచ్చు. అవి..
  1. ఎన్‌డీఏ సీడీఎస్‌ఈ
  2. షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఇన్
  3. ఫ్లైయింగ్ బ్రాంచ్
  4. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ స్పెషల్ ఎంట్రీ
  5. ఫాస్ట్ ట్రాక్ సెలక్షన్
నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్‌డీఏ)
నిర్వహణ:
యూపీఎస్‌సీ
అర్హత: ఫిజిక్స్, మ్యాథ్స్‌తో ఇంటర్ ఉత్తీర్ణత
వయోపరిమితి: 16 1/2-19 ఏళ్లు
ప్రకటన: ప్రతి ఏటా మార్‌‌చ, అక్టోబర్‌ల్లో
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ..

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్‌ఈ)
నిర్వహణ:
యూపీఎస్‌సీ
ప్రకటన: ఏటా ఏప్రిల్, సెప్టెంబర్‌ల్లో
అర్హత: ఏదైనా డిగ్రీ. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివుండాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్నవాళ్లూ అర్హులే.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా

నేషనల్ క్యాడెట్ కార్ప్స్ స్పెషల్ ఎంట్రీ
నిర్వహణ:
ఇండియన్ ఎయిర్ ఫోర్స్
ప్రకటన: ప్రతి ఏటా ఏప్రిల్, అక్టోబర్‌ల్లో
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివుండాలి. ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ సీనియర్ డివిజన్ సీ సర్టిఫికెట్ తప్పనిసరి.
వయోపరిమితి: 19-23 ఏళ్లు

షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఇన్ ఫ్లైయింగ్ (పైలట్) బ్రాంచ్
నిర్వహణ:
ఇండియన్ ఎయిర్ ఫోర్స్
ప్రకటన: ప్రతి ఏటా మార్‌‌చ, సెప్టెంబర్‌ల్లో
అర్హత: డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివుండాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులూ అర్హులే.
వయోపరిమితి: 19-23 ఏళ్లు
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా

ఫాస్ట్ ట్రాక్ సెలక్షన్
నిర్వహణ:
ఇండియన్ ఎయిర్ ఫోర్స్
సెలక్షన్: ఏటా దేశంలోని ముఖ్య ప్రాంతాల్లో ఈ సెలక్షన్ నిర్వహిస్తారు. రాష్ట్రంలో హైదరాబాద్‌లోని చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) దీనికి వేదిక.
ప్రకటన: ప్రతి ఏటా మార్చ్, సెప్టెంబర్‌ల్లో
అర్హత: ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివుండాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులూ అర్హులే.
వయోపరిమితి: 19-23 ఏళ్లు
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా

పేస్కేల్ అండ్ అలవెన్సెస్
ఎయిర్ ఫోర్స్‌లో పైన తెలిపిన ఐదు మార్గాల్లో ఏ విధానంలో ప్రవేశించినప్పటికీ... శిక్షణ సమయంలో నెలకు రూ.21,000 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. శిక్షణ అనంతరం ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా కెరీర్ ఆరంభమవుతుంది. అప్పుడు నెలకు రూ. 40,000కు పైగా వేతనం పొందొచ్చు. ఆకర్షణీయమైన అలవెన్సులూ ఉంటాయి. లెఫ్టినెంట్, స్క్వాడ్రన్ లీడర్, వింగ్ కమాండర్, గ్రూప్ కెప్టెన్, ఎయిర్ కమాండర్... ఇలా పదోన్నతులు పొందొచ్చు.

శిక్షణ ఇలా:
ముందు సాంకేతిక శిక్షణ నిర్వహిస్తారు. ఎయిర్ క్రాఫ్ట్‌కు సంబంధించిన అన్ని విభాగాలపైనా అవగాహన కల్పిస్తారు. ఎయిర్ సిక్‌నెస్ రాకుండా/వచ్చినా తట్టుకునేలా యోగా నేర్పుతారు. శిక్షణలో మూడు దశలుంటాయి. అవి..ప్రీ ఫ్లైయింగ్ ట్రైనింగ్ కోర్స్, బేసిక్ స్టేజ్, అడ్వాన్స్‌డ్ స్టేజ్. ఫ్లైయింగ్‌కు సంబంధించిన ప్రాథమికాంశాలతోపాటు గ్రౌండ్ ట్రైైనింగ్ ఉంటుంది. ప్రీ ఫ్లైయింగ్ ట్రైనింగ్ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు బేసిక్ స్టేజ్ ట్రైనింగ్, దాని తర్వాత అడ్వాన్స్‌డ్ స్టేజ్ శిక్షణ నిర్వహిస్తారు. ఈ దశలో 24 వారాలపాటు ఎయిర్ ఫోర్స్ అకాడెమీ-అలహాబాద్ లేదా ఎయిర్ ఫోర్స్ స్టేషన్- బీదర్‌లో శిక్షణ ఉంటుంది.

స్పెషలైజేషన్లు
అభ్యర్థి సామర్థ్యాన్ని బట్టి.. ఫైటర్ పైలట్, హెలికాప్టర్ పైలట్, ట్రాన్స్‌పోర్ట్ పైలట్‌ల్లో ఏదో ఒకటి కేటాయిస్తారు. ఫైటర్ పైలట్లకు హాకింపేటలో 22 వారాల శిక్షణ నిర్వహిస్తారు. హెలికాప్టర్ పైలట్లకు 22 వారాలు హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్ హాకింపేట్, 22 వారాలు ఎలహంక (బెంగళూరు)లో శిక్షణ ఉంటుంది. ట్రాన్స్‌పోర్ట్ పైలట్లకు ఏడాది పాటు రెండు సెమిస్టర్లలో ఎలహంక (బెంగళూరు)లో శిక్షణ నిర్వహిస్తారు.
వెబ్‌సైట్లు: www.upsc.gov.in, www.careerairforce.nic.in

సివిల్ పైలట్....
సివిల్ పైలట్ కావాలంటే కమర్షియల్ పెలైట్ లెసైన్స్ (సీపీఎల్) తప్పనిసరి. దీనికోసం డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-డీజీసీఏ గుర్తింపు ఉన్న సంస్థలో కోర్సు పూర్తి చేయాలి. ప్రస్తుతం దేశంలో 26 ఫ్లైయింగ్ స్కూళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎందులో ప్రవేశం పొందాలన్నా...మ్యాథ్స్, ఫిజిక్స్‌లతో ఇంటర్ లో కనీసం 55 శాతం (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలైతే 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. వయస్సు కనీసం 17/18 ఏళ్లు నిండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, పైలట్ ఆప్టిట్యూడ్ టెస్ట్, వైవా, ఇంటర్వ్యూల ద్వారా..
కోర్సు ట్యూషన్ ఫీజు: సుమారు రూ.25 లక్షలు
కోర్సు వ్యవధి: 18 నెలలు
వెబ్‌సైట్: www.dgca.nic.in

శిక్షణ ఇలా: మొత్తం మూడు దశలు. మొదటి, రెండో దశల్లో ముఖ్యంగా గ్రౌండ్ డ్యూటీ ట్రై నింగ్‌తోపాటు సిములేటర్ శిక్షణ నిర్వహిస్తారు. ఎయిర్ నావిగేషన్, ఫ్లైట్ ప్లానింగ్, ఏవియేషన్ మెటీరియాలజీ, ఎయిర్ రెగ్యులేషన్స్, ఆర్‌టీఆర్, కాక్‌పిట్ రీసోర్స్ మేనేజ్‌మెంట్ తదితర అంశాల్లో తర్ఫీదునిస్తారు. మూడో దశలో సింగిల్, డబుల్ ఇంజన్లపై గాలిలో శిక్షణ ఉంటుంది. ప్రాథమిక ప్రావీణ్యం పొందిన తర్వాత భిన్న ఇంజన్ల ఫ్లైట్లను నడపాలి. శిక్షణ అనంతరం సీపీఎల్ కోసం డీజీసీఏకు దరఖాస్తు చేసుకోవాలి. ఏవియేషన్ స్టడీస్‌కు సంబంధించి 5 ప్రశ్నపత్రాలు పూర్తి చేయాలి. రేడియో టెలిఫోనీ(ఆన్ ఎయిర్ కమ్యూని కేషన్), మెడికల్ ఫిట్‌నెస్ పరీక్షలు పాసవ్వాలి. కో-పెలైట్‌గా కెరీర్ ఆరంభమవుతుంది.

విదేశాల్లోనైతే:
యూఎస్, యూకే, కెనడా లాంటి దేశాల్లో అధునాతన పైలట్ శిక్షణా కేంద్రాలెన్నో ఉన్నాయి. మెరుగైన వసతులుంటాయి. ఇక్కడ కోర్సు చేసినవారు డీజీసీఏ నిర్వహించే పరీక్షలో అర్హత సాధించాలి. డబ్బు సమస్య కాదనుకునేవారు ఈ దేశాల్లో పైలట్ శిక్షణ తీసుకుంటే మంచిదే.
జీతాలిలా: ఆరంభంలో రూ.70,000 వరకు పొందొచ్చు. ఏడాది అనుభవంతో కో-పైలట్‌గా రూ.లక్ష నుంచి లక్ష యాభై వేలు వరకు లభిస్తుంది. సీనియర్ పైలట్లు నెలకు రూ. 2-3 లక్షల వేతనం పొందడం తేలికే. పదేళ్ల సీనియారిటీ ఉన్న వాళ్లు నెలకు రూ. 5 లక్షలకు పైగా జీతం తీసుకోవడం సులువే.
స్కిల్స్:
  1. ఫిజికల్ ఫిట్‌నెస్ తప్పనిసరి.
  2. సరైన నిర్ణయాలు క్షణాల్లో తీసుకోవాలి
  3. సవాళ్లకు సిద్ధపడాలి
  4. ఎక్కువ సమయం ఫోకస్డ్‌గా గడపగలగాలి
ఇవీ సంస్థలు
మన రాష్ట్రంలో...
  • ఎపీ ఫ్లైయింగ్ క్లబ్-హైదరాబాద్
  • రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడెమీ- హైదరాబాద్
  • ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడెమీ-సికింద్రాబాద్
బెస్ట్ ఇన్ ఇండియా...
ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడె మీ-రాయ్‌బరేలీ(ఉత్తరప్రదేశ్)
  • బాంబే ఫ్లైయింగ్ క్లబ్-ముంబై
  • గవర్నమెంట్ ఫ్లైయింగ్ ట్రైనింగ్ స్కూల్- బెంగళూరు
  • మద్రాస్ ఫ్లైయింగ్ క్లబ్-చెన్నై
  • ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్ లిమిటెడ్-న్యూఢిల్లీ
  • ఒరిస్సా గవర్నమెంట్ ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్-భువనేశ్వర్
Published date : 03 Jul 2012 04:13PM

Photo Stories