Skip to main content

కెరీర్‌గా... ఫొటోగ్రఫీ

మాటలకందని భావాలను వ్యక్తపరచడానికి.. జీవితంలోని మధురస్మృతులను బంధించి సొంతం చేసుకోవడానికి చక్కటి మాధ్యమం.. ఫొటోగ్రఫీ. అభిరుచి, సృజనాత్మకత ఉన్న వారికి సరిపడే రంగం ఫొటోగ్రఫీ.

కోర్సు:
ఫొటోగ్రఫీకి సంబంధించి ఆరు నెలల షార్ట్‌టర్మ్ కోర్సులతోపాటు డిప్లొమా, సర్టిఫికెట్, బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సంస్థలు పదో తరగతి అర్హతతో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. అధిక శాతం ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రం 10+2/ఇంటర్మీడియెట్ అర్హతతో బ్యాచిలర్, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

స్పెషలైజేషనుల
ఇతర కోర్సులకు భిన్నంగా ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉండడం ఫొటోగ్రఫీలో ప్రధాన ప్రత్యేకత. ఫొటో జర్నలిజం, కమర్షియల్ ఫొటోగ్రఫీ, అడ్వర్టైజింగ్, ఫ్యాషన్ ఫొటోగ్రఫీ, వెడ్డింగ్ ఫొటోగ్రఫీ, ఇండస్ట్రియల్ ఫొటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ, ఏరియల్ ఫొటోగ్రఫీ, సైంటిఫిక్ ఫొటోగ్రఫీ.. ఇలా పలురకాల స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఫ్యాషన్ ఫొటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పట్ల చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.

స్కిల్స్:
ఫొటోగ్రఫీలో రాణించాలనుకునే వారికి సృజనాత్మకత ముఖ్యం. దృశ్యాన్ని అందంగా చిత్రీకరించడంలో కీలకమైన బ్యాక్‌గ్రౌండ్ కలర్స్, లైటింగ్ వంటి అంశాల్లో చక్కని అవగాహన ఉండాలి. సాంకేతికంగా ఈ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.

ఉన్నత విద్య:
డిప్లొమా ఇన్ ఫొటోగ్రఫీని చేసినవారు బీఎఫ్‌ఏ చేయొచ్చు. బీఎఫ్‌ఏ పూర్తిచేస్తే ఎంఎఫ్‌ఏ ఫొటోగ్రఫీ చేయొచ్చు. మన రాష్ట్రంలో జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఎంఎఫ్‌ఏ కోర్సును ఆఫర్ చేస్తోంది. ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఇంకా మనదేశంలో అనేక యూనివర్సిటీలు ఎంఎఫ్‌ఏ ఫొటోగ్రఫీ కోర్సును అందిస్తున్నాయి.

అవకాశాలు:
ఫొటోగ్రఫీ కోర్సు చేసిన వారికి అవకాశాలకు కొదవేలేదు. ఫొటో జర్నలిస్ట్‌లకు వివిధ పత్రికలు, టీవీ ఛానెళ్లల్లో అవకాశాలుంటాయి. ఎంచుకున్న స్పెషలైజేషన్స్‌ను బట్టి వివిధ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, ఇండస్ట్రియల్ హౌస్‌లు, సైంటిఫిక్ జర్నల్స్, ఫ్యాషన్ హౌస్‌లు, ప్రభుత్వ సంస్థలు తదితర విభాగాల్లో అవకాశాలుంటాయి. నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్, డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ వంటి అంతర్జాతీయ మీడియా హౌసుల్లో కూడా పని చేసే సౌలభ్యం ఉంటుంది. సొంతంగా స్టూడియోలను ఏర్పాటు చేసుకోవడంతోపాటు ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా కూడా పని చేయొచ్చు.

వేతనాలు:
ఏదైనా సంస్థల్లో ప్రారంభంలో కనీసం రూ. 8000 వేతనంగా పొందొచ్చు. పనితీరు, అనుభవాన్ని బట్టి నెలకు రూ.20,000 సంపాదించడం సులువే. సొంతంగా ఫొటో స్టూడియోలు నిర్వహించొచ్చు. వివిధ కార్యక్రమాలకు ఫొటోలు తీయడం ద్వారా కూడా మంచి ఆదాయం పొందొచ్చు.

ఫొటోగ్రఫీని వివిధ స్థాయిల్లో ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
మన రాష్ట్రంలో..

జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ-హైదరాబాద్
కోర్సు: బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ)
అర్హత:
ఇంటర్మీడియెట్
వెబ్‌సైట్: www.jnafau.ac.in

శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ - హైదరాబాద్.
కోర్సు:బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ)
అర్హత:
ఇంటర్మీడియెట్

ఇతర సంస్థలు:
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-అహ్మదాబాద్
కోర్సు: రెండేళ్ల వ్యవధితో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫొటోగ్రఫీ డిజైన్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
అర్హత: సంబంధిత అంశంలో గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.nid.edu

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫొటోగ్రఫీ -ముంబై
కోర్సు: ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో ఆరు నెలల పార్ట్‌టైం డిప్లొమా కోర్సును అందిస్తోంది.
వెబ్‌సైట్: https://photoinstutenip.com

ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం-చెన్నై
కోర్సు: ఫొటో జర్నలిజం ఒక అంశంగా పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజంను ఆఫర్ చేస్తోంది.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.asianmedia.org https://www.asianmedia.org

ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-పుణే
వెబ్‌సైట్: www.ftiindia.com

సెయింట్ జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్-ముంబై
వెబ్‌సైట్: www.xaviercomm.org
Published date : 02 Jul 2012 06:34PM

Photo Stories