Skip to main content

బ‌డులు తెరుచుకునేది క‌రోనా త‌గ్గాకే..?

ఓ వైపు పెరుగుతున్న కరోనా కేసులు.. మరోవైపు తరుముకొస్తున్న విద్యా సంవత్సరం.. విద్యా సంస్థలను తెరవాలని త్వరపడుతున్న ప్రైవేటు పాఠశాలలు..

మహమ్మారి తగ్గాకే బడి మేలు అంటున్న తల్లిదండ్రులు.. వెరసీ కొత్త విద్యా సంవత్సరంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుత తరుణంలో తమ పిల్లలను పాఠశాలకు పంపించేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. కరోనా తగ్గాకే తరగతులు ప్రారంభించడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా గత నాలుగు నెలలుగా మూతపడ్డ స్కూళ్లు తెరిచేందుకు అవకాశం ఇవ్వాలని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. జూలైలో తెరిచే అవకాశం ఇస్తే విద్యార్థుల తల్లిదండ్రులు పుస్తకాలు, యూనిఫారమ్‌ వంటివి తీసుకునేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నాయి. విద్యార్థులకు కోవిడ్‌ సోకకుండా రక్షణ ఏర్పాట్లు చేస్తామంటున్నారు. అయితే, తమకు ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరుతున్నారు. స్కూల్స్‌లో శానిటైజర్లు, ప్యుమిగేష¯ŒS వంటి చర్యలు చేపట్టేందుకు, థర్మల్‌ స్క్రీనింగ్‌ యంత్రాలు సమకూర్చుకునేందుకు చాలా ఖర్చవుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో తాము అంత ఖర్చు భరించలేమని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్కూళ్లు తెరిచేందుకు అనుమతిస్తే.. విద్యార్థులు గుమికూడేందుకు అవకాశం ఉన్న ప్రేయర్‌ నిర్వహణ, క్రీడలకు దూరంగా ఉంచుతామంటున్నారు. విద్యార్థులను స్కూలుకు తీసుకెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించలేమని, తల్లిదండ్రులే పిల్లలను అన్ని రక్షణ చర్యలతో స్కూలుకు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సృజనాత్మకత, ప్రతిభతో...ఉద్యోగం సొంతం చేసుకోండిలా...

తల్లిదండ్రులు ఏమంటున్నారు..
కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో పిల్లలను బడికి పంపించడం సురక్షితం కాదని కొంతమంది తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. స్కూళ్లు తెరిచినా పిల్లలను పంపించే ఆలోచన లేదంటున్నారు. ఆయా స్కూళ్లల్లో రక్షణ ఏర్పాట్లు, విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. మరికొంత మంది ఆన్‌లైన్‌ బోధన వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఆన్‌లైన్‌ తరగతుల వల్ల విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వచ్చే ఆస్కాముందని మరికొందరు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వాట్సాప్‌లో పంపిస్తున్న పాఠాలు.. సిలబస్‌ పూర్తి చేశామని చెప్పుకోవడానికి మాత్రమేనని, వాటిని పిల్లలు అనుసరించలేకపోతున్నారని చెబుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ విద్యా సంవత్సరాన్ని జీరో ఇయర్‌గా మార్చడమే మంచిదని అభిప్రాపడుతున్నారు. కరోనా పూర్తిగా తగ్గాకే పాఠశాలలు ప్రారంభించడం మేలంటున్నారు.

ప‌ట్టణ ప్రాంతాల్లో ఇంటర్న్‌షిప్‌నకు మార్గం..

మీ సలహా..
ఓ వైపు కరోనా విజుృంభిస్తోంది. మరోవైపు విద్యార్థులకు ఎంతో విలువైన విద్యాసంవత్సరం.. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్‌ తెరవాలా.. వద్దా..? విద్యార్థులు విద్యా సంవత్సరం నష్ట పోకుండా ఏం చేస్తే బాగుంటుంది.. ఆన్‌లైన్‌ తరగతులతో మేలెంత?! తదితర అంశాలపై మీ అభిప్రాయాలను తెలపండి!.
మీ సలహాలు పంపాల్సిన వాట్సాప్‌ నెం: 96660 35940

రిస్క్‌ తీసుకోలేం..
ప్రస్తుతం విస్తరిస్తున్న కోవిడ్‌.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. పెద్దవాళ్లే దాని బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్‌కు పిల్లలను పంపేందుకు ఏ తల్లిదండ్రులూ అంగీకరించరు. పిల్లలు ఇంట్లో ఉంటేనే సేఫ్‌గా ఉంటారు. స్కూల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యం కాదు. మా ఇద్దరు పిల్లలు ఐదు, నాలుగు తరగతులు చదువుతున్నారు. ఈ ఏడాది చదువు లేకపోయినా పర్వాలేదు గాని పిల్లలను స్కూలుకు పంపి రిస్క్‌ చేయలేం. ఆన్‌లైన్‌ క్లాసులు కూడా రద్దు చేయాలి. ఫోన్‌లో పంపే పాఠాలతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
– కొల్లి సత్యవతి, విశాఖపట్నం

పూర్తిగా తగ్గాకే తెరవాలి..
కరోనా బారి నుంచి పెద్దవాళ్లే తప్పించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. పెడచెవిన పెడుతున్నారు. అలాంటిది పిల్లలను కంట్రోల్‌ చేయడం చాలా కష్టం. మా ఇద్దరు పిల్లలు 3వ తరగతి చదువుతున్నారు. స్కూల్లో ఏ విద్యార్థికి సమస్య ఉన్నా.. పిల్లలందరికీ ఇబ్బంది అవుతుంది. కోవిడ్‌ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నామని ఇప్పటి దాకా ఏ స్కూలూ ప్రకటించలేదు.. ఎందుకంటే అలా చేయడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను స్కూలుకు ఎలా పంపించగలం. కోవిడ్‌ పూర్తిగా తగ్గిపోయాక మాత్రమే స్కూళ్లు తెరిస్తే బాగుంటుంది.
– రుత్తల రాజేశ్వరీ రామగణేష్, హైదరాబాద్‌

Published date : 30 Jun 2020 02:34PM

Photo Stories