Skip to main content

ఆర్కిటెక్చర్...

నిర్మాణాల ప్లానింగ్, డిజైనింగ్‌ల అధ్యయనమే.. ఆర్కిటెక్చర్. అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలు, ఎయిర్‌పోర్టులు, స్టేడియాలు, స్కూళ్ల నిర్మాణంలో ఆర్కిటెక్చర్‌ల పాత్ర ఎంతో కీలకం. దీంతో ఆర్కిటెక్చర్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇంటర్ ఎంపీసీ అర్హతతో ఆర్కిటెక్చర్ కోర్సులో ఆరంగేట్రం చేయొచ్చు.

కోర్సు పేరు: బీఆర్క్/బీప్లానింగ్ కోర్సు
కాలవ్యవధి: ఐదేళ్లు
అర్హత: అకడెమిక్ స్థాయిలో ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో అడుగుపెట్టడానికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రూపుతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైతే బీఆర్క్‌కు అర్హత ఉన్నట్లే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ కోర్సును అందిస్తున్నాయి. అవి నిర్వహించే ప్రవేశ పరీక్షల ఆధారంగా సీటు సొంతం చేసుకోవచ్చు.
ప్రవేశ పరీక్షలు:
నాటా:
ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో ప్రవేశం కల్పించే అన్ని ఎంట్రెన్స్‌ల్లో ‘నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్(నాటా)’ అత్యంత ప్రముఖమని చెప్పొచ్చు. దీన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఆర్కిటెక్చర్, అకాడమిక్ కౌన్సెల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిర్వహిస్తున్నాయి. నాటాలో ర్యాంకు సాధించిన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో ప్రవేశించడానికి దాదాపు తొమ్మిది వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: www.nata.in/cms/default.aspx
 
ఏఐఈఈఈ: ఏఐఈఈఈ ర్యాంకు ఆధారంగా.. ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో అడుగుపెట్టొచ్చు. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ ఔత్సాహికులు ఏఐఈఈఈలోని పేపర్-2కు హాజరు కావాలి. ఇందులో మ్యాథమెటిక్స్, అప్టిట్యూడ్ టెస్ట్, డ్రాయింగ్ ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, సెల్ఫ్‌ఫైనాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్స్ అన్నింట్లోనూ కలిపి 950కి పైగాసీట్లు ఉన్నాయి.
వెబ్‌సైట్: www.aieee.nic.in
ఐఐటీల్లో కూడా: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో కూడా కొన్ని క్యాంపస్‌ల్లో ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కోర్సు అందుబాటులో ఉంది. దీనికోసం ఏటా నిర్వహించే ఐఐటీ-జేఈఈ పరీక్షలో ర్యాంకు సొంతం చేసుకోవాలి. ప్రస్తుతం ఐఐటీ-ఖరగ్‌పూర్, ఐఐటీ-రూర్కీ క్యాంపస్‌లలో బీఆర్క్ ఆఫర్ చేస్తున్నారు.

ఉన్నత విద్య: నచ్చిన స్పెషలైజేషన్లలో ‘మాస్టర్స్’ అయ్యేందుకు పీజీ కోర్సుల్లో చేరొచ్చు. ఆ తర్వాత పీహెచ్‌డీవైపు కూడా అడుగులు వేయొచ్చు. ప్రస్తుతం పీజీ స్థాయిలో అర్బన్ డిజైనింగ్, రీజనల్ ప్లానింగ్, బిల్డింగ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్, ఇండస్ట్రియల్ డిజైన్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్, నావల్ ఆర్కిటెక్చర్ తదితర స్పెషలైజ్డ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

మన రాష్ట్రంలో: హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ- స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్... గ్రాడ్యుయేట్, పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తోంది. ఇక్కడ ఐదేళ్ల బీఆర్క్, నాలుగేళ్ల బీప్లానింగ్, ఆరేళ్ల బీఆర్క్(పార్ట్ టైమ్ డి గ్రీ కోర్సు)లు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 12 కాలేజీలు ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశ ం కల్పిస్తున్నాయి.

ఉద్యోగాలిక్కడ:
ప్రభుత్వ విభాగంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, రైల్వేస్, నేషనల్ బిల్డింగ్ ఆర్గనైజేషన్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆర్గనైజేషన్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్, నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ తదితర చోట్ల కొలువు ఖాయం. ప్రయివేట్ రంగంలో ఆర్కిటెక్చర్ కన్సల్టింగ్ సంస్థలు, ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీల్లో అవకాశాలు అపారం.

విధులివే: క్లయింట్లకు నచ్చిన విధంగా కట్టడాల ప్లాన్ గీయడం, అందరూ మెచ్చే రూపమివ్వడం ఆర్కిటెక్చర్ ఇంజనీర్ల ప్రధాన విధి. క్లయింట్ల సమయాభావ పరిస్థితుల కారణంగా.. నిర్మాణ ప్లాన్ రూపొందించడం నుంచి.. నిర్మాణం ప్రారంభించడం కోసం సంబంధిత శాఖల అనుమతులు తీసుకోవడం, సివిల్ ఇంజనీర్లు, ల్యాండ్ సర్వేయర్లతో సంప్రదింపులు సాగించడం కూడా ఆర్కిటెక్చర్ ఇంజనీర్ల విధుల్లోభాగమే.

అదనపు స్కిల్స్ అవసరం:
విద్యార్థులకు అకడెమిక్ అర్హతలతోపాటు క్రియేటివిటీ, అబ్జర్వేషన్ స్కిల్స్, అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, డ్రాయింగ్ స్కిల్స్ వృద్ధి చేసుకోవాలి.

అనుబంధ పరిజ్ఞానం: ఆర్కిటెక్చర్‌లో సర్టిఫికెట్‌తోపాటు ఆ రంగానికి సంబంధించి సాఫ్ట్‌వేర్ నైపుణ్యాల్లో శిక్షణ పొందే అవకాశం కూడా ఇప్పుడు కలిసొచ్చే అవకాశం. దీనివల్ల సమయం కలిసి రావడంతోపాటు వారు రూపొందించే డిజైన్లకు కచ్చితత్వాన్ని తీసుకురావచ్చు. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ ప్రస్తుతం ఆర్కిటెక్చర్ ఇంజనీర్లకు అనుకూలించే కోర్సు.

ఆదాయం.. ఆకర్షణీయం: కోర్సు ఆఫర్ చేస్తున్న ప్రతి కళాశాలలోనూ క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉపాధి లభిస్తోంది. ప్రారంభంలోనే వార్షిక వేతనం మూడు లక్షలతో మొదలవుతోంది. రియల్ ఎస్టేట్ సంస్థలు, కన్‌స్ట్రక్షన్‌లోని బహుళ జాతి సంస్థల్లో ప్రారంభ వేతనం నెలకు రూ. 40 వేల వరకు ఉంటుంది.

సెల్ఫ్ ప్రాక్టీస్: అకడెమిక్ అర్హతలు పొంది.. ఒకట్రెండేళ్లు ఉద్యోగ అనుభవం సాధిస్తే ఆర్కిటెక్చర్ కన్సల్టెన్సీని కూడా ఏర్పటుచేయొచ్చు. నెలకు రూ.లక్షకు పైగా ఆదాయం పొందొచ్చు. దీనిలో రాణించడానికి చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. ప్రస్తుతం చాలా మంది గ్రాడ్యుయేట్లు ‘ముగ్గురు నలుగురు’ గ్రూప్‌గా ఏర్పడి కన్సల్టెన్సీలను ప్రారంభిస్తున్నారు.

Published date : 20 Jun 2012 07:37PM

Photo Stories