Skip to main content

హెచ్‌ఈసీతో బహుళ అవకాశాలు

హెచ్‌ఈసీ గ్రూపుతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసినవారికి ఉన్నతవిద్య, ఉద్యోగాల పరంగా అవకాశాలెన్నో ఉన్నాయి. కార్పొరేట్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుండటం, ఆయా కంపెనీల విభిన్న అవసరాలు.. హెచ్‌ఈసీ విద్యార్థులకు కెరీర్ పరంగా కలిసొస్తున్నాయి. దేశంలోనే ప్రఖ్యాత విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎంలు)లలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు అభ్యసించే వీలుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ హెచ్‌ఈసీ తర్వాత ఉన్న ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై ఫోకస్..
ఐదేళ్ల బీఏ-ఎంఏ
ఇంటర్‌లో హెచ్‌ఈసీ పూర్తయ్యాక అటు బ్యాచిలర్స్ డిగ్రీ, ఇటు పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పట్టాని అందించే ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సుల్లో చేరొచ్చు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టిస్)-హైదరాబాద్ (బీఏ-ఎంఏ సోషల్‌సెన్సైస్), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- మద్రాస్ (ఇంటిగ్రేటెడ్ ఎంఏ డెవలప్‌మెంట్ స్టడీస్, ఇంగ్లిష్ స్టడీస్), యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, హిందీ, తెలుగు, ఉర్దూ) వంటి ప్రముఖ విద్యా సంస్థలు ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సులందిస్తున్నాయి. తెలంగాణ విశ్వవిద్యాలయం-నిజామాబాద్ (కోర్సు: ఐదేళ్ల ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్), ఆంధ్రా యూనివర్సిటీ (ఐదేళ్ల ఎంఏ ఎకనామిక్స్) వంటి యూనివర్సిటీలు కూడా ఐదేళ్ల ఎంఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి.

విభిన్న స్పెషలైజేషన్లతో బీఏ
ఇంటర్‌లో హెచ్‌ఈసీ పాసయ్యాక సంప్రదాయ కోర్సులవైపు మళ్లాలనుకుంటే.. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరొచ్చు. బీఏలో హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్; హిస్టరీ, పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్; హిస్టరీ, పాలిటీ, సోషియాలజీ; హిస్టరీ, పాలిటీ, తెలుగు లిటరేచర్; హిస్టరీ, పాలిటీ; ఇంగ్లిష్ లిటరేచర్; సైకాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ; సోషియాలజీ, ఉర్దూ, పర్షియన్; హిస్టరీ, హిందీ, సంస్కృతం; హిస్టరీ, సోషియాలజీ, జాగ్రఫీ వంటి కాంబినేషన్లను ఎంచుకోవచ్చు. వీటితోపాటు కంపెనీల అవసరాలు, మార్కెట్‌కు అనుగుణంగా అడ్వర్టైజింగ్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్, లిబరల్ ఆర్ట్స్ వంటి కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. తర్వాత బీఏలో తీసుకున్న ఆప్షనల్ సబ్జెక్టులను బట్టి ఆయా సబ్జెక్టుల్లో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ వరకు ఉన్నత విద్యను కొనసాగించవచ్చు.

ఐదేళ్ల ఎంబీఏ
ఇంటర్ హెచ్‌ఈసీ ఉత్తీర్ణులకు మరో అద్భుత అవకాశం.. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ. బహుళజాతి సంస్థల కార్యాలయాలు.. టైర్-1 నగరాలతోపాటు టైర్-2, టైర్-3 సిటీస్‌లోనూ ఏర్పాటవుతున్నాయి. ఆయా సంస్థల సమర్థ నిర్వహణకు మేనేజర్ల అవసరం ఎంతో. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇంటర్‌తోనే కార్యనిర్వాహక నైపుణ్యాలు అందించడానికి విద్యా సంస్థలు ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సును ప్రవేశపెట్టాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) - ఇండోర్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ)- గుంటూరు, కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ- వడ్డేశ్వరం (గుంటూరు), విజ్ఞాన్స్ యూనివర్సిటీ - గుంటూరు.. ఇంటర్మీడియెట్ అర్హతతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సును అందిస్తున్నాయి.

హెచ్‌ఈసీతో ‘లా’
రెండేళ్ల క్రితం వరకు లా అంటే మనకు తెలిసినవి క్రిమినల్ లా, సివిల్ లా మాత్రమే. నేడు ప్రస్తుత అవసరాలకనుగుణంగా ఎన్నో స్పెషలైజేషన్లు అందుబాటులో కొచ్చాయి. అవి.. సైబర్ లా, పేటెంట్ లా, కార్పొరేట్ లా, ఫ్యామిలీ బిజినెస్ లా, ఏవియేషన్ లా, స్పేస్ లా, టెలికాం లా. దేశంలోని 17 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఆయా స్పెషలైజేషన్లను అందిస్తున్నాయి. వీటిల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీల్లో క్లాట్ స్కోర్ ఆధారంగానే ప్రవేశాలుంటాయి.

హెచ్‌ఈసీతో డీఈఈసెట్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏటా డీఈఈసెట్‌ను నిర్వహించి రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు. తెలంగాణలో ప్రకటన వెలువడాల్సి ఉంది. డీఈఈసెట్ ద్వారా డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు.. డీఎస్సీకి హాజరై సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) ఉద్యోగాలు పొందొచ్చు.

నేషనల్ డిఫెన్స్ అకాడెమీ
ఇంటర్ హెచ్‌ఈసీ అర్హతతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) పరీక్షకు హాజరవడం ద్వారా ఆర్మీ విభాగంలో ఆఫీసర్ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా బీఏ పట్టా పొందే వీలుంది.

ఎంఏ ఎకనమిక్స్
బీఏ తర్వాత జేఎన్‌యూలో, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఎంఏ ఎకనమిక్స్ కోర్సు పూర్తిచేస్తే జాబ్ మార్కెట్ ఎర్రతివాచీ పరచడం ఖాయం. ఈ కోర్సులు పూర్తిచేయడం ద్వారా స్టాక్‌మార్కెట్ ఉద్యోగాలతోపాటు కార్పొరేట్ కంపెనీల్లోనూ మంచి జాబ్స్ సంపాదించు కోవచ్చు. అకడెమిక్ రంగంపై ఆసక్తి ఉంటే.. ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తిచేయడం ద్వారా అధ్యాపక వృత్తిలో ఉన్నతంగా రాణించవచ్చు.

గ్రూప్స్, సివిల్స్ వీరికే అనుకూలం..
ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో సోషల్ బోధించేవారికి మంచి డిమాండ్ ఉంది. సైన్స్, మ్యాథ్స్ టీచర్లకు దీటుగా వీరికి వేతనాలు ఇస్తున్నారు. ఇంటర్ హెచ్‌ఈసీ ఉత్తీర్ణులు బీఏ, బీఈడీ చేసి ఉపాధ్యాయులుగా స్థిరపడొచ్చు. అలాగే గ్రూప్స్, సివిల్స్ వంటి పోటీ పరీక్షల్లో హిస్టరీ ఎకనామిక్స్, జాగ్రఫీ సబ్జెక్టుల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. పోటీ పరీక్షల్లో ఆర్ట్స్ విద్యార్థులు సైన్స్, ఇంజనీరింగ్ వారికంటే ఎక్కువ మార్కులు సాధించగలుగుతారు.
- వి. మల్లికార్జున్, ఎకనామిక్స్ ప్రొఫెసర్, అంబేద్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం

హెచ్‌ఈసీతో ఎన్నో అవకాశాలు
సైన్స్, టెక్నికల్ గ్రూపు సబ్జెక్టులతో పోల్చితే వీరికి ఆదర ణ కొంత తక్కువగా ఉన్న మాట వాస్తవం. అవగాహన ద్వారా విద్యార్థులను వీటివైపు ప్రోత్సహించవచ్చు. ఈ గ్రూపులో ఉన్న మూడు సబ్జెక్టుల్లో దేన్నైనా ఎంచుకుని ఉన్నత చదువులు కొనసాగించొచ్చు. గ్రూప్1, గ్రూప్2, సివిల్ సర్వీసుల్లో రాణించడానికి ఆర్ట్స్ గ్రూప్ నేపథ్యం ఉన్నవారికి బాగా కలిసొస్తుంది.
- ప్రొఫెసర్ మురళీధర్, హెచ్‌ఓడీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎస్వీ యూనివ ర్సిటీ
Published date : 10 May 2016 05:29PM

Photo Stories