తెలంగాణ మిగులు రాష్ట్రం కాదు: కాగ్ నివేదిక
2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం మార్చి 29న శాసనసభలో ప్రవేశపెట్టింది. ఆదాయ వ్యయాల పరిశీలనతో పాటు వివిధ రంగాల వారీ పనితీరును కాగ్ తమ ఆడిట్‌లో పొందుపరిచింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో పాటు స్థానిక సంస్థలు, ఆర్థిక రంగం, ప్రభుత్వ రంగ సంస్థలు, సామాన్య, సామాజిక రంగాలపై విడుదల చేసిన నివేదికల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాల నిర్వహణను కాగ్ తూర్పారబట్టింది. రాబడి, ఖర్చులపై ముందస్తు ప్రణాళిక, ఖచ్చితమైన అంచనాలు లోపించాయని వేలెత్తి చూపింది.
- 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1,386 కోట్ల్ల రెవెన్యూ మిగులు మాత్రమే నమోదు చేయగా దానిని రూ.6,778 కోట్లుగా చూపింది. అంటే రాష్ర్ట్రంలో రూ.5,392 కోట్ల రెవెన్యూ లోటు ఉంది.
- ‘ఉదయ్ పద్దులో రూ.3,750 కోట్లను గ్రాంటుకు బదులు ఈక్విటీగా చూపించింది.
- హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు అప్పుగా తెచ్చుకున్న రూ.1,500 కోట్లు రాబడిలో జమ చేసింది.
- తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, హడ్కో నుంచి అప్పుగా తెచ్చుకున్న రూ.1,000 కోట్లు ప్రభుత్వ ఖాతాలో రెవెన్యూ రాబడిగా రాసుకుంది.
- వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించి రూ.528 కోట్ల రెవెన్యూ వ్యయంను రుణంగా చూపించి ఖర్చు తక్కువ చూపింది’.
ద్రవ్యలోటు ఆందోళనకరం
ద్రవ్యలోటు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిర్దేశించిన 3.5 శాతం దాటి ఆందోళనకరంగా పరిణమించిందని కాగ్ స్పష్టం చేసింది.
- రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో ద్రవ్యలోటు 5.46 శాతంగా ఉందని, ఉదయ్ పథకం కింద విద్యుత్తు సంస్థలకు బదిలీ చేసిన డబ్బును మినహాయిస్తే 4.3 శాతంగా ఉంటుంది.
- రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తెచ్చిన నిధులను రెవెన్యూ రాబడుల్లో జమ చేసి, ద్రవ్య లోటును రూ.2,500 కోట్ల మేరకు తక్కువ చేసి చూపించింది.
- ఉదయ్ బాండ్ల ద్వారా రూ.8,931 కోట్లు అప్పు తెచ్చుకుంటే, కేవలం రూ.7,500 కోట్లు డిస్కంలకు విడుదల చేసింది. డిస్కంల మిగతా రుణాలకు కొత్త బాండ్లు జారీ చేయాలని ఉదయ్ పథకం నిర్దేశించినప్పటికీ.. వాటిని జారీ చేయలేదు.
కొరవడిన ముందస్తు ప్రణాళిక
- రెవెన్యూ రాబడి, ఖర్చులపై ముందస్తు ప్రణాళిక, ఖచ్చితమైన అంచనాలు లేక ‘రాష్ట్రం మొత్తం ఖర్చులో రెవెన్యూ వ్యయం 69 శాతంగా నమోదైంది. దీంతో మౌలిక వసతులు, ఆస్తుల కల్పనలో పెట్టుబడికి 31 శాతమే మిగిలి ఉంది’అని కాగ్ ప్రస్తావించింది.
- 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపుల కంటే రూ.6,184 కోట్లు అధికంగా ఖర్చయితే క్రమబద్ధీకరించలేదు. బడ్జెట్ కేటాయింపులు, వాస్తవ ఖర్చులకు పొంతన లేకపోవటంతో కొన్ని శాఖల్లో భారీగా మిగులు, కొన్నింటిలో కేటాయింపులకు మించి ఖర్చులు చోటు చేసుకున్నాయి.
- 2016-17లో బడ్జెట్ కేటాయింపులను మించి చేసిన అధిక ఖర్చు రూ.21,161 కోట్లు. 16 గ్రాంట్లు, మూడు అప్రాప్రియేషన్లలో చేసిన అధిక వ్యయం రాజ్యాంగం ప్రకారం క్రమబద్ధీకరించాలని కాగ్ సూచించింది.
సబ్‌ప్లాన్ నిధులపై నిర్లక్ష్యం
- ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్లో 60 శాతం, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్లో 58 శాతం వినియోగించకుండా చట్టాన్ని నిర్లక్ష్యం చేసిందని కాగ్ వెల్లడించింది.
- ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఐటీడీఏ జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, ఎస్సీ హాస్టళ్లలో విద్యార్థులకు సౌకర్యాల కల్పనకు, రాష్ట్రంలో ఐదు మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధికి కేటాయించిన నిధులు ఖర్చు కాలేదు.
- రైతులకు వడ్డీ లేని పంట రుణాలకు నిర్దేశించిన రూ.265 కోట్లు ఖర్చు చేయలేదు.
- 28,087 వ్యక్తిగత డిపాజిట్ ఖాతాల్లో రూ.19,873 కోట్ల మొత్తం నిల్వ ఉంది. పీడీ ఖాతాల్లో భారీ మొత్తాలు ఉంచి రుణాలపై 7.40 శాతం వడ్డీ చెల్లిస్తున్న తీరు ప్రభుత్వ నగదు నిర్వహణ, ఆర్థిక నిర్వహణలు సరిగా లేవని స్పష్టం చేస్తోందని కాగ్ అభిప్రాయపడింది.
అప్పులతో ముప్పు
- ప్రభుత్వం చేస్తున్న అప్పుల్లో 34.74 శాతం పాత అప్పులను తీర్చేందుకే వినియోగిస్తోందని కాగ్ వెల్లడించింది.
- 2020-22 సంవత్సరాల మధ్య రూ.14,896 కోట్లు, 2022-24 మధ్య రూ.22,280 కోట్ల అప్పును ప్రభుత్వం తీర్చాల్సి ఉందని, ఈ అప్పును తీర్చేందుకు ప్రభుత్వం మరిన్ని అప్పులు చేయాల్సి వస్తుందని అంచనా వేసింది.
- 2017 మార్చి 31 నాటికి ఉన్న రాష్ట్ర అప్పులు పరిశీలిస్తే.. వచ్చే ఏడేళ్లలో 49 శాతం రుణాలు.. అంటే రూ.56,388 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉంది. 2015-16లో పన్నుల రాబడిలో 7.12 శాతం రుణాలు తిరిగి చెల్లించగా, 2016-17లో ఇది 32.16 శాతానికి పెరిగింది.
- 14వ ఆర్థిక సంఘం ప్రామాణిక రేటు ప్రకారం రెవెన్యూ రాబడుల్లో వడ్డీ చెల్లింపులు 8.22 శాతంగా ఉండాలి. కానీ ఇవి 10.40 శాతానికి పెరిగాయని కాగ్ గుర్తించింది.
టౌన్ ప్లానింగ్‌లో భారీ అవినీతి
- జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో 2012-2017 కాలానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో 75,387 ఇళ్లను తనిఖీ చేసిన కాగ్, 30,864 ఇళ్ల నిర్మాణంలో అతిక్రమణలు గుర్తించింది. వీటిలో 10,460 అక్రమ నిర్మాణాలేనని తేల్చింది.
- ఆస్తి పన్ను మదింపులో 708 కట్టడాలను పరిశీలించగా, రూ.5.24 కోట్ల మేర ఆస్తి పన్ను తక్కువగా మదింపు చేసినట్టు కాగ్ గుర్తించింది.
- అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ సమయంలో ఆరు సర్కిళ్ల పరిధిలో కేవలం 287 నిర్మాణాలను పరిశీలించగా రూ.1.25 కోట్ల మేర పన్ను తక్కువగా చెల్లించినట్టు తేలింది.
- జీహెచ్‌ఎంసీ ఆవిర్భవించే నాటికి (2007) దాని పరిధిలో 185 చెరువులుండగా వాటిలో 26 చెరువులు ఇప్పుడు ‘కనపడుట లేదు’. మిగతా వాటిలోనూ 17 చెరువులు ఎక్కడున్నాయో కూడా కనుక్కోలేని దుస్థితి ఉంది.
వాణిజ్య పన్నుల శాఖలో 1,100 కోట్ల అవకతవకలు
- అన్ని వాణిజ్య పన్నుల కార్యాలయాల్లో ఏదో ఒక తప్పును గుర్తించిన కాగ్.. మొత్తం రూ.1,100 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని పేర్కొంది.
- టర్నోవర్ లెక్కించడం నుంచి పన్ను వసూలు వరకు, పన్ను కట్టకపోతే జరిమానా విధింపు నుంచి, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) మంజూరు వరకు, టర్నోవర్ తేడాల నుంచి కొనుగోలు టర్నోవర్ ఎక్కువ చూపించడం వరకు.. ఇలా 1,055 కేసుల్లో తప్పులు జరిగాయి.
- 2016-17 ఆర్థిక సంవత్సరానికి వస్తువులపై పన్ను విధించకుండా లేదా తక్కువ పన్ను వసూలు చేయడం ద్వారా రూ.780 కోట్ల అవకతవకలు జరిగాయి.
ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు
- స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో మొత్తం 359 కేసులకు రూ.42.06 కోట్ల మేర అవకతవకలు జరిగాయని కాగ్ నిర్ధారించింది.
- స్టాంపు డ్యూటీలు, ఫీజులు తక్కువగా విధించడం వల్ల రూ.36.99 కోట్లు, ఆస్తుల విలువ తక్కువ లెక్కించడం వల్ల రూ.4.29 కోట్లు నష్టం జరిగింది.
‘ఆరోగ్యానికి’ అనారోగ్యం!
- 2012-13 నుంచి 2016-17 వరకు రికార్డులను పరిశీలించిన కాగ్ అన్ని అంశాల్లోనూ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.
- 2005 ఏప్రిల్‌లో మొదలైన ఎన్‌ఆర్‌హెచ్‌ఎం పథకం కింద సంతాన సాఫల్యత, పిల్లల ఆరోగ్యం, గర్భిణుల ఆరోగ్య పరిరక్షణ, నవజాత శిశువుల రక్షణ, వ్యాధి నిరోధక చికిత్సలు, పోషకాహార లోపాల నివారణ చర్యలు అమలు చేయాలి.
- ప్రసూతి మరణాల రేటును 1,00,000:100 కన్నా దిగువకు తగ్గించాలని, పసిపిల్లల మరణాల రేటును 1,000:25కు తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించారు. అయితే వీటిలో ఏ లక్ష్యాన్నీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సాధించలేకపోయింది.
రాష్ట్రంలో ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధుల ఖర్చు తీరు (రూ.కోట్లలో)
ఆర్థిక సంవత్సరం |
అందుబాటులో ఉన్న మొత్తం |
ఖర్చుకాని మొత్తం |
శాతం |
2012-13 |
1,620.14 |
899.89 |
56 |
2013-14 |
1,623.44 |
1,006.55 |
62 |
2014-15 |
776.17 |
460.37 |
59 |
2015-16 |
673.13 |
308.16 |
54 |
2016-17 |
1,221.86 |
748.85 |
61 |
అత్యవసర మందుల పంపిణీ ఖర్చు (రూ.కోట్లలో)
ఆర్థిక సంవత్సరం |
కేటాయింపు |
మిగిలిన మొత్తం |
శాతం |
2014-15 |
40.00 |
40.00 |
100 |
2015-16 |
23.89 |
1.07 |
96 |
2016-17 |
20.00 |
9.04 |
55 |
ప్రసవాల తీరు ఇలా..
సంవత్సరం |
మొత్తం ప్రసవాలు |
ప్రభుత్వ ఆస్పత్రుల్లో |
ప్రైవేటు ఆస్పత్రుల్లో |
2013-14 |
3,85,435 |
2,65,119 |
1,20,322 |
2014-15 |
3,84,287 |
2,40,548 |
1,43,739 |
2015-16 |
3,75,957 |
1,93,412 |
1,82,545 |
2016-17 |
5,07,896 |
2,11,384 |
2,96,512 |
అడ్డగోలుగా విద్యుత్ కొనుగోళ్లు!
- దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) కేంద్ర, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్లు (ఈఆర్సీలు) విధించిన పరిమితికి మించిన ధరతో విద్యుత్ కొనుగోళ్లు చేసిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మండిపడింది.
- 2012-17 మధ్య స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ఏకంగా రూ.5,820.90 కోట్లు అధిక వ్యయం జరిగింది
- కేంద్ర విద్యుత్ సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. ఫైవ్‌స్టార్ రేటింగ్ కలిగిన త్రీఫేజ్, సింగిల్ ఫేజ్ ట్రాన్‌సఫార్మర్లతో విద్యుత్ సరఫరా చేయాలి. కానీ టీఎస్‌ఎస్పీడీసీఎల్ త్రీస్టార్ రేటింగ్ గల ట్రాన్‌సఫార్మర్లను కొనుగోలు చేసి వినియోగిస్తోంది. అధిక నాణ్యత గల ట్రాన్‌సఫార్మర్లను వినియోగిస్తే.. ఒక్కో ట్రాన్‌సఫార్మర్ ద్వారా 701 నుంచి 20,586 యూనిట్ల వరకు విద్యుత్ పొదుపు జరిగేది. దీంతో 25 ఏళ్లలో రూ.2,220.49 కోట్లు ఆదా అయ్యేవి.
- 2012-17 మధ్య వ్యవసాయ విద్యుత్ సరఫరా అనుమతించిన పరిమితులను మించిపోవడంతో సంస్థపై రూ.1,744.56 కోట్ల భారం పడింది. 2012-17 మధ్య విద్యుత్ నష్టాల విలువ రూ.1,306.76 కోట్లు ఉంటుంది.
- 2016-17 ఏడాదికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికను సకాలంలో ఈఆర్సీకి సమర్పించకుండా.. పాత టారిఫ్‌ను కొనసాగించడం వల్ల సంస్థకు రూ.323.89 కోట్ల నష్టం జరిగింది.
- మౌలిక సదుపాయాల వృద్ధి కోసం 2012-17 మధ్య ఈఆర్సీ ఆమోదించిన వ్యయం రూ.5,843.43 కోట్లు. కానీ సంస్థ రూ.6,632.62 కోట్లు ఖర్చు చేసింది. ఈ అధిక వ్యయాన్ని విద్యుత్ చార్జీల రూపంలో వసూలు చేసుకోవడానికి ఈఆర్సీ అనుమతించకపోవడంతో.. రూ.789.19 కోట్లను భరించాల్సి వచ్చింది.
- 2012-14 మధ్య చేపట్టిన వివిధ పనుల కోసం తీసుకున్న పెట్టుబడి రుణాల వడ్డీలో 3 నుంచి 5 శాతం వరకు రారుుతీని జాతీయ విద్యుత్ నిధి (వడ్డీ రాయితీ) పథకం సమకూర్చింది. ఈ పథకం కింద 2013-17 మధ్య రూ.216.91 కోట్లు రాబట్టుకునేందుకు అవకాశమున్నా.. సంస్థ కేవలం 2013-14కి సంబంధించిన రూ.4.01 కోట్ల రాయితీని మాత్రమే రాబట్టుకుంది.
- డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ ప్రణాళికకు ఈఆర్సీ నుంచి ఆమోదం పొందలేదు. దీంతో ఆ పథకం కింద రీషెడ్యూల్ చేసిన రుణాలకు సంబంధించిన వడ్డీలను 2015-16లో విద్యుత్ చార్జీల రూపంలో వసూలు చేసేందుకు ఈఆర్సీ అనుమతించలేదు. దీనివల్ల సంస్థ రూ.1400.74 కోట్ల నష్టాన్ని భరించాల్సి వచ్చిందని కాగ్ తెలిపింది.
టీఎస్ ఐపాస్ లక్ష్యం నెరవేరడం లేదు
- తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం (టీఎస్-ఐపాస్) ద్వారా ‘సింగిల్ విండో’విధానంలో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుమతులకు కాకుండా.. వ్యాపారవేత్తలు కోరిన కొన్నింటికే ప్రభుత్వం అనుమతి పత్రాలు జారీ చేస్తోందని తప్పుబట్టింది.
- ‘అన్ని రకాల అనుమతులకు దరఖాస్తు చేసుకున్నట్లు నిర్ధారించుకునేలా సాఫ్ట్‌వేర్ వ్యవస్థ లేదు. అనుమతులకు తరువాత దరఖాస్తు చేసుకునేందుకు ‘అప్లై లేటర్’ ఆప్షనూ లేదు.
- 2016-17లో 1,941 దరఖాస్తులొస్తే 177 మంది దరఖాస్తుదారులే అన్ని రకాల అనుమతులు కోరారు. మిగిలిన వారు పాక్షిక అనుమతులే పొందారు.
- కాలుష్య నియంత్రణ మండలి నుంచి రెడ్ కేటగిరీ పరిశ్రమల ఏర్పాటుకు 148 పరిశ్రమలు అనుమతి పొందాల్సి ఉండగా, 85 పరిశ్రమలే దరఖాస్తు చేసుకున్నాయి.
- ఆరెంజ్ కేటగిరీ కింద 441 పరిశ్రమలకు గాను 175.. అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఓసీ కోసం 106 పరిశ్రమలకు గాను 9 మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి.
- పంచాయతీల నుంచి ఎన్‌ఓసీ కోసం 1,425 పరిశ్రమలకు గాను 147 మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి’అని కాగ్ పేర్కొంది.
మిషన్ కాకతీయలో లోపాలు
- మిషన్ కాకతీయ అమలులో లోపాలున్నాయని తొలి రెండుదశల్లో ప్రాధాన్యంలేని చెరువులను కూడా చేపట్టారని కాగ్ ఆక్షేపించింది. ప్రాధాన్య చెరువుల జాబితాలో మినీ ట్యాంక్‌బండ్‌లు లేకున్నా వాటికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.66.31 కోట్లు ఖర్చు చేసింది.
- గతంలో కమ్యూనిటీ బేస్డ్ ట్యాంక్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం కింద 186 చెరువులు, ట్రిపుల్ కింద మరో 116 చెరువులను చేపట్టగా, వాటినే తిరిగి మిషన్ కాకతీయలోనూ రూ.120.41 కోట్లతో చేపట్టారని పేర్కొంది. గత పథకాల్లో పూడికతీయనంత మాత్రాన ఈ పనులు చేపట్టడం ఆమోదయోగ్యం కాదని తెలిపింది.
- 27 చెరువుల పూడికతీత పనులు తనిఖీ చేయగా, అంచనా వేసిన పరిమాణం కన్నా తక్కువగా పనులు జరిగాయి. ఈ చెరువుల్లో 12.01 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని చేయాలని అంచనా వేసి కేవలం 8.08 లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే తీశారు.
నిబంధనలు ఉల్లంఘించిన టీఎస్‌ఐఐసీ
- రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) టి-హబ్ తొలి, రెండో దశలు, ఇమేజ్ టవర్ల టవర్ భవనాల నిర్మాణంలో నిబంధనలను ఉల్లంఘించి కాంట్రాక్టర్లకు టీఎస్‌ఐఐసీ అక్రమ లబ్ధి కలిగించిందని తెలిపింది.
- టి-హబ్ తొలి దశ భవన నిర్మాణంలో కాంట్రాక్టర్లకు రూ.93.39 లక్షల అనుచిత లబ్ధి కలిగించింది.
- ఇమేజ్ భవన నిర్మాణాన్ని నాలెడ్‌జ సిటీ నుంచి గేమింగ్ సిటీకి మార్చాక సీఆర్ నారాయణరావు, ఎల్‌ఎల్‌పీ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను టీఎస్‌ఐఐసీ రద్దు చేసుకుని కొత్త సలహాదారును నియమించుకుంది. దీంతో ఒప్పంద సమయంలోనే రూ.15.14 కోట్ల అధిక భారం పడింది. పాత సలహాదార్లకు అప్పటికే చెల్లించిన రూ.63.8 లక్షలు వృథా అయ్యాయి.
- బ్రాహ్మణి ఇన్‌ఫ్రాకు 2006లో కేటాయించిన 250 ఎకరాల్లో పరిశ్రమ స్థాపన జరగకపోవడంతో 2013లో స్థలాన్ని టీఎస్‌ఐఐసీ వెనక్కు తీసుకుంది. బ్రాహ్మణి చెల్లించిన రూ.50 కోట్లలో రూ.14 కోట్లు మినహాయించుకోవాల్సి ఉండగా రూ.49.75 కోట్లు తిరిగిచ్చింది. ఇలా రూ.13.75 కోట్ల అనుచిత లబ్ధి చేకూర్చింది.
- విప్రో సంస్థకు గోపన్‌పల్లిలో కేటాయించిన 101.03 ఎకరాల్లో 2007 జూన్ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి 10 వేల మందికి ఉపాధి కల్పించాల్సి ఉంది. కానీ 9 ఎకరాలనే వినియోగంలోకి తెచ్చి 700 మందికే ఉపాధి కల్పించింది. మిగతా భూమి నిరుపయోగంగా ఉండిపోయింది.
75% ప్రభుత్వ స్కూళ్లలో కనీస వసతుల్లేవ్
- రాష్ట్రంలోని 75 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేవని కాగ్ పేర్కొంది. 45 శాతం స్కూళ్లకు ఆట స్థలాలు లేవని, 39 శాతం బడులకు ప్రహరీ గోడలు లేవని వెల్లడించింది.
- విద్యా హక్కు చట్టం పక్కాగా అమలు కాకపోవడంతో విద్యార్థులకు ఆశించిన ప్రయోజనాలు చేకూరలేదు. సర్వ శిక్షా అభియాన్‌కు (ఎస్‌ఎస్‌ఏ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయక కార్యక్రమాలు కుంటుపడ్డాయి.
- రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో (స్థానిక సంస్థలు, ఎయిడెడ్ కలుపుకొని) 2014-17 మధ్య విద్యార్థుల సంఖ్య 1.12 లక్షల మేర (7.65 శాతం) తగ్గగా ప్రైవేటు ప్రాథమిక పాఠశాలల్లో 61 వేల మంది (3.67 శాతం) విద్యార్థుల సంఖ్య పెరిగింది.
- ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 20 వేల మంది విద్యార్థులు తగ్గిపోగా ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3 వేల మంది పెరిగారు.
- మూడేళ్ల కాలంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సంఖ్య 0.42 శాతం పెరిగితే ప్రైవేటు పాఠశాలల సంఖ్య 12.75 శాతం పెరిగింది. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో బడుల సంఖ్య 2.89 శాతం పెరగ్గా ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలల్లో 10.09 శాతం పాఠశాలలు పెరిగాయి.
- ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థుల్లో డ్రాపవుట్స్ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ బాలబాలికల్లో డ్రాపవుట్స్ ఎక్కువగా ఉన్నాయి.
- రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ) అమలుపై సమీక్షే జరగడం లేదని కాగ్ విమర్శించింది. విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన పని చేయాల్సిన రాష్ట్ర సలహా సంఘాన్ని (ఎస్‌ఏసీ) ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు.
- ప్రైవేటు పాఠశాలల్లో బలహీనవర్గాల పిల్లలకు 25 శాతం రిజర్వేషన్లను కల్పించాలన్న నిబంధనను అమలు చేయడం లేదని, 2014-15, 2015-16 విద్యా సంవత్సరాల్లో 44,412 మంది విద్యార్థులకు రవాణ భత్యాన్ని కూడా ఇవ్వలేదని కాగ్ వెల్లడించింది.
- ప్రత్యేక అవసరాలుగల పిల్లల కోసం మూడేళ్లలో రూ. 15.42 కోట్లు కేటాయించగా అందులో 35 శాతం నిధులనే ఖర్చు చేశారు.
- చదవడం, రాయడం లెక్కలు చేయడం కోసం ‘త్రీ ఆర్స్’కార్యక్రమం నిర్వహించినా ఆశించిన ఫలితాలు రాలేదు. రెండో తరగతిలో 38 శాతం మందికి, మూడో తరగతిలో 39 శాతం మందికి అవి రావడం లేదు.
- 2016-17లో 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదవడం, రాయడం, సాధారణ లెక్కలు చేయడం రాని వారు 31 శాతం ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు ప్రాథమిక పాఠశాలల్లో ఈ మూడేళ్లలో 40 శాతం మార్కులు రాని వారు 14 శాతం నుంచి 26 శాతం మంది ఉంటే ప్రాథమికోన్నత పాఠశాలల్లో 21 శాతం నుంచి 47 శాతం మంది విద్యార్థులు ఉన్నారు.
- 91 శాతం నుంచి 100 శాతం మార్కులు వచ్చిన వారు ప్రాథమిక స్థాయిలో 5 నుంచి 10 శాతమే ఉండగా ప్రాథమికోన్నత స్థాయిలో 2 నుంచి 6 శాతమే ఉన్నారు.
మౌలిక సదుపాయాల కొరత..
అంశం |
స్కూళ్లు |
స్కూళ్ల శాతం |
ప్రతి టీచర్‌కు తరగతి లేనివి |
6,643 |
23 |
ర్యాంపులు లేనివి |
21,547 |
75 |
మరుగుదొడ్లు లేనివి |
1,261 |
4 |
వంటపాత్రలు లేనివి |
9,192 |
32 |
ఆట స్థలం లేనివి |
12,768 |
45 |
ప్రహరీ గోడలు లేనివి |
11,028 |
39 |
గ్రంథాలయాలు లేనివి |
888 |
3 |
ఏటా డ్రాపవుట్ రేట్ ఇలా (శాతం)..
కేటగిరీ |
ప్రాథమిక |
ప్రాథమికోన్నత |
మొత్తం |
8 |
6 |
ఎస్సీ |
5 |
3 |
ఎస్టీ |
12 |
7 |
ఒకటో తరగతిలో చేరి 8వ తరగతికి వచ్చేటప్పటికి డ్రాపవుట్ శాతం..
మొత్తం |
31.93 |
ఎస్సీ |
31.38 |
ఎస్టీ |
54.81 |
యూజీసీ నిధులు ఖర్చు చేయలేదు
- తెలుగు వర్సిటీ క్యాంపస్‌ను నిర్మించేందుకు తగిన స్థలం, నిధులు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. యూజీసీ రూ.10.62 కోట్లు కేటాయించి ఆరేళ్లు గడిచినా వాటిని సద్వినియోగపరచుకోలేదు.