Skip to main content

ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2014-15

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వరూపాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మార్చి 12న విడుదల చేసిన ఆర్థిక సర్వేలో ఆవిష్కరించారు. 2014-15 సామాజిక ఆర్ధిక సర్వే ఆధారంగా ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు, సామాజిక ఆర్ధిక స్థితిగతులు, జనాభా, పంటల ఉత్పత్తి, విద్యావకాశాలు తదితర అంశాలను పొందుపరిచారు.

జీఎస్‌డీపీలో సేవా రంగానిదే అగ్రభాగం.. 8.48కి పెరిగిన వృద్ధి రేటు
  • సేవల రంగం పురోగమిస్తుండగా, వ్యవసాయ రంగం తిరోగమనంలో సాగుతోంది. ఒకప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) లోనూ, వృద్ధిరేటులోనూ వ్యవసాయ రంగమే ముందుండేది. క్రమేణా జీఎస్‌డీపీలోనూ, వృద్ధి రేటులోనూ సేవల రంగం దూసుకుపోతోందని రాష్ట్ర, సామాజిక, ఆర్థిక సర్వే నిగ్గుతేల్చింది.
  • 2004- 05 ప్రామాణిక ధరల ప్రకారం 2012- 13 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌డీపీలో వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటు 7.46 ఉండగా.. 2014 - 15 వాస్తవ అంచనాల ప్రకారం వృద్ధి రేటు 5.90కు తగ్గిపోయింది. ఇదే కాలంలో సేవల రంగం వృద్ధి రేటు 6.17 నుంచి 8.48కి పెరిగింది.
  • ఈ కాలంలో జీఎస్‌డీపీలో సేవా రంగం వాటా రూ. 1,26,077 కోట్ల నుంచి రూ.1,49,336 కోట్లకు పెరిగింది. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాల వాటా కూడా రూ. 55,473 కోట్ల నుంచి రూ. 63,414 కోట్లకు పెరిగింది.
  • మరోవైపు జీఎస్‌డీపీ రూ.2,30,240 కోట్ల నుంచి రూ. 2,64,521 కోట్లకు పెరిగింది. 2014- 15 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవసాయం, అనుబంధ (పశుసంపద, అటవీ, మత్స్య) రంగాల వాటా 27.59 శాతం కాగా.. అందులో వ్యవసాయానిదే అగ్రస్థానంగా ఉంది.

  • ఇక పారిశ్రామిక రంగం -4.36 (నెగటివ్ వృద్ధి రేటు) నుంచి 5.25 వృద్ధి రేటుకు చేరడం గమనార్హం.
  • 2013- 14 సంవత్సరానికి సంబంధించి జిల్లా స్థూల ఉత్పత్తి(డీడీపీ)లో విశాఖపట్నం అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లా స్థూల ఉత్పత్తి రూ.65,458 కోట్లు ఉండగా రూ. 55,472 కోట్లతో కృష్ణా, రూ. 46,643 కోట్లతో తూర్పు గోదావరి వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. రూ. 16,386 కోట్లతో విజయనగరం, రూ. 17,846 కోట్లతో శ్రీకాకుళం, రూ. 23,643 కోట్లతో వైఎస్సార్ జిల్లా డీడీపీలో చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి.
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013- 14 ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నుల ఆదాయం రూ.64,123 కోట్లకు పెరిగింది. ఇది 2012- 13తో పోల్చితే ఏడు శాతం ఎక్కువ.
  • 2014 మార్చి మాసాంతానికి మొత్తం అప్పు రూ.1,89,741 కోట్లు. ఇది జీఎస్‌డీపీలో 22.2 శాతం. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎంఏ) అనుమతించిన 28.2 శాతం కంటే ఇది తక్కువ కావడం గమనార్హం.
  • పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక విధానం (2010 -15) కింద 2014 - 15 సంవత్సరంలో గత ఏడాది డిసెంబర్ వరకూ ప్రభుత్వం వివిధ పద్దుల కింద పరిశ్రమలకు రూ.741.84 కోట్లు ప్రోత్సాహకంగా అందించింది. ఇందులో ఇంధన రాయితీ (రీయింబర్స్‌మెంట్) రూ. 420.53 కోట్లు, విలువ ఆధారిత పన్ను రాయితీ రూ. 238.19 కోట్లు ఉంది.
వ్యవసాయంలో 5.9 వృద్ధి నమోదు
  • 2014-15లో వ్యవసాయ రంగంలో రాష్ట్రం 5.9 శాతం వృద్ధి సాధించిందని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. 2013-14లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా రూ.44,418 కోట్లని.. 2021-22 నాటికి రూ.60 వేల కోట్లకు ఇది చేరే అవకాశం ఉందని అంచనా వేసింది.
  • 2014-15లో నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల 554 మి.మీ.ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 374 మి.మీ.లు మాత్రమే కురిసింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల 298 మి.మీ.ల వర్షపాతానికిగానూ కేవలం 173 మి.మీ.ల వర్షపాతం మాత్రమే నమోదైంది.
  • వర్షాభావ పరిస్థితుల వల్ల 2014-15 ఖరీఫ్‌లో 20.38 లక్షల హెక్టార్లలో మాత్రమే రైతులు పంటలు సాగుచేశారు. 2013-14 ఖరీఫ్‌లో 21.90 లక్షల హెక్టార్లలో పంటలు సాగుచేయడం గమనార్హం.
  • కానీ.. 2013-14 ఖరీఫ్‌లో 50.86 లక్షల టన్నుల దిగుబడి రాగా.. 2014-15 ఖరీఫ్‌లో 55.99 టన్నుల దిగుబడి వచ్చింది. అంటే.. ప్రతికూల పరిస్థితుల్లోనూ 10.1 శాతం అధికంగా దిగుబడులు సాధించినట్లు స్పష్టమవుతోంది.
  • 2014-15 ఖరీఫ్‌లో 16.35 లక్షల హెక్టార్లలో వరి పంట సాగైంది. 50.24 టన్నుల ధాన్యం దిగుబడిగా వచ్చింది. కానీ.. 2013-14లో 17.06 లక్షల హెక్టార్లలో వరి సాగుచేసినా.. 43.57 లక్షల టన్నుల దిగుబడి మాత్రమే వచ్చింది.
  • అయితే రబీలో పరిస్థితి తారుమారైంది. 2014-15 రబీలో 18.70 లక్షల హెక్టార్లలో పంటలు సాగుచేశారు. అదే 2013-14 రబీలో 20.91 లక్షల హెక్టార్లలో రైతులు పంటలు వేశారు. 2013-14 రబీలో 66.12 లక్షల టన్నుల దిగుబడి వస్తే.. ఈ ఏడాది రబీలో 55.44 టన్నుల దిగుబడి మాత్రమే వచ్చింది.
  • 2014-15 రబీలో 7.66 లక్షల హెక్టార్లలో వరి పంటను రైతులు సాగుచేసి.. 30.77 లక్షల దిగుబడిని సాధించారు. అదే గతేడాది రబీలో 8.77 లక్షల హెక్టార్లలో వరి సాగుచేసిన రైతులు 36.36 టన్నుల ధాన్యాన్ని దిగుబడిగా సాధించడం గమనార్హం.
  • రాష్ట్రంలో భూకమతాల విస్తీర్ణం 2005-06లో సగటున 1.13 హెక్టార్లు ఉంటే.. 2010-11 నాటికి 1.06 హెక్టార్లకు తగ్గినట్లు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది.
  • రాష్ట్రంలో క్రిమిసంహారక మందుల వినియోగం క్రమేణ తగ్గుతూ వస్తోంది. రైతులు బయో ఫెస్టిసైడ్స్ వైపు మొగ్గు చూపుతుండటమే దీనికి కారణమని ఆర్థిక సర్వే పేర్కొంది.
క్రిమి సంహారక మందులు, బయో ఫెస్టిసైడ్స్ వినియోగం తీరు (టన్నుల్లో)

సంవత్సరం

మందులు

బయోఫెస్టిసైడ్స్

2008-09

4,163

13.20

2009-10

4,048

7.99

2010-11

4,410

8.78

2011-12

882

8.78

2012-13

4,249

10.33

2013-14

4,253

11.19

2014-15

3,895

22.20

  • 5.63 లక్షల హెక్టార్లలో బిందు, తుంపర పద్ధతుల్లో పంటలు సాగుచేస్తున్నారు. సూక్ష్మ నీటిపారుదల పథకం కింద 2003 నుంచి 2014 వరకూ ప్రభుత్వం రూ.2,546 కోట్లను రైతులకు రాయితీగా ఇచ్చింది.
     
  • రాష్ట్రంలో 13 జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు(డీసీసీబీ)ల పరిధిలో 2,037 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సహకార సంఘాల్లో 17.25 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు.


114.43 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి
  • రాష్ట్రంలో 2014-15లో 114.43 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తయ్యాయి. 2013-14లో 116.98 లక్షల టన్నులను ఉత్పత్తి చేశారు. గతేడాది కన్నా ఈ ఏడాది ఆహారధాన్యాల ఉత్పత్తి 4.7 శాతం తగ్గింది.
  • 2013-14లో 42.81 లక్షల హెక్టార్లలో పంటలు సాగుచేస్తే.. 2014-15లో వర్షాభావ పరిస్థితుల వల్ల 39.80 లక్షల హెక్టార్లలోనే పంటలు సాగుచేశారు.
  • పంట రుణాల పంపిణీలో కొత్త రాష్ట్రంలో 2014-15లో రూ.56,019.16 కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. కానీ.. రూ.13,788.60 కోట్ల(22.61 శాతం)ను మాత్రమే పంపిణీ చేశారు.
    Tenth Class
  • ఇందులో రూ.10,108.02 కోట్లు పంట రుణాలు.. రూ.3,680.58 కోట్లు స్వల్పకాలిక రుణాలుపంపిణీ చేసినట్లు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది.
  • 014-15లో వడ్డీలేని రుణాల పథకం కింద రూ.212 కోట్లను రైతులకు రాయితీ ఇవ్వడానికి ప్రభుత్వం కేటాయించింది. కానీ.. కేవలం 123.33 కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేసింది.
  • సెప్టెంబరు, 2014 నాటికి 3.88 లక్షల మంది రైతులకు రూ.37.25 కోట్లను మాత్రమే వడ్డీలేని రుణాలు పథకం కింద రాయితీగా ఇచ్చింది. పావలా వడ్డీ పథకం కింద ఏడు వేల మంది రైతులకు మాత్రమే రూ.13 లక్షల వడ్డీ రాయితీ కల్పించిందని సామాజిక ఆర్థిక సర్వే స్పష్టీకరించింది.
  • దేశంలో పట్టుగూళ్ల ఉత్పత్తిలో కర్ణాటక 1వ స్థానంలో ఉంది. ఏపీ 2వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఏపీలో 1,466.48 టన్నుల పట్టుగూళ్లు ఉత్పత్తి అయ్యాయి.

Tenth Class


రాష్ట్రం అక్షరాస్యత 67.4 శాతం
  • రాష్ట్రంలో అక్టోబరు, 2014 వరకూ ఉపాధి కల్పించాలని కోరుతూ ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజీల్లో నమోదు చేసుకున్న నిరుద్యోగులు 8.80 లక్షలు.
  • రాష్ట్రంలో పేదరికం 9.2 శాతం మాత్రమే ఉన్నట్లు సర్వే స్పష్టీకరించింది.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత శాతం 67.4 శాతం. అంటే.. 32.6 శాతం మంది నిరక్షరాస్యులేనన్న మాట. పురుషుల్లో అక్షరాస్యులు 74.2 శాతం ఉండగా.. మహిళల్లో 60 శాతం మంది ఉన్నారు.
  • పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యులు 79.2 శాతం ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 62.4 శాతం మంది ఉన్నారు. అక్షరాస్యతలో 74.32 శాతంతో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో, 58.89 శాతంతో విజయనగరం చివరి స్థానంలో ఉన్నాయి.


రాష్ట్ర జనాభా 4.95 కోట్లు
  • రాష్ట్ర జనాభా 4.95 కోట్లు. అందులో పురుషులు 2.48 కోట్లు (50.08 శాతం).. మహిళలు 2.47 కోట్లు (49.92) ఉన్నారు. జనాభా పరంగా చూస్తే దేశంలో రాష్ట్రం పదో స్థానంలో ఉంది.
  • 52.85 లక్షల జనాభాతో తూర్పు గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా.. 23.44 లక్షల జనాభాతో విజయనగరం జిల్లా చివర్లో ఉంది.
  • రాష్ట్రంలో 127.19 కోట్ల కుటుంబాలు ఉన్నట్లు.. ఒక్కో కుటుంబంలో సగటున నలుగురు సభ్యులున్నట్లు 2014-15 సామా జిక ఆర్థిక సర్వే అంచనా వేసింది.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 997 మంది మహిళలు ఉన్నారు. (జాతీయ సెక్స్ రేషియో 943 మందే.) 2001 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈ రేషియో 1000: 983 గా ఉంది.
  • విశాఖ, తూర్పు, పశ్చిమ జిల్లాల్లో ఈ రేషియో వెయ్యి కన్నా అధికంగా ఉంది. రాష్ట్రంలో ఎస్సీల్లో సెక్స్ రేషియో 1,007.. ఎస్టీల్లో 1,012 కావడం గమనార్హం.
  • రాష్ట్ర జనాభాలో 17.08 శాతం మంది ఎస్సీలు, 5.33 శాతం మంది ఎస్టీలు ఉన్నారు.
  • ఎస్సీ జనాభా పరంగా చూస్తే 9.57 లక్షల మందితో తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలు ప్రథమ స్థానంలో ఉండగా.. 2.47 లక్షల మందితో విజయనగరం జిల్లా చివరి స్థానంలో ఉంది.
  • ఎస్టీ జనాభా పరంగా చూస్తే 22.57 శాతం మందితో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా.. 2.77 శాతం మందితో వైఎస్సార్ జిల్లా చివరి స్థానంలో ఉంది.


పట్టణ జనాభా 24.23 శాతం
  • 2001 నుంచి 2011 వరకూ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరుగుతూ వస్తోంది. 2001 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 24.23 శాతం. 2011 నాటికి అది 29.47 శాతానికి పెరిగింది.
  • పట్టణ జనాభా అధికంగా ఉన్న జిల్లాల్లో విశాఖపట్నం 47.45 శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా.. 40.81 శాతంతో కృష్ణా జిల్లా రెండో స్థానంలోనూ 16.16 శాతంతో శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో ఉంది.
  • రాష్ట్రంలో జనాభా పరంగా అతి పెద్ద నగరం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కా ర్పొరేషన్ (జీవీఎంసీ). జీవీఎంసీ జనాభా 17.28 లక్షలు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జనాభా 10.34 లక్షలు.


తలసరి ఆదాయం రూ.90,517
  • రాష్ట్ర తలసరి ఆదాయం 2013-14లో రూ.81,397. ఇది 2014-15లో రూ.90,517కు పెరిగింది.
  • డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్(జిల్లా స్థూల ఉత్పత్తి)లో రూ.65,438 కోట్లతో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా.. రూ.55,472 కోట్లతో కృష్ణా రెండో స్థానంలోనూ, రూ.46,643 కోట్లతో తూర్పు గోదావరి జిల్లా మూడో స్థానంలోనూ ఉన్నాయి. రూ.23,643 కోట్లతో వైఎస్సార్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
  • తలసరి ఆదాయంలోనూ విశాఖపట్నం, కృష్ణా జిల్లాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. రూ. 1,24,162 తలసరి ఆదాయంతో విశాఖ జిల్లా అగ్రస్థానంలో ఉండగా 1,04,897తో కృష్ణా, రూ.86,974తో పశ్చిమ గోదావరి వరుసగా ద్వితీ య, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. రూ. 57,174 తలసరి ఆదాయంతో శ్రీకాకుళం చివరి స్థానంలో ఉంది. రూ. 61,157తో విజయనగరం, రూ.64,671తో చిత్తూరు జిల్లాలు తలసరి ఆదాయంలో చివరి నుంచి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
జిల్లాల వారీగా తలసరి ఆదాయం

జిల్లా

తలసరి ఆదాయం (రూ.ల్లో)

విశాఖపట్నం

1,24,162

కృష్ణా

1,04,897

పశ్చిమ గోదావరి

86,974

ప్రకాశం

85,765

గుంటూరు

82,026

నెల్లూరు

80,782

తూర్పు గోదావరి

78,255

వైఎస్సార్

70,821

అనంతపురం

69,562

కర్నూలు

68,197

చిత్తూరు

64,671

విజయనగరం

61,157

శ్రీకాకుళం

57,174



45,831 కి.మీ.ల మేర రోడ్లు
  • రాష్ట్రంలో 45,831 కి.మీ.ల పొడవున రోడ్లు నిర్మించారు. 4,423 కి.మీ.లు జాతీయ రహదారులు, 6,167 కి.మీ.లు రాష్ట్ర రహదారులు, 19,674 కి.మీ.లు జిల్లా ప్రధాన రహదారులు, 15,567 కి.మీ.లు గ్రామీణ రహదారులు ఉన్నాయి.
  • రాష్ట్రంలో జాతీయ రహదారుల సాంద్రత లక్ష జనాభాకు 8.95 కి.మీ.లు. దేశంలో జాతీయ రహదారుల సాంద్రత 7.67 కి.మీ.లు కావడం గమనార్హం.


వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలో కోత
  • రాష్ట్రంలో 10,628.22 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. రైతులకు సరఫరా చేసే ఉచిత విద్యుత్ పథకానికి జూన్, 2014 నుంచి మార్చి, 2015 వరకూ ప్రభుత్వం రూ.2,429.90 కోట్లను ఖర్చు చేసింది.
  • 2014-15లో కొత్తగా 93,494 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. కేవలం 31,945 కనెక్షన్లును మాత్రమే ఇప్పటిదాకా మంజూరు చేసిందని సామాజిక ఆర్థిక సర్వే తేల్చింది.


అటవీ విస్తీర్ణం 21.80 శాతం..
  • రాష్ట్ర విస్తీర్ణంలో 40.96 శాతం (65.61 లక్షల హెక్టార్లు) భూమిలో పంటలు సాగుచేస్తున్నారు. 21.80 శాతం విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి.
  • 12.37 శాతం (19.82 లక్షల హెక్టార్లు) భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నారు. 8.37 శాతం (13.41 లక్షల హెక్టార్లు) బంజరు, వ్యవసాయ యోగ్యం కాని భూములు ఉన్నాయి.


43.90 లక్షల మందికి మధ్యాహ్న భోజనం
  • రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల్లో చదవుతోన్న 43.90 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు.
  • రాష్ట్రంలో విద్యార్థుల డ్రాపౌట్ల (మధ్యలో చదువు మానేస్తున్నవారు) సమస్య ఉంది. 2014-15లో ప్రాథమిక పాఠశాలల్లో 4.60 శాతం, 1-8 తరగతుల్లో 15.74 శాతం, 1-10 తరగతుల మధ్య 25.23 శాతం డ్రాపౌట్లు నమోదయ్యాయి.
  • రాష్ట్రంలో 61,128 పాఠశాలలు ఉండగా వాటిలో 2,84,071 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీటిలో 12,689 ప్రయివేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నా వాటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య 95,143 కావడం గమనార్హం.


ఇతర ముఖ్యాంశాలు
  • బలహీన వర్గాలవారి కోసం ప్రభుత్వం 2012-13లో 2,73,813 ఇళ్లు, 2013-14లో 2,34,151 ఇళ్లను నిర్మించగా తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం 2014-15లో (ఈ ఏడాది జనవరి వరకూ) కేవలం 67,652 ఇళ్లు మాత్రమే నిర్మించింది.
  • బలహీన వర్గాలవారి కోసం 1993-94 సంవత్సరం నుంచి ఈ ఏడాది జనవరి వరకూ 58,09,155 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 51,88,608, పట్టణ ప్రాంతాల్లో 6,20,547 ఇళ్లు ఉన్నాయి.
  • రాష్ట్రంలో 6,71,484 స్వయం సహాయక సంఘాల్లో 71,31,910 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న మొత్తం రూ.3,290 కోట్లకు చేరుకోగా కార్పస్ ఫండ్ రూ.4,340 కోట్లకు చేరుకుంది.
  • బ్యాంకు లింకేజీ విధానం మొదలైనప్పటి నుంచి డ్వాక్రా మహిళలకు డిసెంబర్, 2014 వరకూ రూ.46 వేల కోట్లను రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్) రుణాలు ఇప్పించినట్లు సామాజిక ఆర్థిక సర్వే తేల్చింది.
  • దేశంలో బెరైటీస్, బీచ్ శాండ్‌లు అత్యధికంగా మన రాష్ట్రంలోనే ఉన్నాయి.
  • 2013-14లో రాష్ట్ర ఖజనాలో రూ.రూ.884.64 కోట్లు ఖనిజాదాయం రూపంలో చేరింది. 2014-15లో రూ.1,235.48 కోట్ల మేర ఖనిజాదాయం వచ్చింది.
  • కోడి గుడ్ల ఉత్పత్తిలో దేశంలో ఏపీ రెండో స్థానంలో ఉంది. ఏటా 1,272.69 కోట్ల కోడిగుడ్లు రాష్ట్రంలో ఉత్పత్తవుతున్నాయి. 4.89 లక్షల మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పతితో దేశంలో 4వ స్థానంలో ఉంది.
  • ఏటా 90.83 లక్షల టన్నుల పాలను మన రాష్ట్రం ఉత్పత్తి చేస్తోంది. పాల ఉత్పత్తిలో దేశంలో మన రాష్ట్రానిది ఏడో స్థానం. రొయ్యలు, చేపల ఉత్పత్తిలో దేశంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది.
  • రాష్ట్రంలో 572 మండలాల్లో భూగర్భ జలమట్టం సంతృప్తికరంగా ఉంది. 42 మండలాల్లో ఆందోళనకరంగా ఉన్నట్లు తేలింది.
  • రాష్ట్రంలో 6,200 షెడ్యూల్డ్ బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో రూ.1,73,379 కోట్లను ప్రజలు డిపాజిట్లు చేశారు.
  • సెప్టెంబర్, 2014 నాటికి ఈ బ్యాంకుల ద్వారా రూ.2,08,008 కోట్లను రుణాలుగా తీసుకున్నారు. రుణాలు, డిపాజిట్ల నిష్పత్తి రాష్ట్రంలో 119.97 శాతం ఉందని సామాజిక ఆర్థిక సర్వే తేల్చింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఇది 60 శాతానికి మించకూడదు.
  • రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా 1.01 కోట్ల ఎకరాలకు ప్రభుత్వం సాగునీటి సదుపాయం కల్పించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 54 ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా 21.18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు మరో 48.55 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీరందించవచ్చు.
Published date : 14 Mar 2015 03:01PM

Photo Stories