Andhra Pradesh Budget 2023-24 Highlights: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023-24
సుస్థిరాభివృద్ధే ప్రభుత్వ విధానమని, ఇందుకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ 2023–24 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. జీవనోపాధి, సాధికారత, సామాజిక భద్రత, పారిశ్రామికాభివృద్ధే ప్రధానం అని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా 2023–24 సంవత్సరానికి రూ.2.79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను మార్చి 16న ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన అనే సూత్రాల సమ్మేళనంగా మేనిఫెస్టోను రూపొందించామని, అధికారం చేపట్టిన తొలి సంవత్సరమే 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అమలు చేశామని తెలిపారు. కోవిడ్ వంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ నాలుగేళ్లల్లో గణనీయమైన పురోగతిని సాధించామన్నారు.
ఈ నాలుగేళ్లలో 15,004 గ్రామ,వార్డు సచివాలయాల ఏర్పాటు, 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల నియామకం, 2.65 లక్షల మంది వలంటీర్ల నియామకం, 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడంతో పాటు 15,715 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచామని చెప్పారు. 3,707 వైఎస్సార్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, 461 పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం, 30.65 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు. దాదాపు 21 పథకాల ద్వారా లబ్ధిదారులకు నాలుగేళ్లల్లో డీబీటీ ద్వారా రూ.1.97 లక్షల కోట్లు జమ చేశామన్నారు. 2023–24లో డీబీటీ విధానంలో రూ.54,228 కోట్లు పంపిణీ చేసే విధంగా కేటాయింపులు చేశామని చెప్పారు. 2018–2019 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల ప్రకారం మన జీఎస్‌డీపీ వృద్ధి రేటులో మన రాష్ట్రం దేశంలోనే 22వ స్థానంలో ఉండగా, వైఎస్ జగన్ ప్రభుత్వం అభివృద్ధి విధానాల కారణంగా 2021–2022లో 11.43 శాతం వృద్ధితో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు.
వచ్చే ఏడాది జీఎస్‌డీపీ 10% వృద్ధితో రూ.14,49,501 కోట్లకు చేరుతుందని అంచనాగా ఉందన్నారు. రైతులకు చేదోడుగా ఉంటూ గత నాలుగేళ్లల్లో వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద ఇప్పటి వరకు రూ.27,063 కోట్లు రైతుల ఖాతాల్లో వేయడమే కాకుండా వచ్చే ఏడాది కోసం రూ.4,020 కోట్లు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద ఇప్పటి వరకు రూ.6,872 కోట్లు ఇవ్వగా, వచ్చే ఏడాది కోసం రూ.1,600 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.3,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మంత్రి బుగ్గన ఇంకా ఏం చెప్పారంటే..
పారిశ్రామిక మౌలిక
వసతులకు పెద్ద పీట
☛ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతికి పెద్ద పీట వేస్తోంది. విశాఖలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు వచ్చిన అద్భుతమైన స్పందనే ఇందుకు నిదర్శనం. ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్, జిందాల్ స్టీల్ అండ్ వపర్, భారత్ బయోటెక్, జీఎంఆర్ గ్రూప్, దాల్మియా గ్రూప్, రెన్యూ పవర్, బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్, సెంచురీ ప్లైబోర్డ్స్, శ్రీ సిమెంట్, రామ్‌కో సిమెంట్స్, అపోలో హాస్పిటల్స్‌తోపాటు అనేక ప్రముఖ పారిశ్రామిక సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి.
☛ ఈ సదస్సులో 48 దేశాల నుంచి రాయబారులు, దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సు ద్వారా రూ.13.42 లక్షల కోట్ల పెట్టుబడులతో 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించే అవకాశం కలిగింది. 378 అవగాహన ఒప్పందాలు కుదరడం ఎంతో గర్వించదగ్గ విషయం.
☛ విశాఖ–చెన్నై కారిడార్‌లో పారిశ్రామిక క్లస్టర్స్‌తో పాటు ఎంఎస్‌ఎంఈ యూనిట్లను ప్రోత్సహించేలా బడ్జెట్లో కేటాయింపులు చేస్తున్నాం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలు, వాణిజ్యం కోసం రూ.2,602 కోట్లు కేటాయిస్తున్నాం.
రవాణా, రహదారుల మౌలిక సదుపాయాలు
☛ రాష్ట్రంలో దాదాపు 32,725 కిలోమీటర్ల మేర ప్రధాన జిల్లా రహదారులు, జిల్లాల్లోని ఇతర రోడ్ల నిర్వహణతోపాటు 4,000 కిలోమీటర్ల పొడవున ఉన్న బి.టి.రోడ్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకున్నాం.
☛ రూ.400 కోట్లతో దెబ్బతిన్న రోడ్ల నిర్వహణ, అత్యవసర మరమ్మతులను ప్రభుత్వం చేపట్టింది. రూ.2,205 కోట్లతో 8,268 కి.మీ.రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులను అభివృద్ధి చేశాం. రహదారుల అనుసంధాన ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు 437.59 కి.మీ.పొడవుగల రోడ్లకు సంబంధించి రూ.391 కోట్లతో 46 పనులు మంజూరయ్యాయి. డిసెంబర్ 2022 నాటికి 383.66 కి.మీ. మేర రహదారి పనులు పూర్తయ్యాయి.
☛ 2023–24 ఆర్థిక సంవత్సరానికి రవాణా, రహదారులు, భవనాల శాఖకు రూ.9,118 కోట్లు కేటాయిస్తున్నాం. పేదరిక నిర్మూలన, ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను అందించడమే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. దీనికి అనుగుణంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యంతో 2023–24 బడ్జెట్‌ను సభ ఆమోదం కోసం ప్రవేశ పెడుతున్నాం.
ఏటా 50,000 మందికి నైపుణ్య శిక్షణ
☛ స్థానిక యువతకు ఉపాధి లభించేలా నైపుణ్య శిక్షణకు పెద్ద పీట వేస్తున్నాం. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో కనీసం ఒక స్కిల్ హబ్ చొప్పున మొత్తం 192 నైపుణ్య కేంద్రాలు, జిల్లా కేంద్రంలో ఒక స్కిల్ కాలేజీ, రాష్ట్ర స్థాయిలో స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఏటా 50,000 మందికి శిక్షణ ఇప్పించేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. ఇందుకోసం 154 కార్పొరేట్స్‌తో 18 రంగాల్లో శిక్షణ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాం.
☛ వచ్చే ఏడాది నైపుణ్య శిక్షణ కోసం రూ.1,166 కోట్లు కేటాయిస్తున్నాం. పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తున్నాం. రూ.22,000 కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా 181 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద 2023 సంవత్సరం చివరి నాటికి 30.2 లక్షల శాశ్వత గృహాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకోసం 2023–24 సంవత్సరానికి రూ.5,600 కోట్లు కేటాయిస్తున్నాం.
బడ్జెట్ ఇలా..
➤ మొత్తం ఆదాయం రూ.2,79,279.27 కోట్లు
➤ కేంద్ర పన్నుల వాటా రూపంలో రూ.41,338.02 కోట్లు
➤ కేంద్ర గ్రాంట్లు రూ.46,834.64 కోట్లు
➤ రెవెన్యూ లోటు రూ.22,316.70 కోట్లు
➤ ద్రవ్య లోటు రూ.54,587.52 కోట్లు
రంగాల వారీగా బడ్జెట్ ఇలా..(రూ.కోట్లలో)
ఆర్థిక సేవలకు కేటాయింపులు
వ్యవసాయ, అనుబంధ సర్వీసులకు |
14,043.63 |
గ్రామీణాభివృద్ధి |
17,531.79 |
జలవనరులు, వరద నియంత్రణ |
11,908.10 |
ఇంధన |
6,546.21 |
పరిశ్రమలు, మినరల్స్ |
2,602.12 |
రవాణా |
10,322.57 |
శాస్త్ర సాంకేతిక, పర్యావరణం |
18.85 |
సాధారణ ఎకో సేవలు |
4,617.78 |
మొత్తం |
67,591.05 |
సామాజిక సేవలకు..
సాధారణ విద్య |
32,198.39 |
క్రీడలు, యువజన సర్వీసులు |
137.99 |
సాంకేతిక విద్య |
512.37 |
సాంస్కృతిక, కళలు |
26.34 |
వైద్యం |
15,882.34 |
తాగునీరు, పారిశుద్ధ్యం |
2,200.39 |
గృహ నిర్మాణం |
6,291.70 |
పట్టణాభివృద్ధి |
9,381.54 |
సమాచార శాఖ |
294.38 |
సంక్షేమం |
51,345.89 |
కార్మిక, ఉపాధి |
1,051.10 |
సామాజిక భద్రత, సంక్షేమం |
3,960.50 |
మొత్తం |
1,23,282.93 |
➤ సాధారణ సేవలు 88,405.29
➤ మొత్తం 2,79,279.27
ఐదవసారీ అదే దారి..
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా అన్ని వర్గాల అభ్యున్నతికి అండగా నిలిచే అభివృద్ధి, సంక్షేమ సమతుల్యతతో కూడిన బడ్జెట్‌ను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మార్చి 16న అసెంబ్లీకి సమర్పించింది. జెండర్ బేస్డ్ బడ్జెట్ ద్వారా సమాజంలో సగం ఉన్న మహిళలకు ప్రత్యేక కేటాయింపులు చేశారు. పిల్లలకు కూడా ప్రత్యేక కేటాయింపులు చేయడం విశేషం. అన్ని రంగాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనగా వరుసగా ఐదోసారి రూ.2,79,279.27 కోట్లతో 2023–24 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీకి సమర్పించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,28,540.71 కోట్లుగా, మూల ధన వ్యయం రూ.31,061 కోట్లుగా ఉంటుందని అంచనా వేసినట్లు బుగ్గన పేర్కొన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.23,316.70 కోట్లు రెవెన్యూ లోటు, రూ.54,587.52 కోట్లు ద్రవ్య లోటు ఉంటుందని అంచనా వేశామని తెలిపారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 3.77 శాతం, ద్రవ్యలోటు 1.54 శాతం ఉంటుందని, రెవెన్యూ ఆదాయం రూ.2,06,224.01 కోట్లుగా అంచనా వేశామన్నారు. ఇందులో కేంద్ర పన్నుల వాటా నుంచి రూ.41,338.02 కోట్లు వస్తాయని, కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.46,834.64 కోట్లు వస్తాయని అంచనా వేసినట్లు తెలిపారు.రెవెన్యూ లోటుతో పాటు ద్రవ్య లోటును అదుపులో పెట్టే చర్యలు తీసుకున్నట్లు బడ్జెట్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంతకు ముందు ఉదయం 8 గంటలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశమై 2023–24 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.
నవరత్నాలకు పెద్దపీట
ఎప్పటిలాగే మేనిఫెస్టోలోని నవరత్నాల పథకాల కొనసాగింపునకు బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలతో పాటు మైనార్టీ యాక్షన్ ప్రణాళిక పేరుతో భారీ ఎత్తున నిధులు కేటాయించారు. మొత్తం మీద రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజానీకాన్ని సంతృప్తి పరిచే స్థాయిలో బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. మరో పక్క వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, సాగునీటి రంగాల్లో మౌలిక రంగాలకు పెద్ద పీట వేశారు. బడ్జెట్‌లో ఎక్కడా దాపరికాలు లేకుండా పూర్తి పారదర్శకత ప్రదర్శించారు. ఏయే రంగాల్లో ఏయే పథకాలకు ఎన్ని నిధులు కేటాయించింది స్పష్టంగా వివరించారు. అవ్వా తాతల సామాజిక పెన్షన్లను వచ్చే ఏడాది జనవరిలో నెలకు 3 వేల రూపాయలు చేస్తామని ప్రకటించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వైఎస్సార్ పెన్షన్ కానుకకు ఏకంగా రూ.21,434 కోట్లు కేటాయించారు. నవరత్న పథకాల్లోని అన్ని వర్గాలకు బడ్జెట్ కేటాయింపులు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, మైనార్టీ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందజేసే అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంక్షేమ పథకాలన్నింటినీ ఆయా సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా అమలు చేస్తామని స్పష్టం చేసింది.
సచివాలయాలకు కేటాయింపులు
చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, మత్స్యకారులు, దర్జీలు, చేనేత కార్మికులు, కాపులు, లాయర్లకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. గ్రామ, వార్డు వలంటీర్లు.. గ్రామ, పట్టణ సచివాలయాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. నేరుగా నగదు బదిలీ చేసే 22 నవరత్నాల పథకాలకు బడ్జెట్‌లో రూ.54,228 కోట్లు కేటాయించారు. మహిళల పథకాలకు ప్రత్యేకంగా రూ.77,914.43 కోట్లు, పిల్లల పథకాలకు ప్రత్యేకంగా రూ.20,593.38 కోట్లు కేటాయించారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.38,605 కోట్లు, ఎస్సీ ఉప ప్రణాళికకు రూ.20,005 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళికకు రూ.6,929 కోట్లు, మైనార్టీ కాంపొనెంట్‌కు రూ.4,203 కోట్లు కేటాయించారు. సంక్షేమానికి రూ.51,345 కోట్లు, సాధారణ విద్యా రంగానికి రూ.32,198 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.15,882 కోట్లు, వ్యవసాయ అనుంబంధ రంగాలకు రూ.14,043 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.17,531 కోట్లు కేటాయించారు.
రైతుల సంక్షేమంపై శ్రద్ధ
రైతుల సంక్షేమంపై శ్రద్ధ చూపుతూ బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. రైతులకు సంబంధించిన అన్ని పథకాలకు కేటాయింపులు కొనసాగించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా జల వనరుల శాఖకు రూ.11,908 కోట్లు కేటాయించారు. మన బడి నాడు–నేడు కార్యక్రమానికి రూ.3500 కోట్లు.. వైద్య ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమానికి రూ.2214.21 కోట్లు కేటాయించారు. పేదల గృహ నిర్మాణాలకు రూ.6291.70 కోట్లు, కాపుల సంక్షేమానికి రూ.4,887 కోట్లు, వైఎస్సార్ ఈబీసీ నేస్తంకు రూ.610 కోట్లు కేటాయించారు. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం రూ.6,546 కోట్లు, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీకి రూ.2,400 కోట్లు, గడప గడపకు మన ప్రభుత్వానికి రూ.532 కోట్లు కేటాయించారు.
2022–23 సవరించిన అంచనాలు
2022–23 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం మొత్తం బడ్జెట్ వ్యయం రూ.2,40,509.34 కోట్లుగా ఉంటుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. రెవెన్యూ వ్యయం రూ.2,05,555.95 కోట్లు కాగా, మూల ధన వ్యయం రూ.16,846.69 కోట్లు అని తెలిపారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు రూ.29,107 కోట్లు కాగా, ఇదే కాలానికి ద్రవ్యలోటు రూ.47,716 కోట్లు అని చెప్పారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 2.21 శాతం కాగా, ద్రవ్య లోటు 3.62 శాతంగా ఉందని పేర్కొన్నారు.
2022–23 సవరించిన అంచనాలు – 2023–24 ప్రతిపాదనల మేరకు నగదు బదిలీ పథకాల కేటాయింపులు (రూ.కోట్లలో)
పథకం పేరు |
2022–23 |
2023–24 |
వైఎస్సార్ పెన్షన్ కానుక |
17,850.71 |
21,434.72 |
వైఎస్సార్ రైతు భరోసా |
3,988.52 |
4,020.00 |
జగనన్న విద్యా దీవెన |
2,841.64 |
2,841.64 |
జగనన్న వసతి దీవెన |
2,083.32 |
2,200.00 |
వైఎస్సార్–పీఎం ఫసల్ బీమా యోజన |
2,943.21 |
1,600.00 |
వైఎస్సార్ వడ్డీ లేని రుణాలు (పొదుపు సంఘాలు) |
600.00 |
700.00 |
వైఎస్సార్ వడ్డీ లేని రుణాలు (పట్టణ పొదుపు సంఘాలు) |
236.10 |
300.00 |
వైఎస్సార్ వడ్డీ లేని రుణాలు (రైతులు) |
286.34 |
500.00 |
వైఎస్సార్ కాపు నేస్తం |
536.09 |
550.00 |
వైఎస్సార్ జగనన్న చేదోడు |
346.08 |
350.00 |
వైఎస్సార్ వాహన మిత్ర |
270.76 |
275.00 |
వైఎస్సార్ నేతన్న నేస్తం |
199.07 |
200.00 |
వైఎస్సార్ మత్స్యకార భరోసా |
123.09 |
125.00 |
మత్స్యకారులకు బోట్లకు డీజిల్ సబ్సిడీ |
53.31 |
50.00 |
రైతులకు ఎక్స్గ్రేషియా |
20.00 |
20.00 |
వైఎస్సార్ లా నేస్తం |
15.00 |
17.00 |
జగనన్న తోడు |
31.46 |
35.00 |
ఈబీసీ నేస్తం |
9.43 |
610.00 |
వైఎస్సార్ కళ్యాణమస్తు |
50.00 |
200.00 |
వైఎస్సార్ ఆసరా |
4,000.00 |
6,700.00 |
వైఎస్సార్ చేయూత |
5,007.26 |
5,000.00 |
అమ్మ ఒడి |
5,749.04 |
6,500.00 |
పొలానికి బలం.. కేటాయింపుల్లో అన్నదాతకు అగ్రతాంబూలం
వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.41,436.29 కోట్ల కేటాయింపులతో 2023–24 వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ‘స్వేదాన్ని చిందించి సిరులు పండిస్తున్న రైతన్నను చేయిపట్టి నడిపించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న తపనతో శ్రమిస్తున్న సీఎం జగన్ చిత్తశుద్ధిని చూసి ప్రకృతి పరవశిస్తోంది. వరుణుడు హర్షించి వర్షిస్తుండడంతో రైతు మోములో చెరగని చిరునవ్వులు విరబూస్తున్నాయి’ ఆయన అన్నారు. ఇంకా మంత్రి ఏమన్నారంటే..
జాతీయ వృద్ధి రేటు కంటే మిన్నగా..
దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న దివంగత వైఎస్సార్ కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తుండడంతో వ్యవసాయ రంగంలో అగ్రపథాన ఉన్నాం. 2021–22లో జాతీయ వృద్ధిరేటు 10 శాతం కాగా మన రాష్ట్రం 13.07 శాతం వృద్ధి సాధించింది. 2022–23లో జాతీయ వృద్ధి రేటు 11.2 శాతం కాగా మన రాష్ట్రంలో 13.18 శాతం నమోదైంది. రాష్ట్ర జీఎస్‌డీపీ పరిశీలిస్తే 2018–19లో రూ.2.70 లక్షల కోట్లు ఉండగా 2022–23లో రూ.4.40 లక్షల కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 1.70 లక్షల కోట్లు అధికంగా జీఎస్‌డీపీ నమోదైంది.
44 నెలల్లో రూ.1.54 లక్షల కోట్లు
గత 44 నెలల్లో వ్యవసాయం, ఇతర అనుబంధ రంగాలకు రూ.1.54 లక్షల కోట్లు ఖర్చు చేశాం. వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా రూ.27,062.09 కోట్లు అందించాం. సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీకి రూ.1442.66 కోట్లు, వైఎస్సార్ ఉచిత పంటల బీమాకి రూ.6,684.84 కోట్లు, పంట నష్ట పరిహారానికి రూ.1,911.81, ధాన్యం కొనుగోలుకు రూ.55,401.58 కోట్లు ఇతర పంటల కొనుగోలుకు రూ.7,156 కోట్లు, శనగ రైతుల బోనస్‌కు రూ.300 కోట్లు, ఆర్బీకే స్థాయిలో యంత్ర పరికరాల ఏర్పాటుకు సబ్సిడీ రూపంలో రూ.240.67 కోట్లు, సాగుకు పగటి పూట విద్యుత్ సరఫరా, ఫీడర్ల సామర్థ్యం పెంచడం, విద్యుత్తు రంగం బలోపేతానికి రూ.53,456 కోట్లు ఖర్చు చేశాం.
వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయింపులు (రూ.కోట్లలో)
కర్షక దేవాలయాలుగా ఆర్బీకేలు
గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన 10,778 ఆర్బీకేలను ఉత్పాదకుల విక్రయ, విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దాం. 535 ఆర్బీకేలకు సొంత భవనాలుండగా 1,513 భవనాల నిర్మాణం పూర్తైంది. 8730 భవనాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు, విదేశాలు సైతం ఏపీ విధానాలను ప్రశంసిస్తున్నాయి. 2022–23 ఎఫ్‌పీఓ చాంపియన్ అవార్డుకు ఆర్బీకేలు నామినేట్ కావడం గర్వకారణం. 2 లక్షల సబ్‌ౖస్క్రెబర్స్‌తో ఆర్బీకే యూట్యూబ్ చానల్, లక్ష మంది చందాదారులతో రైతు భరోసా మాసపత్రిక ఆదరణ పొందాయి.
రికార్డు స్థాయి దిగుబడులు
సీఎం జగన్ పగ్గాలు చేపట్టిన తొలి ఏడాదే రికార్డు స్థాయిలో 175 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు వచ్చాయి. 2021–22లో గులాబ్ తుపాన్, అధిక వర్షాలు కురిసినప్పటికీ 155 లక్షల టన్నులు నమోదు కాగా 2022–23లో 169 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేస్తున్నాం. వైఎస్సార్ ఉచిత పంటల బీమా తరహా పథకం దేశంలోనే ఎక్కడా లేదు. పంట సాగు చేసి ఈ–క్రాప్‌లో నమోదైతే చాలు రైతుల ఖాతాలోనే బీమా పరిహారం సొమ్ములు జమ చేస్తున్నాం.
కేంద్ర పథకాలకు కేటాయింపులు.. (రూ.కోట్లలో)
కరువు ఛాయలే లేవు
చంద్రబాబు హయాంలో ఏటా 100కు పైగా మండలాలు కరువు బారినపడితే ఇప్పుడు ఒక్క మండలం కూడా కరువు ఛాయల్లో లేదు. ఇప్పటిదాకా రూ.6.01 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలిచ్చాం. పంటసాగుదారుల హక్కు చట్టం తెచ్చాం. 9.20 లక్షల మందికి రూ.6,229.28 కోట్ల పంట రుణాలిచ్చాం. దురదృష్టవశాత్తు ఆత్మహత్యలకు పాల్పడే రైతన్నల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నాం.
ఉద్యాన హబ్‌గా రాష్ట్రం
ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, కొబ్బరి, మిరప సాగు, దిగుబడుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. 314.78 లక్షల టన్నులతో దేశీ పండ్ల ఉత్పత్తిలో 15.60 శాతం వాటాతో దూసుకెళ్తోంది. 2022లో వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ఐదుగురు ఉద్యాన రైతులు దక్కించుకున్నారు. ఉద్యాన రంగం 10.56 శాతం వృద్ధి నమోదు చేసింది. సూక్ష్మసాగు నీటిపథకం కింద 2022–23లో 1.38 లక్షల ఎకరాల్లో తుంపర, బిందు పరికరాలను అమర్చాం. ఆయిల్ సాగు విస్తరణను ప్రోత్సహించేందుకు మొక్కలు నాటేందుకు ఇచ్చే రాయితీని హెక్టార్‌కు రూ.12 వేల నుంచి రూ.29 వేలకు పెంచాం. పాత తోటల పునరుద్ధరణ కోసం ఒక్కో మొక్కకు రూ.250 చొప్పున ప్రత్యేక సాయం ఇస్తున్నాం.
యూనివర్శిటీలకు కేటాయింపులు... (రూ.కోట్లలో)
రైతులకు వ్యక్తిగత పరికరాలు
ఈ ఏడాది 7 లక్షల మంది రైతులకు 50 శాతం రాయితీపై రూ.450 కోట్లతో టార్పాలిన్లు, స్ప్రేయర్లు అందచేస్తాం. దశలవారీగా పది వేల ఆర్బీకేల్లో కిసాన్ డ్రోన్లను అందుబాటులోకి తెస్తాం. అందులో భాగంగా రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్లతో 2 వేల కిసాన్ డ్రోన్లను 40 శాతం రాయితీపై అందుబాటులోకి తెస్తాం. నియోజకవర్గ స్థాయిలో 147, జిల్లా స్థాయిలో 9 ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌తో పాటు రీజనల్ స్థాయిలో 4 కోడింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రాగులు, సజ్జలు, జొన్నలకు మాత్రమే కనీస మద్దతు ధర ప్రకటిస్తే మిగిలిన చిరుధాన్యాలకు క్వింటాల్‌కు రూ.2500 చొప్పున ఎమ్మెస్పీ ప్రకటించాం. హెక్టార్‌కు రూ.6 వేల ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం. పట్టు సాగు విస్తరణ కోసం ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 90 శాతం రాయితీ అందిస్తున్నాం. సీఎం యాప్ ద్వారా పంట ఉత్పత్తులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట మార్కెట్‌లో జోక్యం చేసుకొని రైతులకు అండగా నిలుస్తున్నాం. మత్స్యకార భరోసా కింద గతేడాది 1.05 లక్షల మందికి రూ.106 కోట్ల నిషేధ భృతిని అందజేశాం. రూ.3,605.89 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తున్నాం.
రంగాలవారీగా కేటాయింపులు రూ.కోట్లల్లో
ఏపీ సీడ్స్‌కు అవార్డుల పంట
ఆర్బీకేల ద్వారా 2022–23లో 12.56 లక్షల రైతులకు 7.17 లక్షల క్వింటాళ్ల రూ.202.66 కోట్ల రాయితీపై పంపిణీ చేశాం. పారదర్శకంగా అందించిన ఏపీ సీడ్స్‌కు పలు అవార్డులు దక్కాయి. ఆర్బీకేల ద్వారా ఈ ఏడాది 5 లక్షల మట్టి నమూనాలు సేకరించి విశ్లేషణ ఫలితాలతో ప్రతీ రైతుకు సాయిల్ హెల్త్ కార్డులు అందచేస్తాం. ఆర్బీకేల ద్వారా రూ.440 కోట్ల విలువైన ఎరువులందించాం. బస్తాపై రూ.10 నుంచి రూ.20 వరకు తగ్గించాం. వచ్చే ఏడాది 10 లక్షల టన్నుల ఎరువులు, సూక్ష్మపోషకాలను ఆర్బీకేల ద్వారానే పంపిణీ చేస్తాం.
దుర్గగుడి అభివృద్ధికి రూ.20 కోట్లు
విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (దుర్గగుడి)లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.20 కోట్లు కేటాయింపులు చేస్తూ ప్రతిపాదించింది. ‘గ్రాంట్స్ ఇన్ ఎయిడ్’ కేటగిరీలో ఈ నిధులను కేటాయింపులు జరుపుతున్నట్లు ఉదహరించారు. మరోవైపు, దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే అర్చకుల సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు బడ్జెట్లో రూ.120 కోట్లు కేటాయింపులు చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదించింది.
హోం శాఖకు నిధుల వరద
2023–24 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం హోం శాఖకు రూ.8,206.57 కోట్లు కేటాయించింది. గతేడాది కేటాయించిన రూ.7,586.83 కోట్ల కంటే ఈ ఏడాది రూ.619.74 కోట్లు అధికంగా కేటాయించడం విశేషం. పోలీస్ దళాల ఆధునికీకరణకు రూ.50 కోట్లు, దర్యాప్తు వ్యవస్థను బలోపేతం చేస్తూ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లకు రూ.34 కోట్లు, ‘దిశ’వ్యవస్థకు రూ.15 కోట్లు కేటాయించింది.
ప్రాజెక్టులకు నిధుల పరవళ్లు..
సాగునీటి ప్రాజెక్టులకు 2023–24 వార్షిక బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.11,908.10 కోట్లను కేటాయించింది. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించిన సీఎం వైఎస్ జగన్ గతేడాది పెన్నా డెల్టా జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజీలను పూర్తి చేసి సెప్టెంబరు 6న జాతికి అంకితం చేయడం తెలిసిందే. తద్వారా పెన్నా డెల్టాలో 4.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమర్థంగా నీళ్లందేలా జలయజ్ఞం ఫలాలను రైతులకు అందించారు. ఈ ఏడాదీ ప్రాధాన్యతగా గుర్తించిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వీలుగా నిధులు కేటాయించారు. ఉత్తరాంధ్రలో కీలకమైన వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం పనులు పూర్తయ్యేలా తగినన్ని నిధులు కేటాయించారు. వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ, గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు సొరంగం పనుల పూర్తికి నిధులు కేటాయించారు. హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలను మళ్లించి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో 68 చెరువులను నింపి సాగు, తాగునీటిని అందించే పథకాన్ని పూర్తి చేయడానికి అవసరమైన నిధులను కేటాయించారు.
పోలవరంపై ప్రత్యేక దృష్టి..
పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. కేంద్రం రూ.3 వేల కోట్లకుపైగా రీయింబర్స్ చేయడంలో జాప్యం చేస్తున్నా రాష్ట్రమే నిధులను వెచ్చిస్తోంది. ఈ బడ్జెట్లోనూ పోలవరంకు సింహభాగం నిధులు రూ.5,042.47 కోట్లు కేటాయించింది. చంద్రబాబు నిర్వాహకాలతో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతతో ఏర్పడిన అగాధాల పూడ్చివేత పద్ధతులపై డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ సూచనల మేరకు దృష్టి పెట్టాం. తర్వాత వరదల్లోనూ ప్రధాన డ్యామ్ పనులు చేపట్టి సత్వరమే పూర్తి చేసేలా అడుగులు వేస్తోంది.
జలయజ్ఞం ఫలాలే లక్ష్యంగా..
సాగునీటి ప్రాజెక్టుల పనులపై ఖర్చు పెట్టే ప్రతి పైసా రైతుల జీవనోపాధులను పెంచడానికి దోహదం చేసేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. తోటపల్లి, పుష్కర, తాటిపూడి, తెలుగుగంగ, శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్బీసీ), గుండ్లకమ్మ తదితర ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన ఆయకట్టుకు నీళ్లందించే ఉప కాలువలు, పిల్ల కాలువలను పూర్తి చేయడానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు చేశాం. ఉత్తరాంధ్రలో కీలకమైన తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి వీలుగా నిధులు కేటాయించింది. కర్ణాటక పరిధిలో తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల ఆధునికీకరణ పూర్తి చేసి రాష్ట్ర కోటా నీటిని పూర్తి స్థాయిలో రాబట్టి రాయలసీమ రైతులకు నీళ్లందించడమే లక్ష్యంగా తుంగభద్ర బోర్డుకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చింది.
ప్రాజెక్టుల వారీగా నిధుల కేటాయింపులు (రూ.కోట్లలో)
చదువుకు బడ్జెట్ భరోసా..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.32,921 కోట్లను కేటాయించింది. ఇందులో పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యలకు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులను కేటాయించింది. పాఠశాల, ఉన్నత విద్యలకు కలిపి సాధారణ విద్య పద్దు కింద రూ.32,198.39 కోట్లు, సాంకేతిక, విద్య పద్దు కింద రూ.512.37 కోట్లుగా ఉంది. వీటితో పాటు నైపుణ్యాభివృద్ధికీ నిధులు కేటాయించింది. మరోవైపు.. విద్యార్థులకు సంక్షేమ విభాగాల ద్వారా అందించే జగనన్న విద్యాదీవెన (రూ.2,841 కోట్లు), జగనన్న వసతి దీవెన (రూ.2,200 కోట్లు).. అమ్మఒడి (రూ.6,500 కోట్లు) పథకాల నిధులు రూ.11,541 కోట్లను కూడా కలుపుకుంటే ఈ కేటాయింపులు మరింత పెరుగుతాయి.
ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతం
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ విద్యారంగానికి అరకొర కేటాయింపులు చేసి ఆ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చింది. కానీ, ప్రస్తుత సర్కారు ప్రభుత్వ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ అందుకు తగ్గట్లుగా నిధులూ కేటాయిస్తోంది. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడమే కాకుండా అందులో చదువుకునే పేద విద్యార్థులకు అనేక రకాల కార్యక్రమాలు అమలుచేయిస్తూ అండదండలు అందిస్తోంది.
అమ్మఒడి, గోరుముద్ద, విద్యాకానుక..
జగనన్న అమ్మఒడి కింద రానున్న ఏడాదిలో కూడా రూ.6,500 కోట్లను విద్యార్థుల తల్లులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. జగనన్న గోరుముద్ద కింద రూ.1,164 కోట్లను ప్రతిపాదించింది. ఇందులో అచ్చంగా అదనపు మెనూ కోసమే రూ.611.23 కోట్లను ప్రభుత్వం కేటాయించడం గమనార్హం. ఇక జగనన్న విద్యాకానుక కింద రూ.560 కోట్లను ఖర్చు చేయనుంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మనబడి నాడు–నేడు కార్యక్రమం కోసం రూ.3,500 కోట్లను అందించనుంది. ఇంటర్మీడియెట్ విద్యకు రూ.779.47 కోట్లు అందించనుంది.
ఉన్నత విద్య మరింత బలోపేతం
ఉన్నత విద్యను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేసింది. 2023–24 బడ్జెట్‌లో ఈ రంగానికి గతంలో కన్నా ఎక్కువ కేటాయింపులు చేసింది. వర్సిటీలు, కాలేజీ విద్య, సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి విభాగాలకు ఇతోధికంగా నిధులను కేటాయించింది. అత్యున్నత నైపుణ్యాలతో ప్రపంచస్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్రంలోని విద్యార్థులను తీర్చిదిద్దాలన్నది సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష. అందుకనుగుణంగా ఉన్నత విద్యారంగానికి బడ్జెట్‌లో సముచిత స్థానం కల్పిస్తూ నిధులు కేటాయించారు. ఉన్నత విద్యలోని అన్ని విభాగాలకు రూ.2,064.71 కోట్లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు రూ.1,166.64 కోట్లు కలిపి మొత్తంగా రూ.3,231.35 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
2021–22లో ఉన్నత విద్యకు ప్రభుత్వం రూ.1,973.15 కోట్లు కేటాయించింది. ఆ ఏడాది కేటాయింపులకన్నా అధికంగా రూ.2,031.24 కోట్లు ఖర్చుపెట్టింది. ఇక 2022–23లో రూ.2,014.30 కోట్లు కేటాయించగా ఈసారి అంతకన్నా అత్యధిక నిధులను బడ్జెట్‌లో పొందుపరిచింది. సంప్రదాయ వర్సిటీలకు, సాంకేతిక విశ్వవిద్యాలయాలకు ఈసారి బడ్జెట్‌లో నిధులు పెంచింది. రూసా కింద రూ.150 కోట్లతో వివిధ కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా ప్రత్యేకంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల భవనాల నిర్మాణం కోసం డిజిటల్ తరగతులు, వర్చువల్ లేబొరేటరీస్, ట్రైబల్ డిగ్రీ కాలేజీల కోసం అదనంగా రూ.9.98 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ కాలేజీల నిర్వహణ ఇతర అవసరాల కోసం రూ.785.89 కోట్లు కేటాయించింది.
బడ్జెట్ చదివింపులు ఇలా..
వివిధ వర్సిటీలకు బడ్జెట్ కేటాయింపులు ఇలా.. (రూ.కోట్లలో)
☛ ఆదికవి నన్నయ 8.69
☛ అంబేడ్కర్ 7.57
☛ ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ 4.10
☛ ఆంధ్రా వర్సిటీ 302.40
☛ ఏపీఎస్‌సీహెచ్‌ఈ 4.35
☛ క్లస్టర్ వర్సిటీ, కర్నూలు 1.20
☛ ద్రవిడ వర్సిటీ 19.96
☛ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ 5.40
☛ వైఎస్సార్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ 7.89
☛ కృష్ణా వర్సిటీ 8.10
☛ నాగార్జున వర్సిటీ 54.00
☛ శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ 4.93
☛ రాయలసీమ వర్సిటీ 8.64
☛ శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ 71.14
☛ పద్మావతి మహిళా వర్సిటీ 56.41
☛ శ్రీవేంకటేశ్వర వర్సిటీ 183.60
☛ ఉర్దూ వర్సిటీ 1.50
☛ విక్రమ సింహపురి వర్సిటీ 13.90
☛ యోగి వేమన వర్సిటీ 32.84
(సాంకేతిక వర్సిటీలకు నిధులు ఇలా)
☛ జేఎన్‌టీయూ కాకినాడ 54.00
☛ జేఎన్‌టీయూ అనంతపురం57.25
☛ ఆర్జీయూకేటీ 94.32
(వివిధ ఆస్తుల కల్పనకు మూలధన కేటాయింపులు ఇలా..)
☛ ఆదికవి నన్నయ వర్సిటీ 4.00
☛ క్లస్టర్ వర్సిటీ 52.00
☛ సెంట్రల్ వర్సిటీలకు మౌలిక సదుపాయాలు 12.66
☛ అబ్దుల్‌హక్ ఉర్దూ వర్సిటీ 5.00
☛ రూసా కింద భవనాల నిర్మాణం 150.00
☛ రాయలసీమ వర్సిటీ 7.94
☛ పద్మావతి మహిళా వర్సిటీ 1.35
☛ ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, కురుపాం 33.00
సరికొత్తగా పల్లెటూరు రోడ్లు..
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. 2023–24 ఆరి్థక సంవత్సరంలో మొత్తం రూ.1,869.77 కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టనుంది. ‘ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి ప్రాజెక్టు’ కార్యక్రమంలో భాగంగా 250 మంది, ఆ పైబడి జనాభా నివసించే గ్రామాలకు కొత్తగా రోడ్ల నిర్మాణానికి రూ. 731 కోట్లు, పట్టణాలు, జాతీయ, రాష్ట్రీయ రహదారుల నుంచి సమీప గ్రామాలను కలుపుతూ పీఎంజీఎస్‌వై కార్యక్రమంలో కొత్తగా రోడ్ల నిర్మాణానికి రూ. 875 కోట్లు, ఏపీ రూరల్ డెవలప్‌మెంట్ ఫండ్, పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్‌ఐడీఎఫ్ వంటి వివిధ కార్యక్రమాలకు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిరి్మంచే రోడ్లకు మరో రూ. 263 కోట్ల నిధులను బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరాకు వీలుగా వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో మొత్తం రూ. 2,200.38 కోట్లు ప్రతిపాదించింది.
గ్రామీణాభివృద్ధికి దండిగా నిధులు..
☛ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలకు అదనంగా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో వివిధ ప్రజాభివృద్ధి కార్యక్రమాలకు మొత్తం రూ. 7,512.89 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించింది. అందులో ప్రధానంగా.. సెర్ప్‌కు రూ. 453 కోట్లు, పొదుపు సంఘాల మహిళల కోసం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి రూ. 700 కోట్లు ప్రభుత్వం ప్రతిపాదించింది.
☛ మెట్టభూముల్లో వైఎస్సార్ జలకళ పథకం ద్వారా రైతుల పొలాల్లో ఉచితంగా బోర్ల తవ్వకం పథకానికి రూ. 252 కోట్లు కేటాయించారు.
☛ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పనుల కల్పన కార్యక్రమాలకు రూ. 5,115.38 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది.
☛ వాటర్ షెడ్ల నిర్మాణం వర్షపు నీరు నిల్వ కార్యక్రమాల నిర్వహణకు మరో రూ. 195.88 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు రూ.3,862 కోట్లు
☛ గ్రామ పంచాయతీలతో పాటు, మండల, జిల్లా పరిషత్‌లకు వివిధ రూపాల్లో ఆర్థిక చేయూత అందజేసేందుకు రూ. 3,862.71 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. అందులో.. 15వ ఆరి్థక సంఘం ప్రతిపాదనల మేరకు మూడు రకాల గ్రామీణ స్థానిక సంస్థలకు వచ్చే ఆర్థిక ఏడాది రూ. 2,031 కోట్ల మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయించింది.
☛ ఈ కేటాయింపులకు అదనంగా గ్రామ సచివాలయాలు, వలంటీర్ల కార్యక్రమాలకు రూ. 3,857 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది.
రయ్.. రయ్.. రహదారులు
ఆర్ అండ్ బీకి రూ. 9,118.71 కోట్లు.. గతేడాది కంటే రూ. 537.46 కోట్లు అధికం
రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్(ఆర్‌డీసీ) ద్వారా రోడ్ల నిర్మాణం, రాష్ట్ర–జిల్లా ప్రధాన రహదారుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం 2023–24 బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చింది. ఇప్పటికే దాదాపు 32,725 కి.మీ. మేర జిల్లా ప్రధాన రహదారులు, 4 వేల కి.మీ. మేర బీటీ రోడ్లను పునరుద్ధరించిన విషయాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. రూ.2,205 కోట్లతో 8,268 కి.మీ. మేర రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారులను నిర్మించినట్టు వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు రహదారుల అనుసంధాన ప్రాజెక్ట్ కింద 437.59 కి.మీ. రోడ్ల నిర్మాణాన్ని రూ. 391 కోట్లతో చేపట్టామన్నారు. 2023–24 బడ్జెట్‌లో కూడా రహదారుల నిర్మాణం, రోడ్లు భద్రత, రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యమిచ్చింది.
కొన్ని ప్రధాన కేటాయింపులు ఇలా...
☛ గ్రామీణ ప్రాంతాల అనుసంధాన రోడ్లకు: రూ. 616 కోట్లు
☛ ఎన్‌డీబీ రోడ్ల నిర్మాణం– వంతెనల నిర్మాణం: రూ. 616 కోట్లు
☛ రాష్ట్ర ప్రధాన రహదారులు నిర్మాణం: రూ. 500 కోట్లు
☛ జిల్లా రహదారుల పునరుద్ధరణ: రూ. 400 కోట్లు
☛ ఆర్‌డీసీకి కేటాయింపులు: రూ. 300 కోట్లు
☛ ఆర్‌ఐడీఎఫ్ కింద రోడ్ల నిర్మాణం: రూ. 200 కోట్లు
☛ రైల్వే శాఖతో కలసి ప్రాజెక్టులు, భద్రతకు రాష్ట్ర వాటా: రూ. 408 కోట్లు
ఆర్ అండ్ బీకి నిధుల పెరుగుదల ఇలా.. (రూ.కోట్లలో)
2020–21: 6,588.57
2021–22: 7,594.19
2022–23: 8,581.25
2023–24: 9,118.71
డ్రైవరన్నలకు మరింత అండ.. వైఎస్సార్ వాహనమిత్రకు రూ.275 కోట్లు
పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డ్రైవర్లకు మరింత సహాయం అందించనున్నారు. గత నాలుగేళ్ల కంటే ఈ సంవత్సరం వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి అధికంగా నిధులు కేటాయించారు. వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి 2023–24 బడ్జెట్‌లో రూ.275 కోట్లు కేటాయించారు. తద్వారా ఈ ఏడాది వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద ఐదో విడత అర్హత కలిగిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్, ఎండీయూ డ్రైవర్లు కలిపి మొత్తం 2.75 లక్షల మందికి రూ.10వేలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. ఈ ఏడాది కొత్తగా ఇంటింటికీ రేషన్ అందిస్తున్న ఎండీయూ డ్రైవర్లకు కూడా వాహనమిత్ర పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. దాంతో దాదాపు 10 వేల మందిని అదనంగా ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చి లబ్ధి చేకూర్చనుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇప్పటికే నాలుగు దశల్లో 1.05కోట్ల మందికి మొత్తం రూ.1,025.96కోట్లు ఆర్థిక సహాయం చేసింది.
వాహన మిత్రకు బడ్జెట్ ఇలా.. రూ. కోట్లలో
2019-20: 236.34
2020-21: 273.47
2021-22: 254.64
2022-23: 261.51
2023-24: 275.00
నైపుణ్యాభివృద్ధిరస్తు..
బడ్జెట్లో రూ.1,166.64 కోట్లు కేటాయింపు
విద్యార్థుల చదువులు ముగియగానే ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకునేలా వారిని తీర్చిదిద్దేందుకు వీలుగా ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలకు నిధుల కేటాయింపును పెంచింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో నైపుణ్యాభివృద్ధి కోసం 1,166.64 కోట్లను కేటాయించింది. 2021–22లో 774.01 కోట్లు ఖర్చు చేయగా, 2022–23లో రూ.969.91 కోట్లు కేటాయించింది. విద్యార్థుల చదువులు ముగిసే నాటికి ఉన్నతమైన నైపుణ్యాలు, సామర్థ్యాలను కలిగి జాతీయ అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా వారిని తీర్చిదిద్దాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. తదనుగుణంగా యువతకు నైపుణ్యాలను అందించేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. నైపుణ్య వర్సిటీ ఏర్పాటుతో పాటు.. నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శిక్షణ సంస్థలనూ నెలకొల్పుతోంది. ఇందుకోసం గత రెండేళ్లుగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం.. కేటాయింపులను పెంచింది.
ఐఐటీలు, పాలిటెక్నిక్ కాలేజీలను మరింత అభివృద్ధి పరిచేలా..
నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు రూ.197.06 కోట్లు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎంప్లాయిమెంటు జనరేషన్ కార్యక్రమాలకు రూ.398.98 కోట్లు కేటాయించింది. ఐఐటీలు, పాలిటెక్నిక్ కాలేజీలను మరింత అభివృద్ధి పరిచేలా సదుపాయాల కోసం కేపిటల్ నిధులను సమకూరుస్తోంది. ఐటీఐ భవనాల నిర్మాణానికి రూ.32.70 కోట్లు ఖర్చు చేయనుంది. పాలిటెక్నిక్ కాలేజీలకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్‌బీఏ) గుర్తింపునకు వీలుగా వివిధ సదుపాయాలు కల్పిచాలని నిర్ణయించింది. భవనాల నిర్మాణానికి రూ.54.76 కోట్లు, వర్చ్యువల్ ల్యాబ్‌ల కోసం రూ.కోటి కేటాయించింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల ఆధునికీకరణకు రూ.15 కోట్లు అందించనుంది.
పేదల సంజీవని ఆరోగ్యశ్రీకి రూ.2,400 కోట్లు
2023–24 బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్రంలోని 95 శాతం కుటుంబాలకు సంజీవని అయిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.2,400 కోట్లను ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించింది. అదేవిధంగా శస్త్ర చికిత్సల అనంతరం రోగులకు విశ్రాంత సమయానికి భృతి అందించే ఆరోగ్య ఆసరాకు రూ.445 కోట్లు కేటాయించింది. ఈ రెండింటికి గత బడ్జెట్‌లో రూ.2,300 కోట్లు అందించగా ఈసారి రూ.545 కోట్ల మేర అదనంగా కేటాయించారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌కు ప్రభుత్వ వాటా కింద రూ.140 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇలా మొత్తంగా వైద్య, ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో రూ.15,882.33 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి రూ.498.07 కోట్లు కేటాయింపులు పెరిగాయి. ఈ లెక్కన 2022–23తో పోలిస్తే వైద్య, ఆరోగ్య రంగానికి ఈసారి 8.32 శాతం నిధులు అధికంగా కేటాయించారు.
నాడు–నేడు కోసం..
నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖచిత్రాన్ని మార్చివేయడానికి సీఎం వైఎస్ జగన్ సర్కార్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బడ్జెట్‌లో నాడు–నేడు కార్యక్రమానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేయడానికి రూ.350 కోట్లు కేటాయింపులు చేశారు. డీఎంఈ పరిధిలో మెడికల్ భవనాల కోసం రూ.941.32 కోట్లు, ఆయుష్ కళాశాలల అభివృద్ధికి రూ.10 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు ప్రభుత్వం వెచి్చంచబోతోంది.
వైఎస్సార్ బీమాకు రూ.372 కోట్లు..
అనుకోని ప్రమాదాల్లో పెద్ద దిక్కుని కోల్పోయే అసంఘటిత రంగాలకు చెందిన కారి్మకుల కుటుంబాలకు ఉచిత బీమా అందించే వైఎస్సార్ బీమా పథకానికి బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.372 కోట్లు కేటాయించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 18 నుంచి 70 ఏళ్ల మధ్య సంపాదించే అసంఘటిత రంగాల కార్మికులు మరణిస్తే బీమా కంపెనీలు, బ్యాంకులతో సంబంధం లేకుండా ఆ కుటుంబానికి ప్రభుత్వమే నేరుగా బీమా సాయం అందిస్తోంది. గత రెండేళ్లలో ఈ పథకం కింద రూ.512 కోట్ల మేర క్లెయిమ్‌లను ప్రభుత్వం పరిష్కరించింది. వైఎస్సార్ బీమాకు రూ.372 కోట్లతో కలిపి కార్మిక శాఖకు ప్రభుత్వం 2023–24కు రూ.795.80 కోట్ల నిధులను కేటాయించింది. ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు రూ.340.3 కోట్లు కేటాయించారు. అలాగే అనంతపురంలోని లేబర్ కోర్టుకు రూ.1.21 కోట్లు, విశాఖపట్నం లేబర్ కోర్టు, ఇండ్రస్టియల్ ట్రిబ్యునల్‌కు రూ.1.25 కోట్లు, గుంటూరు లేబర్ కోర్టుకు రూ.83.23 లక్షలు కేటాయించింది.
పట్టణ ప్రగతికి రూ.9,381.54 కోట్లు కేటాయింపు..
పట్టణ ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. పురపాలక సంఘాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. పేదలకు టిడ్కో ఇళ్ల కేటాయింపునకు, ఘన వ్యర్థాల నిర్వహణకు, మురుగు నీటి శుద్ధికి, స్మార్ట్ సిటీస్ అభివృద్ధిలో భాగంగా 4 ముఖ్య నగరాలకు, స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు వడ్డీ లేని రుణాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తంగా 2023–24 బడ్జెట్‌లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.9,381.54 కోట్లు కేటాయించింది. ఇందులో టిడ్కో ప్రాజెక్టుకు రూ.1,300 కోట్లు, సీఆర్డీఏ అవసరాలకు రూ.500 కోట్లు, కొత్త రాజధాని నగరానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.500 కోట్లు, కొత్త రాజధాని భూ సేకరణకు రూ.240.09 కోట్లు కేటాయించింది. ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యమిచ్చారు.
మున్సిపల్ వార్డు కార్యదర్శుల కోసం రూ.925.63 కోట్లు, వలంటీర్ల గౌరవ వేతనాలకు 434.86 కోట్లు.. అలాగే ప్రజారోగ్య శాఖలో పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్య భృతికి రూ.241.99 కోట్లు, మున్సిపాలిటీల ఏర్పాటు, అవసరాల కోసం రూ.1,150 కోట్లు, స్మార్ట్ సిటీస్‌లో ప్రాజెక్టులో భాగంగా అమరావతికి రూ.300 కోట్లు, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలకు రూ.50 కోట్ల చొప్పున కేటాయింపులు చేశారు. పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాలు ఇచ్చేందుకు రూ.300 కోట్లు, అమృత్ 2.0 ప్రాజెక్టుల కోసం ఈసారి ప్రత్యేకంగా రూ.480 కోట్లు కేటాయించారు. స్వచ్ఛభారత్ మిషన్(అర్బన్)లో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణకు రూ.250 కోట్లు, మురుగు నీటి శుద్ధి, నిర్వహణకు రూ.300 కోట్లు.. అలాగే అర్బన్ కెపాసిటీ బిల్డింగ్‌తో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ కోసం రూ.20 కోట్లు, ఎస్‌బీఎంలో భాగమైన అర్బన్ ఐఈసీ అండ్ బిహేవియర్ కార్యక్రమానికి రూ.40 కోట్లు, వివిధ పట్టణాల్లో యాస్పిరేషనల్ టాయిలెట్ల నిర్మాణానికి రూ.27.74 కోట్లు కేటాయించారు.
పేదల సొంతింటి కల సాకారం..
రాష్ట్రంలోని నిరుపేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలు ఉండరాదన్న లక్ష్యంతో సీఎం జగన్ నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా పేదలకు పక్కా గృహ యోగం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 30.65 లక్షల మంది మహిళలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు విలువ చేసే ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి, ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం 2023–24 బడ్జెట్‌లో రూ.6,291.70 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే 3.30 శాతం మేర అదనంగా కేటాయింపులు చేపట్టింది.
ఆర్థిక సాయంతో పాటు..
2022–23 బడ్జెట్‌లో పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.4,791.69 కోట్లు ఖర్చు చేసింది. కాగా, ఈ అంచనాలు రూ.7,277.18 కోట్లకు చేరాయి. ప్రభుత్వం ఇప్పటి వరకూ రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులిచ్చింది. వీటిలో 20 లక్షల వరకూ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేపట్టి వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వీటిలో ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. లబ్ధిదారులకు ఉచితంగా స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తోంది. దీంతో పాటు ఒక్కో లబ్ధిదారుకు పావలా వడ్డీకి రూ.35 వేల చొప్పున రుణ సాయం చేస్తోంది. అంతేకాకుండా ఉచితంగా ఇసుక, సబ్సిడీపై సిమెంట్, ఐరన్ సహా ఇతర నిర్మాణ సామాగ్రినీ సరఫరా చేస్తోంది.
పారిశ్రామిక రంగానికి నిధుల ధార..
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించి తద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో 2023–24 బడ్జెట్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేసింది. గతేడాది సవరించిన బడ్జెట్ అంచనాలతో పోలిస్తే పరిశ్రమలు, పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన, ఐటీ రంగాల కేటాయింపులను 146% పెంచింది. 2022–23లో రూ.1,672.36 కోట్లుగా ఉన్న కేటాయింపులను 2023–24కు రూ.4,112.5 కోట్లకు పెంచారు. పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధి, ఎంఎస్‌ఎంఈ, పారిశ్రామిక ప్రోత్సాహకాలకు భారీ కేటాయింపులు చేసింది. ఇందులో పరిశ్రమలకు రూ.2,602.13 కోట్లు కేటాయించగా.. పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు రూ.1,295.22 కోట్లు కేటాయించింది. విశాఖ–చెన్నై కారిడార్‌లో భాగంగా నక్కపల్లి క్లస్టర్, కొప్పర్తి, చిత్తూరు క్లస్టర్ల అభివృద్ధి కోసం రూ.761 కోట్లు కేటాయించింది.
సుదీర్ఘ తీరప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ 4 పోర్టుల కోసం రూ.450 కోట్లు కేటాయించింది. గత ప్రభుత్వం మాదిరిగా బకాయిలు పెట్టకుండా ఏటా క్రమం తప్పకుండా పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాలను చెల్లిస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా వచ్చే ఏడాదీ భారీగా కేటాయింపులు చేసింది. ఎంఎస్‌ఎంఈ రంగానికి రాయితీలిచ్చేందుకు రూ.465 కోట్లు, పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.412 కోట్లు, ఎస్సీ పారిశ్రామిక రాయితీలకు రూ.175 కోట్లు కేటాయించింది. కడప స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కూ.250 కోట్లు, వైఎస్సార్ ఈఎంసీకి రూ.100 కోట్లు, ఐటీ రంగానికి రూ.215.14 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా నైపుణ్యాభివృద్ధి కోసం రూ.1,166 కోట్లను కేటాయించారు.
మరికొన్ని కేటాయింపులు ఇలా.. కేటాయింపు (రూ. కోట్లలో)
☛ సాగరమాల ప్రాజెక్టు 100
☛ రామాయ పట్నం పోర్టు 100
☛ భావనపాడు పోర్టు 100
☛ కడప స్టీల్ ప్లాంట్ 250
☛ వైఎస్సార్ ఈఎంసీ 100
☛ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 100
☛ సూక్ష్మ పరిశ్రమల క్లస్టర్ 25
☛ ఎంఎస్‌ఎంఈ క్లస్టర్స్ 30
☛ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ స్కీం 50
పారిశ్రామిక రంగానికి కేటాయింపులు ఇలా..
☛ పారిశ్రామిక మౌలిక వసతులకు రూ.1,295.22 కోట్లు
☛ పరిశ్రమలకు రూ.2,602.13 కోట్లు
☛ ఐటీ రంగానికి రూ.215.14 కోట్లు
☛ మచిలీపట్నం పోర్టుకు రూ.150 కోట్లు
☛ విశాఖ చెన్నై కారిడార్ అభివృద్ధికి రూ.761 కోట్లు
☛ ఎంఎస్‌ఎంఈ రాయితీలకు రూ.465 కోట్లు
☛ పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.412 కోట్లు
☛ ఎస్సీ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహకాలకు రూ.175 కోట్లు
బడ్జెట్‌లో రెవెన్యూ శాఖకు రూ.5,379 కోట్లు కేటాయింపు
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు తక్షణమే ఆదుకునేందుకు ఈ ఏడాది కూడా ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.2వేల కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియ మరింత వేగంగా ముందుకు సాగేలా బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.321 కోట్లు కేటాయింపులు చేసింది. వైఎస్సార్ గృహ వసతి పథకానికి రూ.500 కోట్లు కేటాయించింది. మొత్తంగా ఈ బడ్జెట్‌లో రెవెన్యూ శాఖకు రూ.5,379 కోట్లు కేటాయించింది. రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, దేవదాయ శాఖల బడ్జెట్ ఇందులోనే కలిసి ఉంటుంది. రెవెన్యూ శాఖలో అంతర్భాగమైన విపత్తుల నిర్వహణ నిధి కింద రూ.2 కోట్లు కేటాయించింది. గతేడాదీ ఇంతే మొత్తాన్ని కేటాయించింది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వం ఆగమేఘాల మీద నిధులు విడుదల చేస్తోంది.
ప్రతిష్టాత్మక రీ సర్వేకు ప్రాధాన్యం
జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకం కింద రీ సర్వేకు బడ్జెట్‌లో రూ.321 కోట్లను కేటాయించారు. ఈ పథకం కింద ఇప్పటికే 2 వేల గ్రామాల్లో రీ సర్వేను పూర్తి చేసి భూ హక్కు పత్రాల పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆయా గ్రామాలకు సంబంధించి 4.3 లక్షల పట్టా సబ్ డివిజన్లు, 2 లక్షల మ్యుటేషన్లను ఉచితంగా చేశారు. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి రాష్ట్రమంతా రీ సర్వే పూర్తి చేసే దిశగా రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్ శాఖలు చేస్తున్న కృషికి ఎక్కడా ఆర్థికంగా ఆటంకాలు కలగకుండా బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. సర్వేకు అవసరమైన డ్రోన్లు, రోవర్లు కొనుగోలు చేయడంతోపాటు అత్యంత ఆధునిక రీతిలో జరుగుతున్న సర్వేకు అవసరమైన సకల సౌకర్యాలను ప్రభుత్వం సమకూరుస్తోంది. ఈ సంవత్సరం మే నాటికి మరో 2 వేల గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయడానికి రెవెన్యూ యంత్రాంగం శ్రమిస్తోంది. ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది.
స్మార్ట్ మీటర్ల ఖర్చు సర్కారుదే..
‘సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఇంధన భద్రత తప్పనిసరి. వెనుకబడిన వర్గాలకు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి చౌకైన, నమ్మకమైన, సమర్థవంతమైన ఇంధన సేవలను 2030 నాటికి అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 18.74 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 9 గం. ఉచిత వ్యవసాయ విద్యుత్, ఎస్సీ, ఎస్టీ నివాసాల్లోని ప్రతి ఇంటికీ నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది’ అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. 2023–24 బడ్జెట్‌లో ఇంధన రంగానికి ప్రభుత్వం రూ.6,546 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.5,500 కోట్లను వ్యవసాయ ఉచిత విద్యుత్ సబ్సిడీకి ఇచ్చేలా ప్రతిపాదించింది.
పంపుసెట్లకు అమర్చే స్మార్ట్ మీటర్ల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. దోభీ ఘాట్లకు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న రజక కుటుంబాలకు, వెనుకబడిన కులాల వారికి, చేనేత కార్మికులకు, క్షౌర శాలలకు విద్యుత్ రాయితీ వర్తింప చేస్తున్నట్టు పేర్కొంది. విద్యుత్ రాయితీని చిన్న గ్రానైట్ యూనిట్లకు యూనిట్‌కి రూ.2గా ఇటీవల ప్రకటించారు. నాపరాతి యూనిట్లకు కూడా ఇదే విధమైన ప్రయోజనాన్ని వర్తింపజేయాలని బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది.
రాత్రి పూట పొలాల్లో జాగారం లేకుండా..
‘రైతులకు రాత్రిపూట జాగారం వద్దు. పొలాల్లో కాపలాలు వద్దు. పగటి పూట నాణ్యమైన 9 గంటల విద్యుత్ ముద్దు. ఇది మా ప్రభుత్వ లక్ష్యం’ అని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. ఆయన వ్యవసాయ బడ్జెట్‌లో పేర్కొన్న ప్రకారం నాణ్యమైన విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 96,300 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశారు. ఆక్వా రైతులకూ రాష్ట్ర ప్రభుత్వం యూనిట్‌కు రూ.3.50 చొప్పున రాయితీనిస్తోంది. పదెకరాల వరకు యూనిట్‌కు రూ.1.50 మాత్రమే వసూలు చేస్తోంది.
ఫీడర్లు బలపడ్డాయ్..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 6,663 ఫీడర్ల ద్వారా వ్యవసాయ విద్యుత్ సరఫరా చేసేవారు. ఇందులో 3,854 ఫీడర్లు మాత్రమే అప్పటికి ఉన్న మౌలిక సదుపాయాలతో 9 గంటల పగటిపూట సరఫరా చేయగల సామర్థ్యం కలిగి ఉండేవి. మిగిలిన 2,809 ఫీడర్లకు ఈ ప్రభుత్వం అదనపు సామర్థ్యం కల్పించి పగటిపూట విద్యుత్ సరఫరా చేస్తోంది. గత మూడేళ్లలో కల్పించిన మౌలిక సదుపాయాలతో.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 6,770 వ్యవసాయ ఫీడర్లలో 6,640 ఫీడర్లు 9 గంటల పగటిపూట నిరంతర విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నాయి. మిగిలిన 130 ఫీడర్లు కూడా రెండు విడతలుగా పగటిపూట 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. మిగిలిన రైతులకు కూడా పగటిపూటే 9 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఇచ్చేలా పనులు పురోగతిలో ఉన్నాయి. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించిన నగదు బదిలీ కోసం వ్యవసాయ పంపుసెట్లకు ప్రభుత్వం మీటర్లు బిగించనుంది. ఇందుకయ్యే ఖర్చు మొత్తం రూ.5,692 కోట్లను ప్రభుత్వమే భరిస్తుంది. వ్యవసాయ రంగానికి రానున్న 30 ఏళ్లపాటు ఉచిత విద్యుత్ అందించాలనే కృతనిశ్చయంతో 7వేల మెగావాట్ల విద్యుత్‌ను ‘సెకీ’ (ఎస్‌ఈసీఐ) ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.