Skip to main content

Success Story: ఇవి పాటిస్తే.. పోలీసు ఉద్యోగం ఈజీనే..

డిఎస్పీగా ఉన్న కూతురికి సిఐగా ఉన్న తండ్రి సెల్యూట్ చేశాడు. ఈ సెల్యూట్ అందరం గర్వపడే సెల్యూట్. ఇంట ఆడపిల్లకు గౌరవం పెరుగుతున్నందుకు చదువులో అమ్మాయిలు ముందంజ వేస్తున్నందుకు ఉద్యోగాల్లో సామర్థ్యాలు చూపుతున్నందుకు కుటుంబాల ఆలోచనాధోరణిలో మార్పు తెస్తున్నందుకు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు ఈ కాలపు కూతురికి ఈ కాలం తల వొంచి చేస్తున్న సెల్యూట్ ఇది.
డీఎస్పీ జెస్సీ ప్రశాంతి
డీఎస్పీ జెస్సీ ప్రశాంతి

సెల్యూట్ చేసే ఎత్తుకు సమాజం ఎదుగుతోంది.సెల్యూట్ చేరుుంచుకునే ఉన్నతికి కూతురు అడుగులేస్తోంది. నిజంగానే ఇది మనం కూడా నుదుటికి చేరుు చేర్చవలసిన సెల్యూట్.

ఒక స్ఫూర్తిదాయకమైన సన్నివేశం ఇది..DSP
తిరుపతిలో ఒక స్ఫూర్తిదాయకమైన సన్నివేశం చోటు చేసుకుంది. అక్కడ జరగనున్న పోలీస్ డ్యూటీ మీట్‌కు గుంటూరు అర్బన్ సౌత్ డిఎస్పీ వై.జెస్సి ప్రశాంతి హాజరయ్యారు. తిరుపతిలో కల్యాణిడ్యామ్ పోలీస్ ట్రైనింగ్ సి.ఐ వై.శ్యామ్‌సుందర్ కూడా హాజరయ్యారు. పోలీసు విభాగంలో పై అధికారి కనిపిస్తే కింది అధికారి సెల్యూట్ చేయాలి. ఇక్కడ సి.ఐ శ్యామ్ సుందర్ తన పై అధికారి ప్రశాంతికి శాల్యూట్ చేశారు. అయితే ఆ పై అధికారి ఆయన కూతురు. నాన్న చేత సెల్యూట్ చేయించుకునేలా ఆ నాన్న ఆ కూతురిని చదువులో ప్రోత్సహించాడు. నాన్న పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ ఆ కూతురు ఉన్నతోద్యోగం సాధించింది. ఈ దృశ్యం అందరినీ సంతోషపెట్టింది. కొత్త తరాలు పాత తరాలను మించిన విజయాలు సాధించాలని, ముఖ్యంగా పాతకాలపు అభిప్రాయాలను దాటి అమ్మాయిలను ప్రోత్సహిస్తే వారు విజయాలు అందుకుంటారని సందేశం ఇచ్చింది. ఈ సందర్భంగా ఈ తండ్రీ కూతుళ్లను ‘సాక్షి’ పలుకరించింది. ప్రశాంతితో చేసిన ఇంటర్వ్యూ విశేషాలివి..

నాన్నగారు సెల్యూట్ చేయడం మీకు ఎలా అనిపించింది?
ప్రశాంతి: పోలీస్ విభాగంలో పై అధికారికి సెల్యూట్ చేయడం సర్వసాధారణం. డ్యూటీ మీట్‌లో నాన్న నాకు ఎదురుపడినప్పుడు మా మధ్య ఉన్న తండ్రీకూతుళ్ల బంధం కంటే వృత్తిధర్మమే గుర్తుకొచ్చింది. సెల్యూట్ చేస్తానని నాన్న, స్వీకరిస్తానని నేను ఊహించలేదు. నాన్న నాకు సెల్యూట్ చేశాడన్న సంతోషం కన్నా సెల్యూట్ చేసేంతగా ఎదిగేందుకు ప్రోత్సహించాడని గుర్తుకొచ్చి ఆయనపై మరింత గౌరవం పెరిగింది. సెల్యూట్ దృశ్యాలు వైరల్‌తో వస్తున్న అభినందనలు జీవితంలో మరచిపోలేనివని. డిపార్ట్‌మెంట్‌లో కూడా చాలా మెచ్చుకుంటున్నారు.

మీ కుటుంబ నేపథ్యం?

DSP Family


ప్రశాంతి: మాది నెల్లూరు జిల్లా, టీపీ గూడూరు మండలం, పాపిరెడ్డిపాళెం అయినా పుట్టి పెరిగిందంతా తిరుపతిలోనే. వృత్తి రీత్యా నాన్న తిరుపతిలో స్థిరపడ్డారు. అమ్మ వై.సునీత గృహిణి. చెల్లెలు మెర్సీ స్రవంతి కడప డెంటల్ కశాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, తమ్ముడు డానియన్ కుమార్ బీటెక్ పూర్తి చేసి సివిల్స్ శిక్షణ పొందుతున్నాడు. మా తాత పేరం వెంకయ్య ఐపీఎస్ అధికారిగా పని చేశారు.

మీ చదువుఎలా సాగింది?
ప్రశాంతి: ఎస్వీయూలో గోల్డ్‌మెడల్‌తో ఎం.బి.ఏ చేశాను.

పోలీస్ ఉద్యోగంలోకి రావడానికి మీ మీద ఎవరి ప్రభావం ఉంది?
ప్రశాంతి: అమ్మలో క్రమశిక్షణ ఎక్కువ. ఆమెకు తక్కువ మాట్లాడటం అలవాటు. నాన్న డ్యూటీకి వెళితే మేము అల్లరి చేయకుండా ఉండటానికి కోపం చూపేది. అందువల్ల నాన్నతో చనువుగా ఉండేవాళ్లం. అందరు అమ్మా నాన్నల్లాగే మా అమ్మా నాన్నలు కూడా మా మీద ఆశలు పెట్టుకున్నారు. అయితే తల్లిదండ్రుల గోల్స్ అన్నింటిని పిల్లలు సాధించలేరు. కాని వారి సూచనలను ఆదర్శంగా చేసుకొని మనకంటూ లక్ష్యం పెట్టుకొని ప్రయత్నిస్తే సక్సెస్ అవుతాం. ఐఏఎస్,ఐపీఎస్‌లు ప్రజలకు నేరుగా సేవ చేయగలరు. అందువల్ల ఐఏఎస్ అవుదామనుకున్నాను. కాని ఆ కల తొలి ప్రయత్నంలో చేజారింది. రెండవ ప్రయత్నంలో గ్రూప్స్‌లో అర్హత సాధించాను. వేరే శాఖలకు అవకాశం ఉన్నా పోలీస్ శాఖ తీసుకున్నాను. ఆ శాఖలో పని చేసిన నాన్న, తాతలను ఆదర్శంగా తీసుకోవడం ఇందుకు కారణం కావచ్చు.

Success Story: ఒకే సంవత్సరంలో 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించా.. కానీ చివ‌రికి

ఈ క్రమంలో ఏదైనా ఒత్తిడి ఎదుర్కొన్నారా...?
ప్రశాంతి: సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుండగానే నా స్నేహితులు చాలామంది స్థిరపడ్డారు. నా మీద బంధువుల నుంచి చదువు ఆపేసి పెళ్లి చేసుకోమని ఒత్తడి వచ్చేది. అయితే అమ్మా నాన్నలు నా లక్ష్యం వైపు ఎంకరేజ్ చేశారు.

పోలీస్ శాఖలో ఇప్పుడు స్త్రీల స్థితిగతులు ఎలా ఉన్నాయి?
ప్రశాంతి: గతానికి, ఇప్పటికి పోలీస్‌శాఖలో అనేక మార్పులు వచ్చాయి. మహిళలకు ప్రాధాన్యత పెరిగింది. ఇటీవల మహిళలు ధైర్యంగా పోలీసుశాఖలోకి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి గారు, డీజీపీ గారు పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఫ్రెండ్లీ, స్మైలీ పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రజలు ధైర్యంగా పోలీసు స్టేషన్‌కు వచ్చే రోజులు వచ్చాయి. పోలీసుల స్నేహ శైలి బాధితుల సమస్యల పరిష్కారానికి మార్గదర్శకత చూపుతోంది. అందువల్ల అమ్మాయిలకు అవకాశం వస్తే పోలీస్ శాఖనే ఎంపిక చేసుకోవాలని సూచిస్తాను.

దిశ చట్టంపై మీ అభిప్రాయం?
ప్రశాంతి: ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి గారు నిర్దిష్ట లక్ష్యంతో తెచ్చిందే దిశాచట్టం. సీఎం, డీజీపీలు ప్రత్యేక శ్రద్ధతో మహిళల రక్షణ కోసం దిశాను రూపొందించారు. ఫిర్యాదు చేసిన 7 రోజుల్లో ఛార్జ్‌షీట్ వేసి 21 రోజుల్లోనే విచారణ పూర్తి చే సి, బాధితులకు న్యాయం చేకూర్చే వేగవంతమైన చట్టం ఇది. అయితే ఈ చట్టంపై మహిళలు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. సైబర్ రిలెటీవ్‌గా ఈ చట్టానికి అదనపు సెక్షన్లను యాడ్ చేశారు. దిశ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్రేతర ప్రాంతాల్లో సైతం ఈ చట్టం అమలుకు ప్రయత్నాలు సాగిస్తుండడం చూస్తే దిశ ప్రాధాన్యత అర్థమవుతుంది.

యువతరం అమ్మాయిలకు మీరిచ్చే సందేశం?
ప్రశాంతి: ప్రతి అమ్మాయి విద్యావంతురాలిగా ఎదగాలి. వ్యక్తిగతంగా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకొని లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలి.

Success Story: చ‌దివింది డాక్ట‌ర్‌.. అయింది ఐపీఎస్‌.. తొలి కేసులోనే ఒక సంచలనం..

చదువులే పిల్లల ఆస్తి...
పిల్లల చదువు విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చాను. ఎంచుకున్న రంగంలో రాణించేందుకు తగిన ప్రోత్సాహం అందించాను. మన వద్ద ఆస్తిపాస్తులు లేవు. మన పెద్దలు ఆస్తులు కూడబెట్టింది లేదు. మీ చదువులే నాకు ఆస్తి అని నిత్యం చెప్పేవాడిని. చదువు ప్రాధాన్యతను తెలుసుకున్న పిల్లలు ఉన్నతంగా స్థిరపడుతున్నారు. పిల్లల్ని తమ కంటే ఉన్నత స్థాయిలో చూసినప్పుడు ఏ తల్లిదండ్రులకైనా చెప్పలేనంత ఆనందంతో గుండె ఉప్పొంగుతుంది. నా కూతురు ప్రశాంతికి సెల్యూట్ చేసే అవకాశం దక్కడం గర్వంగా భావిస్తున్నా.
                                     - వై.శ్యామ్‌సుందర్, సీఐ, తిరుపతి, కల్యాణ్‌డ్యాం, పోలీస్ ట్రైనింగ్ సెంటర్.

ఇంతకు మించిన ఆనందం ఉంటుందా...
భర్త, కూతురు ఒకే రంగంలో పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారిద్దరికీ ప్రశంసలు రావడం ఇంకా సంతోషంగా ఉంది. మా అమ్మాయి ప్రశాంతిని చూసి గర్వపడుతున్నా. - వై.సునీత, తల్లి.

Inspirational Story: డీఎస్సీ ఉద్యోగాన్ని సాధించానిలా.. ఈ విష‌యాన్ని గ‌ర్వంగా చెప్ప‌గ‌ల‌ను..

Inspirational Story : పేద కుటుంబంలో పుట్టాను..నా కుమారుడికి వైద్యం కోసమే గ్రూప్‌–1 సాధించానిలా..

Published date : 07 Feb 2022 07:03PM

Photo Stories