AP Police Jobs Age Limit: ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల వయో పరిమితి పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్.. ఈ కేటగిరి వారికైతే..
ఉద్యోగార్థుల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
దీని వల్ల..
దీంతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు జనరల్ కేటగిరిలో 18 నుంచి 26 ఏళ్ల వరకు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారైతే 18 నుంచి 31 ఏళ్ల వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఐ ఉద్యోగాలకు జనరల్ కేటగిరిలో 21 నుంచి 29 ఏళ్ల వరకు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారైతే 21 నుంచి 34 ఏళ్ల వయస్సు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 6,100 కానిస్టేబుల్, 411 ఎస్‌ఐ పోస్టుల భర్తీ కోసం పోలీసు శాఖ అక్టోబర్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు తాజాగా వయో పరిమితి రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి డిసెంబర్ 24వ తేదీ (శనివారం) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల మరింత మందికి దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతుంది.
నాలుగంచెల ఎంపిక ప్రక్రియ..
ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్ట్‌ల భర్తీకి నాలుగంచెల ఎంపిక విధానాన్ని అనుసరిస్తున్నారు. అవి.. మొదటి దశ: ప్రిలిమినరీ రాత పరీక్ష; రెండో దశ: ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్; మూడో దశ: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్; నాలుగో దశ: ఫైనల్ రిటెన్ ఎగ్జామినేషన్.
ఎస్‌ఐ- ప్రిలిమినరీ రాత పరీక్ష..
- ఎస్‌ఐ పోస్ట్‌లకు తొలిదశ ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో రెండు వందల మార్కులకు ఉంటుంది. రెండు పేపర్లుగా పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
- పేపర్ 1 అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ 100 ప్రశ్నలు-100 మార్కులకు; అలాగే పేపర్ 2 జనరల్ స్టడీస్ 100 ప్రశ్నలు-100 మార్కులకు ఉంటాయి.
రెండో దశ.. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్..
- రెండో దశలో ఫిజికల్ మెజర్‌మెంట్‌లో నెగ్గేందుకు అభ్యర్థులు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగుండాలి.
- పురుషులు: 167.6 సెం.మీ.ఎత్తు ఉండాలి. ఛాతీ 86.3 సెంటీ మీటర్లు ఉండాలి. శ్వాస తీసుకున్నప్పుడు కనీసం మూడు సెంటీమీటర్లు పెరగాలి. మహిళలకు శారీరక ప్రమాణాల్లో సడలింపులు ఉంటాయి. మహిళలకు కనీస ఎత్తును 152.5 సెంటీ మీటర్లుగా నిర్దేశించారు.
మూడో దశ.. ఫిజికల్ ఎఫిషీయన్సీ టెస్ట్..
- ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించి, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌లోనూ అర్హత సాధించిన వారికి తదుపరి దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌కు వంద మార్కులు కేటాయిస్తారు. దీన్ని మొత్తం మూడు ఈవెంట్ల(1600 మీటర్లు, వంద మీటర్ల పరుగు, లాంగ్ జంప్)లో నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒక్కో ఈవెంట్‌ను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
- ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో భాగంగా నిర్వహించే ఈవెంట్లలోని 1600 మీటర్ల పరుగు పందెంలో తప్పనిసరిగా అర్హత సాధించాలి. ఇది కాకుండా మిగిలిన రెండు ఈవెంట్లలో ఒక ఈవెంట్‌లో అర్హత సాధిస్తే సరిపోతుంది. అయితే ఏపీఎస్పీ విభాగంలోని పోస్ట్‌లకు పోటీ పడే వారు మాత్రం మూడు ఈవెంట్లలోనూ అర్మత పొందాలి.
ఫైనల్ రాత పరీక్ష..
- ఎస్‌ఐ పోస్ట్‌లకు సంబంధించి ప్రిలిమ్స్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మూడింటిలోనూ అర్హత సాధించి.. మెరిట్ జాబితాలో నిలిచిన వారికి.. చివరగా ఫైనల్ రాత నిర్వహిస్తారు. ఈ పరీక్ష నాలుగు పేపర్లలో ఉంటుంది.
- పేపర్ 1 ఇంగ్లిష్(డిస్క్రిప్టివ్ టైప్) 100 మార్కులు; పేపర్ 2 తెలుగు/ఉర్దూ(డిస్క్రిప్టివ్ టైప్) 100 మార్కులు; పేపర్ 3 అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ(ఆబ్జెక్టివ్ ౖటñఃప్) 200 ప్రశ్నలు-200 మార్కులు, పేపర్ 4 జనరల్ స్టడీస్(ఆబ్జెక్టివ్ టైప్) 200 ప్రశ్నలు-200 మార్కులకు నిర్వహిస్తారు.
- పేపర్1,పేపర్-2లను కేవలం అర్హత పేపర్లుగానే పేర్కొంటారు. పేపర్-3, పేపర్-4లలో పొందిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జాబితా రూపొందించి.. నియామకాలు ఖరారు చేస్తారు.
కానిస్టేబుల్.. నాలుగు దశల్లో..
- కానిస్టేబుల్ పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియ కూడా నాలుగు దశల్లో ఉంటుంది.
- తొలి దశ ప్రిలిమినరీ పరీక్షను 200 ప్రశ్నలు- 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
- రెండో దశలో ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ ఉంటుంది. పురుష అభ్యర్థులు 167.6 సెం.మీ ఎత్తు, 86.3 సెం.మీ. ఛాతి కలిగుండాలి.
- మహిళా అభ్యర్థులు 152.5 సెం.మీ ఎత్తు ఉండాలి. ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్ట్‌లకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
- ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ విజేతలకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(1600 మీటర్లు,వంద మీటర్లు, లాంగ్ జంప్) నిర్వహిస్తారు. వీటిలో 1600 మీటర్ల టెస్టులో తప్పనిసరిగా అర్హత పొందాలి. అలాగే వంద మీటర్ల టెస్ట్, లాంగ్ జంప్‌ల్లో ఏదో ఒకదాంట్లో అర్హత సాధిస్తే సరిపోతుంది.
ఫైనల్ రాత పరీక్ష..
- ప్రిలిమినరీ, పీఎంటీ, పీఈటీలలో విజయం సాధించిన వారికి చివరగా ఫైనల్ రిటెన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
- ఈ పరీక్ష మూడు గంటల వ్యవధిలో 200 ప్రశ్నలు-200 మార్కులకు ఉంటుంది.
- ఏపీఎస్సీ కానిస్టేబుల్ పోస్ట్‌లకు 200 ప్రశ్నలు-100 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
- ప్రిలిమినరీ, ఫైనల్ రాత పరీక్షల్లో.. ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
విజయానికి అడుగులు ఇలా..
అర్థమెటిక్..
అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ విభాగంలో ముఖ్యాంశాలుగా భావించే సగటు, కసాగు, గసాభా, సంఖ్యలు, వర్గ మూలాలు, ఘన మూలాలు, నిష్పత్తులు, భాగస్వామ్యం, వయసు, శాతాలు, లాభ-నష్టాలు, చక్ర వడ్డీ, సరళ వడ్డీ, కాలం-దూరం, కాలం-పని వంటి వాటిపై పట్టు సాధించాలి. అదే విధంగా మ్యాథమెటిక్స్‌లోని ప్రాథమిక అంశాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, మ్యాట్రిసెస్, సెట్స్-రిలేషన్స్‌ను ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయాలి.
రీజనింగ్..
రీజనింగ్‌లో.. నంబర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్స్, కోడింగ్-డీకోడింగ్, సీటింగ్ అరేంజ్‌మెంట్, బ్లడ్ రిలేషన్స్ వంటి వాటిపై పూర్తిగా పట్టు సాధించాలి. వెన్ డయాగ్రమ్స్, అసెంప్షన్ అండ్ రీజన్, ఆర్గ్యుమెంట్, సిలాజిజమ్, డేటా సఫిషియన్సీ విభాగాల్లో పట్టుతో వెర్బల్ రీజనింగ్‌లో రాణించే అవకాశముంది. ఆడ్‌మన్ ఔట్, డైస్ అండ్ క్యూబ్స్, వెన్ డయాగ్రమ్స్‌లపై అవగాహనతో నాన్ వెర్బల్ రీజనింగ్‌లో ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నైపుణ్యం లభిస్తుంది. మెంటల్ ఎబిలిటీ విభాగంలో రాణించేందుకు టాబ్యులేషన్, డేటా సమీకరణ, డేటా విశ్లేషణలపై అవగాహన పెంచుకోవాలి. నిరంతరం సాధన చేయాలి.
జనరల్ స్టడీస్‌కు ఇలా..
- హిస్టరీకి భారత, ఏపీ చరిత్రకు సంబంధించి ముఖ్యమైన ఘట్టాలు, చరిత్ర గతిని మార్చిన సంఘటనలు, భారత స్వాతంత్య్ర ఉద్యమంలోని ప్రధాన ఘట్టాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి.
- జాగ్రఫీలో భారత, ఏపీ భౌగోళిక స్వరూపం, సహజ వనరులు, నదులు, సముద్ర తీర ప్రాంతాలు, అడవులు, పంటలు, సాగు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
- ఎకానమీకి సంబంధించి కోర్ ఎకనామీ అంశాలతోపాటు సమకాలీన అంశాలు, దేశ ఆర్థిక రంగంలో అమలవుతున్న కొత్త విధానాల గురించి తెలుసుకోవాలి.
- పాలిటీకి సంబంధించి రాజ్యాంగం, రాజ్యాంగ రూపకర్తలు, రాజ్యంగంలోని ముఖ్యమైన అధికరణలు, ప్రకరణలు వంటి వాటితోపాటు తాజా రాజ్యాంగ సవరణలు, వాటి ఉద్దేశం, ప్రభావం వంటి అంశాలు తెలుసుకోవాలి.
- కరెంట్ అఫైర్స్‌లో జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న తాజా పరిణామాలు(ఉదా: క్రీడలు-విజేతలు, సదస్సులు, సమావేశాలు-తీర్మానాలు తదితర) గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి.
- ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్య అంశాలు; భారత, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆర్థికాభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, పునర్విభజన సమస్యల గురించి అధ్యయనం చేయాలి.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లక్షిత వర్గాలు, లబ్ధిదారులు, బడ్జెట్ కేటాయింపుల గురించి తెలుసుకోవాలి.
- జనరల్ ఇంగ్లిష్, జనరల్ తెలుగు పేపర్ కోసం ఈ రెండు భాషలకు సంబంధించి బేసిక్ గ్రామర్ అంశాలు, యాంటానిమ్స్, సినానిమ్స్, ఫ్రేజెస్‌లపై పట్టు సాధించాలి.