Skip to main content

SI Selections: పరుగు పరీక్షలో తడబాటు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పరుగు పరీక్షలో యువత తడబడుతున్నారు. నెలల తరబడి ఫిట్‌నెస్‌ శిక్షణ పొంది ఏళ్లుగా ఎదురుచూసిన డ్రీమ్‌ జాబ్‌ను పరుగు పందెం తడబాటుతో పొగొట్టుకుంటున్నారు. ఎస్సై ఉద్యోగం కోసం 1600 మీటర్ల పరుగును 8 నిమిషాల్లో పూర్తి చేయడానికి సమగ్ర శిక్షణ ఉన్నప్పటికీ అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. ఇటీవల ఏలూరులో ఎస్సై రిక్రూట్‌మెంట్‌ పోటీల్లో కనిపించిన పరిస్థితి ఇది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 1,577 మంది పరుగు పందెంలో అర్హత సాధించలేక అనర్హులుగా మారారు. దీంతో మళ్ళీ రిక్రూట్‌మెంట్‌ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి.
SI Selections
పరుగు పరీక్షలో తడబాటు

ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షల్లో అనేక మినహాయింపులు

ఏలూరు రేంజ్‌ పరిధిలో ఎస్సై సెలెక్షన్స్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ సజావుగా ముగిసింది. పకడ్బందీగా ఈవెంట్స్‌ నిర్వహించడంతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అభ్యర్థులకు ఎక్కువ అవకాశం ఇచ్చారు. గత నెల 25 నుంచి ఈ నెల 15 వరకు పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో ఏలూరు రేంజ్‌ పరిఽధిలోని ఆరు జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులకు పోటీలు నిర్వహించారు. మొత్తం 9,690 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 7,877 మంది హాజరయ్యారు. వీరిలో 5,410 మంది మాత్రమే అర్హత సాధించారు. ఈ పర్యాయం రిక్రూట్‌మెంట్‌ పరిధిలో అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సడలింపులు ఇచ్చింది.

చదవండి: Inspirational Success Story : ఆ స్వేచ్చతోనే.. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్న‌త ఉద్యోగాలు కొట్టారు.. ఒక‌రు డీఎస్పీ.. మ‌రోక‌రు మేజ‌ర్‌..

ఈ సారి షెడ్యూల్‌ తేదీలతో సంబంధం లేకుండా రిక్రూట్‌ సమయంలో ఎప్పుడు వచ్చినా పరీక్షలు నిర్వహించే వెసులుబాటు ఇచ్చారు. మహిళా అభ్యర్థులకు ఒకరోజు మాత్రమే నిర్వహించాల్సిన పోటీలు వారి సౌకర్యం కోసం రెండు రోజుల పాటు నిర్వహించారు. వీటన్నింటితో పాటు పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రత్యేకంగా వైద్య శిబిరాలు 21 రోజులు పాటు నిర్వహించి డాక్టర్‌, నర్సులతో పాటు పూర్తి స్ధాయిలో అవసరమైన మందులు, ప్రథమ చికిత్స కిట్లు ఏర్పాటు చేశారు.

ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచారు. ఈవెంట్‌కు గతంలో సమయం లేకుండా వెంటవెంటనే నిర్వహించే పరిస్థితి. ఈసారి ప్రతి దానికి అభ్యర్ధులు అలసట తీరి మళ్ళీ సన్నద్ధం కావడానికి వీలుగా గంట సమయం ఇచ్చారు. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి అభ్యర్థుల నుంచి వచ్చిన అప్పీళ్లను స్వీకరించి మళ్ళీ కొంత మందికి ఇంకో చాన్స్‌ ఇచ్చారు.

చదవండి: SSC Constable Notification 2023: 7,547 కానిస్టేబుల్‌ పోస్ట్‌లు.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి... జాబ్ కొట్టండి

1600 మీటర్ల పరుగులో విఫలం

1600 మీటర్ల పరుగుపందెంకు పురుష అభ్యర్థులకు 8 నిమిషాలు, మహిళా అభ్యర్థులకు 10 నిమిషాల సమయం ఇచ్చారు. మొత్తం 1,577 మంది అర్హత పొందలేకపోయారు. వీరిలో 1,152 మంది పురుషులుండగా 425 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఫిజికల్‌ మెజర్మెంట్‌ టెస్ట్‌(పీఎంపీ), హైట్‌, చెస్ట్‌ పరీక్షలకు 444 మంది అర్హత పొందలేకపోయారు. వీరిలో 413 మంది పురుషులు, 31 మంది మహిళా అభ్యర్థులున్నారు. 100 మీటర్లు, లాంగ్‌జంప్‌లో 405 మంది అనర్హులు కాగా వీరిలో 292 మంది పురుషులు, 113 మంది మహిళా అభ్యర్థులున్నారు.

ప్రత్యేక ఏర్పాట్లు

అభ్యర్థులకు సమయం వృథా కాకుండా, ఈవెంట్స్‌కు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఒక టీం, ఎత్తు, చాతీ పరీక్షలు నిర్వహించడానికి ఒక టీమ్‌, ఈవెంట్స్‌కు ఇంకో టీమ్‌ ఇలా ప్రతి దశలో పెద్ద ఎత్తున శాఖాపరమైన సిబ్బందిని వినియోగించి రోజుకు సగటున 800 మందికి అన్ని పరీక్షలు పూర్తి చేశారు. గత నెల 25 నుంచి ఈ నెల 15వ తేది వరకు జరిగిన సెలెక్షన్స్‌లో వర్షాల కారణంగా ఆరు రోజుల పాటు ఈవెంట్లు నిర్వహించలేదు. ఎంపికై న 5410 మంది అభ్యర్థుల్లో 4796 మంది పురుషులు, 614 మంది మహిళా అభ్యర్థులకు వచ్చే నెల 14,15 తేదిల్లో రాతపరీక్షలు నిర్వహించి దాని ఆధారంగా ఎంపిక చేయనున్నారు.

వచ్చే నెలలో రాతపరీక్షలు
వచ్చే నెల 14, 15 తేదీల్లో ఏలూరు రేంజ్‌ పరిధిలో 5,410 మంది అభ్యర్థులకు రాత పరీక్షలు నిర్వహిస్తున్నాం. 4,796 మంది పురుష అభ్యర్థులు, 614 మంది మహిళా అభ్యర్ధులు ఎంపికయ్యారు. వీరందరికీ హాల్‌టిక్కెట్‌లు పంపి రాతపరీక్షలు నిర్వహిస్తాం. 1600 మీటర్లు, ఈవెంట్స్‌లో ఎక్కువ మంది అభ్యర్థులు అర్హత సాధించలేకపోయారు.
– జీవీజీ అశోక్‌కుమార్‌, ఏలూరు రేంజ్‌ డీఐజీ

Published date : 21 Sep 2023 03:51PM

Photo Stories