Skip to main content

APBIE: ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్‌ కొలువు.. ఎంపికై న విద్యార్థులు ఉద్యోగం చేసుకుంటూనే చదువుకునే అవకాశం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): యువతకు సాఫ్ట్‌వేర్‌ కొలువు ఒక కల. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగం సాధించాలంటే కనీసం డిగ్రీ, ఆపై చదువులు తప్పనిసరి.
Software job in inter qualification   SoftwareEngineerJob  students preparing for a software job in Vijayawada West

అంతేకాదు క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఎన్నో దశలను ఎదుర్కోవాలి. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఇంటర్మీడియెట్‌ విద్యార్హతతోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కలను రాష్ట్ర ప్రభుత్వం నిజం చేస్తోంది. డిగ్రీ చదువుతూనే ఐటీ రంగంలో ఉద్యోగంలో కొనసాగించే అవకాశాలను కల్పిస్తోంది. దీని కోసం సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది.

రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థీ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే లక్ష్యంగా ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

చదవండి: Software Jobs: ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు.. ఎంపిక ఇలా..

75 శాతం మార్కులు తప్పనిసరి

ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధిస్తే చాలు ఐటీ ఉద్యోగం కల్పించేలా ఇంటర్మీడియెట్‌ బోర్డు, హెచ్‌సీఎల్‌ టెక్‌–బీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. ఎంపికై న విద్యార్థులు ఉద్యోగం చేసుకుంటూనే యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం ఉంది. 2022–23లో ఇంటర్మీడియెట్‌ పూర్తిచేసిన వారు, 2024 విద్యా సంవత్స రంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసే వారు దీనికి అర్హులు.

ఇంటర్‌లో ఎంపీసీ, ఎంఈసీ చదివిన విద్యార్థులకు ఐటీ రంగంలో, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఒకేషనల్‌ కోర్సులు చదివిన వారికి అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన డీపీఓ విభాగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.

విద్యార్థులు ఉద్యోగంతో పాటు డిగ్రీ విద్యను బిట్స్‌ పిలాని, శస్త్ర అమిటీ (ఏఎంఐటీవై), ఈఐఎం నాగ్‌పూర్‌, కేఎల్‌ యూనివర్సిటీ, ఐఐటీ గౌహతి, ఐఐటీ కొట్టాయంలో అభ్యసించవచ్చు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల ఫీజులో కొంతమొత్తాన్ని హెచ్‌సీఎల్‌ కంపెనీ చెల్లించనుంది. ఏటా రూ.15 వేలకు తక్కువ కాకుండా ఫీజును కంపెనీ భరించేలా ఒప్పందం కుదిరింది.

ఎంపిక ఇలా..

దరఖాస్తు చేసుకునేందుకు అర్హులైన విద్యార్థులు డిసెంబ‌ర్ 10వ తేదీలోగా తమ వివరాలను హెచ్‌టీటీపీఎస్‌://బీఐటీ.ఎల్‌వైటీఈసీహెచ్‌బీఈఈజీఓఏపీ (హెచ్‌సీఎల్‌టెక్‌బీఈఈ.కాం) లింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్టేషన్‌ చేసుకోవాలి. ఆయా విద్యార్థులు మూడు దశల్లో పరీక్షలు రాయాలి.

తొలుత రాత పరీక్ష ఉంటుంది. అనంతరం ఇంగ్లిష్‌ నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. చివరిగా ఎంపికై న వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మూడు పరీక్షల్లో నెగ్గిన విద్యార్థులకు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు.

శిక్షణ కాలంలో ఏడో నెల నుంచి నెలకు రూ.10 వేల చొప్పున స్టైపెండ్‌ ఉంటుంది. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి మంచి వేతనంతో కూడిన ఉద్యోగం లభిస్తుంది.

ఎన్టీఆర్‌ జిల్లాలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు డిసెంబ‌ర్ 14వ తేదీన, కృష్ణాజిల్లా విద్యార్థులకు 15వ తేదీన పరీక్ష నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. పరీక్ష ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు జరుగుతుంది.

ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాల విద్యార్థులందరూ రిజ్మిస్టేషన్‌కు అర్హులే. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారంతా హాజరుకావాలి. కళాశాలల ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆయా కళాశాలల నుంచి సమాచారం అందుతుంది. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్న వారికి కంపెనీ నుంచి పరీక్ష తేదీల వివరాలు తెలియజేస్తారు.

విద్యార్థులకు మంచి అవకాశం

డిసెంబ‌ర్ పదో తేదీ లోపు అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్‌ విద్యార్హతతో ఐటీ ఉద్యోగం వచ్చేలా లభించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అర్హులందరూ దరఖాస్తు చేసుకునేలా ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌ ప్రోత్సహించాలి. ఇప్పటికే ఆయా కళాశాలలకు సమాచారం అందించాం. ఈ ఏడాది ఎక్కువ మంది విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకునేలా ప్రిన్సిపాల్స్‌ చొరవ చూపించాలి.
– పెదపూడి రవికుమార్‌, ప్రాంతీయ అధికారి, ఇంటర్మీడియెట్‌ బోర్డు, ఉమ్మడి కృష్ణాజిల్లా

Published date : 07 Dec 2023 09:28AM

Photo Stories