Skip to main content

AP Inter Supplementary Exam 2024: ఇంటర్‌ సప్లిమెంటరీ మూల్యాంకనంలో నూతన విధానం

New Intermediate Board Evaluation System  Quick Result Release with Transparent Correction Process  Efficient Evaluation System for First and Second Year Exams

రాజమహేంద్రవరం: జవాబు పత్రాల మూల్యాంకనంలో ఇంటర్మీడియెట్‌ బోర్డు నూతన సంస్కరణలకు నాంది పలికింది. మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల జవాబు పత్రాలను పారదర్శకంగా దిద్దేందుకు, పరీక్ష ఫలితాలు త్వరితగతిన వెలువరించేందుకు సరికొత్త విధానాన్ని తెర పైకి తెచ్చింది. దీనిని ఈ ఏడాది ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మాన్యువల్‌ పద్ధతికి స్వస్తి పలికి, ఎగ్జామినర్లు ఆన్‌లైన్‌ ద్వారా జవాబు పత్రాలు దిద్దే విధంగా ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఇంటర్‌ విద్యా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన విధివిధానాలకు సైతం రూపకల్పన చేశారు.

ఇప్పటికే ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు ఈ నెలాఖరు వరకూ జరుగుతాయి. అనంతరం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నూతన విధానంలో మూల్యాంకనం ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. దీని ప్రకారం అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌(ఏఈ)గా నియమితులైన అధ్యాపకుడు జూనియర్‌ కళాశాలల్లో లేదా ఇంటి వద్ద నుంచే జవాబు పత్రాలను దిద్దవచ్చు. దీనివలన కళాశాలల్లో విద్యా బోధనకు ఎటువంటి ఆటంకమూ ఏర్పడదు. పైగా స్పాట్‌ వాల్యుయేషన్‌ ఖర్చు సైతం తగ్గనుంది.

Also Read :  Polycet 2024 Counselling: పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

ఆన్‌లైన్‌ మూల్యాంకనం ఇలా..

ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం జవాబు పత్రాలను స్కాన్‌ చేసి, ఏఈగా ఎంపిక చేసిన అధ్యాపకుడికి ఆన్‌లైన్‌లో పంపిస్తారు. ప్రత్యేకంగా కేటాయించే కోడ్‌ ఆధారంగా ఆ అధ్యాపకుడు కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌లో ఓపెన్‌ చేసి, తాను పని చేసే కాలేజీ లేదా ఇంటి వద్ద ఆ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయవచ్చు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ ఎప్పుడైనా ఈ జవాబు పత్రాలు దిద్దే వెసులుబాటు కల్పించారు. అయితే ఈ ప్రక్రియ మొత్తం తప్పనిసరిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే నిర్వహించాలి. ప్రతి ఎగ్జామినర్‌ ‘టీక్యూడీ’ ద్వారా లాగిన్‌ అయి, వెంటనే పాస్‌వర్డ్‌ మార్చుకోవాలి. ముందుగా ఐదు ప్రాక్టీస్‌ పేపర్లు మూల్యాంకనం చేసిన తర్వాత రెగ్యులర్‌ పేపర్లు అదుబాటులోకి వస్తాయి. రోజుకు 60 పేపర్ల వరకూ మూల్యాంకనం చేసేందుకు అవకాశం కల్పించారు.

ఇబ్బందులకు చెల్లు

ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఇప్పటి వరకూ మాన్యువల్‌ విధానంలోనే ఎగ్జామినర్లు నిర్వహించే వారు. దీనివలన ఈ ప్రక్రియ ఆలస్యమై, ఫలితాల విడుదలలో సైతం జాప్యం జరిగేది. ఈ పరిణామం విద్యార్థుల అడ్మిషన్లపై పడేది. మరోవైపు తరగతుల నిర్వహణలో అధ్యాపకులు సైతం ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వీటన్నింటినీ అధిగమించేందుకు ఆన్‌లైన్‌ మూల్యాంకనం ఎంతో ఉపయోగపడనుంది. ఈ విధానంలో ఎక్కడా ఎటువంటి పొరపాట్లకూ ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. మాన్యువల్‌గా పేపర్లు దిద్దే సమయంలో మార్కులు టోటల్‌ చేయడంలో పొరపాట్లు జరిగేవి. కొన్ని ప్రశ్నలకు మార్కులు వేయడం, మరికొన్నింటికి మరచిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకునేవి. అనంతరం రీ–వెరిఫికేషన్‌లో అసలు సంగతి బహిర్గతమయ్యేది. ఇలాంటి ఘటనలు అటు ఇంటర్‌ బోర్డు అధికారులకు, తల్లిదండ్రులకు తలనొప్పి వ్యవహారంగా మారేది. ఆన్‌లైన్‌ విధానంతో వీటన్నింటినీ కట్టడి చేసే వీలుంటుందని ఇంటర్‌ బోర్డు అధికారులు చెబుతున్నారు.

స్కానింగ్‌ సెంటర్‌ ఏర్పాటు

జవాబు పత్రాలు దిద్దే ప్రక్రియలో గతంలో ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా రీ కలెక్షన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ (డీఆర్‌డీసీ) ఉండేది. ఆన్‌లైన్‌ విధానం అమలులోకి తీసుకురానున్న తరుణంలో డీఆర్‌డీసీకి బదులు రీజినల్‌ రిసెప్షన్‌ స్కానింగ్‌ సెంటర్‌ (ఆర్‌ఆర్‌ఎస్‌సీ) అందుబాటులోకి తీసుకురానున్నారు. గతంలో ప్రతి జిల్లాలోని జవాబు పత్రాలను సేకరించి జంబ్లింగ్‌ విధానంలో ఇతర జిల్లాలకు పంపేవారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, కర్నూలు జిల్లాల్లో స్కానింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ స్కానింగ్‌ సెంటర్‌ ఉంటుంది. ఏరోజుకారోజు పరీక్ష పూర్తయిన వెంటనే స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా ఆర్‌ఆర్‌ఎస్‌సీ కేంద్రాలకు జవాబు పత్రాలను పంపుతారు. ఆ కేంద్రాల్లో స్కాన్‌ చేసిన జవాబు పత్రాలను నిర్దేశిత ఎగ్జామినర్లకు పంపుతారు. వారు వెంటనే ఆన్‌లైన్‌ మూల్యాంకనం చేపడతారు.

ఒక్క ప్రశ్న చూడకపోయినా..

ఆన్‌లైన్‌ మూల్యాంకనంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. పేపర్లు దిద్దే సమయంలో ఒక ప్రశ్నకు విద్యార్థి రాసిన సమాధానాన్ని ఎగ్జామినర్‌ పూర్తిగా పరిశీలించి, మార్కులు వేసిన తరువాతే మరో ప్రశ్న ప్రత్యక్షమవుతుంది. అన్ని ప్రశ్నలూ పూర్తయ్యాక ఫైనల్‌ సబ్‌మిట్‌ దర్శనమిస్తుంది. విద్యార్థులు జవాబు రాసినా, రాయకపోయినా అన్ని ప్రశ్నలనూ పరిశీలించాల్సి ఉంటుంది. ఫలితంగా అన్ని ప్రశ్నలకూ తప్పనిసరిగా మార్కులు వేయాల్సి ఉంటుంది. ఎగ్జామినర్‌ మూల్యాంకనం పూర్తి స్థాయిలో చేశారా లేదా అనే విషయాన్ని చీఫ్‌ ఎగ్జామినర్‌ (సీఈ), ఇంటర్‌ బోర్డ్‌ అధికారులు పరిశీలిస్తారు.

Also Read:  Integrated B.Tech Courses After 10th: పదితోనే ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో ప్రవేశాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

జిల్లాలో ఇలా..

జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 25 కేంద్రాల్లో ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు 19,794 మంది విద్యార్థులకు నిర్వహిస్తున్నారు. జనరల్‌ విభాగంలో మొదటి సంవత్సరం 14,788 మంది, ద్వితీయ సంవత్సరంలో 3,624 పరీక్షలకు హాజరువుతున్నారు. ఒకేషనల్‌ విభాగంలో మొదటి సంవత్సరం 801, ద్వితీయ సంవత్సరంలో 581 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు.

నూతన విధానంలో మూల్యాంకనం

ఆన్‌లైన్‌ విధానంలో జవాబు పత్రాలు దిద్దేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాం. రాజమహేంద్రవరం స్కానింగ్‌ సెంటర్‌కు సుమారు 2.25 లక్షల జవాబు పత్రాలు రానున్నాయి. మూల్యాంకనంపై ఇప్పటికే అధ్యాపకులకు శిక్షణ ఇచ్చాం. తిరిగి ఆదివారం మరోసారి అవగాహన కల్పిస్తాం. ఈ విధానం చాలా మంచిది. అధ్యాపకులకు ఎంతో ఉపయోగపడుతుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి జూనియర్‌ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్‌ మూల్యాంకనంతో అటు బోధన సాగిస్తూనే.. మూల్యాంకనం చేసుకునే వెసులుబాటు అధ్యాపకులకు కలుగుతుంది.

ఎన్‌ఎస్‌వీఎల్‌ నరసింహం, ఇంటర్మీడియెట్‌ బోర్డ్‌ ప్రాంతీయ అధికారి, రాజమహేంద్రవరం

Published date : 29 May 2024 01:00PM

Photo Stories