Skip to main content

Intermediate: ఇంటర్‌లో డిజిటల్‌ మూల్యాంకనం

ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి విద్యార్ధుల సమాధాన పత్రాలను ఇక నుంచి డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేయాలని బోర్డు నిర్ణయించింది.
Intermediate
ఇంటర్‌లో డిజిటల్‌ మూల్యాంకనం

ఫిబ్రవరి 4న తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయంలో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో చైర్మన్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, కాలేజీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పోలా భాస్కర్, మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ రాఘవేంద్రరావు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సురేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏడేళ్ల అనంతరం బోర్డు 74వ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో 2015లో ఒకసారి బోర్డు సమావేశమైంది.

పటిష్టంగా.. పారదర్శకంగా

ఇంటర్ పరీక్షల్లో ప్రధానంగా మూల్యాంకనంలో ఎలాంటి లోపాలు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో చర్చించారు. మూల్యాంకనం పటిష్టంగా నిర్వహించడంతోపాటు పారదర్శకంగా చర్యలు చేపట్టనున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులతోపాటు ఇతర సమయాల్లోనూ వందల మంది అధ్యాపకులను మూల్యాంకన కేంద్రాలకు రప్పించి జవాబు పత్రాలను దిద్దడంలో ఇబ్బందులు ఎదురవుతున్నందున ఇకపై డిజిటల్ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు. విద్యార్ధుల జవాబు పత్రాలను డిజిటలైజేషన్ చేసి ఆయా సబ్జెక్టుల లెక్చరర్లకు ప్రత్యేక లాగిన్ ల ద్వారా అందచేస్తారు. అధ్యాపకులు వాటిని మూల్యాంకనం చేసి తిరిగి బోర్డుకు అదే లాగిన్ ద్వారా పంపుతారు. ఆయా మార్కులను పరిగణలోకి తీసుకొని బోర్డు ఫలితాలను ప్రకటించనుంది. ప్రస్తుతానికి దీన్ని ఇంటర్ మొదటి సంవత్సరానికి మాత్రమే అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం పరిశీలన జరిపి రెండేళ్లకు వర్తింపచేయడంపై తగిన నిర్ణయం తీసుకుంటారు.

ప్రతి మండలంలో 2 జూనియర్ కాలేజీలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీల ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. ఇందులో ఒకటి కో ఎడ్యుకేషన్ కళాశాల కాగా మరొకటి ప్రత్యేకంగా బాలికల కోసం ఏర్పాటు కానుంది. టెన్త్ తరువాత బాలికల్లో డ్రాపౌట్లు ఎక్కువగా ఉండటం కూడా ప్రస్తావనకు వచ్చింది. బాలికలకు కాలేజీలు అందుబాటులో లేకపోవడం ఒక కారణంగా కాగా మరుగుదొడ్లు లాంటి మౌలిక వసతులు కొరవడడం మరో కారణమనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో జూనియర్ కాలేజీలన్నిటిలో మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యంగా బాలికల కోసం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రూ.40 కోట్లతో మరుగుదొడ్ల నిర్మాణం, మరమ్మతులకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఇంటర్ బోర్డుకు సంబంధించి జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటుపై కూడా చర్చించారు. విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు పలు సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి సురేష్ తెలిపారు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల గుత్తాధిపత్యాన్ని నిరోధించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేలా ఇంటర్ బోర్డుకు పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. కొత్తగా 200 జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

చదవండి:

Good News: 30 వేల మంది ఉపాధ్యాయులు, అధ్యాపకుల పదోన్నతులకు చర్యలు

 

 

 

Online Classes: ఆన్ లైన్ క్లాసులూ నిర్వహించాలి..

UGC: యూజీసీ చైర్మన్‌గా నియమితులైన‌ తెలంగాణ వ్యక్తి?

Published date : 05 Feb 2022 01:20PM

Photo Stories