Dr. BR Ambedkar Gurukulal Admissions: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో జూనియర్ ఇంటర్‌లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
ఏలూరు : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో జూనియర్ ఇంటర్‌లో ప్రవేశాలకు ఈ నెల 16, 17 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి యన్.భారతి మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. బాలురకు సంబంధించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల పోలసానిపల్లి పాఠశాల నందు 16వ తేదీన, బాలికలకు అదే పాఠశాలలో 17న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పెదవేగి, ఆరుగొలను, నరసాపురం గురుకుల పాఠశాలల్లో చేరేందుకు 16వ తేదీ ఉదయం 9 గంటలకు పోలసానిపల్లిలో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు.
Also Read: Telangana Gurukulam UG Admissions
అలాగే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలసానిపల్లి, వట్లూరు, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, నూజివీడు గురుకుల పాఠశాలల్లో చేరేందుకు 17వ తేదీ ఉదయం 9 గంటలకు పోలసానిపల్లి పాఠశాల ప్రాంగణంలో కౌనెల్సింగ్‌కు హాజరు కావాల్సిందిగా కోరారు. ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులతో ఇప్పటికే ఆన్‌లైన్ విధానంలో సీట్లు భర్తీ చేయడం జరిగిందని, మిగిలిన సీట్లు మెరిట్‌తో పాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుగుణంగా సీట్లు భర్తీ చేయబడతాయని చెప్పారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ప్రవేశ పరీక్ష హాల్ టిక్కెట్, ర్యాంక్ కార్డు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, పదోతరగతి మార్క్‌లిస్ట్, ఆధార్ తమ వెంట తీసుకు రావాలన్నారు.
బాలురకు సంబంధించి మొత్తం 140 సీట్లు ఖాళీలుండగా వీటిలో ఎస్సీ–94, బీసీ–10, బీసీ–సి 27, ఎస్టీ–6, ఓసీ–3 సీట్లు కలవని చెప్పారు. బాలికలకు సంబంధించి మొత్తం 122 సీట్లు ఖాళీలు ఉండగా వీటిలో ఎస్సీ–97, బీసీ–11, బీసీ–సి 2, ఎస్టీ–12 ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని విధ్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా సమన్వయ కర్త యన్.భారతి కోరారు.