Intermediate Public Exams 2024: పకడ్బందీగా ఇంటర్ పరీక్షల నిర్వహణ
భీమవరం: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌న్స్ జిల్లా కమిటీ సభ్యులు విద్యాశాఖ, పోలీస్, విద్యుత్, వైద్యశాఖ, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు దశల్లో నిర్వహించే ఇంటర్ పరీక్షల్లో ఫిబ్రవరి 2న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 3న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయన్నారు. పరీక్షలకు జిల్లాలో 111 పరీక్షా కేంద్రాల్లో 17,806 మంది విద్యార్థులు హాజరుకానున్నారని శివన్నారాయణరెడ్డి చెప్పారు.
Also Read : AP Inter 1st Year Study Material (TM)
ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు (ఒకేషనల్), ఫిబ్రవరి 11 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు (జనరల్) నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలకు జిల్లాలో 35 పరీక్ష కేంద్రాల్లో 3,106 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరిగే థియరీ పరీక్షలకు 50 పరీక్ష కేంద్రాల్లో 35,949 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వివరించారు. అన్ని పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నిరంతరం పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. విద్యార్థులు హల్ టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు. పరీక్షా సమయాలకు అనువుగా ఆర్టీసీ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీములను వెంటనే ఏర్పాటు చేయాలని శివన్నారాయణరెడ్డి ఆదేశించారు. రీజనల్ ఇన్‌స్పెక్టర్ కె.చంద్రశేఖర్ బాబు, డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కేవీ సత్యనారాయణ, బి.శ్రీనివాసరావు, ఎం.నర్సింహమూర్తి, ఎ.రాజ్ కృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.వెంకటరమణ, ఆర్టీసీ పీవో గీతాదేవి పాల్గొన్నారు.