AP EDCET 2022: ఉపాధ్యాయ వృత్తికి మార్గం.. ఎడ్‌సెట్
బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారా.. లేదా చివరి సంవత్సరం చదువుతున్నారా.. ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి ఉందా.. అందుకు అవసరమైన బీఈడీ కోర్సులో చేరాలనుకుంటున్నారా?! మీకు సరైన మార్గం.. ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్)!! ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. మంచి ర్యాంకు సొంతం చేసుకుంటే.. బీఈడీలో అడుగుపెట్టొచ్చు. ఆ తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో కొలువుదీరొచ్చు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఏపీ ఎడ్‌సెట్–2022 నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నేపథ్యంలో.. ఎడ్‌సెట్ పరీక్ష విధానం, ఇందులో విజయానికి మార్గాలు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం...
- ఎడ్‌సెట్ ఉత్తీర్ణతతో బీఈడీలో ప్రవేశం
- బీఈడీ తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడే అవకాశం
- బీఈడీతో ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాల్లో కొలువులు
- ఏపీ ఎడ్‌సెట్–2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
ఉపాధ్యాయ వృత్తితో సమాజంలో ప్రత్యేక గౌరవం, గుర్తింపు లభిస్తుంది. నేటి ఎడ్‌టెక్ యుగంలో బోధన నైపుణ్యాలుంటే.. అవకాశాలు అనేకం. సంప్రదాయ స్కూల్స్ మొదలు ఎడ్‌టెక్ సంస్థల వరకు..బీఈడీ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇలాంటి ఎవర్ గ్రీన్ బోధన వృత్తిలో అడుగుపెట్టేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించే కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ). ఎడ్‌సెట్ ఉత్తీర్ణతతో బీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.
అర్హతలు
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. బీటెక్, బీసీఏ, బీబీఎం విద్యార్థులు కూడా అర్హులే. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్ట్‌లనే ఎడ్‌సెట్‌లో మెథడాలజీ సబ్జెక్ట్‌లుగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలా మెథడాలజీ సబ్జెక్ట్‌లుగా ఎంచుకున్న వాటి నుంచే ప్రశ్నలు అడుగుతారు.
ఎడ్‌సెట్.. మూడు విభాగాలు.. 150 ప్రశ్నలు
ఎడ్‌సెట్ పరీక్షను మొత్తం మూడు విభాగాలుగా 150 ప్రశ్నలతో నిర్వహిస్తారు.
విభాగం | సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
పార్ట్–ఎ | జనరల్ ఇంగ్లిష్ | 25 | 25 |
పార్ట్–బి1 | జనరల్ నాలెడ్జ్ | 15 | 15 |
పార్ట్–బి2 | టీచింగ్ ఆప్టిట్యూడ్ | 10 | 10 |
పార్ట్–సి | మెథడాలజీ | 100 | 100 |
మొత్తం | 150 | 150 |
- పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది.
- పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు.
- పరీక్షలో పార్ట్–ఎ, పార్ట్–బిలు ఉమ్మడి విభాగాలుగా ఉంటాయి. అభ్యర్థులు ఎంచుకున్న మెథడాలజీతో సంబంధం లేకుండా..ఈ రెండు విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి.
పార్ట్–సి.. అయిదు మెథడాలజీలు
- ఎడ్‌సెట్ ఎంట్రన్స్‌లో భాగంగా పార్ట్–సిలో మొత్తం అయిదు మెథడాలజీల్లో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు డిగ్రీలో చదివిన సబ్జెక్ట్‌ల ఆధారంగా ఈ మెథడాలజీని దరఖాస్తు సమయంలోనే ఎంచుకోవాల్సి ఉంటుంది.
మెథడాలజీ సబ్జెక్ట్‌లు.. మార్కులు
- మ్యాథమెటిక్స్ మెథడాలజీ: ఈ విభాగంలో మొత్తం 100 ప్రశ్నలు–100 మార్కులు మ్యాథమెటిక్స్ నుంచి అడుగుతారు.
- ఫిజికల్ సైన్సెస్: దీనికి సంబంధించి ఫిజిక్స్ నుంచి 50 ప్రశ్నలు–50 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 50 ప్రశ్నలు–50 మార్కులకు అడుగుతారు.
- బయలాజికల్ సైన్సెస్: ఈ మెథడాలజీలో బోటనీ నుంచి 50 ప్రశ్నలు–50 మార్కులు, జువాలజీ నుంచి 50 ప్రశ్నలు–50 మార్కులకు చొప్పున అడుగుతారు.
- సోషల్ స్టడీస్: ఈ మెథడాలజీలో జాగ్రఫీ నుంచి 35 ప్రశ్నలు–35 మార్కులు, హిస్టరీ నుంచి 30 ప్రశ్నలు–30 మార్కులు, సివిక్స్ నుంచి 15 ప్రశ్నలు–15 మార్కులు, ఎకనామిక్స్ నుంచి 20 ప్రశ్నలు–20 మార్కులకు ఉంటాయి.
- ఇంగ్లిష్: ఈ సబ్జెక్ట్‌ను మెథడాలజీగా ఎంచుకున్న వారికి మొత్తం 100ప్రశ్నలు ఇంగ్లిష్ సబ్జెక్ట్ నుంచే ఉంటాయి.
AP Ed CET 2022: ఏపీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల.. బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు..
విజయం సాధించాలంటే
- ఎడ్‌సెట్‌లో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు హైస్కూల్ స్థాయి నుంచి బ్యాచిలర్ డిగ్రీ వరకూ..తమ మెథడాలజీ సబ్జెక్ట్‌తోపాటు, ఇతర అంశాలపైనా దృష్టి పెట్టాలి.
- ప్రిపరేషన్ పరంగా భావనల ఆధారిత అభ్యసన(కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్) దృక్పథాన్ని అనుసరించాలి.
- ఆయా సబ్జెక్ట్స్‌లోని బేసిక్స్ నుంచి కాంటెంపరరీ డెవలప్‌మెంట్స్ వరకూ.. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
- ప్రధానంగా మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్ అభ్యర్థులకు ఈ దృక్పథం ఎంతో అవసరం. పలు సూత్రాలు, సిద్ధాంతాలు, డేటా ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. వీటికి సమాధానం ఇవ్వాలంటే.. కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్‌తోనే సాధ్యమవుతుంది.
- బయలాజికల్ సైన్సెస్‌లోనూ ఈ దృక్పథం ఎంతో అవసరం. ప్రిపరేషన్ సమయంలో డయాగ్రమ్స్, కంపేరిటివ్ లెర్నింగ్ ప్రాక్టీస్ చేయాలి.
- సోషల్ స్టడీస్ అభ్యర్థులు ఎడ్‌సెట్‌లో విజయానికి ఇతర సబ్జెక్ట్‌లతో పోల్చితే.. మరింత ఎక్కువగా కృషి చేయాలి. కారణం.. ఈ విభాగానికి పోటీ ఎక్కువగా ఉంటుంది. మొత్తం ఎడ్‌సెట్ అభ్యర్థుల్లో 50 నుంచి 55 శాతం మేర సోషల్ మెథడాలజీ వారే ఉంటున్నారు. ఈ విభాగంలోని నాలుగు ఉప విభాగాలు(హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్)కు ప్రాధాన్యం ఇవ్వాలి.
- ముఖ్యంగా జాగ్రఫీ, ఎకనామిక్స్‌లో బేసిక్స్‌తోపాటు సమకాలీన అంశాల గురించి అవగాహన అవసరం. జాగ్రఫీలో వాటి నేపథ్యాల అధ్యయనం కూడా ముఖ్యం. సివిక్స్, ఎకనామిక్స్‌కు సంబంధించి తాజాగా చోటుచేసుకున్న రాజకీయ, ఆర్థిక, వాణిజ్య పరిణామాలపై అవగాహన పొందాలి.
ఉమ్మడి సబ్జెక్ట్‌లకు ఇలా
ఎడ్‌సెట్ అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉండే పార్ట్– ఎ,పార్ట్–బిలో జనరల్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, టీచింగ్ అప్టిట్యూడ్‌లకు ప్రత్యేక ప్రిపరేషన్ సాగించాలి.
ఇంగ్లిష్
ఈ విభాగంలో రాణించడానికి బేసిక్ గ్రామర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లపై అవగాహన పెంచుకోవాలి. రీడింగ్ కాంప్రహెన్షన్ కోసం ప్రామాణిక దినపత్రికలతోపాటు ఎడిటోరియల్స్, విశ్లేషణలను చదవాలి. వాటిలోని కీలక అంశాలతో సొంతంగా సారాంశాన్ని రాసే నేర్పు పొందాలి.జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు, ద్వైపాక్షిక ఒప్పందాలు; అవార్డులు–రివార్డ్‌లు వంటి వాటిపై దృష్టి సారించాలి.
టీచింగ్ ఆప్టిట్యూడ్
అభ్యర్థుల్లో టీచింగ్‌పై ఉన్న ఆసక్తిని గుర్తించే విధంగా ప్రశ్నలు అడిగే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే.. విశ్లేషణాత్మక దృక్పథం అలవర్చుకోవాలి. బోధన శైలిపై సహజ అవగాహన ఏర్పరచుకోవాలి.
ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ
ఎడ్‌సెట్ పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థులు పొందిన మార్కులు, ర్యాంకు, ఎంచుకున్న మెథడాలజీ ఆధారంగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించి.. సీట్ల భర్తీ ప్రక్రియ చేపడతారు. గత ఏడాది కౌన్సెలింగ్ గణాంకాల ప్రకారం–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పరిధిలోని 482 కళాశాలల్లో దాదాపు 35 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.
బీఈడీతో కెరీర్
- ఎడ్‌సెట్‌లో ర్యాంకు ఆధారంగా బీఈడీ పూర్తి చేసిన వారికి భవిష్యత్తులో బోధన రంగంలో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి.
- బీఈడీ తర్వాత టెట్‌లో ఉత్తీర్ణత, ఆ తర్వాత డీఎస్సీలోనూ విజయం సాధిస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్‌లుగా కెరీర్ ప్రారంభించొచ్చు.
- ఉద్యోగం చేస్తూనే పీజీ కూడా పూర్తి చేస్తే.. భవిష్యత్తులో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, జూనియర్ లెక్చరర్ హోదాలకు సైతం చేరుకోవచ్చు.
- జాతీయ స్థాయిలో నిర్వహించే సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్)లో అర్హత ఆధారంగా కేంద్రీయ విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు వంటి కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా అవకాశం దక్కించుకోవచ్చు.
- ఎడ్‌టెక్ సెక్టార్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పోర్టల్స్‌లోనూ ఉపాధ్యాయులుగా కెరీర్ సొంతం చేసుకోవచ్చు.
ఏపీ ఎడ్‌సెట్–2022 ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- రూ.వెయ్యి ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేది: 15.06.2022
- రూ.2వేల ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేది: 22.06.2022
- ఆన్‌లైన్ అప్లికేషన్‌లో వివరాల సవరణ: జూన్ 17 నుంచి జూన్ 24 వరకు;
- హాల్ టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం: జూలై 2 నుంచి
- ఎడ్‌సెట్ ఎంట్రన్స్ తేదీ: జూలై 13, 2022
- ఆన్‌లైన్ దరఖాస్తు, పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in