Skip to main content

10. సహజ వనరులు-ప్రకృతి సంపద.

10. సహజ వనరులు-ప్రకృతి సంపద.

Tenth Class ముఖ్యాంశాలు:
మానవునికి ప్రకృతి ప్రసాదించిన వనరులే సహజ వనరులు. గాలి, నీరు, అడవులు, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు వంటి మొదలైన శిలాజ ఇంధనాలు కూడా సహజ వనరులే. భూమిపై లభించే ఈ వనరులన్నీ చాలా వరకు పరిమితమైనవి. పెరుగుతున్న జనాభా అవసరాలకు వీటిని అపరిమితంగా వాడుతున్నాము. సహజ వనరుల దుర్వినియోగాన్ని నివారించడానికి సరైన యాజమాన్య విధానాలు అవసరం.దీని వలన సహజ వనరుల సక్రమ పంపిణీ జరిగి, ప్రజల జీవన విధానాలలో అభివృద్ధి జరుగుతుంది.

అభివృద్ధి, సంరక్షణ రెండింటికి సమప్రాధాన్యతనిస్తూ ప్రస్తుతం ఉన్న తరాలు మనుగడ సాగించాలి. భావితరాలకు అవసరమయ్యే సహజ వనరులను తెలివిగా, పొదుపుగా మనం పార్యావరణ హితంగా వాడితే అది ‘సుస్థిర అభివృద్ధి’ అవుతుంది. మనం సుస్థిరంగా జీవించాలంటే చాలా వనరులను జాగ్రత్తగా వినియోగిస్తూ సంరక్షించుకోవాలి.

సుస్థిర వ్యవసాయ పద్ధతులు, సహజమైన ఆహార పంటలు, అడవుల పెంపకం, జన సంరక్షణ విధానాలు, కాలుష్యాన్ని నివారించడం, జీవ వైవిధ్యాన్ని పాటించడం, సహజ వనరులను పరిమితంగా వాడటం పర్యావరణ సంరక్షణ నినాదం ‘3R’ వంటివి పాటిస్తే మానవుని మనుగడకు భరోసా ఉంటుంది.

పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రకృతి వనరులను విపరీతంగా వాడితే భవిష్యత్ తరాలకు అందించలేము. అందువల్ల శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ శిలాజ ఇంధనాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. సౌరశక్తి, పవనశక్తి, జలవిద్యుత్, పరిమిత సహజ వనరుల వినియోగం వల్ల ‘సుస్థిర అభివృద్ధి’ సుసాధ్యం అవుతుంది.
Think globally, act locally!

క్విక్ రివ్యూ
ఇంకుడు చెరువు: నీటి ప్రవాహాలకు అడ్డుగా ఉండే రాళ్ళు మట్టితో అడ్డుకట్టలు కట్టి ఏర్పాటు చేసే నీటి నిల్వలను ఇంకుడు చెరువు (Percolation Tanks) అంటారు.

కాంటూర్ పట్టీ పంటల విధానం: నేల కోతకు గురికాకుండా నేల వాలులో చెట్లను పెంచే విధానం. ఈ చెట్ల పెంపకం వల్ల వరదలు సంభవించినపుడు భూసారం కొట్టుకు పోయే అవకాశం ఉండదు.

ప్రత్యామ్నాయ ఇంధనవనరులు: శిలాజ ఇంధనాలు మండించినపుడు కాలుష్యం వెదజల్లుతాయి. విచక్షణారహితంగా వాడితే భవిష్యత్ తరాలకు లభించవు. కనుక వీటిని అదుపులో ఉంచడం కోసం ప్రత్యామ్నాయ ఇంధనవనరులను వాడవలెను. ఇవి కాలుష్యరహితమైనవి.
ఉదా॥బయోగ్యాస్, LPG సౌరశక్తి, పవన విద్యుత్ మొదలగునవి.

పర్యావరణ సంరక్షణ నినాదం ‘3R’:

  1. తగ్గించడం (Reduce)
  2. తిరిగి వాడడం (Re usese)
  3. పునః చక్రీయం (Re cycle)


ICRISAT
ఇంటర్నేషనల్‌క్రాప్ రీసెర్చీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాఫిక్స్. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఈ సంస్థలో మనదేశం వంటి ఉష్ణ మండల దేశాలలో వరి పంటపై పరిశోధనలు చేస్తారు.

చెరువు కట్టలనిర్వహణ: వర్షం నీరు వృధాగా వెళ్ళి పోకుండా ఎత్తుగాఅడ్డుకట్టలు నిర్మించి నీటిని నిల్వ చేస్తారు. వీటి ద్వారా ఎండిన బావులు, బోరుబావుల యందు తిరిగి భూగర్భ జల మట్టాలను పెంచే విధానం. ఇటీవల మేట వేసిన కట్టలను పూడిక తీస్తున్నారు.

 

 

4 మార్కుల ప్రశ్న జవాబులు

 

 

  1. సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి? ఇది వనరుల యాజమాన్యంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? (AS-1)
    జ:
    1. భావి తరాలకు అవసరమయ్యే సహజ వనరులను అందుబాటులో ఉండే విధంగా మనం పర్యావరణాన్ని ఉపయోగించుకున్నట్లయితే అది ‘సుస్థిర అభివృద్ధి’(Sustainatle development) అవుతుంది.
    2. సుస్థిరంగా జీవించాలంటే సహజ వనరులను జాగ్రత్తగా వినియోగిస్తూ సంరక్షించుకోవాలి.
    3. సుస్థిర పద్ధతుల ద్వారా వనరులను పొదుపుగా వాడుకుంటూ వ్యర్థాలను తగ్గించుకోవాలి.
    4. అభివృద్ధి, సంరక్షణ రెండింటికి సమప్రాధాన్యతనిస్తూ మనుగడ సాగించాలి.
    5. సుస్థిరాభివృద్ధి అనేది వనరుల సంరక్షణకు అత్యంత ప్రాధ్యాన్యతను ఇస్తుంది.
    6. ఏ సహజ వనరునైనా విచక్షణతో వాడినట్లయితే భవిష్యత్ తరాల వారికి అందించిన వారిమి అవుతాము.
    7. అడవుల నరికివేతను అరికట్టి విలువైన వన్య ప్రాణులను, కలపను, ఔషధాలను, జీవ వైవిధ్యా కాపాడగలుగుతున్నాము.
    8. వాహనాలలో CNG వాడకం, ఇళ్ళలో సౌరశక్తిని వినియోగించడం, విద్యుత్ ఆదాకోసం CFL,LED బల్బుల వినియోగం వంటివి సుస్థిరాభివృద్ధి వలన సత్ఫలితాలను అందించగలుగుతున్నాము.

      Tenth Class
  2. అడవుల సంరక్షణ విధానాలను కొన్నింటిని సూచించండి. (AS-1)
    జ: నేడు అటవీ సంరక్షణ అనేది అంతర్జాతీయ సమస్యగా మారింది. కావున అడవుల సంరక్షణకు అటవీ శాఖతో పాటు ఇతర శాఖల మధ్య సమన్వయం పెంచుతూ, ప్రాంతీయ ప్రజలలో అవగాహన కల్పించడం అనివార్యంగా భావించాలి. అందుకు ఈ క్రింది సూచనలను పాటించవలసినదిగా అభిప్రాయ పడుతున్నాను.
    1. విచక్షణారహితంగా అడవులలో చెట్లనరికి వేతను అరికట్టాలి. అనుమతులు లేని ఇలాంటి చర్యలను నిషేధించాలి.
    2. నరికి వేతకు గురైన చెట్ల స్థానంలో త్వరగా పెరిగే మొక్కలను నాటి వాటి స్థానాన్నీ భర్తీ చేయాలి.
    3. వంట చెరకు కోసం అడవులలో చెట్ల నరకకుండా బీడు భూములలో చెట్లను పెంచాలి.
    4. వన మహోత్సవం, NGC వంటి కార్యక్రమాలు చేపట్టి మొక్కలను నాటించాలి. వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించాలి.
    5. అక్రమ కలప రవాణాను నిర్మూలించుటకు అటవీ సరిహద్దు ప్రాంతాలలో చెక్ పోస్టుల సంఖ్య పెంచాలి.
    6. అడవులు, కొండలు, పర్వతాల చుట్టూ మొక్కల పెంపకం చేపట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి.
    7. ‘‘సామాజిక అడవుల పెంపకం’’చేపట్టాలి.
    8. గడ్డి భూములను సంరక్షిస్తూ చెట్ల పెంపకాన్ని చేపట్టాలి.
    9. అడవులలో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
    10. అటవీ సంరక్షణకు కృషి చేస్తున్న బృందాలకు, పర్యావరణ ప్రేమికులను ప్రోత్సహించుట ద్వారా మనం అడవులను సంరక్షించుకోవచ్చు.
  3. స్థానిక పెట్రోల్ బంకుకు వెళ్ళి నిహ్వాహకుడితో శిలాజ ఇంధనాల వినియోగం గురించి ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళి రూపొందించండి? (AS - 2)
    జ:
    1. మీరు రోజుకు ఎన్ని లీటర్ల పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారు?
    2. రోజురోజుకు చమురుధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
    3. పెట్రోల్, డీజిల్‌లు ఎక్కడి నుండి దిగుమతి అవుతున్నాయి?
    4. పెట్రోలియం నిల్వలు పూర్తిగా భూమిలో తరిగి పోతే పరిస్థితి ఏమిటి?
    5. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతున్నా, వినియోగం తగ్గుతోందా?
    6. Un leaded petrol విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా?
    7. ఇంధన వినియోగానికి, రవాణా వ్యవస్థకు ఏమైనా సంబంధం ఉందా?
    8. పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయ ఇంధనాలు ఏమైనా ఉన్నాయా?
  4. పర్యావరణ పరిరక్షణకు అవసరమైన 3R పద్ధతులను వివరించండి?(AS - 1)
    జ:
    పర్యావరణ సంరక్షణకు ఉపకరించే నినాదం ‘3R పద్ధతి’ 3R అనగా - Reduce, Re use, Re cycle
    1. తగ్గించడం (Reduce) : వనరులను పరిమితంగా, వృధా చేయకుండా వినియోగించడం, కారుతున్న నల్లాలను, పంపులను సరిచేయడం, స్నానాల గదిలో షవర్ల వాడకం తగ్గించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించవచ్చు. అవసరం లేని సమయాల్లో విద్యుద్దీపాలను, ఫ్యాన్లను ఆర్పడం ద్వారా కొంత విద్యుచ్ఛక్తిని పొదుపు చేయవచ్చు.
    2. పునర్వినియోగం (Re use), :చెత్తలో పడేయకుండా అవకాశాన్ని బట్టి తిరిగి ఉపయోగించుకోవడం కాగితాన్ని తిరిగి వాడటం వలన మొక్కలను కాపాడటమే గక, కాలుష్యాన్ని తగ్గించిన వారమవుతాము.
    3. పునః చక్రీయం (Re cycle): ఇది అన్ని సార్లు సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకు ప్లాస్టిక్ వల్ల ఉపయోగాలకంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ప్లాస్టిక్‌ను పునః చక్రీయం చేయడానికి ముందు వాటిని వేరుచేయాలి. లోహాలను కూడా ఒక్కోరకంగా రీసైకిల్ చేయాల్సి ఉంటుంది. వీటిని రీసైక్లింగ్ ప్రక్రియకు గురిచేసేటపుడు జాగ్రత్తగా ప్రతి రకాన్ని వేరు చేయాల్సి ఉంటుంది.
  5. నీటి వనరుల సౌలభ్యాన్ని బట్టి వ్యవసాయ పంటల ఎంపిక, విధానాలు ఎలా ఉండాలో రైతులకు అవగాహన కలిగించడానికి నినాదాలు తయారు చేయండి. (AS-1)
    జ:
    - నీటి వనరుల అంచనా - పంటల దిగుబడిగి నిచ్చెన
    -బిందు సేద్యం చేస్తుంది - పంట దిగుబడి సుసాధ్యం
    -పంట మార్పిడి అవలంభించు - అధిక ఫలసాయం పొందు
    -ఆరుతడి పంటలు - అభివృద్ధికి బాటలు
    -వాణిజ్య పంటలు కంటే - ఆహార పంటలే ముద్దు
    -నీటి సౌలభ్యం పరిమితం - మెట్ట పంటలసాగు అనివార్యం
    -రైతన్నా మేలుకో - నీటి వనరులను కాపాడుకో
    - తెగుళ్ళు సోకని పంటరకాలను ఎన్నుకో - ఆరోగ్యాన్ని కాపాడుకో

 

2 మార్కుల ప్రశ్న జవాబులు

 

  1. భూగర్బ జలం వేగంగా తరిగిపోతున్నది. దీనికి ప్రత్యామ్యాయాలు ఏమిటి? (AS-1)
    జ: ఋతుపవనాల ఆగమనం, సగటు వర్షపాతం సక్రమంగా లేని కారణంగా భూగర్భజలాల వినియోగం పై ఒత్తిడి పెరిగింది. లోతైన గొట్టపు బావులు, బోరు బావులు తవ్వడం వలన భూగర్భ జలాలు బాగా తరిగిపోతున్నాయి. దీని సంరక్షణ కోసం
    1. వర్షపు నీటిని నిల్వ చేయడం
    2. వీలైనన్నీ ఇంకుకు గుంటలు, ఇంకుడు చెరువులు
    3. భూగర్భ జలాన్ని పరిమితంగా వాడటం
    4. అడవుల పెంపకం వంటి ప్రత్యామ్నాయాల ద్వారా భూగర్భ జలాన్ని పెంచవచ్చు.
  2. పెట్రోలును పొదుపుగా వాడుకోవడానికి నీవిచ్చే సూచనలు ఏమిటి? (AS-6)
    జ:
    1. అధిక మైలేజీ ఇచ్చే వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
    2. దూరప్రయాణాలకి పబ్లిక్ వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
    3. వీలైనంత తక్కువ దూరాలకు సైకిళ్ళు వాడాలి.
    4. ఒక్కరే ఒక వాహనం వాడటం కంటే ప్రయాణాన్ని పంచుకోవటం అలవాటు (Shared journey)చేసుకోవాలి.
    5. ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
    6. ప్రతీ ఇంటికి ఒకే వాహనం పరిమితి పాటించాలి.
  3. పల్లె ప్రాంతాలలో బావులు, చెరువులు ఎండి పోతున్నాయి. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఇందుకు కారణాలు ఊహించండి. (AS-2)
    జ:
    1. ఋతుపవనాలు అనుకూలించక పోవడం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనడం.
    2. ప్రకృతి వైపరీత్యాల వల్ల, వరదలు సంభవించినపుడు చెరువుల్లో పూడిక ఏర్పడటం
    3. లోతైన గొట్టపు బావులు, బోరు బావులు తవ్వడం వలన భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి.
    4. వర్షపు నీటిని నిల్వచేసే ఇంకుడు గుంతలు లేకపోవడం మరో ప్రధాన లోపం.
  4. పునరుద్ధరింపదగిన వనరులు, పునరుద్ధరింపలేని వనరులు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి (AS-1)
    జ:
    1. కొన్ని సహజ వనరులు ఉపయోగించిన తర్వాత కూడా తిరిగి ఉత్పత్తి అవుతాయి. వీటిని పునఃరుద్ధరింపదగిన వనరులు అంటారు.
      ఉదా॥సౌరశక్తి, పవనశక్తి, జల విద్యుత్
       
    2. కొన్ని సహజ వనరులు ఉపయోగించిన తర్వాత భవిష్యత్తులో ఉత్పత్తి చేయబడవు. వీటిని పునరుద్ధరింపలేని వనరులు అంటారు.
      ఉదా॥శిలాజ ఇంధనాలు.
  5. సహజ వనరుల వినియోగాన్ని తగ్గించడానికి నీవిచ్చే సూచనలు ఏమిటి? (AS-6)
    జ:
    1. విద్యుత్‌కు బదులు సోలార్ కుక్కర్, సోలార్ హీటర్లుతో పాటు మొత్తంగా సోలార్ శక్తిని వాడేందుకు ప్రయత్నించడం.
    2. ఫిలమెంట్ బల్బుల స్థానంలో విద్యుత్‌ను ఆదా చేసే CFL, LED బల్బులను ఉపయోగించడం.
    3. అవసరం లేని సమయాలలో విద్యుత్ వాడకాన్ని నిలిపివేయడం
    4. కొద్ది దూరంలోని పనులకు సైకిల్ నడుపుట, ప్రయాణాలకు పబ్లిక్ రవాణా వ్యవస్థను వినియోగించుట ఉత్తమం.
    5. ఇంటిలోపల, బయట నీటి పైపుల లీకేజీని అరికట్టి నీటివనరులను సంరక్షిస్తాను.
  6. ఆదిమ జాతి ప్రజలు సహజ వనరులను ఎలా ఉపయోగించుకుంటారు?(AS-1)
    జ:
    1. తెలంగాణ రాష్ట్రంలోని కోయ, కొండరెడ్డి, గోండు గిరిజనులు, ఆంధ్రప్రదేశ్ లోని సవర, దగబ మొదలైన గిరిజనులను ‘ఆదిమ జాతి ప్రజలు’ అంటారు.
    2. వీరు అడవిలోని సహజ వనరులను అవసరం మేరకు వినియోగించుకుంటారు.
    3. వీరు ఎక్కువగా పోడు వ్యవసాయం, ప్రాకృతిక విధానంలో సహజ పంటలను పండిస్తారు.
    4. పర్యావరణం పట్ల శ్రద్ధాశక్తులను కనబరుస్తారు.
    5. వీరు వెదురు, చీపుర్లు, తునికాకు, మద్దిబంక, పుట్టతేనే, ఇప్పపూలు, కుంకుడు కాయలు, శీకాయలు, కరక్కాయలు, చిల్లగింజలు అడవి నుంచి సేకరించి అమ్ముకొని జీవిస్తారు.
  7. భూగర్భ జలం కాపాడాలంటే ఏం చేయాలి? (AS-1)
    జ: అన్ని జీవులకు ప్రాణాధారం నీరు. అందువలన నీటి వనరులను, భూగర్భ జలమును సంరక్షించాలి. దీని కోసం
    1. ఇంకుడు గుంటలు నిర్మించి భూగర్భజలం పెంచాలి
    2. చెరువులు, చెక్ డ్యామ్‌లు నిర్మించి నీటిని ఇంకేలా చేయాలి.
    3. వర్షపు నీటి నిల్వకు చెరువులు, కాలువలు, పూడిక తీయించాలి
    4. వ్యవసాయంలో సూక్ష్మ నీటి పారుదల పద్ధతులు వాడాలి.
    5. పారిశ్రామిక వ్యర్థాలను అధిక గాఢతతో భూమిలోకి పంపించకూడదు.

 

1 మార్కు ప్రశ్న జవాబులు

 

  1. శిలాజ ఇంధనాలను ఎందుకు పరిమితంగా వాడాలి?
    జ: బొగ్గు, పెట్రోలు, డీజిల్, సహజ వాయువులు అనేవి శిలాజ ఇంధనాలు. వీటిని పరిమితంగా వాడాలి. ఎందుకంటే ఇది పునరుద్ధరింపలేని వనరులు. ఒకవేళ అంతరించిపోతే - భవిష్యత్తులో వీటిని పొందాలంటే కొన్ని వేల సంవత్సరాలు సమయం పడుతుంది.
     
  2. బిందు సేద్యం (Drip irrigation) అనగా నేమి?
    జ:
    నీటిని కాలువల ద్వారా కాకుండా సన్నని నీటి తుంపరల ద్వారా పంటమొక్కలకు అందించే పద్ధతిని ‘బిందు సేద్యం’ అంటారు. దీనినే నేడు డ్రిప్ ఇరిగేషన్ (Drip irrigation) గా పిలుస్తున్నారు.
     
  3. ICRISAT గురించి మీకేమి తెలుసు?
    జ: ICRISAT అనగా International crop Research Institute for semi Arid Tropics ఇది హైదరాబాద్ లోని పటాన్ చెరు ప్రాంతంలో ఉంది. ఈసంస్థలో మెట్ట పంటలపై పరిశోధనలు జరుపుతారు.
     
  4. సుస్థిర అభివృద్ధి అనగా నేమి?
    జ: భవిష్యత్ తరాల వారి జీవన విధానానికి భరోసా కల్పిస్తూ మనం అభివృద్ధి చెందే విధానాన్ని ‘‘సుస్థిర అభివృద్ధి’’ (Sustainable Development) అంటారు. భవిష్యత్ తరాల వారికి కూడా సహజవనరులు గాని శిలాజ ఇంధనాలు గాని అందేలా మనం పొదుపుగా వాడుతూ అభివృద్ధి చెందడమే సుస్థిర అభివృద్ధి.
     
  5. ONGC గురించి మీకు తెలిసినది వ్రాయండి.
    జ: ONGC అనగా Oil and Natural Gases Corporation Limited. ఇది సహజ వాయువుల నిక్షేప కేంద్రం. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద గోదావరి నదిలో కేజీ బెసిన్ దగ్గర ఉంది. గోదావరి అడుగు భాగంలో డ్రిల్లింగ్ చేసి సహజ వాయువులను యంత్రాల ద్వారా వెలికి తీస్తున్నారు. ONGC ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్‌లో ఉంది.
     
  6. ‘గ్లోబల్ వార్మింగ్’ అనగా నేమి?
    జ: అడవులను విచక్షణారహితంగా నరికి వేయడం వల్ల వన్యజాతులు నాశనమవుతాయి. హరిత గృహ వాయువులు విడుదలై భూమిపై అధిక వేడి పెరుగుతుంది. దీనినే ‘గ్లోబల్ వార్మింగ్’ అంటారు.
     
  7. బయోడీజిల్ అనగా నేమి?
    జ: పెట్రోల్, డీజిల్ కు ప్రత్యామ్నాయ ఇంధనమే బయోడీజిల్. దీని ఉత్పత్తికి జట్రోపా కర్కాస్ విత్తనాలు వాడతారు. బయోడీజిల్ ఉత్పత్తి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలయన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకొన్ని జట్రోపా మొక్కల పెంపకానికి కాకినాడ వద్ద 200 ఎకరాల స్థలాన్ని సేకరించింది.
     
  8. అడవుల నరికివేత వల్ల నష్టమేమిటి? (2 మార్కులకు అడిగే అవకాశం...)
    జ: ప్రతి సం॥భూమిపై 36 మిలియన్ల ఎకరాల అడవులు నరికివేయబడుతున్నాయి. దీని వల్ల అనేక వన్యజాతుల ఆవాసాలు నాశనమవుతున్నాయి. వర్షపాతం తక్కువగా ఉంటుంది. హరిత గృహ వాయువులు విడుదలై భౌగోళిక వెచ్చదనం (Global warming) ఏర్పడుతుంది. ఒక వేళ అకాల వర్షాలు, వరదలు సంభవిస్తే నేలకోత ఎక్కువగా ఉంటుంది. అడవుల నరికివేత వల్ల ముఖ్యంగా అటవీ ఉత్పత్తుల సేకరణ, వంట చెరకు, ఔషధ మొక్కలు, మనుగడ కోసం అడవులపై ఆధారపడి జీవించే ఆదివాసీ గిరిజనులు నష్టపోతున్నారు.
     
  9. పర్యావరణ పరిరక్షణ పద్ధతులుగా పెర్కొనే 3R విస్తరించుము?
    జ: 3R అనగా ---Reduce - తగ్గించడం
    Re use - తిరిగి వాడటం
    Re Cycle - పునఃచక్రీయం
     
  10. భూగర్భ జలాలు తగ్గి పోకుండా ఉండడానికి అనుసరించే పద్ధతులు ఏవి?
    జ: ఇంకుడు గుంతలు, కాంటూర్ కందకాలు, చెక్ డ్యామ్‌లు.

 

 

1/2 మార్కు ప్రశ్న జవాబులు

 

 

  1. తక్కువ నీటి సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో రైతులు అనుసరించాల్సిన విధానం( )
    1. స్వల్పకాలిక పంటలు పండించడం
    2. వాణిజ్య పంటలు పండించడం
    3. బిందు సేద్యం చేయడం.
    4. పంట విరామం ప్రకటించడం

    ఎ. 1, మరియు 2,
    బి. 1,2 మరియు 3
    సి. 1,మరియు4
    డి. 3 మరియు 4
  2. ఇంకుడు చెరువుల ప్రయోజనం ( )
    ఎ. భూగర్భజలంపెంపు
    బి. నీటి పారుదల
    సి. వ్యవసాయం
    డి. పైవన్నీ
  3. ఈ క్రింది వానిలో శిలాజ ఇంధనం కానిది ( )
    ఎ. LPG
    బి. CNG
    సి.బయోగ్యాస్
    డి. సహజవాయువు
  4. ICRISAT గల నగరం ( )
    ఎ. కలకత్తా
    బి.హైదరాబాద్
    సి. బెంగళూర్
    డి. చెన్నై
  5. 1998-2002 మధ్య కాలంలో భూగర్భ నీటి స్థాయి తగ్గుదల ( )
    ఎ. 2 మీ.
    బి. 3మీ.
    సి.4మీ.
    డి.5మీ
  6. ‘చిప్కో’ ఉద్యమం దీనికి సంబంధించినది ( )
    ఎ.పులుపు
    బి.సింహాలు
    సి.చెట్లు
    డి. ఏదీకాదు.
  7. క్రింది వాటిలో పునరుద్ధరింపబడని వనరు ( )
    ఎ. పెట్రోలు
    బి. గాలి.
    సి.నీరు
    డి. గాలి
  8. 3R పద్ధతిలోని అంశం కానిది ( )
    ఎ. తగ్గించడం vబి. తిరిగి వాడటం
    సి. పునఃచక్రీయం
    డి. పారేయటం
  9. ప్రతి సంవత్సరానికి నరికి వేతకు గురవుతున్న అడవుల శాతం ( )
    ఎ.15%
    బి.18%
    సి.21%
    డి.33%
  10. .............ఇది దేనికి సంబంధించిన గుర్తు ( )
    ఎ. తగ్గించడం
    బి. పునర్వినియోగం
    సి. పునఃచక్రీయం
    డి. ఏదికాదు.
  11. ప్రపంచ సంరక్షణా విధానాన్ని ప్రతిపాదించిన సంస్థ .................
  12. నేలసారం పెంచడానికి ...........పంటలు తోడ్పడతాయి.
  13. బీడు భూముల అభివృద్ధికి................మొక్కలు అనుకూలం
  14. ఆంధ్ర ప్రదేశ్‌లో సహజవాయు నిక్షేపాలు కలిగిన ప్రాంతం.................
  15. ప్రపంచ అటవీ దినోత్సవం.................
  16. CNG సంక్షిప్త రూపం ..................
  17. LPG సంక్షిప్త రూపం ..................
  18. బయోడీజిల్‌ని ఉత్పత్తి చేసే మొక్క....................
  19. ప్రకృతి సేద్య రంగంలో ప్రసిద్ధి చెందిన’’ ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు ...................
  20. పునరుద్ధరింపదగిన చౌక వనరు...................
  21. FAO విస్తరణ రూపం.....................
  22. UNDP విస్తరణ రూపం...................
  23. 2012 సంవత్సరంలో యునెస్కో పర్యావరణ అవార్డు పొందిన పర్యావరణ వేత్త.........
  24. వరిసాగు...........................ప్రదేశాలకు అనువైనది.
  25. చిప్కో ఉద్యమ నాయకుడు...................
  26. కేంద్ర ప్రభుత్వం నీటి సంరక్షణ కొరకు 2015, జనవరి 13-17 వరకు జరుపతలపెట్టిన కార్యక్రమం..........................

 

గ్రూప్-ఎ

 

గ్రూప్-బి

27. ICRISAT

( )

ఎ. గోదావరి

28. ONGC

( )

బి. హైదరాబాద్

29. SRSP

( )

సి. KG బేసిన్

30. మానస్ శాంక్చువరి

( )

డి. కాకినాడ

31. బయోడీజిల్ ప్లాంట్

( )

ఇ. పులులు

 

 

 

గ్రూప్-ఎ

 

గ్రూప్-బి

1. చిప్కో

( )

ఎ. జట్రోపా

2. నర్మదా బచావో

( )

బి. బీడు భూముల్లో పెంచు మొక్కలు

3. బయోడీజిల్

( )

సి. CO2

4. గ్లైరిసిడియా

( )

డి. మేధా పాట్కర్

5. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్

( )

ఇ. సుందర్‌లాల్ బహుగుణ

 


జవాబులు:
1)బి; 2)ఎ; 3)సి; 4)బి; 5)బి; 6)సి; 7)ఎ; 8)డి; 9)ఎ; 10)సి;
11)IUCN; 12)లెగ్యుమినేసి; 13) గ్లైరిసిడియా; 14) కాకినాడలోని కె.జి బేసిన్ ;15) మార్చి 21; 16) Compressed natural Gas ; 17)Liquid Petrolium Gas ; 18) జట్రోపా కార్కస్ ; 19) సుభాష్ పాలేకర్; 20)సౌరశక్తి ;
21)Food And Agriculture Organisation ; 22) United Nations Development Programme ; 23) గోకా రామస్వామి (వరంగల్ జిల్లా); 24) అధిక నీటి పారుదల ; 25) సుందర్‌లాల్ బహుగుణ ;26) మనజలం - మన జీవితం; 27)బి ; 28) సి ; 29 ఎ ; 30)ఇ ;
31) డి ; 32)ఇ ; 33) డి ; 34) ఎ ; 35)బి ; 36) సి.

 

 

 

Published date : 29 Nov 2023 02:52PM

Photo Stories