Skip to main content

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయండి : హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు మార్చి 20న ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మార్చి 21న‌ జరగనున్న పరీక్ష యథాతథంగా కొనసాగించాలని పేర్కొంది. మార్చి23 నుంచి మార్చి 30వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు తెలిపింది. మార్చి 29న అత్యుతన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

తెలంగాణలో మార్చి 19 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణను సవాలు చేస్తూ మందడి బాలకృష్ణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్‌ పాటించడం లేదని బాలకృష్ణ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు మార్చి 20న‌ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పరీక్షా కేంద్రాల్లో మౌళిక వసతులు, శానిటైజేషన్‌ ఏర్పాట్లు సరిగా లేవని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండటంతో కరోనా విస్తరించే అవకాశం ఉందన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించింది. మార్చి 23 నుంచి మార్చి 30 వరకు జరిగే పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మార్చి 21న‌ జరిగే పరీక్షకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Published date : 20 Mar 2020 03:37PM

Photo Stories