Skip to main content

10th class exams in Andhra Pradesh: పేపర్లు ఆరు.. సిద్ధమవ్వాల్సిన తీరు ఇలా

Latest changed pattern of 10th class exams in AP

ఆంధ్రప్రదేశ్‌లో.. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లలో మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు నమూనా ప్రశ్న పత్రాలను బ్లూ ప్రింట్‌ను కూడా ఎస్‌ఎస్‌సీ బోర్డ్‌ విడుదల చేసింది. దీంతో ప్రతి సబ్జెక్ట్‌లోనూ.. రెండు పేపర్లకు బదులు.. ఒకే పేపర్‌లో పరీక్ష రాసేందుకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులు మారిన కొత్త విధానానికి అనుగుణంగా పాఠ్యాంశాల అధ్యయనం సాగించాలని సబ్జెక్ట్‌ టీచర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో...ఏపీలో తాజాగా మారిన పదో తరగతి పరీక్షల విధానం, పరీక్షల స్వరూపం, సబ్జెక్ట్‌ల వారీగా సన్నద్ధమవ్వాల్సిన తీరు తదితర అంశాలపై విశ్లేషణ...

  • ఏపీలో ఇక నుంచి ఆరు పేపర్లలో పదో తరగతి పరీక్షలు
  • పేపర్‌-1, పేపర్‌-2 విధానానికి ఫుల్‌స్టాప్‌
  • ప్రతి పేపర్‌కు వంద మార్కులు
  • ఎన్‌ఎస్, పీఎస్‌ కలిపి ఒక పేపర్‌గా నిర్వహణ
  • ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు

3:15 గంటలు.. 100 మార్కులు

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల విషయంలో మారిన నిబంధనల ప్రకారం- ప్రతి సబ్జెక్ట్‌లోనూ పేపర్‌-1,2 కలిపే నిర్వహించనున్నారు. సైన్స్‌ సబ్జెక్ట్‌ను పార్ట్‌-ఎ, పార్ట్‌-బిలుగా వర్గీకరించారు. పార్ట్‌-ఎలో భౌతికరసాయన శాస్త్రం, పార్ట్‌-బిలో జీవశాస్త్రం సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం వంద మార్కులకు 3:15 గంటల వ్యవధిలో పరీక్ష జరగనుంది. పరీక్ష వ్యవధిలో.. ప్రశ్న పత్రాన్ని చదివి అర్థం చేసుకునేందుకు 15 నిమిషాల సమయం కల్పిస్తారు.

బ్లూ ప్రింట్, మోడల్‌ పేపర్స్‌ విడుదల

పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లుగా నిర్వహించాలనే నిర్ణయం నేపథ్యంలో.. ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డ్‌.. విద్యార్థుల సౌలభ్యం కోసం సబ్జెక్ట్‌ వారీగా సిలబస్, బ్లూ ప్రింట్, మోడల్‌ కొశ్చన్‌ పేపర్స్‌ను సైతం వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ఫలితంగా విద్యార్థులు వాటిని పరిశీలించి.. ఆయా సబ్జెక్ట్‌లు, చాప్టర్లకు ఇచ్చిన వెయిటేజీని గుర్తించి దానికి అనుగుణంగా ప్రిపరేషన్‌ సాగించే అవకాశం లభిస్తుంది.

AP 10th Class Public Exams 2022–23 : టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు ఏఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వ‌స్తాయంటే..?

ఒత్తిడి తగ్గించడమే ప్రధాన ఉద్దేశం

పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లుగానే నిర్వహించాలనే నిర్ణయానికి ప్రధాన ఉద్దేశం.. విద్యార్థులకు ఒత్తిడి తగ్గించడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి సబ్జెక్ట్‌లో రెండు పేపర్ల విధానంలో పరీక్షల సమయం సమీపించినప్పుడు ఒత్తిడికి గురవుతున్నారని, అదే విధంగా ఒక పేపర్‌లో సరిగా సమాధానాలు ఇవ్వకపోతే ఆ ప్రతికూల ప్రభావం మరో పేపర్‌లో పరీక్ష ప్రదర్శనపై పడుతోందని అంటున్నారు. ఒకే పేపర్‌గా పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థులు 'రెండు పేపర్లు' అనే ఆందోళన నుంచి విముక్తి లభిస్తుంది. తద్వారా సదరు సబ్జెక్ట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. 

మ్యాథమెటిక్స్‌ ఇలా

మ్యాథమెటిక్స్‌ సబ్జెక్ట్‌లో మొత్తం నాలుగు విభాగాలుగా 33 ప్రశ్నలు అడుగుతారు. మొదటి విభాగంలో ఒక మార్కు ప్రశ్నలు 12(12 మార్కులు), రెండో విభాగంలో రెండు మార్కుల ప్రశ్నలు 8(16 మార్కులు), మూడో విభాగంలో నాలుగు మార్కుల ప్రశ్నలు 8(32 మార్కులు), నాలుగో విభాగంలో 8 మార్కుల ప్రశ్నలు 5 (40 మార్కులు) ఉంటాయి. నాలుగో విభాగంలోని ఎనిమిది మార్కుల ప్రశ్నలకు ఇంటర్నల్‌ ఛాయిస్‌ విధానం ఉంది. 

ఏపీ ప‌దోత‌ర‌గ‌తి స్ట‌డీమెటీరియ‌ల్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్ పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

సోషల్‌ పేపర్‌

సోషల్‌ పేపర్‌ కూడా మ్యాథమెటిక్స్‌ పేపర్‌ మాదిరిగానే 4 విభాగాలుగా ఉంటుంది. మార్కుల కేటాయింపు కూడా అదే తీరులో జరుగుతుంది. 

జనరల్‌ సైన్స్‌

  • జనరల్‌ సైన్స్‌ను పార్ట్‌-ఎ, పార్ట్‌-బిలుగా పేర్కొన్నారు. పార్ట్‌-ఎలో భౌతిక రసాయన శాస్త్రం నుంచి, పార్ట్‌-బిలో జీవ శాస్త్రం నుంచి నాలుగు విభాగాల చొప్పున ప్రశ్నలు అడుగుతారు. 
  • పార్ట్‌-ఎలో మొదటి విభాగంలో ఒక మార్కు ప్రశ్నలు 6 (6 మార్కులు), రెండో విభాగంలో 2 మార్కుల ప్రశ్నలు 4 (8 మార్కులు), మూడో విభాగంలో 4 మార్కుల ప్రశ్నలు 3 (12 మార్కులు), నాలుగో విభాగంలో 8 మార్కుల ప్రశ్నలు 3 (24 మార్కులు) ఉంటాయి.
  • పార్ట్‌-బిలో మొదటి విభాగంలో ఒక మార్కు ప్రశ్నలు 6 (6 మార్కులు), రెండో విభాగంలో రెండు మార్కుల ప్రశ్నలు 4 (8 మార్కులు), మూడో విభాగంలో నాలుగు మార్కుల ప్రశ్నలు 5 (20 మార్కులు), నాలుగో విభాగంలో ఎనిమిది మార్కుల ప్రశ్నలు 2 (16 మార్కులు) ఉంటాయి.

ఇంగ్లిష్‌ మూడు భాగాలుగా

  • ఇంగ్లిష్‌ ప్రశ్న పత్రం మూడు భాగాలుగా 35 ప్రశ్నలతో ఉంటుంది. పార్ట్‌-ఎలో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లో రెండు మార్కుల ప్రశ్నలు 5 (10 మార్కులు), పద్యంలో రెండు మార్కుల ప్రశ్నలు మూడు (6 మార్కులు), మరో ప్యాసేజ్‌లో రెండు మార్కుల ప్రశ్నలు రెండు (4 మార్కులు) అడుగుతారు. దీంతోపాటు పోస్టర్‌ ఆధారిత ప్రశ్నలు అయిదు అడుగుతారు. వీటికి 10 మార్కులు. 
  • సెక్షన్‌-బి నుంచి గ్రామర్, వొకాబ్యులరీపై 40 మార్కులకు 1/4 మార్కు, 1/2 మార్కు, 1 మార్కు, 2 మార్కుల ప్రశ్నలు అడుగుతారు. 
  • సెక్షన్‌-సి నుంచి సృజనాత్మక వ్యక్తీకరణ కింద పది మార్కుల ప్రశ్నలు 3 (30 మార్కులు) అడుగుతారు.

10th Class Model Papers: టెన్త్ పేపర్ ఎలా ఉంటుంది?.. మోడల్ పేపర్లు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండిలా..

తెలుగు.. పద్య,గద్య భాగాలు, వ్యాకరణం

  • తెలుగు సబ్జెక్ట్‌లో..పద్య,గద్య భాగాలతోపాటు వ్యాకరణం నుంచి ప్రశ్నలు అడుగుతారు. తెలుగు పేపర్‌ను మొత్తం 3 భాగాలుగా పేర్కొన్నారు.
  • మొదటి భాగంలో ఒక పద్యానికి ప్రతిపదార్థం(8 మార్కులు), పద్య పూరణ(8 మార్కులు), మరో 8 మార్కులకు వాక్యాల అమరిక ప్రశ్నలు అడుగుతారు. అదే విధంగా అపరిచిత గద్యం నుంచి 8 మార్కుల ప్రశ్న ఉంటుంది.
  • రెండో విభాగంలో వ్యక్తీకరణ, సృజనాత్మతకతకు చెందిన ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 36 మార్కులకు ఉండే ఈ విభాగంలో 4 మార్కుల ప్రశ్నలు 3(12 మార్కులు), 8 మార్కుల ప్రశ్నలు 3 (24 మార్కులు) ఉంటాయి. 
  • మూడో విభాగంలో భాషాంశాలకు సంబంధించి 1 మార్కు ప్రశ్నలు, రెండు మార్కుల ప్రశ్నలు అన్ని కలిపి 32 మార్కులకు స్వల్ప సమాధాన ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు.

ఆ మూడు సబ్జెక్ట్‌లు కీలకం

విద్యార్థులు ప్రిపరేషన్‌ క్రమంలో ప్రధానంగా మూడు సబ్జెక్ట్‌లు కీలకంగా నిలవనున్నాయి. అవి మ్యాథమెటిక్స్, జనరల్‌ సైన్స్, సోషల్‌. వీటిలో రాణించడానికి సబ్జెక్ట్‌ నిపుణుల సలహాలు.. 

మ్యాథమెటిక్స్‌

ఎస్‌ఎస్‌సీ బోర్డ్‌ బ్లూ ప్రింట్‌ ప్రకారం 14 చాప్టర్లు ఉన్న మ్యాథమెటిక్స్‌లో ప్రతి చాప్టర్‌లో సిలబస్‌కు అనుగుణంగా పూర్తిగా అధ్యయనం చేయాలి. ప్రాబ్లమ్స్‌ను సాల్వ్‌ చేయడంతోపాటు కారణాల నిరూపణ, వ్యక్తీకరణ, ఒక సమస్యను ఇతర అంశాలతో అనుసంధానం చేయడం వంటి నైపుణ్యాలు పొందాలి. ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలను నోట్స్‌ రూపంలో రాసుకుంటే.. రివిజన్‌ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది. టెక్స్‌›్టబుక్‌లో ప్రతి చాప్టర్‌ చివరన ఇచ్చే సమస్యలను తప్పకుండా ప్రాక్టీస్‌ చేయాలి. గ్రాఫ్‌లు, నిర్మాణాత్మక సమస్యలకు సమాధానాలు కనుగొనేందుకు ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.     
-వై.వనంరాజు

జనరల్‌ సైన్స్‌.. పీఎస్

ఫిజికల్‌ సైన్స్‌లో మంచి మార్కులు సాధించాలంటే.. అప్లికేషన్‌ అప్రోచ్‌తో చదవడం ఎంతో ముఖ్యం. ఆయా చాప్టర్లకు సంబంధించిన అంశాలను నిజజీవిత సంఘటనలతో అన్వయించుకుంటూ ప్రిపరేషన్‌ సాగించాలి. విషయ అవగాహనతోపాటు, ప్రశ్నించడం-పరికల్పన చేయడం; ప్రయోగాలు-క్షేత్ర పర్యటనలు; సమాచార నైపుణ్యాలు-ప్రాజెక్ట్‌ పనులు; పటాలు-వాటి ద్వారా భావ ప్రసారం, వంటి వాటిపైనా కృషి చేయాలి. ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభించి మంచి మార్కులు సొంతమవుతాయి. 

What After Tenth: ఎన్నో అవకాశాలు... కోర్సు ఎంపికలో ఆసక్తి ప్రధానం

జీవశాస్త్రం

జీవశాస్త్రం సబ్జెక్ట్‌లోనూ అవగాహన, సొంత విశ్లేషణ నైపుణ్యాలు కీలకంగా మారుతున్నాయి. ఇందుకోసం ఫ్లో చార్ట్‌లు, బ్లాక్‌ డయాగ్రమ్స్‌లను సొంతంగా రూపొందించుకోవాలి. విశ్లేషణాత్మక, తులనాత్మక అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నేర్చుకున్న అంశాలను వాస్తవ పరిస్థితులతో అన్వయించే విధంగా చదవాలి. ప్రయోగాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ప్రయోగ నిర్వహణ ప్రక్రియపై అవగాహన పొందడం ఎంతో మేలు చేస్తుంది. ఆయా అంశాలకు సంబంధించి చాప్టర్‌లో పేర్కొన్న అభ్యాసాలకు సంబంధించి విశ్లేషణ, కారణాలు, పోలికలు, బేధాలు తెలుసుకుంటూ చదవాలి. డయాగ్రమ్స్‌ విషయంలో భాగాలను గుర్తించడమే కాకుండా.. వాటి ప్రాముఖ్యతను వర్ణించగలిగే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి. 
-పి.నీలకంఠం

సోషల్‌ స్టడీస్‌

సోషల్‌ స్టడీస్‌లో మంచి మార్కులు సాధించడానికి విద్యార్థులు సమకాలీన అంశాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. టెక్స్‌›్ట బుక్‌లో ఒక అంశం గురించి ఉంటే.. దానికి సంబంధించి మన నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలతో పోల్చుకుంటూ చదవడం ఎంతో లాభిస్తుంది. అంతేకాకుండా సమకాలీన అంశాల విషయంలో ప్రతిస్పందన, ప్రశ్నించడం, ప్రశంస/అభినందనలపై సా«ధన చేయడం ఎంతో అవసరం. అవగాహనకు సంబంధించి ఒక నిర్దిష్ట అంశాన్ని చదివి, సొంత పరిజ్ఞానంతో రాసే విధంగా నైపుణ్యం పెంచుకోవాలి.
-వి.సురేశ్‌ కుమార్, ఎస్‌ఏ-సోషల్‌ స్టడీస్‌

Tenth Class Study Material 

పదో తరగతి.. ఆరు పేపర్లు.. ముఖ్యాంశాలు

  • ఇంగ్లిష్‌లో 35 ప్రశ్నలతో, మిగతా సబ్జెక్ట్‌లలో 33 ప్రశ్నలతో 100 మార్కులకు పరీక్ష పత్రం.
  • విద్యార్థులు అవగాహన- ప్రతిస్పందనపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  • సృజనాత్మక వ్యక్తీకరణ విషయంలో మెరుగ్గా రాణించాలి.
  • విషయావగాహన, ప్రశ్నించడం-పరికల్పనలు చేయడం ముఖ్యం.
  • సమాచార సేకరణ, నిత్య జీవిత వినియోగం, విలువలు వంటి ప్రమాణాలను ప్రిపరేషన్‌ సమయంలో పాటించాలి.
  • ప్రశంస-అభినందన విధానంపై అవగాహన పెంచుకునేలా ప్రిపరేషన్‌ సాగించాలి.
     
Published date : 29 Sep 2022 03:49PM

Photo Stories