Department of Education: పది మంది ఐఏఎస్‌లతో పాఠశాలల తనిఖీలు
ఇందులో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పది మంది ఐఏఎస్‌లతో పాఠశాలల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. ప్రతి జిల్లాలో నెలకు రెండుసార్లు ఈ ఐఏఎస్ అధికారులు పాఠశాలలను తనిఖీలు చేస్తారని వెల్లడించారు. నిర్దేశించిన విద్యా ప్రణాళికలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. విజయనగరం కలెక్టరేట్‌లో ఏప్రిల్ 24న జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మంత్రి బొత్స మాట్లాడారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ విద్యాశాఖ అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఉపాధ్యాయులు ఆందోళన చెందడం ఏమిటని ప్రశ్నించారు.
చదవండి: గురుకులాల్లో సమ్మర్ క్యాంపుల హడావుడి!
పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు సకాలంలో అందించడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఆయన చర్యలు తీసుకున్నారన్నారు. అలాంటి చర్యలను హర్షించాల్సింది పోయి ఆందోళన చేస్తామనడం సరికాదన్నారు. విద్యా సంవత్సరం ముగిసినా విద్యార్థులకు ఇంకా ఆ పుస్తకాలను అందించకపోవడం దారుణమా? కాదా? అని నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఉపాధ్యాయులు మాట పడాల్సివస్తోందన్నారు. అటువంటి పరిస్థితి ఉపాధ్యాయులకు ఎదురుకాకుండా ఉండేందుకే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకున్నారని తెలిపారు. దీన్ని ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాలని, వారి కష్టసుఖాలు తమకు తెలుసన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం ప్రతిపక్షానికి, పచ్చ మీడియాకు అలవాటుగా మారిందని మండిపడ్డారు.