ఏప్రిల్ నెలాఖరు లేదా మే మొదటి వారంలో టీఎస్ టెన్త్ పరీక్షలు: టీఎస్ ఎస్‌ఎస్‌సీ బోర్డు
Sakshi Education
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్ ముగిశాకే తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ పరీక్షలపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ చెబుతోంది.
ఈ నెలాఖరు లేదా మే మొదటి వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుందని భావిస్తోంది. తొలుత మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించేలా ఎస్‌ఎస్‌సీ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. అదే సందర్భంలో స్థానిక ఎన్నికల ప్రకటన వెలువడటంతో మార్చి 31 నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్‌ను సవరించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 31 నుంచి జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.
కనీసం 15 రోజుల వ్యవధి అవసరం
సీబీఎస్‌ఈకి కూడా..
కనీసం 15 రోజుల వ్యవధి అవసరం
- కొత్త షెడ్యూల్ ప్రకటించినా కనీసం 15 రోజుల వ్యవధి కావాల్సి ఉంటుందని.. ఆ తరువాతే పరీక్షల తేదీలను నిర్ణయించాల్సి ఉంటుందని ఎస్‌ఎస్‌సీ బోర్డు చెబుతోంది.
- కరోనా నేపథ్యంలో విద్యార్థులను దూరదూరంగా కూర్చోబెడతామని ఇంతకుముందే బోర్డు ప్రకటించింది.
- ఈ దూరం పెంచితే పరీక్ష కేంద్రాలు సరిపోవు. ఇంతకుముందు గుర్తించిన పరీక్ష కేంద్రాల ప్రకారం విద్యార్థులకు గూగుల్ మ్యాపింగ్‌తో కూడిన హాల్ టికెట్లను బోర్డు జారీ చేసింది.
- జంబ్లింగ్ విధానంలో ఎవరెవరికి ఏయే పరీక్ష కేంద్రాలు కేటాయించారో కూడా వాటిలో వివరంగా ఇచ్చారు.
- ఇప్పుడు కొత్తగా మరిన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. ఎవరెవరికి ఏయే సెంటర్లు కేటాయించారో తెలియజేస్తూ తిరిగి మళ్లీ హాల్ టికెట్లు జారీ చేయాల్సి వస్తుంది.
- ఇది సమస్యతో కూడుకున్న పని కావడంతో మొత్తం ప్రక్రియ మొదటికొచ్చి పరీక్షల నిర్వహణ మరింత ఆలస్యం అవుతుంది.
- ఈ దృష్ట్యా ప్రస్తుతం గుర్తించిన పరీక్ష కేంద్రాల్లోనే అదనపు సదుపాయాలు కల్పించాలనే ఆలోచనలో ఉంది.
సీబీఎస్‌ఈకి కూడా..
- రాష్ట్రంలో 1నుంచి 5 తరగతి విద్యార్థులకు సంవత్సరాంత పరీక్షలు పూర్తయ్యాయి.
- 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సంవత్సరాంత పరీక్షలు లేకుండా అందరూ పాసైనట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
- సీబీఎస్‌ఈ కూడా 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సంవత్సరాంత పరీక్షలు రద్దు చేయాలన్న ఆలోచనకు వచ్చింది.
- సీబీఎస్‌ఈలో 9, 11 తరగతుల వార్షిక పరీక్షలు ఇంకా నిర్వహించనందున ఆ విద్యార్థులను ప్రాజెక్ట్ వర్క్, టర్మ్ ఎగ్జామ్స్ ఆధారంగా పై తరగతులకు ప్రమోట్ చేయాలన్న ఆలోచన ఉంది.
- 10, 12 తరగతుల పరీక్షలను వాయిదా వేసిన బోర్డు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానుసారం షెడ్యూల్‌ను ప్రకటించనుంది. 29 మెయిన్ పేపర్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించే ఆలోచన ఉన్నట్లు కేంద్రం తెలిపింది.
Published date : 06 Apr 2020 03:35PM