స్కూళ్ల నిర్వహణలో అలసత్వం వద్దు
2022–23 విద్యా సంవత్సరంలో పాటించాల్సిన పలు మార్గదర్శకాలను పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ జారీ చేశారు. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కొందరు ప్రధానోపాధ్యాయులు, టీచర్లు తమ విధుల నిర్వహణలో సరిగ్గా వ్యవహరించడం లేదనే విషయం అధికారుల దృష్టికి వచ్చిందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలు, లక్ష్యాలు విజయవంతమవ్వాలంటే ప్రధానోపాధ్యాయులు, టీచర్లు ముఖ్య పాత్ర వహించాల్సి ఉంటుందన్నారు. లక్ష్యాలను చేరుకునేందుకు సమగ్రమైన పాఠ్య ప్రణాళికలను అమలు చేయాల్సిన అవసరముందని వివరించారు. డిజిటల్ కంటెంట్, వనరులను వినియోగించి.. బోధనాభ్యసన కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. టీచర్లు తరగతి గదిలో తమ ఫోన్లను స్విచ్చాఫ్‌లో పెట్టేలా ప్రధానోపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులతో తరచూ సమావేశమై.. వారి పిల్లల ప్రమాణాలను వివరించాలని సూచించారు. స్కూల్‌కు చాలా కాలంగా గైర్హాజరవుతున్న విద్యార్థులను తిరిగి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సీఈఆర్టీ క్యాలెండర్ ప్రకారం పాఠ్యప్రణాళికలను అమలు చేయాలని సూచించారు. విద్యా కార్యక్రమాలు సజావుగా సాగేలా ఎంఈవోలు, డిప్యుటీ డీఈవోలు పర్యవేక్షించాలని ఆదేశించారు.
చదవండి:
విద్యార్థుల మేధాశక్తిని పెంపొందించే దిశగా..
ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు సీట్లు