బోధనా సిబ్బంది బదిలీలకు ఆమోదం
ఈ మేరకు విద్యాశాఖ ఫైలును ఆమోదించారు. దీంతో మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), ట్రయిన్‌డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ)లకు మేలు జరగనుంది. గత ఎనిమిదేళ్లుగా సాధారణ బదిలీలు లేక ఈ టీచర్లు నానా అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా బదిలీలకు అవకాశం కల్పించలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీచర్లు బదిలీల కోసం ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రతిపాదనలను రూపొందించ దస్త్రాన్ని సీఎం అనుమతికోసం పంపగా ఆమోదం తెలిపారు. త్వరలోనే విద్యాశాఖ బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.
2,641 మందికి మేలు
రాష్ట్రంలో 164 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 162 స్కూళ్లలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. తక్కిన రెండింటిలో 10వ తరగతి వరకు నిర్వహిస్తున్నారు. ఈ స్కూళ్లలో 2,641 మంది ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ప్రిన్సిపాళ్లు, పీజీటీలు, టీజీటీలున్నారు. మోడల్ స్కూళ్ల టీచర్ల బదిలీలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంపై వివిధ సంఘాల నేతలు కె.వెంకట్రామిరెడ్డి, కోమటిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జి.చంద్రశేఖర్, పి.మోహన్ రెడ్డి, మార్కండేయులు కృతజ్ఞతలు తెలిపారు.