Skip to main content

ఆంధ్రప్రదేశ్ ‘పదో తరగతి– 2021’ ఫలితాలు విడుదల

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వల్ల రద్దయిన పదో తరగతి పరీక్ష ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విడుదల చేశారు.
కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా సీఎం జగన్‌ ఆదేశాల మేరకు మార్చి 2020, జూన్‌ 2021కి నిర్వహించాల్సిన పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. 2020 బ్యాచ్‌ విద్యార్థులకు ఆల్‌పాస్‌ ఇచ్చారు. 2021 బ్యాచ్‌ విద్యార్థుల ఫలితాల కోసం ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. 2021 విద్యార్థులతోపాటు 2020 విద్యార్థులకు వారి అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. దీంతో ఆ మేరకు విద్యాశాఖ ఫలితాలు విడుదల చేసింది. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారందరికీ అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇస్తూనే అందరినీ ఉత్తీర్ణులుగా ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది.

చ‌ద‌వండి: బ్రేకింగ్‌: ఏపీ ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులను సెకండియర్‌లోకి ప్రమోట్‌ చేస్తూ ఉత్తర్వులు..

చ‌ద‌వండి: వినూత్నంగా ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ క్యాలెండర్‌ రూపకల్పన.. ఈ విధంగానే..

‘ప్రైవేటు’ విద్యార్థులదే హవా..
2020లో 10 గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌(జీపీఏ) సాధించిన విద్యార్థుల్లో అత్యధికంగా 62.03 శాతం మంది ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులే ఉన్నారు. 2021లో కూడా 72.86 శాతం వీరే. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు తమ విద్యార్థులకు అత్యధికంగా అంతర్గత మార్కులు వేసుకోవడమే ఈ పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. 2020లో పది విద్యార్థులు 6,29,545 మంది ఉండగా.. 1,83,044 మందికి 10 జీపీఏ వచ్చింది. వీరిలో ప్రభుత్వ యాజమాన్య స్కూళ్ల విద్యార్థులు 37,687 మంది మాత్రమే ఉండగా ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు 1,45,357 మంది ఉన్నారు. 2021లో 6,24,367 మంది విద్యార్థుల్లో 1,99,696 మందికి 10 జీపీఏ వచ్చింది. వీరిలో ప్రభుత్వ యాజమాన్య స్కూళ్ల విద్యార్థులు 38,453 మంది ఉండగా ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు 1,61,243 మంది ఉన్నారు. రెండేళ్లలో (2020, 2021) పదో తరగతిలో ఆంగ్ల మాధ్యమ విద్యార్థులే అధికంగా ఉన్నారు. 2020లో 63.72 శాతం మంది ఉండగా.. 2021లో 65.81 శాతం మంది ఉన్నారు. తెలుగు మాధ్యమం విద్యార్థుల సంఖ్య 2020లో 35.53%, 2021లో 33.42 శాతంగా ఉంది.
Published date : 07 Aug 2021 03:08PM

Photo Stories