Tenth Class Public Exams 2024 : పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కు సర్వం సిద్ధం
రాయవరం: పదవ తరగతి పరీక్షలు ముగిశాయి. జిల్లావ్యాప్తంగా ఈ నెల 18వ తేదీ నుంచి 112 పరీక్షా కేంద్రాల్లో పది పరీక్షలు ప్రారంభమైన విషయం విదితమే. 21,113 మంది విద్యార్థులు రెగ్యులర్, ప్రైవేట్‌గా పరీక్షలు రాయాల్సి ఉండగా, సరాసరిన 99.48 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పుడు అధికారులు జవాబు పత్రాల మూల్యాంకనంపై దృష్టి సారించారు. గత విద్యా సంవత్సరంలో జిల్లా కేంద్రమైన అమలాపురంలోని బాలుర జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్పాట్ వేల్యుయేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. గతేడాది ఏప్రిల్ 19న ప్రారంభమైన స్పాట్ వేల్యుయేషన్ 26వ తేదీ వరకు ఆరు రోజుల పాటు నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే జవాబు పత్రాల మూల్యంకనాన్ని అమలాపురం బాలుర ఉన్నత పాఠశాలతో పాటుగా, బాలికల ఉన్నత పాఠశాలలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన పరీక్ష పేపర్ల కోడింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటలకు జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టనున్నారు.
కోనసీమ జిల్లా
- డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్లు : 01
- స్ట్రాంగ్ రూమ్ ఇన్‌చార్జి : 01
- అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు : 07
- ఏఏసీవోలు : 07
- చీఫ్ ఎగ్జామినర్లు : 99
- అసిస్టెంట్ ఎగ్జామినర్లు : 594
- స్పెషల్ అసిస్టెంట్లు : 198
దఫదఫాలుగా జవాబు పత్రాలు
ఈ ఏడాది వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1.85 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసే అవకాశముంది. మూల్యాంకన ప్రక్రియను సమర్థంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. ఇప్పటికే పూర్తయిన పది పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలు వివిధ జిల్లాల నుంచి దఫదఫాలుగా వస్తున్నాయి. ఇప్పటి వరకు తెలుగు, కాంపోజిట్ తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం, పీఎస్ సబ్జెక్టులకు సంబంధించిన జవాబు పత్రాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. బయాలాజికల్ సైన్స్, సోషల్, ఒకేషనల్, ఓఎస్‌ఎస్ సబ్జెక్టులకు చెందిన జవాబు పత్రాలు రావాల్సి ఉంది. ఆయా జిల్లాలకు జిల్లా విద్యాశాఖ అధికారి క్యాంప్ ఆఫీసర్‌గా, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. వీరితోపాటు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు జవాబు పత్రాల మూల్యాంకనంలో పాల్గొననున్నారు. గతేడాది 1,84,083 జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టారు. తెలుగు 25,168, కాంపోజిట్ తెలుగు–3,457, సంస్కృతం–2,163, హిందీ 29,058, ఇంగ్లిషు–24,209, గణితం–24,017, పీఎస్–24,781, బయాలజీ–24,781, సోషల్–26,307, వొకేషనల్ 142 పేపర్లను జిల్లాకు కేటాయించారు. ఈ ఏడాది కూడా అంతే స్థాయిలో జిల్లాకు కేటాయించే అవకాశముంది.
సబ్జెక్టుల వారీగా..
పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకన విధులకు ఆయా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను నియమిస్తూ ఇప్పటికే ఉత్తర్వులను సిద్ధం చేసే పనిలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఉంది. స్పాట్ వేల్యుయేషన్ ఉత్తర్వులను సంబంధిత ఉపాధ్యాయులకు ఒకటి రెండు రోజుల్లో అందజేయనున్నట్లు సమాచారం. ఏడు సబ్జెక్టులు, ఒకేషనల్ పరీక్షలు కలిపి మొత్తం ఎనిమిది రోజులు పాటు మూల్యాంకనం చేస్తారు.
నిబంధనలు..
మూల్యాంకన విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు సెల్‌ఫోన్, స్మార్ట్‌ఫోన్లు, వైట్నర్, ఎరేజర్ తదితర వస్తువులను మూల్యాంకనం గదిలోకి తీసుకువెళ్లరాదు. ప్రతి రోజు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మూల్యాంకనం జరుగుతుంది. మూల్యాంకన సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎటువంటి తప్పిదాలు జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుంది. శిబిరానికి నిర్దేశిత సమయాల్లో హాజరు కాకుంటే, అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
- ఒకటి నుంచి 8 వరకు టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం
- జిల్లాకు 1.85 లక్షల సమాధాన పత్రాలు కేటాయించే అవకాశం ఏర్పాట్లలో అధికారుల నిమగ్నం
కోడింగ్ చేస్తున్నాం
ఇప్పటి వరకు జిల్లా కేంద్రానికి చేరుకున్న జవాబు పత్రాలను కోడింగ్ చేస్తున్నాం. రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం స్పాట్ వేల్యుయేషన్‌కు నియమ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నాం.
– నక్కా సురేష్, అసిస్టెంట్ కమిషనర్, ప్రభుత్వ పరీక్షల విభాగం, అమలాపురం
అసౌకర్యం కలగకుండా..
ఇన్విజిలేటర్లకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నాం. జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాల్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. నిర్ణీత సమయంలో మూల్యాంకనం పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నాం.
– ఎం.కమలకుమారి, డీఈవో, అమలాపురం
ఎవరికీ మినహాయింపులు ఉండవు
మూల్యాంకన విధులకు నియమితులైన వారు తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సి ఉంది. స్పాట్ వేల్యుయేషన్‌లో ఎవరికీ మినహాయింపులు ఉండవు. సకాలంలో మూల్యాంకనం జరిగేలా ఉపాధ్యాయులు సహకరించాలి.
– జి.నాగమణి, రీజనల్ జాయింట్ డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ.