Skip to main content

Tenth Class Public Exams 2024: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
Tenth Class Public Exams 2024: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
Tenth Class Public Exams 2024: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

గుంటూరు : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ వెల్లడించారు. స్థానిక డీఈఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 460 పాఠశాలల నుంచి 27,366 మంది రెగ్యులర్‌ విద్యార్థులతో గతంలో తప్పిన, ప్రైవేటుగా రాస్తున్న మరో 3,925 మందిని కలుపుకుని మొత్తం 31,291 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. 147 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థులు హాల్‌ టికెట్‌, ప్యాడ్‌, పెన్ను మినహా మరే ఇతర సామగ్రిని వెంట తీసుకురాకూడదని వివరించారు.

ఉదయం 8.30 నుంచి కేంద్రాల్లోకి అనుమతి,,

ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనుండగా, విద్యార్థులు 8.30 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 8.45 నుంచి 9.30 వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు.

ఆర్టీసీలో ఉచిత ప్రయాణం..

పరీక్ష కేంద్రాలకు వెళ్లి, వచ్చేందుకు వీలుగా హాల్‌ టికెట్‌ చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అత్యున్నతస్థాయి కమిటీ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. పరీక్షల జిల్లా పరిశీలకురాలిగా విద్యాశాఖ డైరెక్టర్‌ పి.పార్వతిని ప్రభుత్వం నియమించినట్లు వెల్లడించారు.

బార్‌ కోడింగ్‌ ఓఎంఆర్‌తో పాటు..

విద్యార్థులకు బార్‌ కోడింగ్‌ నంబరు కలిగిన ఓఎంఆర్‌ షీట్‌తో పాటు ప్రశ్నపత్రంపై ప్రత్యేక సీరియల్‌ నంబరు ఉంటుందని చెప్పారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లి, రోల్‌ నంబరు ఆధారంగా కేటాయించిన గదిలో వరస క్రమంలో కూర్చున్న విద్యార్థులకు అదే క్రమంలో ఓఎంఆర్‌ షీట్‌తో పాటు ప్రశ్నపత్రం పంపిణీ చేస్తామని చెప్పారు. ఒకవేళ వివరాల్లో తప్పులు ఉన్నట్లయితే ఇన్విజిలేటర్‌ దృష్టికి తీసుకెళ్లి సరైన ఓఎంఆర్‌ షీట్‌ పొందాలని స్పష్టం చేశారు.

పటిష్ట భద్రతా ఏర్పాట్లు

టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందని డీఈఓ శైలజ తెలిపారు. ఎక్కడైనా లీకేజీ ఘటన జరిగితే అది ఏ కేంద్రంలో, ఏ విద్యార్థికి ఇచ్చిన ప్రశ్నపత్రం నుంచి అనే వివరాలను సీరియల్‌ నంబరు ఆధారంగా గుర్తించే ఆధునిక వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని వివరించారు.

సెల్‌ఫోన్లకు అనుమతి లేదు..

పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌తో వచ్చేందుకు ఎవరికీ అనుమతి లేదని, విద్యార్థులతో పాటు చీఫ్‌ సూపరింటెండెంట్లు, శాఖాధికారులు సహా తనిఖీ బృందాల వద్ద సెల్‌ఫోన్‌ ఉండేందుకు అనుమతి లేదన్నారు. ఫీజు బకాయిలతో పాటు ఇతర ఏ విధమైన కారణాలతో విద్యార్థులకు హాల్‌ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించరాదని, విద్యార్థులందరికీ హాల్‌ టికెట్లు ఇవ్వాలని పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించారు. పరీక్షలకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదులకు డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నంబరు దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో గుంటూరు డీవైఈఓ బలరాం నాయక్‌, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌ కె.వెంకట్‌రెడ్డి, ఉర్దూ డీఐ షేక్‌ ఎండీ ఖాసిం పాల్గొన్నారు.

 

Published date : 16 Mar 2024 04:33PM

Photo Stories