వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు

వన్యప్రాణుల సంరక్షణ కోసం భారత ప్రభుత్వం 1952లో ‘ఇండియన్ బోర్‌‌డ ఫర్ వైల్డ్ లైఫ్’ అనే సంస్థను ఏర్పాటు చేసింది. దీనికి ప్రధాన మంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని (వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్) జమ్మూకశ్మీర్‌లో మినహా అన్ని రాష్ట్రాల్లో అమలు చేశారు. వన్యప్రాణుల గురించి అవగాహన పెంపొందించేందుకు రాష్ర్ట ప్రభుత్వం కృష్ణ జింకను రాష్ర్ట జంతువుగా, పాలపిట్టను రాష్ర్ట పక్షిగా, జమ్మి చెట్టును రాష్ర్ట వృక్షంగా ప్రకటించింది.
భారత రాజ్యాంగం వన్యప్రాణుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ఆదేశిక సూత్రాల్లోని 48వ ప్రకరణలో రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు వన్యప్రాణులను విధిగా సంరక్షించాలని పేర్కొంది. ఆర్టికల్ 51(ఎ) ప్రకారం వన్యప్రాణుల సంరక్షణ పౌరుల ప్రాథమిక విధి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వన్యప్రాణుల సంరక్షణను రాష్ర్ట జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చారు.
పులిని జాతీయ జంతువుగా భారత ప్రభుత్వం 1972లో గుర్తించింది. అంతకు ముందు సింహం జాతీయ జంతువుగా ఉండేది.
తెలంగాణలోని టైగర్ రిజ‌ర్వ్‌లు
కవ్వాల్ టైగర్ రిజర్వ్
ఆదిలాబాద్ జిల్లాలోని జన్నారం, ఉట్నూర్ ప్రాంతంలో 2,015.44 చ.కి.మీ. పరిధిలో ఇది విస్తరించి ఉంది. ఉత్తర తెలంగాణలో ఇదే ప్రాచీన అభయారణ్యం. దీని దక్షిణ భాగంలో గోదావరి, కడెం నదుల పరీవాహక ప్రాంతం ఉంది. మన రాష్ర్టంలో అధికంగా టేకు లభించే అభయారణ్యం ఇదే. దీన్ని 1965లో ఏర్పాటు చేశారు. 1999లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు. 2012 ఏప్రిల్ 10న పులుల అభయారణ్యంగా గుర్తించారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్
ఇది మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో 2611.39 చ.కి.మీ. మేర విస్తరించి ఉంది. 1978 లో వన్యప్రాణి అభయారణ్యంగా, 1983లో పులుల అభయారణ్యంగా గుర్తించారు. దీని ద్వారా కృష్ణానది ప్రవహిస్తోంది.
తెలంగాణలోని వైల్డ్‌లైఫ్ శాంక్చుయరీలు (వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు)
ప్రాణహిత వన్యప్రాణి అభయారణ్యం
ఇది ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల పట్టణానికి సమీపంలో దాదాపు 136 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. ప్రాణహిత నది ఈ అభయారణ్యం మీదుగా ప్రవహిస్తోంది. ఈ శాంక్చుయరీలో టేకు చెట్లతో కూడిన ఆకురాల్చే అడవులు ఉన్నాయి. వివిధ రకాల జంతువులకూ ఇది నివాసయోగ్యమైంది.
శివరాల వన్యప్రాణి అభయారణ్యం
ఇది ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 29.81 చ.కి.మీ. మేర విస్తరించి ఉంది. ఇది గోదావరి నదికి ఇరువైపులా విస్తరించి ఉంది. ఇక్కడి గోదావరి సజీవధార వల్ల బురద నేల మొసళ్లు అధికంగా ఉంటాయి.
ఏటూరు నాగారం వన్యప్రాణి అభయారణ్యం
ఇది వరంగల్ జిల్లాలోని గోదావరి నదీ తీరాన దక్కన్ పీఠభూమిలో సుమారు 806.15 చ.కి.మీ. మేర విస్తరించి ఉంది.
పాకాల వన్యప్రాణి అభయారణ్యం
వరంగల్ జిల్లాలోని పాకాల చెరువు పరిసరాల్లో సుమారు 860.2 చ.కి.మీ. మేర విస్తరించి ఉంది. దీన్ని మొదట బురదనేల మొసళ్లు, పులుల రక్షిత ప్రాంతంగా నోటిఫై చేశారు. తర్వాత 1999లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా గుర్తించారు.
కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం
ఇది ఖమ్మం జిల్లాలోని పాల్వంచ పట్టణానికి సుమారు 21 కి.మీ. దూరంలో కిన్నెరసాని రిజర్వాయర్ సమీపంలో ఉంది. సుమారు 635 చ.కి.మీ. పరిధిలో ఇది విస్తరించి ఉంది.
కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) జాతీయ పార్కు
హైదరాబాద్ మధ్యలో ఉన్న ఈ జాతీయ పార్కు నగరానికి స్వచ్ఛమైన గాలిని అందించే ఊపిరితిత్తి లాంటిది. ఈ పార్కు అనేక జంతు, వృక్ష జాతులకు నెలవు. 1994లో రక్షిత వనంగా నోటిఫై చేశారు. తర్వాత 1998 డిసెంబర్ 3న కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కుగా ప్రకటించారు.
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
  • కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం - ఆదిలాబాద్.
  • ప్రాణహిత వన్యప్రాణి సంరక్షణ కేంద్రం - ఆదిలాబాద్.
  • శివరాం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం - ఆదిలాబాద్, కరీంనగర్.
  • ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం - వరంగల్.
  • పాకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం - వరంగల్.
  • కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం - ఖమ్మం.
  • మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం - మెదక్.
  • పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం - మెదక్, నిజామాబాద్
  • అమ్రాబాద్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం - మహబూబ్‌నగర్, నల్గొండ.
జింకల పార్కులు
  • జవహర్ డీర్ పార్కు - శామీర్‌పేట్, రంగారెడ్డి జిల్లా
  • పిల్లలమర్రి జింకల పార్కు - మహబూబ్‌నగర్.
  • కిన్నెరసాని జింకల పార్కు - పాల్వంచ
  • లోయర్ మానేరు డ్యాం(ఎల్‌ఎండి) జింకల పార్కు - కరీంనగర్
టైగర్ రిజర్వ్ పేరు- జిల్లా
  • కవ్వాల్ టైగర్ రిజర్వ్ - ఆదిలాబాద్
  • అమ్రాబాద్ (నాగార్జునసాగర్) టైగర్ రిజర్వ్ -మహబూబ్‌నగర్, నల్గొండ.
జూలాజికల్ పార్కులు
  • నెహ్రూ జూలాజికల్ పార్కు- హైదరాబాద్.
  • వనవిజ్ఞాన కేంద్రం(మినీ జూ)-వరంగల్.
జాతీయ పార్కులు
  • కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కు - జూబ్లీహిల్స్, హైదరాబాద్
  • మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కు- వనస్థలిపురం, రంగారెడ్డి జిల్లా
  • మృగవని నేషనల్ పార్కు- చిలుకూరు, రంగారెడ్డి జిల్లా

 

మాదిరి ప్రశ్నలు

1. కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది?
1) ఖమ్మం
2) వరంగల్
3) ఆదిలాబాద్
4) నల్గొండ


































#Tags