తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగం

శక్తి ఒక ముఖ్య వనరు మాత్రమే కాదు, ఈ నవీన యుగంలో దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించే ప్రథమ కారకం. ఒక దేశం.. వ్యవసాయ పరంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి శక్తి సంపద చాలా అవసరం. ప్రస్తుతం మానవ జీవితం శక్తి వనరులపై ఆధారపడి ఉంది. శక్తి వనరులను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి...
1. సంప్రదాయ శక్తి వనరులు
2. సంప్రదాయేతర శక్తి వనరులు

సంప్రదాయ శక్తి వనరులు
వీటిని ‘తరిగిపోయే శక్తి వనరులు’ లేదా ‘పునరుత్పాదితం కాని శక్తి వనరులు’ అని అంటారు. బొగ్గు, చమురు, సహజ వాయువు, అణుశక్తిని ఉత్పత్తి చేసే యురేనియం, థోరియం లాంటి ఖనిజాలను సంప్రదాయ శక్తి వనరులు అంటారు. వీటి నిల్వలు ప్రకృతిలో నిర్దిష్ట పరిమాణంలో ఉన్నాయి. భవిష్యత్తులో వీటి వాడకం వల్ల క్రమేణా తరిగిపోయే అవకాశం ఉంది.

సంప్రదాయేతర శక్తి వనరులు
వీటిని ‘తరిగిపోని శక్తి వనరులు లేదా ‘పునరుత్పాదిత శక్తి వనరులు’గా పిలుస్తారు. నీరు, సౌరశక్తి, పవన శక్తి, వేలా తరంగాలు, భూతాపశక్తి మొదలైన వాటిని సంప్రదాయేతర శక్తి వనరులుగా పరిగణిస్తారు. ఇవి ప్రకృతిలో నిరంతరం లభ్యమవుతాయి.
తెలంగాణ భూపరివేష్టిత రాష్ర్టం కావడం వల్ల సంప్రదాయేతర శక్తి వనరులు పరిమితంగా ఉన్నాయి. అందువల్ల రాష్ర్టంలో విద్యుత్ ఉత్పత్తికి సంప్రదాయ శక్తి వనరులపైన ఆధారపడుతున్నాం.
శరవేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక, సేవా రంగాలు, పెరుగుతున్న జనాభా, సేద్యపు భూమి విస్తీర్ణం, పంట సాంద్రత లాంటి కారణాల వల్ల తెలంగాణలో రోజురోజుకీ విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది.
  • భారత రాజ్యాంగం ప్రకారం విద్యుత్ ఉమ్మడి జాబితాలోకి వస్తుంది.
  • తెలంగాణలో జల విద్యుత్ ఉత్పత్తి కంటే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అధికంగా ఉంది.

ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు

థర్మల్ విద్యుత్ కేంద్రాలు
బొగ్గు, సహజ వాయువు, డీజిల్ తదితర ఇంధనాలను మండించి, నీటిని ఆవిరిగా మార్చి టర్బైన్‌లను తిప్పడం ద్వారా విద్యుత్ తయారు చేసే కేంద్రాలను ‘థర్మల్ విద్యుత్ కేంద్రాలు’ అంటారు.
  • వెయ్యి మెగావాట్లు లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసే థర్మల్ కేంద్రాలను ‘సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రాలు’ అని అంటారు.
  • 4000 మెగావాట్లు లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసే థర్మల్ కేంద్రాలను ‘అల్ట్రా థర్మల్ విద్యుత్ కేంద్రాలు’ అంటారు.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ): రామగుండం
  • ఎన్టీపీసీని కరీంనగర్ జిల్లాలోని రామగుండంలో 1983లో ఏర్పాటు చేశారు. ఇది బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. దీని సామర్థ్యం 2600 మెగావాట్లు. ఇది మహారత్న కంపెనీ.
  • ఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ. దీనికి అవసరమైన బొగ్గు సింగరేణి కాలరీస్‌కు చెందిన గోదావరి కోల్‌బెల్ట్ నుంచి సరఫరా అవుతోంది. గోదావరి నదిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు అందుతోంది.
  • ఉత్తమ నిర్వహణకుగానూ 1985 లో ఈ థర్మల్ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ‘జాతీయ ఉత్పాదక’ అవార్డు లభించింది.
  • ఈ ప్లాంటుతో లబ్ధి పొందుతున్న రాష్ట్రాలు -తమిళనాడు, తెలంగాణ, గోవా, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్.
  • 2004లో 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఏడో యూనిట్‌కు శంకుస్థాపన జరగడంతో దేశంలోని అన్ని ఎన్టీపీసీల్లోకెల్లా రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు అగ్రస్థానంలో ఉంది. ఈ యూనిట్ స్థాపనతో దీని సామర్థ్యం 2600 మెగావాట్లకు చేరింది.
  • ఈ ఎన్టీపీసీని కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో స్థాపించారు. ఇందులో రాష్ర్ట వాటా 580 మెగావాట్లు. ఈ కేంద్రంలో మూడు దశల్లో ఏడు యూనిట్లు నిర్మించారు.
  • భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీని 1975లో ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థ. దేశం మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో ఎన్టీపీసీ వాటా 27 శాతం.
రామగుండం బి-థర్మల్ పవర్ కార్పొరేషన్
  • రాష్ర్ట ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన టీఎస్‌జెన్‌కో ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలోని రామగుండం వద్ద ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించారు. ఇది బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం. ఈ థర్మల్ విద్యుత్ కేంద్రం 62.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఒకే ఒక యూనిట్‌తో 1971 నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది.
కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్
  • తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌జెన్‌కో)కు చెందిన బొగ్గు ఆధారిత ‘కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రా’న్ని ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో 1966లో స్థాపించారు. ఇప్పటి వరకు ఆరు దశల్లో 11 యూనిట్లను ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం 1720 మెగావాట్లు.
  • ఈ ప్రాజెక్టుకు సింగరేణి బొగ్గు గనుల నుంచి బొగ్గు, కిన్నెరసాని రిజర్వాయర్ ద్వారా నీరు అందుతున్నాయి.
  • ఈ ప్రాజెక్టును ఏడో దశకు విస్తరించేందుకు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏడో దశ ఉత్పత్తి సామర్థ్యం 800 మెగావాట్లు.
కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)
  • కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం టీఎస్‌జెన్‌కో ఆధ్వర్యంలో నడుస్త్తోంది. దీనికి వరంగల్ జిల్లా ఘనపురం మండలం చెల్పూరు గ్రామంలో 2006 జూన్ 5న శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో అభివృద్ధి చేస్తున్నారు.
  • మొదటి దశలో 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఒక యూనిట్ నిర్మించారు. 2010 నుంచి ఈ యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది.
  • రెండో దశలో 600 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు యూనిట్లను నిర్మించనున్నారు.
హుస్సేన్‌సాగర్ థర్మల్ పవర్ స్టేషన్
  • ఇది తెలంగాణ ప్రాంతంలోని మొదటి థర్మల్ విద్యుత్ కేంద్రం. దీన్ని 1920లో హైదరాబాద్ రాష్ర్టంలో హుస్సేన్ సాగర్ ఒడ్డున మింట్ కాంపౌండ్‌లో హైదరాబాద్ ఏడో నిజాం ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్’ ప్రారంభించారు. ఇది బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. దీని సామర్థ్యం 22.5 మెగావాట్లు. కానీ దీన్ని 1992లో మూసివేశారు. ఆ తర్వాత 1995లో పూర్తిగా ధ్వంసం చేశారు. దీని అవశేషాలపైనే ప్రసాద్ ఐమ్యాక్స్, ఎన్టీఆర్ గార్డెన్స్ నిర్మించారు.
  • దేశంలో థర్మల్ విద్యుత్‌ను మహారాష్ర్ట అధికంగా ఉత్పత్తి చేస్తోంది.

తెలంగాణలో ఏర్పాటుకానున్న థర్మల్ ప్రాజెక్టులు

యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం
  • నల్లగొండ జిల్లాను తెలంగాణ విద్యుత్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృష్ణా నది తీరంలో దీన్ని నిర్మిస్తున్నారు. దామరచెర్ల మండలం వీర్లపాలెం వద్ద తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో 4400 మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు 2015 జూన్ 8న భూమి పూజ చేశారు. సుమారు 5,558 ఎకరాల్లో రూ.55వేల కోట్ల వ్యయంతో దశలవారీగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం చేపడతారు.
  • దీన్ని టీఎస్‌జెన్‌కో, బీహెచ్‌ఈఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు.
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్
  • ఖమ్మం జిల్లా మణుగూరు మండలం రామానుజవరం గ్రామం వద్ద 2015 మార్చి 28న భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. దీని సామర్థ్యం 1080 మెగావాట్లు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నిర్మిస్తున్న మొదటి విద్యుత్ ప్లాంట్ ఇది. ఈ పవర్ ప్రాజెక్టును బీహెచ్‌ఈఎల్ నిర్మిస్తోంది.
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్
  • ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి వద్ద 1800 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి రెండు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మిస్తోంది.
జూరాల సోలార్ విద్యుత్ కేంద్రం
  • ఈ విద్యుత్ కేంద్రాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల జల విద్యుత్ కేంద్రం వద్ద రేవులపల్లి గ్రామంలో స్థాపించారు. ఇది తెలంగాణ రాష్ర్టంలో మొదటి సోలార్ విద్యుత్ కేంద్రం. ‘జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సోలార్ మిషన్’లో భాగంగా ఈ ప్లాంట్‌ను నిర్మించారు. ఇది ఫొటో వోల్టాయిక్ సెల్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం.
  • ఈ కేంద్రం 2011 డిసెంబర్ 29 నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది.
  • దీని విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఒక మెగావాట్.
  • తెలంగాణలో మొదటి సోలార్ విద్యుత్ పార్కును మహబూబ్‌నగర్ జిల్లా ‘గట్టు’లో ఏర్పాటు చేయనున్నారు.
శంకర్‌పల్లి గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం
  • ఈ ప్రాజెక్టును రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లిలో 2002లో ప్రతిపాదించారు. దీని విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1600 మెగావాట్లు. సహజ వాయువు అందుబాటులో లేకపోవడంతో ప్రాజెక్టును నిలిపివేశారు. ఇటీవల కాలంలో గ్యాస్ లభ్యత కారణంగా ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి.
తెలంగాణ సోలార్ విద్యుత్ విధానం విడుదల
తెలంగాణ సౌర విద్యుత్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2015 జూన్ 3న విడుదల చేసింది. రాష్ర్టంలో 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. 2015 జూన్ 12న జరిగిన టీఎస్‌ఐపాస్ ఆవిష్కరణ కార్యక్రమంలోనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పారిశ్రామిక వేత్తల సమక్షంలో ‘సోలార్ పవర్ పాలసీ’ని ప్రకటించారు. సౌర విద్యుత్ సంస్థలకు ప్రత్యేక సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు చేస్తారు.

మాదిరి ప్రశ్నలు

1. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌కు నీటిని ఏ ప్రాజెక్ట్ నుంచి అందిస్తున్నారు?
1) బయ్యారం చెరువు
2) ముక్క మామిడి ప్రాజెక్టు
3) కిన్నెరసాని రిజర్వాయర్
4) పెద్దవాగు ప్రాజెక్టు


















#Tags