పౌరసత్వం
పౌరసత్వం అనేది ఆంగ్ల భాషా పదమైన 'Citizenship'కు అనువాదం. లాటిన్ భాషా పదాలైన ‘సివిస్’, ‘సెవిటాస్’ అనే పదాల నుంచి ‘సిటిజన్‌షిప్’ ఉద్భవించింది. ‘సివిస్’ అంటే పౌరులు అని, ‘సివిటాస్’ అంటే నగరం అని అర్థం. పౌరసత్వం అనే భావన మొదటిసారిగా ప్రాచీన గ్రీకు రాజ్యాల్లో అవతరించింది. ప్రపంచ యుద్ధాల తర్వాత ఏర్పడిన జాతీయ రాజ్యాల నేపథ్యంలో పౌరసత్వ భావనకు ప్రాముఖ్యం ఉంది.
ఆధునిక దేశాల్లో ప్రజలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. పౌరులు (Citizen), విదేశీయులు (Aliens). పౌరులకు సంబంధిత రాజ్యంలో పౌర, రాజకీయ హక్కులను కల్పిస్తారు. విదేశీయులకు మాత్రం మానవతా దృష్ట్యా కొన్ని పౌరహక్కులను మాత్రమే కల్పిస్తారు. కాబట్టి పౌరసత్వం అనే హోదాను, రాజ్యం పౌరులకు కల్పించిన రాజకీయ పౌరహక్కుల ప్రాతిపదికపై గుర్తిస్తారు.
రాజ్యాంగ ప్రకరణలు - పార్లమెంట్ చట్టాలు
రాజ్యాంగంలోని రెండో భాగంలో ప్రకరణ 5 నుంచి ప్రకరణ 11 వరకు పౌరసత్వానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను మాత్రమే పొందుపర్చారు. రాజ్యాంగం రూపొందించిన సమయంలో దేశ విభజనకు చెందిన పరిణామాలు ఏర్పడటం వల్ల పౌరసత్వానికి సంబంధించిన సమగ్ర అంశాలను పొందుపర్చడానికి నాటి పరిస్థితులు అనుకూలంగా లేవు. కాబట్టి పౌరసత్వానికి సంబంధించిన ఇతర అన్ని అంశాలను రూపొందించడానికి రాజ్యాంగం పార్లమెంట్‌కు అధికారాన్ని కల్పించింది.
రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన అధికారాన్ని వినియోగించుకొని పార్లమెంట్ పౌరసత్వ చట్టాన్ని 1955లో రూపొందించింది. ఆ తర్వాత ఈ చట్టాన్ని నాలుగుసార్లు (1986, 1992, 2003, 2005) సవరించారు.
పౌరులకు ప్రత్యేక హక్కులు
భారత రాజ్యాంగంలో కొన్ని పదవులు, హక్కులను భారతీయ పౌరులకు మాత్రమే కల్పించారు. ఉదాహరణకు ఉన్నత పదవులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి, గవర్నర్, సుప్రీంకోర్ట్, హైకోర్టు న్యాయమూర్తులతో పాటు ఇతర ప్రజాపదవులకు భారతీయ పౌరులు మాత్రమే అర్హులు.
పౌరులకు మాత్రమే వర్తించే ప్రత్యేక స్వాధికారాలు:
రాజ్యాంగ ప్రకరణలు - పార్లమెంట్ చట్టాలు
రాజ్యాంగంలోని రెండో భాగంలో ప్రకరణ 5 నుంచి ప్రకరణ 11 వరకు పౌరసత్వానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను మాత్రమే పొందుపర్చారు. రాజ్యాంగం రూపొందించిన సమయంలో దేశ విభజనకు చెందిన పరిణామాలు ఏర్పడటం వల్ల పౌరసత్వానికి సంబంధించిన సమగ్ర అంశాలను పొందుపర్చడానికి నాటి పరిస్థితులు అనుకూలంగా లేవు. కాబట్టి పౌరసత్వానికి సంబంధించిన ఇతర అన్ని అంశాలను రూపొందించడానికి రాజ్యాంగం పార్లమెంట్‌కు అధికారాన్ని కల్పించింది.
రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన అధికారాన్ని వినియోగించుకొని పార్లమెంట్ పౌరసత్వ చట్టాన్ని 1955లో రూపొందించింది. ఆ తర్వాత ఈ చట్టాన్ని నాలుగుసార్లు (1986, 1992, 2003, 2005) సవరించారు.
పౌరులకు ప్రత్యేక హక్కులు
భారత రాజ్యాంగంలో కొన్ని పదవులు, హక్కులను భారతీయ పౌరులకు మాత్రమే కల్పించారు. ఉదాహరణకు ఉన్నత పదవులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి, గవర్నర్, సుప్రీంకోర్ట్, హైకోర్టు న్యాయమూర్తులతో పాటు ఇతర ప్రజాపదవులకు భారతీయ పౌరులు మాత్రమే అర్హులు.
పౌరులకు మాత్రమే వర్తించే ప్రత్యేక స్వాధికారాలు:
- ప్రకరణ 15 ప్రకారం పౌరులను జాతి, మత, కుల, లింగ, పుట్టుక ప్రాతిపదికలపై వివక్షత చూపరాదు.
- ప్రకరణ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలకు భారత పౌరులు మాత్రమే అర్హులు.
- ప్రకరణ 19 ప్రకారం భావ వ్యక్తీకరణ, సంచార, స్థిర నివాస, సంఘాలు ఏర్పర్చుకునే స్వేచ్ఛను పౌరులకే పరిమితం చేశారు.
- ప్రకరణ 29 ప్రకారం సాంస్కృతిక, విద్యా హక్కు పౌరులకు మాత్రమే వర్తిస్తాయి.
కొన్ని హక్కులను భారత పౌరులతో సమానంగా విదేశీయులకు కల్పించారు. అవి:
- చట్టం ముందు అందరూ సమానులే - ప్రకరణ 14
- అక్రమ శిక్షలకు వ్యతిరేకంగా రక్షణ - ప్రకరణ 20
- జీవించే హక్కు - ప్రకరణ 21
- పీడనాన్ని నిరోధించే హక్కు - ప్రకరణ 23
- మతస్వేచ్ఛ - ప్రకరణ 25
- మత ప్రాతిపదికన పన్ను విధింపుపై ఆంక్షలు - ప్రకరణ 27
భారతదేశంలో పౌరసత్వ ప్రాతిపదిక - రాజ్యాంగ ప్రకరణలు:
రాజ్యాంగంలో 5 నుంచి 11 వరకు ఉన్న ప్రకరణల ప్రకారం కింది వారిని పౌరులుగా పరిగణిస్తారు.
5వ ప్రకరణ ప్రకారం జనవరి 26, 1950 అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి భారతదేశంలో నివసించే పౌరులు భారతీయులే. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటికి ముందు ఐదు సంవత్సరాల నుంచి భారత్‌లో నివసించే వారందరినీ భారతీయులుగానే గుర్తించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో జన్మించిన వారందరూ భారతీయులే.
6వ ప్రకరణ ప్రకారం పాకిస్థాన్ నుంచి ఇండియాకు వలస వచ్చిన వారు 1948 జూలై 19వ తేదీ వరకు తమ పేర్లను సంబంధిత కమీషనరేట్‌ల వద్ద నమోదు చేసుకుంటే వారికి భారత పౌరసత్వం లభిస్తుంది. ఈ పద్ధతిలో పౌరసత్వాన్ని పొందేవారు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం పౌరులుగా నమోదై ఉండాలి.
7వ ప్రకరణను అనుసరించి పాకిస్థాన్‌కు వలసవెళ్లి తదనంతర కాలంలో తిరిగి భారతదేశానికి వచ్చి, 1948లో మార్చి 21వ తేదీలోగా కమిషనరేట్‌ల వద్ద తమ పేర్లను నమోదు చేసుకున్న వారికి భారత పౌరసత్వం లభిస్తుంది. అయితే వీరందరూ భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం భారతీయులై ఉండాలి.
8వ ప్రకరణ ప్రకారం తల్లిదండ్రులు, మాతామహులు, పితామహులు కనీసం ఒకరైనా భారతీయ సంతతికి చెంది ఉన్నట్లయితే అలాంటి వారు రక్త సంబంధం ప్రాతిపదికన భారత పౌరసత్వాన్ని పొందవచ్చు.
9వ ప్రకరణ ప్రకారం భారతీయ పౌరులు స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని పొందితే, సహజంగానే భారతదేశ పౌరసత్వాన్ని కోల్పోతారు.
10వ ప్రకరణ ప్రకారం.. పైన పేర్కొన్న ప్రాతిపదికల ప్రకారం పౌరసత్వాన్ని పొందగలిగే అర్హతలు ఉంటే భారతదేశ పౌరులుగా కొనసాగుతారు. వాటికి సంబంధించిన నియమాలను పార్లమెంట్ రూపొందిస్తుంది.
11వ ప్రకరణ పౌరసత్వానికి సంబంధించిన అన్ని అంశాలపై అంటే పౌరసత్వం పొందే, రద్దు చేసే పద్ధతులపై పార్లమెంటుకే అంతిమ అధికారం ఉంటుంది.
భారతదేశంలో పౌరసత్వాన్ని పొందే పద్ధతులు
భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం కింది పద్ధతుల్లో పౌరసత్వాన్ని పొందవచ్చు.
పుట్టుక ద్వారా పౌరసత్వం (By Birth): 1950 జనవరి 26 తర్వాత, 1987 జూలై 1 లోపల భారతదేశంలో జన్మించిన ప్రతి వ్యక్తి భారతీయ పౌరుడవుతాడు. దీన్నే లాటిన్ భాషలో Jus - Soil (Right of the Soil) అంటారు. అయితే 1987 జూలై 1 తర్వాత భారతదేశంలో పుట్టినవారు భారత పౌరసత్వాన్ని పొందాలంటే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతీయ పౌరులై ఉండాలి. 2004 డిసెంబర్ 3లో దీనికి చిన్న సవరణ చేశారు. దీని ప్రకారం తల్లిదండ్రులు ఇద్దరూ భారతీయ పౌరులై ఉంటేనే వాళ్ల పిల్లలకు భారత పౌరసత్వం వస్తుంది.
వారసత్వం ద్వారా పౌరసత్వం: 1950 జనవరి 26 తర్వాత, 1992 డిసెంబర్ 10 లోపు భారతదేశం బయట జన్మించిన వారి తండ్రి భారతీయ పౌరుడైతే ఆ సంతానానికి భారతీయ పౌరసత్వం వస్తుంది. దీన్నే లాటిన్ భాషలో Jus - Sanguinis (Right of Blood) అంటారు. 1992 డిసెంబర్ 10 తర్వాత జన్మించిన వారికి భారత పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతీయ పౌరులై ఉండాలి, వారి పుట్టుకను భారత విదేశాంగ శాఖలో నమోదు చేయాలి.
రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం: కొన్ని వర్గాల వారు భారత ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వాన్ని పొంది ఉంటారు. వారి రిజిస్ట్రేషన్ సంబంధిత అధికారి ముందు జరిగి ఉండాలి.
ఎ. భారత సంతతికి చెందిన వారు భారతదేశంలో ఏడు సంవత్సరాలు సాధారణ నివాసిగా ఉండాలి.
బి. భారతీయ పౌరులను వివాహం చేసుకొని ఉండాలి.
సహజీకృత పౌరసత్వం: భారత ప్రభుత్వం రూపొందించిన చట్టాలకు లోబడి కింద పేర్కొన్న నిర్ణీత అర్హతలతో దరఖాస్తు చేసుకున్న విదేశీయులకు భారత పౌరసత్వం కల్పిస్తారు.
ఎ. భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న 22 భాషల్లో ఏదో ఒక భాషలో ప్రావీణ్యం ఉండాలి.
బి. సత్ప్రవర్తన కలిగి ఉండాలి.
సి. అంతకుముందు కలిగి ఉన్న విదేశీ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు ఒక అఫిడవిట్ దాఖలు చేయాలి.
డి. భారతదేశంలో కనీసం పదేళ్లు స్థిరనివాసం కలిగి ఉండాలి.
ఇ. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో 14 ఏళ్లు పనిచేసినప్పుడు కూడా సహజీకృత పౌరసత్వానికి అర్హులౌతారు.
పై అర్హతలను కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయించవచ్చు. విదేశాలకు చెందిన మేధావులు, శాస్త్రవేత్తలు, గొప్ప వ్యక్తులకు వీటి నుంచి మినహాయింపు ఉంటుంది.
భూభాగాల విలీనం: భారత భూభాగంలోకి ఏదైనా ప్రాంతం విలీనం చెందినట్లయితే ఆ ప్రాంత ప్రజలకు భారత పౌరసత్వం లభిస్తుంది (పాండిచ్చేరి, గోవా భారత్‌లో చేరడం).
పౌరసత్వాన్ని రద్దుపరిచే విధానం
భారత పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం పౌరులు కింది పద్ధతుల్లో పౌరసత్వాన్ని కోల్పోతారు.
స్వచ్ఛంద రద్దు: భారతీయులు ఎవరైనా స్వచ్ఛందంగా భారత పౌరసత్వాన్ని వదులుకోవచ్చు.
అంతమొందించడం/ తొలగించడం (Termination): అక్రమ పద్ధతుల ద్వారా భారత పౌరసత్వాన్ని పొందినప్పుడు అలాంటి వారి పౌరసత్వాన్ని చట్టప్రకారం రద్దు చేస్తారు.
బలవంతంగా రద్దుపరచడం (Deprivation): పౌరులు ఎవరైనా దేశద్రోహానికి పాల్పడినా, రాజ్యానికి విధేయత ప్రకటించకపోయినా, యుద్ధ సమయంలో శతృదేశాలకు సహాయపడినా, దేశ సాధారణ పౌరుడై ఉండి ఏడేళ్లపాటు విదేశాల్లో నివసించి ఉన్నా, పౌరసత్వాన్ని పొందిన అయిదేళ్ల లోపు ఏ దేశంలోనైనా 2 సంవత్సరాల శిక్షను అనుభవించి ఉన్నా పౌరసత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తారు.
భారత పౌరసత్వ స్వభావం - ఏకపౌరసత్వం
సమాఖ్య వ్యవస్థల్లో సాధారణంగా ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది.
ఉదా: అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ద్వంద్వ పౌరసత్వం ఉంది. భారత్‌లో సమాఖ్య వ్యవస్థ ఉన్నప్పటికీ ఏకపౌరసత్వాన్ని కొనసాగించారు. అందువల్ల ఈ లక్షణాన్ని సమాఖ్య విరుద్ధ లక్షణంగా పరిగణిస్తారు. భారతదేశంలో ఏకపౌరసత్వం ఉన్నప్పటికీ, ద్వంద్వ పౌరసత్వంలోని పరిమితులు ఉన్నాయనే విమర్శ ఉంది.
పరిమితులు: భారతదేశంలో ఎక్కడ జన్మించినా ఒకే పౌరసత్వాన్ని పొందుతారు గానీ, ప్రభుత్వోద్యోగాలు, ఇతరత్రా కొన్ని విషయాల్లో పుట్టుక, స్థిర నివాసం ప్రాతిపదికపై కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కల్పించారు.
ఉదా: నిబంధన 16 ప్రకారం స్థిర నివాస ప్రాతిపదికపై లోకల్, నాన్‌లోకల్‌గా వర్గీకరణ చేసి ప్రభుత్వోద్యోగాల్లో ప్రత్యేక మినహాయింపులు ఇస్తున్నారు. ముఖ్యంగా సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టికల్ 371 డి ప్రకారం ఉద్యోగ నియామకాల్లో జోన్‌ల వారీగా, జిల్లా స్థాయిల్లో నియామకాలు జరిపే వీలు కల్పించారు.
జమ్మూ కాశ్మీర్‌లో జన్మించిన వారికి, శాశ్వత నివాసం ఏర్పర్చుకున్న వారికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. అక్కడ స్థానికేతరులకు శాశ్వతంగా నివాసం ఏర్పర్చుకునే హక్కు లేదు.
ఆదివాసీ ప్రాంతాల్లో నివసించే వారికి కూడా కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించారు.
కెనడా సమాఖ్యలా భారతదేశంలోనూ ఏక పౌరసత్వాన్ని కొనసాగించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడటం. ఎందుకంటే ఇది కాందిశీకులు లాంటి అనేక ఇతర సమస్యలు సృష్టించింది. ఇలాంటి సమస్యలే పంజాబ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో కూడా తలెత్తాయి.
ద్వంద్వ పౌరసత్వం
భారత సంతతికి చెంది ఉండి విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తరచుగా భారతదేశానికి రాకపోకలు నిర్వహిస్తుంటారు. ఈ విషయంలో వీరు ఎదుర్కొంటున్న వీసాపరమైన ఇబ్బందులను తగ్గించడం కోసం పౌరసత్వ చట్టానికి 2005లో కొన్ని మార్పులు చేశారు. ద్వంద్వ పౌరసత్వంలో కొన్ని సదుపాయాలను కల్పించారు. వాటిని కింది విధంగా వివరించవచ్చు.
ప్రవాస భారతీయులు (Non Resident Indians - NRIs): విదేశాల్లో తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నివసిస్తున్న మొదటితరం భారతీయులు. 182 రోజులు భారతదేశం వెలుపల నివసిస ఉండేవారిని ఎన్.ఆర్.ఐ.లు అంటారు. వీరికి భారత పాస్‌పోర్ట్ ఉంటుంది.
భారత సంతతికి చెందిన వారు (Personsof Indian Origin - PIOs): విదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉన్న రెండో తరం భారతీయులు. అంటే విదేశాలకు వెళ్లి, అక్కడ స్థిరపడి ఆ దేశ పౌరసత్వాన్ని పొందిన తల్లిదండ్రులకు జన్మించిన సంతానం. వీరికి భారత పాస్‌పోర్ట్ ఉండదు.
ఉదాహరణకు అమెరికాలోని లూసియానా రాష్ట్రానికి గవర్నర్‌గా ఎన్నికైన బాబి జిందాల్.
ఓవర్‌సీస్ సిటిజన్‌స ఆఫ్ ఇండియా (Overseas Citizens of India - OCI): భారత ప్రభుత్వ చట్టం- 1955 ప్రకారం నమోదు చేసుకున్న వ్యక్తులు.
ద్వంద్వ పౌరసత్వం - ఎల్.ఎం. సింఘ్వి కమిటీ సూచనలు
ద్వంద్వ పౌరసత్వంలో ఓటింగ్ హక్కులు ఉండవు. అదేవిధంగా ప్రజా పదవులకు అర్హులు కారు. ద్వంద్వ పౌరసత్వంలో ఉండే సౌకర్యాలు మాత్రమే ఉంటాయి. పీఐఓలకు పీఐవో కార్డులు జారీ చేస్తారు. 2003లో చేసిన పీఐవో చట్టం ప్రకారం కొన్ని సదుపాయాలుంటాయి.
ఈ సౌకర్యం అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంకకు వర్తించదు. పీఐవోలకు భారతదేశాన్ని సందర్శించడానికి ప్రత్యేక వీసా అవసరం లేదు. పీఐవో కార్డు జారీ చేసిన తేదీ నుంచి 15 ఏళ్లపాటు ఈ సౌకర్యం ఉంటుంది.
ఈ కార్డు పొందడానికి వయోజనులు రూ. 15,000 చెల్లించాలి. ఎన్‌ఆర్‌ఐలకు ఉన్న అన్ని సౌకర్యాలు పీఐవోలకు ఉంటాయి.
ఓవర్‌సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా- 2005
ఈ చట్టం ప్రకారం ఇతర దేశాల్లో ఉన్న భారత సంతతికి చెందిన అందరికీ ఓసీఐ హోదాను పొందే అవకాశాన్ని కల్పించారు.
చట్టంలోని ముఖ్యాంశాలు:
- ఈ చట్టం 2005 డిసెంబర్ 2 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ హోదా ఉన్న వారికి భారతదేశానికి మల్టిపుల్ ఎంట్రీ (Multiple Entry) సౌకర్యం ఉంటుంది. ఇందుకోసం దీర్ఘకాలిక పరిమితి ఉన్న వీసాలు జారీ చేస్తారు. వీరికి కూడా ద్వంద్వ పౌరసత్వ వీసాలు కల్పిస్తారు.
- ఓసీఐలు భారతదేశంలో పనిచేస్తూ నివాసం ఉండవచ్చు లేదా వారికి సహజ పౌరసత్వం ఉన్న దేశాల్లోనూ పౌరసత్వం ఉండవచ్చు. వీరికి కూడా ఎన్‌ఆర్‌ఐలతో సమానమైన ప్రతిపత్తి ఉంటుంది. అయితే రాజకీయ హక్కులుండవు.
- ఓసీఐ హోదాను పొందడానికి 275 యూఎస్ డాలర్లు చెల్లించాలి. ఓసీఐలుగా రిజిస్టర్ చేసుకున్న ఐదేళ్ల తర్వాత ఒక సంవత్సరం పాటు భారతదేశంలో నివాసం ఉంటే భారత సంపూర్ణ పౌరసత్వానికి అర్హులవుతారు.
సరోగసీ పౌరసత్వం (Surrogacy)
సరోగసీ అనేది వైద్యశాస్త్ర పరంగా తల్లిదండ్రులు మరో తల్లి ద్వారా సంతానాన్ని పొందడం. సరోగసీ మదర్ కేవలం పిండం పెరుగుదల కోసం తన గర్భసంచిని ఆధారంగా అందిస్తుంది. ఈ విధానంలో గర్భసంచిలో పెరిగే బిడ్డకు దాన్ని ఆధారంగా ఇచ్చిన తల్లికి ఏ మాత్రం సంబంధం ఉండదు. ఈ విధంగా జన్మించిన పిల్లలను ‘సరోగసీ బేబీస్’ అంటారు. ఇలాంటి పిల్లలకు భారతదేశంలో జన్మించినప్పటికీ భారత రాజ్యాంగం ప్రకారం పౌరసత్వం రాదు. అయితే ఇటీవలే సుప్రీంకోర్టు మానవతా దృక్పథంతో ఇలాంటి వారికి పౌరసత్వం ఇవ్వవచ్చని పేర్కొంది. కానీ ఈ విషయంపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చట్టాలనూ రూపొందించలేదు.
ఎమిగ్రి (Emigre): రాజకీయ కారణాల వల్ల స్వదేశాన్ని వదిలి వెళ్లిన పౌరులను ఎమిగ్రి అంటారు.
ఎక్స్‌పాట్రియేట్ (Expatriate): స్వదేశాన్ని స్వచ్ఛందంగా వదిలి వెళ్లిన పౌరులను ఎక్స్‌పాట్రియేట్‌గా పేర్కొంటారు.
రెఫ్యూజీ (Refugee): రాజకీయ కారణాల వల్ల మరో దేశానికి వలస వెళ్లే ప్రజలను రెఫ్యూజీలుగా పేర్కొంటారు. కొన్ని రకాల జాతి, మత, రాజకీయ కారణాల వల్ల వీరు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి ఇష్టపడరు.
గ్రీన్ కార్డ్: అమెరికాలో అధికారికంగా శాశ్వత నివాసాన్ని ఏర్పర్చుకోవడానికి అక్కడి ప్రభుత్వం జారీ చేసే అనుమతి పత్రాన్ని గ్రీన్ కార్డ్ అని అంటారు.
#Tags