అత్యవసర అధికారాలు

భారత రాజ్యాంగంలో మూడు రకాలైన అత్యవసర పరిస్థితులను పేర్కొన్నారు. అసాధారణ పరిస్థితుల్లో దేశ సార్వభౌమత్వం, సమగ్రత, ఐక్యత, రక్షణలను పరిరక్షించడానికి అత్యవసర అధికారాలను పొందుపర్చారు. జాతి ప్రయోజనాల దృష్ట్యా కేంద్రానికి ప్రత్యేక అధికారాలు అనివార్యమని, వీటిని జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుందని రాజ్యాంగ నిర్మాతలు పేర్కొన్నారు. వీటిని ప్రయోగించే అవసరమే ఉండకపోవచ్చని భావించి ‘మృత ప్రకరణలు (డెడ్ ఆర్టికల్స్)’గా పరిగణించవచ్చని వ్యాఖ్యానించారు.
దేశంలో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల (బాహ్య లేక అంతర్గత) దృష్ట్యా దేశ ఐక్యత, సమగ్రతకు ప్రమాదం వాటిల్లుతుందని భావిస్తే.. అలాంటి స్థితిని ‘అత్యవసర పరిస్థితి’గా పరిగణిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు సంక్రమిస్తాయి.
అత్యవసర పరిస్థితికి సంబంధించిన అధికారాలను రాజ్యాంగంలో పొందుపరచాలని రాజ్యాంగ పరిషత్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, టి.టి. క్రిష్ణమాచారి సమర్థించారు. అత్యవసర అధికారాలను వ్యతిరేకించిన వారిలో ముఖ్యులు హెచ్.వి. కామత్, ప్రొఫెసర్ కె.టి. షా., పి.డి. దేశ్‌ముఖ్.

అత్యవసర పరిస్థితులు - రకాలు
రాజ్యాంగంలోని 18వ భాగంలో ప్రకరణ 352 నుంచి 360 వరకు మూడు రకాలైన అత్యవసర పరిస్థితులకు సంబంధించిన అంశాలను పేర్కొన్నారు.
1. జాతీయ అత్యవసర పరిస్థితి (National Emergency) - ప్రకరణ 352
2. రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన (Constitutional Emergency) - ప్రకరణ 356
3. ఆర్థిక అత్యవసర పరిస్థితి (Financial Emergency) - ప్రకరణ 360

జాతీయ అత్యవసర పరిస్థితి
జాతీయ అత్యవసర పరిస్థితిని రెండు కారణాల వల్ల విధించవచ్చు.
ఎ) బాహ్య కారణాలు: విదేశీ దాడులు, యుద్ధం మొదలైన కారణాల వల్ల దేశ సమగ్రతకు భంగం కలిగినా, కలుగుతుందని రాష్ట్రపతి భావించినప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు.
బి) అంతర్గత కారణాలు: దేశంలో అంతర్గత కల్లోలం ఏర్పడినప్పుడు తద్వారా దేశ ఐక్యత, సమగ్రతకు భంగం వాటిల్లుతుందని రాష్ట్రపతి భావించినప్పుడు అత్యవసర పరిస్థితి ప్రకటిస్తారు. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘అంతర్గత కల్లోలం (Internal Disturbances)’ అనే పదాన్ని తొలగించి ‘సాయుధ తిరుగుబాటు (Armed Rebellion)’ అనే పదాన్ని చేర్చారు. కాబట్టి, ప్రస్తుతం అంతర్గత కారణాల వల్ల అత్యవసర పరిస్థితి విధించాలంటే సాయుధ తిరుగుబాటు అనే కారణాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు.
జాతీయ అత్యవసర పరిస్థితిని దేశవ్యాప్తంగా లేదా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లేదా ఒక రాష్ట్రంలోగానీ, రాష్ట్రంలోని కొంత భాగంలోగానీ విధించవచ్చు. ఈ ఏర్పాటును 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ప్రధాన మంత్రి అధ్యక్షతన ఉన్న కేబినెట్ స్థాయి మంత్రుల లిఖితపూర్వక సలహా మేరకు రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. ‘కేబినెట్’, ‘లిఖితపూర్వక’ అనే పదాలను 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రకరణ 352లో చేర్చారు. ఈ సవరణ చేయడానికి ముందు ‘మంత్రి మండలి సాధారణ సలహా’ మాత్రమే ఉండేది.
రాష్ట్రపతి జారీ చేసిన అత్యవసర పరిస్థితిని పార్లమెంట్ 30 రోజుల్లోపు (జారీచేసిన రోజు నుంచి) ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలి. మౌలిక రాజ్యాంగంలో పార్లమెంట్ రెండు నెలల్లోగా ఆమోదించాలని ఉండేది. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ఒక నెలకు తగ్గించారు.
రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించే సమయానికి లోక్ సభ రద్దై ఉన్నా లేదా విధించిన రోజు నుంచి 30 రోజుల్లోపు అత్యవసర పరిస్థితిని ఆమోదించకుండా రద్దయినా తిరిగి కొత్త లోక్ సభ ఏర్పడిన రోజు నుంచి 30 రోజుల్లోపు రాష్ట్రపతి ఆదేశాన్ని లోక్ సభ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో రాజ్యసభ ఆ తీర్మాన్ని ఆమోదించాలి. లేకుంటే 30 రోజుల తర్వాత అత్యవసర పరిస్థితి దానంతట అదే రద్దవుతుంది.
ఒకసారి పార్లమెంట్ ఆమోదిస్తే, జాతీయ అత్యవసర పరిస్థితి ఆరు నెలల వరకు అమల్లో ఉంటుంది (ఆమోదించిన రోజు నుంచి). పార్లమెంట్ అనుమతితో జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్ని పర్యాయాలైనా పొడగించవచ్చు. ప్రతి పొడగింపు ఆరు నెలలే ఉండాలి.
రెండు వేర్వేరు కారణాల వల్ల అత్యవసర పరిస్థితి విధించడం - ప్రకరణ 352(9): రెండు వేర్వేరు కారణాల వల్ల ఒకేసారి అత్యవసర పరిస్థితి విధించడానికి మౌలిక రాజ్యాంగంలో అవకాశం లేదు. అయితే 1975లో 38వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ విధమైన అవకాశం కల్పించారు.
ఉదా: 1971లో బాహ్య కారణాల వల్ల విధించిన అత్యవసర పరిస్థితి 1977 వరకు కొనసాగింది. ఈ పరిస్థితి అమల్లో ఉండగానే అంతర్గత కారణాల ప్రాతిపదికన అత్యవసర పరిస్థితిని 1975 జూన్ 26న విధించారు.
జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు - ప్రకరణ 352(7, 8): రాష్ట్రపతి మరో ఆదేశం ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయవచ్చు. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం, జాతీయ అత్యవసర పరిస్థితి రద్దుకు సంబంధించిన తీర్మానాన్ని లోక్ సభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి రద్దు చేస్తారు.
లోక్ సభ ప్రత్యేక తీర్మానం: ఒకవేళ లోక్ సభ ఆ సమయానికి సమావేశంలో లేకపోతే, లోక్‌సభలోని మొత్తం సభ్యుల్లో 1/10వ వంతు సభ్యులు, లోక్ సభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయమని రాష్ట్రపతికి నోటీసు ఇస్తారు. నోటీసు ఇచ్చిన 14 రోజుల లోపల రాష్ట్రపతి లోక్ సభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.

జాతీయ అత్యవసర పరిస్థితి పర్యవసానాలు
జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు అది కింద పేర్కొన్న విధంగా దేశంలో వివిధ అంశాలపై ప్రభావం చూపుతుంది.
1. కేంద్ర - రాష్ట్ర సంబంధాలపై ప్రభావం: జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు కేంద్ర, రాష్ట్ర సంబంధాల మధ్య మౌలిక మార్పులు సంభవిస్తాయి. అవి:
  • కేంద్ర కార్య నిర్వాహక వర్గం అధికారాలు విస్తృతమవుతాయి.
  • కేంద్రం రాష్ట్రాలకు అన్ని అంశాలపై ఆదేశాలు జారీ చేస్తుంది.
  • రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు కావుగానీ, వాటి అధికారాలన్నీ కేంద్రం నియంత్రణలోకి వస్తాయి.
  • రాష్ట్ర జాబితాలోని అన్ని అంశాలపై, పార్లమెంట్ చట్టాలు చేయవచ్చు. కానీ రాష్ట్ర శాసనసభలు రద్దు కావు.
  • పైన పేర్కొన్న విధంగా రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్ చేసిన చట్టాలు అత్యవసర పరిస్థితి రద్దు చేసిన తర్వాత ఆరు నెలల వరకు అమల్లో ఉంటాయి. ఆరు నెలల తర్వాత రద్దవుతాయి.
  • కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు కూడా ప్రభావితమవుతాయి. సాధారణ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య విభజితమయ్యే వనరులు రద్దు కావచ్చు లేదా వీటిని కేంద్రానికి బదలాయించవచ్చు.
2. లోక్ సభ, రాష్ట్ర శాసనసభలపై ప్రభావం: జాతీయ అత్యవసర పరిస్థితుల్లో లోక్ సభ సాధారణ పదవీకాలాన్ని ఏడాది వరకు పొడగించవచ్చు. ఇలా ఎన్ని పర్యాయాలైనా చేయవచ్చు. అయితే అత్యవసర పరిస్థితి రద్దయిన తర్వాత ఆరు నెలల కంటే ఎక్కువ పొడగించడానికి వీల్లేదు.
ఉదా: 1975లో 5వ లోక్ సభ పదవీ కాలాన్ని పొడగించారు. 5వ లోక్ సభ 1976 మార్చి 19కి ముగియాల్సి ఉంది. అయితే దీన్ని 1977 మార్చి 18 వరకు పొడగించారు. అదేవిధంగా మరోసారి 1978 మార్చి 18 వరకు పొడగించారు. కానీ ఇది మధ్యలోనే (1977 జనవరి 18న) రద్దయింది. ఈ విధంగా మొత్తానికి అయిదో లోక్ సభ 5 సంవత్సరాల 10 నెలల 6 రోజులు కొనసాగింది. ఇదే సుదీర్ఘ లోక్ సభ.
ఇదేవిధంగా రాష్ట్ర శాసనసభ పదవీ కాలాన్ని కూడా పార్లమెంట్ ఏడాది వరకు పొడగించవచ్చు. ఇలా ఎన్ని పర్యాయాలైన చేయవచ్చు.
ఉదా: అత్యవసర పరిస్థితి కారణంగా ఆంధ్రప్రదేశ్ అయిదో అసెంబ్లీని కూడా 1977 నుంచి 78 వరకు ఏడాది పాటు పొడగించారు. ఇదేవిధంగా కేరళ అసెంబ్లీ పదవీ కాలాన్ని కూడా రెండుసార్లు పొడగించారు.
3. ప్రాథమిక హక్కులపై ప్రభావం: జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ప్రాథమిక హక్కులపై ప్రభావాన్ని ప్రకరణ 358, 359లో వివరించారు.
  • ప్రకరణ 19లో పేర్కొన్న ప్రాథమిక హక్కులపై అత్యవసర పరిస్థితి ప్రభావాన్ని ప్రకరణ 358 తెలియజేస్తుంది. దీని ప్రకారం.. జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ప్రకరణ 19లో పేర్కొన్న ఆరు వ్యక్తిగత స్వేచ్ఛలు వాటంతట అవే రద్దవుతాయి. ప్రభుత్వం ఈ స్వేచ్ఛలపై పూర్తిగా పరిమితులు విధించవచ్చు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని న్యాయస్థానాలను ఆశ్రయించడానికి వీల్లేదు.
  • అత్యవసర పరిస్థితి ఎత్తేసిన తర్వాత ప్రకరణ 19లోని స్వేచ్ఛలు వాటంతట అవే పునరుద్ధరితమవుతాయి. అయితే రద్దయిన కాలంలో జరిగిన సంఘటనలు లేదా ఉల్లంఘనలను ప్రశ్నిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీల్లేదు.
  • 44వ రాజ్యాంగ సవరణ (1978) ద్వారా ఈ స్వేచ్ఛలపై కొన్ని పరిమితులు విధించారు. బాహ్య కారణాల వల్ల అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు మాత్రమే ప్రకరణ 19లోని స్వేచ్ఛలు పరిమితమవుతాయి. సాయుధ తిరుగుబాటు కారణంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు వీటిపై ప్రభావం ఉండదు. అత్యవసర పరిస్థితికి సంబంధించిన చట్టాలకు మాత్రమే పరిరక్షణ ఉంటుంది. ఇతర చట్టాల ద్వారా స్వేచ్ఛలపై పరిమితులు విధించడానికి వీల్లేదు.
ప్రకరణ 359 ఇతర ప్రాథమిక హక్కులపై ప్రభావాన్ని గురించి తెలియజేస్తుంది.
  • ప్రకరణ 359 ప్రకారం, జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రాథమిక హక్కులు వాటంతట అవే రద్దు కావు. నిర్దేశిత కాలపరిమితికి ఒక నోటిఫికేషన్ ద్వారా వాటి అమలును రాష్ట్రపతి రద్దు చేస్తారు. ఈ సందర్భంలో ప్రాథమిక హక్కుల అమలు మాత్రమే రద్దవుతుంది.
  • ప్రకరణ 359 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే 20, 21 ప్రకరణలకు రద్దు నుంచి మినహాయింపు ఉంటుంది.
  • 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రకరణ 359 ప్రభావాన్ని కొంతవరకు పరిమితం చేశారు.
  • ప్రకరణ 20, 21 అమలును రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారం లేదు.
  • ప్రకరణ 20, 21లో పేర్కొన్న హక్కులకు భంగం కలిగినప్పుడు పౌరులు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. అత్యవసర పరిస్థితికి సంబంధించిన చట్టాలను మాత్రమే న్యాయసంరక్షణ నుంచి మినహాయించారు. ఇతర చట్టాల విషయంలో తమ హక్కులకు భంగం కలిగినప్పుడు పౌరులు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు.
ప్రకరణ 358, 359ల మధ్య వ్యత్యాసం

ప్రకరణ 358

ప్రకరణ 359

1. దీని ప్రభావం ప్రకరణ 19లో ప్రస్తావించిన వ్యక్తిగత స్వేచ్ఛలకు మాత్రమే పరిమితం. 1. దీని ప్రభావం ప్రాథమిక హక్కులన్నింటికీ వర్తిస్తుంది.
2. ఈ సందర్భంలో ప్రకరణ 19లో పేర్కొన్న వ్యక్తిగత స్వేచ్ఛలు అత్యవసర పరిస్థితి విధించిన వెంటనే వాటంతట అవే రద్దవుతాయి. 2. దీని ప్రకారం ప్రాథమిక హక్కులు అత్యవసర పరిస్థితిని ప్రకటించిన వెంటనే వాటంతట అవే రద్దు కావు. రాష్ట్రపతి వాటి అమలును రద్దు చేస్తూ ప్రత్యేక ఆదేశాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
3. దీని ప్రభావం బాహ్య కారణాల వల్ల విధించిన అత్యవసర పరిస్థితికే పరిమిత మవుతుంది. 3. దీని ప్రభావం బాహ్య కారణాలు, అంతర్గత కారణాలతో విధింపునకు కూడా వర్తిస్తుంది.
4. దీని ప్రకారం అత్యవసర పరిస్థితి ఉన్నంతవరకూ ప్రాథమిక హక్కులపై ప్రభావం ఉంటుంది. 4. దీని ప్రభావం రాష్ట్రపతి నిర్ణయించిన సమయం వరకు మాత్రమే ఉంటుంది. అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ ప్రాథమిక హక్కుల అమలు రద్దు చేయకపోవచ్చు.
5. దీని ప్రభావం దేశం మొత్తానికి వర్తిస్తుంది. 5. దీని ప్రభావాన్ని దేశం మొత్తానికిగానీ, కొన్ని ప్రాంతాలకుగానీ వర్తింపచేయవచ్చు.

జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భాలు
జాతీయ అత్యవసర పరిస్థితిని ఇంతవరకూ మూడు పర్యాయాలు విధించారు. రెండు పర్యాయాలు బాహ్య కారణాలు, ఒక పర్యాయం అంతర్గత కారణాల వల్ల విధించారు.

అత్యవసర పరిస్థితి కాలం

కారణం

నాటి రాష్ట్రపతి

నాటి ప్రధాని

1962 అక్టోబర్ 26 నుంచి 1968 జనవరి 10 చైనా దురాక్రమణ సర్వేపల్లి రాధాకృష్ణన్ నెహ్రూ
1971 డిసెంబర్ 3 నుంచి 1977 మార్చి 21 పాకిస్థాన్ దాడి వి.వి. గిరి ఇందిరాగాంధీ
1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 అంతర్గత కల్లోలం ఫకృద్దీన్ అలీ అహ్మద్ ఇందిరాగాంధీ

  • 1965లో పాకిస్థాన్‌తో యుద్ధం జరిగినప్పటికీ, ప్రత్యేకంగా అత్యవసర పరిస్థితిని విధించాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. కారణం, 1962లో విధించిన అత్యవసర పరిస్థితి 1968 వరకు కొనసాగింది.
  • మూడో పర్యాయం అంతర్గత కారణాల వల్ల జూన్ 25, 1975లో విధించారు. ఇది 1977 మార్చి వరకు కొనసాగింది. అయితే ఒక సమయంలో రెండు వేర్వేరు కారణాల వల్ల రెండు రకాలైన అత్యవసర పరిస్థితి విధించే సందర్భం మౌలిక రాజ్యాంగంలో లేదు. కానీ 1975లో 38వ రాజ్యాంగ సవరణ ద్వారా నిబంధన 352కు సవరణ చేసి ఒకే సమయంలో రెండు రకాలైన అత్యవసర పరిస్థితులను ప్రకటించే వీలును కల్పించారు.

#Tags