Ananya Reddy All-India 3rd Rank In UPSC: యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో పాలమూరు అమ్మాయికి 3వ ర్యాంకు

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌- 2023 ఫలితాల్లో తెలంగాణకు చెందిన దోనూరు అనన్య రెడ్డి మూడో ర్యాంక్‌ సాధించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన అనన్య ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే సత్తా చాటారు. అంత్రోపాలజీకి మాత్రమే కోచింగ్‌ తీసుకున్నానని, రోజుకు 12-14 గంటలు చదివేదానినని తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చిన్నతనంలోనే సివిల్స్‌ చదవాలని నిర్ణయించుకున్నట్లు అనన్య చెప్పారు.

అప్పుడు ఉమా హారతి.. ఇప్పుడు అనన్య రెడ్డి
గతేడాది యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లోనూ తెలంగాణకు చెందిన ఉమా హారతి మూడో ర్యాంకును సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ఆల్‌ ఇండియా స్థాయిలో తెలంగాణకు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంకును కైవసం చేసుకోవడం విశేషం. సివిల్ సర్వీసెస్ పరీక్షను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), కేంద్రంలోని పలు విభాగాల అధికారులను ఎంపిక చేయడానికి నిర్వహిస్తారు.

UPSC ద్వారా నిర్వహించే ఈ పరీక్షలో ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ మూడు దశల్లో ప్రక్రియ కొనసాగుతుంది.ప్రతి సంవత్సరం ఈ పరీక్షను నిర్వహిస్తారు. UPSC సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్ష 2023 మే 28న జరిగింది. ప్రిలిమ్స్ రౌండ్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 2023 సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో రెండు షిఫ్టులలో జరిగే మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు.

ఐఏఎస్ కోసం 180 మంది ఎంపిక
యూపీఎస్సీ సీఎస్ఈ మెయిన్స్ ఫలితాలు డిసెంబర్ 8న విడుదలయ్యాయి. CSE 2023 ఇంటర్వ్యూలు లేదా వ్యక్తిత్వ పరీక్షలు జనవరి 2, ఏప్రిల్ 9 మధ్య దశలవారీగా జరిగాయి. నేడు(మంగళవారం)తుది ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 1,016 మంది అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని యూపీఎస్సీ పేర్కొంది. వీరిలో  ఐఏఎస్ కోసం 180 మంది,ఐపీఎస్ కోసం 200 మంది,ఐఎఫ్ఎస్ కోసం 37 మందిని ఎంపిక చేశారు. 

#Tags