SVNIRTER CET 2024: ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్ సెట్ పరీక్షతో ఈ కళాశాలల్లో ప్రవేశం..
ఈ సెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే.. జాతీయ స్థాయిలో పేరున్న స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ అందించే కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఇటీవల ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్ సెట్–2024 నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో.. ఈ సెట్‌తో ప్రవేశం కల్పించే కోర్సులు, ఆయా కోర్సుల ప్రత్యేకత, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం.
హెల్త్‌కేర్ రంగంలో కెరీర్ అనగానే ఎంబీబీఎస్‌నే లక్ష్యంగా చేసుకుంటారు. కాని, సీట్ల పరిమితి కారణంగా అందరికీ మెడిసిన్ కోర్సులో చేరే అవకాశం లభించదు. ఇలాంటి వారికి చక్కటి ప్రత్యామ్నాయ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ, బ్యాచిలర్ ఇన్ ప్రోస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ (బీ.ఏఎస్‌ఎల్‌పీ) ముఖ్యమైనవి.
ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్ అంటే..
స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్.. సంక్షిప్తంగా ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్! దేశంలో దివ్యాంగులు, ఇతర శారీరక వైకల్యాలున్న వారి సంఖ్య పెరుగుతోంది. వీరి సమస్యలు, వ్యాధులకు చికిత్సను అందించే లక్ష్యంతో.. అందుకు అవసరమైన సిబ్బందిని తీర్చిదిద్దేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ దేశ వ్యాప్తంగా పలు ఇన్‌స్టిట్యూట్‌లను ఏర్పాటు చేసింది. వీటిలో జాతీయ స్థాయిలో ఉన్నత ప్రమాణాలను అనుసరిస్తున్న సంస్థగా కటక్(ఒడిస్సా)లోని ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌కు గుర్తింపు ఉంది. ఈ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సెట్)ను నిర్వహించి.. దేశంలోని పలు స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నారు.
Self Employment: ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు
బ్యాచిలర్ స్థాయి కోర్సులు
ప్రస్తుతం ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్–సెట్ స్కోర్ ఆధారంగా బ్యాచిలర్ స్థాయిలో నాలుగు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. అవి.. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ), బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషన్ థెరపీ (బీఓటీ), బ్యాచిలర్ ఇన్ ప్రోస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్(బీపీఓ), బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ (బీ.ఏఎస్‌ఎల్‌పీ).
కోర్సు వ్యవధి నాలుగేళ్లు
బ్యాచిలర్ స్థాయిలోని బీపీటీ, బీఓటీ, బీపీఓ, బీఏఎస్‌ఎల్‌పీ కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. దీనికి అదనంగా మరో ఆరు నెలల ఇంటర్న్‌షిప్ అంటే మొత్తం నాలుగున్నరేళ్లపాటు ఈ కోర్సుల బోధన సాగుతుంది.
Archery World Cup: ప్రపంచకప్ టోర్నీలో సత్తా చాటిన భారత ఆర్చరీ జట్టు!
అయిదు ఇన్‌స్టిట్యూట్‌లు
- ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్–సెట్ స్కోర్ ద్వారా మొత్తం అయిదు ఇన్‌స్టిట్యూట్‌లలో 443 సీట్ల భర్తీ చేస్తారు. అవి..
- ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్–కటక్(బీపీటీ–62,
- బీఓటీ–62, బీపీఓ–46, బీఏఎస్‌ఎల్‌పీ–10)
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిలిటీస్ (ఎన్‌ఐఎల్‌డీ)–కోల్‌కత (బీపీటీ–57; బీఓటీ–56; బీపీఓ–47)
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజేబిలిటీస్ (ఎన్‌ఐఈపీడీ)–చెన్నై (బీపీటీ–18, బీఓటీ–18, బీపీఓ–20, బీఏఎస్‌ఎల్‌పీ–27)
- కాంపోజిట్ రీజనల్ సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్‌మెంట్, రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ (సీఆర్‌సీఎస్‌ఆర్‌ఈ)– గువహతి (బీఏఎస్‌ఎల్‌పీ–20)
- యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్‌లోని బీపీటీ (68 సీట్లు), బీఓటీ (68 సీట్లు), బీపీఓ (39 సీట్లు) కోర్సులకు కూడా ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్–సెట్ స్కోర్‌నే పరిగణనలోకి తీసుకుంటారు.
How To Apply JEE Advanced Registration: జేఈఈ అడ్వాన్స్‌డ్-2024కు ఎలా అప్లై చేయాలి? చివరి తేదీ ఎప్పుడంటే..
అర్హతలు వేర్వేరుగా
- బీపీటీ, బీఓటీ: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత ఉండాలి.
- బీపీఓ: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ లేదా ఎంపీసీ ఉత్తీర్ణులవ్వాలి.
- బీఏఎస్‌ఎల్‌పీ: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ/బైపీసీ ఉత్తీర్ణత ఉండాలి. అర్హత కోర్సు చివరి సంవత్సరం ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వంద మార్కులకు సెట్
బీపీటీ, బీఓటీ, బీపీఓ, బీఏఎస్‌ఎల్‌పీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్–సెట్‌ను నాలుగు విభాగాల్లో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో పార్ట్–ఎ: జనరల్ ఎబిలిటీ అండ్ జనరల్ నాలెడ్జ్–10 ప్రశ్నలు; పార్ట్–బి: ఫిజిక్స్–30 ప్రశ్నలు; పార్ట్–సి: కెమిస్ట్రీ–30 ప్రశ్నలు; పార్ట్–సి: బయాలజీ/ మ్యాథమెటిక్స్–30 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. పార్ట్–డిలోని బయాలజీ/ మ్యాథమెటిక్స్ ప్రశ్నలకు సంబంధించి అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌లో చదివిన గ్రూప్ ఆధారంగా సదరు సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలి. బైపీసీ విద్యార్థులు బయాలజీని, ఎంపీసీ విద్యార్థులు మ్యాథమెటిక్స్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. పరీక్షకు లభించే సమయం రెండు గంటలు.
ఇంటర్మీడియెట్ స్థాయి.. ప్రిపరేషన్
ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏర్–సెట్‌లో మంచి స్కోర్ సాధించడానికి విద్యార్థులు ఇంటర్మీడియెట్ స్థాయిలోని అకడమిక్స్‌పై పట్టు సాధించాలి. ఆయా అంశాలకు సంబంధించి కాన్సెప్ట్‌లు, ఫార్ములాలు, అప్లికేషన్స్‌పై అవగాహన పెంచుకోవాలి. జనరల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ విభాగంలో రాణించేందుకు.. కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే అంశాల(ముఖ్యమైన ప్రాంతాలు,సదస్సులు, వ్యక్తులు, అవార్డులు–గ్రహీతలు, క్రీడలు–విజేతలు తదితర)పై దృష్టి సారించాలి.
TS 10th Class Results: పదో తరగతి ఫలితాలు రేపు.. ఒక్క క్లిక్‌తో ‘సాక్షి’లో వేగంగా టెన్త్ ఫలితాలు
ఉమ్మడి కౌన్సెలింగ్
సెట్‌లో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి.. ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా ఆయా కోర్సులు–ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం ఖరా రు చేస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, మే 20
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ సదుపాయం: 2024, జూన్ 4
- ఎంట్రన్స్ తేదీ: 2024, జూన్ 23
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.svnirtar.nic.in